బైబిలు ఉద్దేశము
బేత్లెహేములో యేసును ముగ్గురు రాజులు సందర్శించారా?
యేసు పుట్టిన తర్వాత, యూదుల రాజుగా ఆయనను పూజించాలని తూర్పున ప్రసిద్ధులైన వ్యక్తులు బేత్లెహేముకు వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ను ఆచరించే చాలా మంది ప్రజలు వాళ్ళ సందర్శనను నేటికీ గుర్తుచేసుకుంటారు.
కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు, యేసు జన్మించినప్పటి సన్నివేశాన్ని చిత్రీకరించే దృశ్యాలను తయారు చేస్తారు, ఆ దృశ్యాల్లో, తూర్పు నుండి వచ్చిన ఆ సందర్శకులు, అంటే, క్రొత్తగా జన్మించిన యేసు దగ్గరికి కానుకలతో వస్తున్న ముగ్గురు రాజుల్లాగా కనిపిస్తారు. ఇతర దేశాల్లో, పిల్లలు “ఆ పరిశుద్ధ రాజుల” వేషాలను ధరించి తమ ఇరుగుపొరుగున ప్రదర్శనలు చేస్తారు. ఇప్పటికీ 20 శతాబ్దాలు గడిచాక కూడా, అన్నిచోట్లా ఉన్న ప్రజలు, ఆ ముగ్గురు అసాధారణ సందర్శకులను గుర్తుచేసుకుంటారు. అసలు వాళ్ళు ఎవరు?
వాళ్ళు రాజులా?
ఈ సంఘటనను గురించిన చరిత్ర రికార్డు బైబిలు పుస్తకమైన మత్తయిలో కనిపిస్తుంది. “యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పుదేశపు జ్ఞానులు [“జ్యోతిష్కులు,” న్యూ అమెరికన్ బైబిల్] యెరూషలేమునకు వచ్చి—యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి” అని చదువుతాము. (మత్తయి 2:1, 2) న్యూ అమెరికన్ బైబిల్ తూర్పు నుండి వచ్చిన ఈ సందర్శకులను జ్యోతిష్కులు అంటుందే గానీ రాజులు అని ఎందుకు అనడం లేదు?
ఇక్కడ, మేగోస్ అనే గ్రీకు బహువచనం ఉపయోగించబడింది. వివిధ బైబిలు అనువాదాలు వివిధ రకాలుగా అనువదించాయి. కొన్ని అనువాదాలు “జ్ఞానులు” అనీ, కొన్ని అనువాదాలు “జ్యోతిష్కులు” అనీ, కొన్ని అనువాదాలు “ఖగోళశాస్త్రజ్ఞులు” అనీ అనువదించాయి. మరి కొన్ని అనువాదాలు “మెజై” అని లిప్యంతరీకరణం చేశాయి. మెజై అనే మాట, నక్షత్రాల, గ్రహాల స్థానాన్ని బట్టి భవిష్యత్తును గురించి చెప్పేవాళ్ళను లేదా సలహా ఇచ్చేవాళ్ళను సూచిస్తుంది. కనుక, బేత్లెహేమును సందర్శించిన వీళ్ళు శకునము చెప్పేవాళ్ళు అనీ, దేవుడు ఆమోదించని మాంత్రిక విద్యలను అభ్యసించేవాళ్ళు అనీ బైబిలు తెలియజేస్తుంది.—ద్వితీయోపదేశకాండము 18:10-12.
వాళ్ళు రాజులు కూడానా? వాళ్ళు రాజులైతే, రాజులు అని బైబిలు సూచించి ఉండేదని అనుకోవడం తర్కబద్ధమే. “రాజు” అనే మాట మత్తయి 2:1-12 వచనాల్లో, మొత్తం నాలుగుసార్లు కనిపిస్తుంది. యేసు గురించి ఒకసారి, హేరోదు గురించి మూడు సార్లు కనిపిస్తుంది. కానీ ఒక్క సారి కూడా ఈ జ్యోతిష్కులను గురించి రాజులు అని చెప్పడంలేదు. ఈ విషయాన్ని గురించి చెబుతూ క్యాథలిక్ ఎన్సైక్లోపీడియా ఇలా అంటుంది: “ఏ చర్చి ఫాదరు కూడా ఈ జ్యోతిష్కులను రాజులుగా దృష్టించరు.” బైబిలు కూడా అలా చెప్పడం లేదు.
వాళ్ళు ముగ్గురా?
ఎంతమంది జ్యోతిష్కులు వచ్చారన్నది బైబిలు వృత్తాంతంలో తెలియజేయబడలేదు. అయినప్పటికీ, క్రీస్తు జననాన్ని చిత్రీకరించే దృశ్యాలూ, క్రిస్మస్ పాటలూ ముగ్గురు సందర్శించారు అన్న తలంపుకు మద్దతునిస్తాయి. మూడు రకాల కానుకలు ఇవ్వబడ్డాయి అన్న వాస్తవం నుండే ఈ తలంపు వచ్చి ఉంటుందని స్పష్టమవుతుంది. వీరిని గురించి బైబిలు ఈ విధంగా చెబుతుంది: “[వారు] తమ పెట్టెలు విప్పి, బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా [యేసుకు] సమర్పించిరి.”—మత్తయి 2:11.
