కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g03 7/8 పేజీలు 17-19
  • ఈకల్నిండా కళ్ళున్న అద్భుతమైన పక్షి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఈకల్నిండా కళ్ళున్న అద్భుతమైన పక్షి
  • తేజరిల్లు!—2003
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • వాటి అద్భుతమైన ప్రదర్శన
  • నెమలి కుటుంబ జీవితం
  • చరిత్రలో నెమలి
  • ఈకలు—వాటి అపురూప రూపకల్పన
    తేజరిల్లు!—2007
  • వాటికి అటువంటి అందమైన ఈకలు ఎలా వచ్చినవి?
    తేజరిల్లు!—1992
తేజరిల్లు!—2003
g03 7/8 పేజీలు 17-19

ఈకల్నిండా కళ్ళున్న అద్భుతమైన పక్షి

ఇండియాలోని తేజరిల్లు! రచయిత

మేము నెమలి గురించి మాట్లాడుతున్నామని మీరు ఈ శీర్షికాంశాన్ని చూసి ఊహించివుండవచ్చు. అవును మగనెమలి పింఛం ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచింది.a అయితే ఇలాంటి అందమైన పింఛం దేనికైనా ఉపయోగపడుతుందా, ఈ పక్షి అందం విషయంలోనే కాక ఇతర విషయాల్లో కూడా అసాధారణమైనదా అని మీరెప్పుడైనా ఆలోచించారా?

పెసంట్‌ జాతికి చెందిన నెమలిలో మూడు రకాలు ఉన్నాయి. మనం ఇప్పుడు ఇండియాకు చెందిన లేదా సాధారణ మగనెమలిని పరిశీలిద్దాం, ఇది ప్రాథమికంగా నీలం-ఆకుపచ్చ కలిసిన వర్ణంలో ఉంటుంది, 150 సెంటిమీటర్ల పొడవున్న పింఛంతో సహా ఈ పక్షి 200 నుండి 235 సెంటిమీటర్ల పొడవు ఉంటుంది. పింఛంలోని ఈకలు ఆకుపచ్చ మరియు బంగారు వర్ణాలలో ఉండి వాటిపై కన్నులను ప్రతిబింబించే ఆకారాలు నీలం మరియు కంచు వర్ణాలలో ఉంటాయి. పక్షి శరీరం మీదున్న ఈకలు చాలామట్టుకు నీలం ఆకుపచ్చ వర్ణాలు కలిసిన విలక్షణమైన వర్ణంలో ఉంటాయి.

ఇండియా జాతీయ పక్షిగా అధికార స్థానం ఇవ్వబడిన మగనెమలి రూపానికి రాచఠీవి ఉందనడంలో సందేహం లేదు. బహుశా అందుకే కొన్ని భాషల్లో అహంకారులను వర్ణించడానికి “నెమలిలాంటి పొగరుబోతు” అనే మాట ఉపయోగించబడుతుంది. అయితే ఈ పక్షి రూపం సూచించినట్లు దూరదూరంగా ఉండే రకం కాదు. నిజానికి దాన్ని సులభంగా మచ్చిక చేసుకోవచ్చు. కొంతమంది నెమలిని పవిత్రమైనదిగా భావిస్తారు. అందుకే ఇండియాలోని గ్రామాల్లో ఈ పక్షులు రైతుల పొలాలను పాడుచేసినా వారు చూస్తూ ఊరుకుంటారు.

వాటి అద్భుతమైన ప్రదర్శన

నెమళ్ళు తమ ప్రకాశవంతమైన పురివిప్పి చేసే అద్భుత నాట్యానికి అత్యంత ప్రఖ్యాతిగాంచాయి. ఇలా నాట్యమాడడంలోని ఉద్దేశం ఏమిటి? అదంతా ఆడనెమళ్ళను ఆకర్షించడానికి చేసే కృషి.

ఆడనెమలి ఎంపికలో జాగ్రత్తగా ఉంటుంది కానీ ఆకర్షించడానికి చేసే నాట్యాలకు అది సులభంగా లొంగిపోతుంది. మగనెమలి పురివిప్పినప్పుడు దాని పింఛంలో అద్భుతమైన రంగులతో నిండివుండే కన్నులు ఆడనెమలి అవధానాన్ని పూర్తిగా ఆకట్టుకుంటాయి. అత్యంత అద్భుతమైన రీతిలో ప్రదర్శన చేసిన మగనెమలిని అది ఎంపిక చేసుకోవడానికి ఇష్టపడుతుంది.

