ఆ కీర్తన ఆమె మనస్సులో పాదుకుంది
“‘గొప్పవాడైన యెహోవా తన మహిమలో సింహాసనాసీనుడైవున్నాడు’ అనే మాటలున్న కీర్తనను స్కూల్లో పాడేదాన్ని. ‘ఈ యెహోవా ఎవరు?’ అని నేను తరచూ అనుకునేదాన్ని.”
గ్వెన్ గూచ్ యెహోవాసాక్షి కాకముందు చేసిన వ్యాఖ్యానం అది, ఆమె జీవిత కథ కావలికోటలో ప్రచురించబడింది.a అది చదివిన వారిలో కనీసం ఒక్క పాఠకురాలు ఆ వ్యాఖ్యానాన్ని గుర్తించింది. అమెరికాలోని వాషింగ్‌టన్‌లోని సియాటిల్‌లో నివసిస్తున్న వేరా ఇలా జ్ఞాపకం చేసుకుంటుంది, “నేను హైస్కూల్లో ఉన్నప్పుడు నాక్కూడా అలాంటి అనుభవమే కలిగింది.”
వేరా ఒకానొక గీతాన్ని విన్న తర్వాత గ్వెన్‌లానే ఆమెలో కూడా ఈ యెహోవా ఎవరై ఉంటారా అనే గొప్ప జిజ్ఞాస కలిగింది. మొదటిసారిగా 1949లో ఆమె సహోదరుడు, యెహోవా అనేది బైబిలులోని దేవుని సొంత పేరు అని చెప్పినప్పుడు ఆమె జిజ్ఞాస తీరింది.
వేరా ఇప్పటికి దాదాపు అర్ధశతాబ్దం నుండి యెహోవాసాక్షిగా ఉంది. కానీ హైస్కూల్ రోజులనుండి కూడా ఆమె ఆ గీతాన్ని మర్చిపోలేదు. “ఆ గీతం ఎక్కడిదో తెలుసుకోవాలని ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నం చేశాను” అని ఆమె చెప్తుంది. చివరికి, ఒక మ్యూజిక్ స్టోర్ మూలంగా ఆమె విజయం సాధించింది. ఆ గీతం, 1825లో ఫ్రాంట్ స్కూబర్ట్ సమకూర్చినది. సంగీతంతో కూడిన ఆ మాటలు నిజంగా యెహోవాను స్తుతిస్తున్నాయి. ఉదాహరణకు, ఆ గేయంలోని కొన్ని పాదాలు ఇలా ఉన్నాయి:
“ప్రభువైన యెహోవా మహోన్నతుడు! భూమ్యాకాశములు ఆయన శక్తిని చాటి చెప్తున్నాయి. . . . ప్రచండ వాయువు హోరులో, నిర్ఝర నినాద నిక్వాణంలో మీరు దాన్ని వింటారు . . . అరణ్యాల్లో వినిపించే రొదలోను వింటారు, లీలగా గాలికి తలలు ఊపుతున్న బంగారువన్నె మొక్కజొన్న చేలలోను; పరిమళాలు వెదజల్లే సుందర సుమాలలోను, నక్షత్రాలు నిండిన నీలాకాశంలోను దాన్ని వింటారు . . . భీతిని పుట్టించే పయోధర ప్రచండ ఘోష ఆయన శక్తిని ప్రతిధ్వనిస్తుంది, ఆయననుంచి వచ్చే మెరుపుల జ్వాలలు అనంతమైన ఆకాశాన్ని ఆక్రమిస్తున్నాయి. అంతెందుకు మీ హృదయనాదం నిత్య ప్రభువైన యెహోవా దేవుని శక్తిని ఉన్నతపరుస్తోంది . . . కరుణా కటాక్షాల కోసం ఆయనవైపు చూడండి . . . ప్రభువైన యెహోవా మహోన్నతుడు!”
వేరా ఇలా అంటోంది: “నేను కొన్నిసార్లు ఈ గేయాన్ని ప్రజలకు చూపించి, 1800లలో దేవుని నామాన్ని ఎరిగివుండి, ఆయన్ను స్తుతించినవారు ఉన్నారని చెప్పేదాన్ని.” వాస్తవం ఏమిటంటే తొలికాలాల నుండీ విశ్వసనీయులైన స్త్రీపురుషులు యెహోవాను పాటల ద్వారా స్తుతించటానికి కదిలించబడ్డారు. ఇలా స్తుతించటం నిరంతరమూ కొనసాగుతుంది, ఎందుకంటే భూమ్యాకాశాలను సృజించిన సృష్టికర్తను స్తుతించటానికిగల కారణాలకు అంతులేదు.
[అధస్సూచీలు]
a కావలికోట మార్చి 1, 1998 చూడండి.
[13వ పేజీలోని చిత్రం]
వేరా