జ్యోతిష్కులు మూడు రకాల కానుకలిచ్చారు కనుక, వాళ్ళు ముగ్గురై ఉంటారు అని అనుకోవడం తర్కబద్ధమేనా? ఇశ్రాయేలును సందర్శించిన మరొక ప్రముఖ సందర్శకురాలిని గురించిన వృత్తాంతాన్ని పరిశీలిద్దాం. షేబ దేశపు రాణి, రాజైన సొలొమోనును సందర్శించి, ఆయనకు “గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను” కానుకలుగా ఇచ్చింది. (1 రాజులు 10:2) మూడు రకాల కానుకలు ఇవ్వబడినప్పటికీ, ఇచ్చినది ఒక వ్యక్తేననీ, అది షేబ దేశపు రాణి అనీ పేర్కొనబడింది. ఆ సందర్భంలో సొలొమోను దగ్గరికి వచ్చింది ముగ్గురు వ్యక్తులని ఆమె ఇచ్చిన కానుకల సంఖ్య సూచించడం లేదు. అలాగే, యేసుకు మూడు కానుకలు ఇవ్వబడినందువల్ల, కానుకలను తెచ్చి ఇచ్చింది ముగ్గురు వ్యక్తులని అనడానికీ లేదు.
“ఎంత మంది జ్యోతిష్కులు వచ్చారు అన్న విషయాన్ని సువార్త వృత్తాంతం చెప్పలేదు. ఈ విషయంలో అందరూ ఒకే విధంగా అనుకోవడమూ లేదు. కొందరు ఫాదర్లు ముగ్గురు జ్యోతిష్కులు అని అంటారు; కానుకల సంఖ్యను బట్టే కావచ్చు వాళ్ళు అలా చెబుతున్నది” అని ద క్యాథలిక్ ఎన్సైక్లోపీడియా పేర్కొంటోంది. యేసును సందర్శించినది ఇద్దరనీ, ముగ్గురనీ, నలుగురనీ, చివరికి ఎనిమిది మందనీ కూడా వివిధ చిత్రాలూ, బొమ్మలూ చూపిస్తున్నాయి అని ఆ ఎన్సైక్లోపీడియా చెబుతుంది. యేసును సందర్శించడానికి 12 మంది జ్యోతిశ్శాస్త్రజ్ఞలు వచ్చారని కొందరు అంటారు. ఎంతమంది జ్యోతిష్కులు అనేదాన్ని గురించి ఒక నిర్ధారణకు రాలేము.
ప్రసిద్ధమైనదే అయినా సరికాని కథ
ప్రచారంలో ఉన్న కథ జరిగినదానికి భిన్నంగా ఉంది. యేసు పుట్టిన తర్వాత, జ్యోతిష్కులు మొదట వెళ్ళింది బేత్లెహేముకు కాదు, యెరూషలేముకి. అంటే యేసు పుట్టిన సమయంలో వాళ్ళు అక్కడ లేరు. వాళ్ళు తర్వాత బేత్లెహేముకు వెళ్ళినప్పుడు, ఆ ‘యింటిలోనికి వెళ్ళి, ఆ శిశువును చూశారు’ అని బైబిలు చెబుతుంది. (మత్తయి 2:10) ఈ జ్యోతిష్కులు యేసును సందర్శించే సమయానికెల్లా, ఆయన కుటుంబం తమ ఇంటికి తరలివెళ్ళింది అన్నది స్పష్టం. వాళ్ళు ఆయనను చూసింది, తొట్టిలో పడుకొని ఉన్నట్లు కాదు.
లేఖనాల ప్రకారంగా చూస్తే, యేసు జన్మించినప్పుడు ముగ్గురు రాజులు వచ్చి, ఆయనను సన్మానించారనే ప్రఖ్యాతి గాంచిన ఆ కథ ఖచ్చితమైనది కాదు అని తెలుస్తుంది. పైన పేర్కొన్నట్లు, యేసును సందర్శించిన జ్ఞానులు రాజులు కారు, మంత్ర విద్యలను అభ్యసించిన జ్యోతిష్కులు అని బైబిలు బోధిస్తుంది. వాళ్ళు ఎంతమంది అన్నది లేఖనాలు చెప్పడం లేదు. అలాగే, వాళ్ళు యేసును, ఆయన జన్మించిన సమయంలో, పశువుల తొట్టిలో ఉన్నప్పుడు సందర్శించలేదు. ఆయన కుటుంబం ఇంట్లో ఉన్నప్పుడు సందర్శించారు.
ముగ్గురు రాజులను గురించిన ఒక ప్రసిద్ధ కథా, క్రిస్మస్ గురించి చెప్పుకోబడుతున్న ఇతర కథలూ లేఖనాధారమైనవి కావు. ఈ కథలు హానిరహితమైన పండుగ కథలుగా దృష్టించబడుతున్నాయి. అయితే, నిజ క్రైస్తవులు సత్యారాధనకు ఎంతో విలువ ఇస్తారు. యేసు కూడా అలాగే విలువిచ్చాడు. ఆయన తన తండ్రికి చేసిన ప్రార్థనలో, “నీ వాక్యమే సత్యము” అని ఒకసారి అన్నాడు. (యోహాను 17:17) “యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు” అని ఆయన అన్నాడు.—యోహాను 4:23.
[15వ పేజీలోని చిత్రం]
“జ్యోతిష్కులు ఆరాధించడం”