పురివిప్పడమనేది ప్రదర్శనలో ఒక భాగం మాత్రమే. మగనెమలి తన పొడవాటి పింఛాన్ని విప్పి ముందుకు వంచి నాట్యం చేయడం ప్రారంభిస్తుంది. నిటారుగా నిలబడివున్న ఈకలు శబ్దం చేసేలా అది తన శరీరాన్ని అటూ ఇటా ఆడిస్తున్నప్పుడు పెంకురంగులోని దాని రెక్కలు పక్కకు వ్రేలాడుతుంటాయి. అది పెద్దగా అరుస్తుంది కూడా. ఆ అరుపు వినడానికి అంత శ్రావ్యంగా ఉండదు కానీ తాను ఆడనెమలిని ఇష్టపడుతున్నాను అని అది తెలియజేస్తుంది.

అప్పుడప్పుడు ఆడనెమలి కూడా మగనెమలి చేస్తున్న నాట్యాన్ని అనుకరించడానికి స్వల్ప ప్రయత్నాలు చేస్తుంది కానీ చాలామట్టుకు దానికి ఆ నాట్యంలో ఆసక్తే లేనట్టు నిలబడి ఉంటుంది. అయితే అత్యంత అద్భుతమైన నాట్యం ఆడనెమలి ప్రేమను పొందుతుంది. ఒక మగనెమలి ఒక సంవత్సరంలో 5 ఆడనెమళ్ళు మరియు 25 పిల్లనెమళ్ళుగల గుంపును ఏర్పరచుకుంటుంది.

నెమలి కుటుంబ జీవితం

జతకూడే రుతువు గడిచిపోయిన తర్వాత మగనెమలి ఈకలు రాలుస్తుంది. ఎదిగిన నెమలి పింఛమంతటిలో సగటున 200 కంటే ఎక్కువ ఈకలు ఉంటాయి. ఇండియాలోని గ్రామస్థులు వాటిని పాశ్చాత్య దేశాలకు ఎగుమతి చేయడానికి సేకరించేవారు, కానీ ఆ తర్వాత ఈ పక్షి జాతిని సంరక్షించడానికి అలాంటి ఎగుమతి నిషేధించబడింది. అయితే స్థానికంగా ఇప్పటికీ విసన కర్రలు, ఇతర ఆకర్షణీయమైన వస్తువులు తయారుచేయడానికి నెమలి ఈకలు ఉపయోగించబడుతున్నాయి.

నెమళ్ళు సాయంవేళల్లో నిద్రించడానికి అనువైన స్థలం కోసం పొడవాటి చెట్లపైకి ఎక్కుతాయి. ఉదయం అవి మెల్లగా చెట్లపైనుండి క్రిందికి దిగుతాయి. ఈ పక్షుల అందం మీ కళ్ళకు ఇంపుగా ఉండవచ్చు కానీ వాటి పాటకూడా అంత మధురంగా ఉంటుందని మాత్రం ఆశించకండి. వాటి శోకభరితమైన అరుపులు సాయంకాలపు నిశ్శబ్దాన్ని ఛేదిస్తాయి, మళ్ళీ ఉదయాన్నే పక్షులు ఆహారం వెదుక్కోవడానికి వెళ్ళేవరకూ అవి అలా అరుస్తుంటాయి.

నెమళ్ళు ఏది పడితే అది తింటాయి. అవి విత్తనాలు, ధాన్యం, పప్పుదినుసులు, మొక్కల లేత వేర్లతో పాటు కీటకాలు, బల్లులు, కొన్నిసార్లు చిన్న పాములను కూడా ఆరగిస్తాయి.

నెమలి తన రూపాన్ని బట్టి నిస్సత్తువగా కనిపించినా అది తనను తాను రక్షించుకోవడానికి చాలా జాగ్రత్తపడుతుంది. మెల్లగా పొంచివచ్చే పిల్లి జాడ వెంటనే పసిగట్టిన నెమలి రానున్న ఈ ప్రమాదం గురించి హెచ్చరించడానికి పెద్దగా అరుస్తూ అడవిలో పరుగెడుతుంది. ఇతర మగనెమళ్ళు కూడా దానితో కలుస్తాయి. అవి ఆశ్చర్యకరమైన వేగంతో ఒక దాని వెనుక ఒకటి పరుగెడతాయి. అయితే ఆడనెమళ్ళు మాత్రం ఎంతటి ప్రమాదకరమైన పరిస్థితుల్లోనైనా తమ పిల్లలను విడిచి వెళ్ళడానికి నిరాకరిస్తాయి.

నెమలికున్న పొడవాటి పింఛం దాని వేగాన్ని తగ్గించినట్లేమీ అనిపించదు కానీ అది ఎగరడం ఆరంభించినప్పుడు మాత్రం పింఛం కొంత ఇబ్బంది కలిగిస్తుందన్నట్లే ఉంటుంది. నెమలి ఒకసారి పైకి ఎగిరిందంటే ఆ తర్వాత అది తన రెక్కలను వడిగా కొడుతూ ఎంతో వేగంగా ఎగురుకుంటూ వెళుతుంది.

నెమలి పిల్లలు ఎనిమిది నెలల వయసులో తమ తల్లిదండ్రులను వదిలి తమను తాము పోషించుకోవడానికి సిద్ధపడతాయి. అవలా వెళ్ళిపోవడం వాటి తల్లి మళ్ళీ పిల్లలను పెంచడానికి ఏర్పాట్లు చేసుకోవడానికి వీలవుతుంది. మగనెమలికి ఎనిమిది నెలల వయసు నుండి పింఛం పెరగడం ప్రారంభమవుతుంది కానీ పింఛం పూర్తిగా పెరగడానికి నాలుగు సంవత్సరాలు పడుతుంది. అప్పుడు అవి తమ స్వంత కుటుంబాన్ని ప్రారంభించుకోవడానికి సిద్ధంగా ఉంటాయి.

చరిత్రలో నెమలి

ప్రాచీన గ్రీసు, రోము, ఇండియాల్లోని ఉద్యానవనాలను నెమళ్ళు ఆకర్షణీయంగా చేసేవి. వేలాది సంవత్సరాలపాటు ఇండియాలోని రాజసభల్లో ఉంచబడిన చిత్రాలు, శిల్పాలు, ఇతర అలంకార వస్తువుల్లో నెమళ్ళు ఉండేవి. నిజానికి మయూర సింహాసనం ఇండియాలోని సంపదను చూపించడానికి అత్యంత ప్రాముఖ్యమైన ఉదాహరణల్లో ఒకటిగా పరిగణించబడేది. అనేక వజ్రాలతో పొదగబడిన ఆ సింహాసనంలో 108 కెంపులు, 116 పచ్చలు ఉన్నాయని నివేదించబడుతోంది. ఆ సింహాసనపు వితానంపై ఒక స్వర్ణ మయూరం ఉండడం వల్లనే దానికి ఆ పేరు వచ్చింది. ఆ సింహాసనం కేవలం ప్రాముఖ్యమైన ఆచారాల్లో మాత్రమే ఉపయోగించబడేది.

సొలొమోను రాజు దిగుమతి చేసుకునే విలువైన వస్తువుల్లో నెమళ్ళు కూడా ఉండేవని బైబిలు చరిత్ర చూపిస్తోంది. ఆయన ఉద్యానవనాల్లో నెమళ్ళు తిరుగాడటాన్ని ఊహించుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. (1 రాజులు 10:​22, 23) బుద్ధిసూక్ష్మతగల సృష్టికర్త ఉన్నాడని ఈ పక్షులు మనకు ఖచ్చితంగా చూపిస్తున్నాయి. నెమలి అద్భుతమైన రంగులుగల తన పురిని విప్పి నాట్యం చేసినప్పుడు, “సమస్తమును సృష్టించి[న]” దేవుడైన యెహోవాకున్న కళాత్మకమైన సామర్థ్యాలను బట్టి ఆశ్చర్యపోకుండా ఎవ్వరూ ఉండలేరు.​—⁠ప్రకటన 4:9-11. (g03 6/22)

[అధస్సూచి]

a ఈ పింఛంలోని ఈకలు నెమలి వీపునుండి పెరుగుతాయి, తోకనుండి కాదు. ఈ పింఛంలోని ఈకలను నిటారుగా నిలబెట్టడానికి నెమలి తన తోకలోని ఈకలను ఉపయోగిస్తుంది.

[18వ పేజీలోని చిత్రం]

ఆడనెమలి మగనెమలి చేసే నాట్యాన్ని చూసి ఎల్లప్పుడూ ప్రభావితం చెందదు

[చిత్రసౌజన్యం]

© D. Cavagnaro/Visuals Unlimited

[19వ పేజీలోని చిత్రాలు]

ఆడనెమళ్ళు మంచి తల్లులు

[చిత్రసౌజన్యం]

© 2001 Steven Holt/stockpix.com

[17వ పేజీలోని చిత్రసౌజన్యం]

నెమలి: Lela Jane Tinstman/Index Stock Photography

[18వ పేజీలోని చిత్రసౌజన్యం]

John Warden/Index Stock Photography

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి