కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g99 12/8 పేజీలు 15-17
  • ఐరిష్‌వూల్ఫ్‌హౌండ్‌ను చూడండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఐరిష్‌వూల్ఫ్‌హౌండ్‌ను చూడండి
  • తేజరిల్లు!—1999
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవుడు, ప్రభుత్వం మరియు మీరు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
తేజరిల్లు!—1999
g99 12/8 పేజీలు 15-17

ఐరిష్‌వూల్ఫ్‌హౌండ్‌ను చూడండి

ఐర్లాండ్‌లోని తేజరిల్లు! విలేఖరి

“శునకరాజ్యంలో రాజసంగా ఉండే అసాధారణ పరిమాణంగల కుక్క”

అని ఐరిష్‌ వూల్ఫ్‌హౌండ్‌ అనే జాతి కుక్క గురించి వర్ణించబడింది. (వూల్ఫ్‌ అంటే తోడేలు, హౌండ్‌ అంటే వేట) మీరు వూల్ఫ్‌హౌండ్‌ను ఎప్పుడైనా చూశారా? ఇప్పుడు ఐర్లాండ్‌లో తోడేళ్ళు లేవన్నది నిజమే. కానీ ఒకప్పుడు ఉండేవి. అక్కడ పందులూ, లేడిజాతికి చెందిన పెద్ద పెద్ద జంతువులూ కూడా ఉండేవి. ఐర్లాండ్‌లోని చివరి తోడేలు దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం చంపబడింది అని చెబుతుంటారు. అంతకు ముందు, తోడేళ్ళను, అలాగే మరితర పెద్ద జంతువులను వేటాడడంలో వూల్ఫ్‌హౌండ్‌లు పేరుగాంచాయి. అమెరికాలోని రాకీ పర్వతాలకు పంపించబడిన ఒక వూల్ఫ్‌హౌండ్‌ గురించిన ఒక కథ ఇప్పుడు ప్రచారంలో ఉంది. ఆ కథ ప్రకారం, 1892లో, ఆ వూల్ఫ్‌హౌండ్‌ “ఒక్క చలికాలంలోనే ఒంటరిగా నలభై తోడేళ్ళను చంపేసింది.” కానీ మీరు భయపడకండి. వూల్ఫ్‌హౌండ్‌లు మనుష్యులను వేటాడవు, లేక చంపవు!

కొందరు చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, వూల్ఫ్‌హౌండ్‌లు సా.శ.పూ. 500 కెల్లా ఐర్లాండ్‌లో బాగా స్థిరపడి ఉంటాయి. సెల్ట్స్‌ అని పిలువబడే ప్రజలు వూల్ఫ్‌హౌండ్‌లను వేటకు మాత్రమేగాక వేరే పనులకు కూడా ఉపయోగించారు. ఈ కుక్కలు, ఐర్లాండ్‌ రాజులతో పాటు, యోధులతో పాటు పోరాటానికి కూడా వెళ్ళేవని పురాణ కథలూ, చరిత్రా చెబుతున్నాయి.

ప్రత్యేక తరహా కుక్క జాతిగా వూల్ఫ్‌హౌండ్‌కున్న ఖ్యాతి ప్రపంచ నలుమూలలకు వ్యాపించింది. వూల్ఫ్‌హౌండ్‌లను ఎరీనాల్లో ప్రదర్శించేందుకు రోమ్‌కు కూడా తీసుకువెళ్ళేవారు. క్వింటస్‌ అరేలియస్‌ సిమ్మాకస్‌ అనే పేరు గల రోమన్‌ చీఫ్‌ మెజిస్ట్రేట్‌, తన సహోదరుడు తన కోసం ఏడు ఐరిష్‌ వూల్ఫ్‌హౌండ్‌లను రోమ్‌కు పంపించినందుకు ఆ సహోదరునికి సా.శ. 393లో కృతజ్ఞతలు తెలుపుతూ ఒక ఉత్తరం వ్రాశాడని ఆయనను గురించిన నివేదికలు మనకు చెబుతున్నాయి. ఆ కుక్కలు రోమన్లను నిజంగానే చాలా ఆనందభరితులను చేశాయనిపిస్తుంది. “రోమ్‌ వారందరూ కూడా వాటిని ఎంతో ఆశ్చర్యంగా చూశారు, ఇనుప బోన్లలో వాటినిక్కడికి తీసుకు వచ్చి ఉంటారు అని వాళ్ళు అనుకున్నారు” అనీ సిమ్మాకస్‌ వ్రాశాడు.

వాటిని ఇనుప బోన్లలో తీసుకొచ్చి ఉంటారు అని ప్రజలు తలంచడానికి కారణం, ఆ కుక్కల పెద్ద పరిమాణమే కావచ్చు. మగవి, భుజం వరకు 86 సెంటీమీటర్లు ఉంటాయి, కొన్ని ఇంకా ఎత్తుగా ఉంటాయి. రికార్డులో ఉన్నవాటిలో అన్నింటికన్నా ఎత్తున్న వూల్ఫ్‌హౌండ్‌ ఎత్తు 100 సెంటీమీటర్ల కన్నా ఎక్కువగా ఉంది. ఆడ వూల్ఫ్‌హౌండ్‌లు సాధారణంగా మగవాటికన్నా దాదాపు పది సెంటీమీటర్లు తక్కువ ఎత్తులో ఉంటాయి. ఎత్తు ఎక్కువగా ఉన్నందు వల్ల అదనపు తిండి సులభంగా దొరుకుతుంది. స్కాట్లాండ్‌ నవలా రచయితయైన సర్‌ వాల్టర్‌ స్కాట్‌, భోజన సమయంలో జాగ్రత్తగా ఉండమని తన స్నేహితుడ్ని హెచ్చరించాడు. జాగ్రత్తగా ఉండకపోతే, “ముక్కు చివరి నుండి తోక వరకు రెండు మీటర్ల పొడవున్న” తన వూల్ఫ్‌హౌండ్‌ “తన పంజాను టేబిల్‌ మీద గానీ కుర్చీ మీద గానీ ఆనించే శ్రమకూడా లేకుండానే, ప్లేట్లో నుండి తినేయ”గలదు.

ఈ హౌండ్లు పుట్టినప్పుడు చాలా చిన్నగా ఉంటాయి, కేవలం ఏడు వందల గ్రాముల బరువే ఉంటాయి. కానీ చాలా త్వరగా ఎదుగుతాయి. అవి అంటే ఎంతో మెప్పు ఉన్న ఒక యజమానురాలు, ఇవి పిల్లలుగా ఉన్నప్పుడు “ఆసక్తికరమైన చిన్న జీవులు”గా ఉంటాయి, “పొట్టిగా బొద్దుగా ఉండే ఈ పిల్లలు, చాలా త్వరగా, పొడవైన కాళ్ళతో ఎత్తుగా సన్నగా ఉండే, మృదువైన జీవులుగా” మారుతాయి అని చెబుతున్నారు.

అవి ఎక్కువగా మొరుగవు. మరింత దృఢంగా, నెమ్మదిగా ఉంటాయి. కానీ మొరుగుతే మాత్రమే, అది మన స్మృతిపథంలో అలాగే ఉండిపోతుంది. వాటి మొరుగుడు విన్న ఒక వ్యక్తి, “[తాను] విన్నవాటన్నింటిలోకెల్లా దీని గొంతే నూతిలో నుండి వస్తున్నట్లుగా, ఎంతో విచారంగా ఉన్నట్లుగా ఉంటుంది” అని చెప్పాడని ప్రజలు చెబుతుంటారు.

ఈ ఐరిష్‌ వూల్ఫ్‌హౌండ్‌ గురించి, “చూపు వాడిగా ఉంటుంది, కళ్ళు తీక్షణంగా ఉంటాయి, కనుబొమ్మల వెంట్రుకలు పొడవుగా ఉంటాయి, బొచ్చు మొరటుగాను ముదురు బూడిదరంగులోను ఉంటుంది” అని వర్ణించబడుతుంది. మొదటి సారి చూసేవారికెవరికైనా తప్పించుకోవాలనిపించేలా ఉంటుంది. అయితే అవి “ఒక చిన్న పిల్లవాడు వాటితో ఆడుకోగల్గేంత దయగా ప్రవర్తిస్తాయి” అని కూడా చెప్పబడుతుంది. వాటి గురించి బాగా తెలిసిన ఒక యజమానుడు, నిజానికి అవి “ఎంతో ఆనందంగా వాత్సల్యపూరితంగా ఉంటాయి” అని చెబుతున్నాడు. అవి బూడిద రంగులో మాత్రమే కాదు, తెలుపు రంగులోనూ, గోధుమ రంగులోనూ, ఎరుపు రంగులోనూ, నలుపు రంగులోనూ ఉంటాయి.

ప్రసిద్ధ ఐరిష్‌ రచయితయైన ఒలివర్‌ గోల్డ్‌స్మిత్‌ వాటిపై ప్రశంసా వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఈ “గొప్ప ఐరిష్‌ వూల్ఫ్‌డాగ్‌ చాలా అందంగా రాచఠీవితో ఉంటుంది . . . ప్రపంచంలోకల్లా గొప్ప కుక్కజాతికి చెందినదిది” అని ఆయన అంటున్నాడు. వాటి కనుబొమ్మలూ, కనురెప్పల వెంట్రుకలూ, మీసమూ అన్నీ కలిసి దానికి “నిజమైన ఐరిష్‌ రూపాన్ని” ఇస్తున్నాయి అని చెప్పబడుతుంది. ఆ ఐరిష్‌ రూపంతో పాటు, దాని పరుషమైన అందమైన చూపుకు ఆయన ఎంతో ఆకర్షితుడయ్యాడు.

అయితే అవి ఒక జాతిగా అంతరించిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? వాటికున్న జనాదరణే ఒక కారణం. అవంటే మెప్పుదలగలవాళ్ళు, చక్రవర్తుల్లాంటి ప్రముఖులైన వ్యక్తులకు కానుకగా వాటిని ఇవ్వవచ్చని తలంచారు. అలా వాటిని “సంపాదించి, ప్రపంచంలోని నలుమూలల ఉన్న దేశాలకు పంపడం జరిగింది.” అలా అవి వివిధ ప్రాంతాలకు పంపబడ్డాయి. అంతేకాక, తోడేళ్ళ వేటలో వాటి ఉపయోగం అయిపోయిన తర్వాత, ఐర్లాండ్‌లోని ఒక జాతిగా అవి నిర్లక్ష్యం చేయబడ్డాయి.

వూల్ఫ్‌హౌండ్‌ అంటే ఎంతో మక్కువ గల ఒకరు వాటి దైన్యస్థితిని గురించి, 1839లో ఈ విధంగా నివేదించాడు: “ఈ ఉన్నతజాతి కుక్కలు అతి త్వరగా అంతరించిపోతున్నాయన్నది మనస్తాపాన్ని కలిగించవలసిన విషయం. కొన్ని సంవత్సరాల్లోపల, అసామాన్యమైన ప్రయత్నాలు ఏమైనా చేయకపోతే అవి తప్పనిసరిగా అంతరించిపోతాయి.” అవి ఎంత తక్కువగా ఉండేవంటే, వూల్ఫ్‌హౌండ్‌ ఉన్నవాళ్ళు తమ దగ్గరున్నది “దాని జాతిలోని చివరిది” అని చెప్పుకోవడం అసాధారణమేమీ కాదు. కానీ అవి మనుగడ సాగించగల్గాయి.

జోర్జ్‌ ఏ. గ్రాహమ్‌ వంటి వ్యక్తుల “అసామాన్యమైన ప్రయత్నాల”తో అవి రక్షించబడ్డాయి. 1862లో ఆయన వాటి దురవస్థను చూశాడు. మిగిలివున్న వూల్ఫ్‌హౌండ్‌లను తనకు సాధ్యమైనంత మేరకు కనుగొని వాటిని ఒక దగ్గరికి చేర్చి, వాటిని జాగ్రత్తగా పోషించి, ఈనాడు అవి ఉన్న పరిస్థితికి వాటిని తీసుకువచ్చేందుకు కావలసిన వాటిని అమర్చాడు. ఆయన అలా చేయకపోతే, “గొప్ప జాతికి చెందిన ఈ అమూల్యమైన శునకరాజులు ఉనికిలో ఉండేవి కావు” అని 1893లో ఒక చరిత్రకారుడు అంటున్నారు.

ఫిలస్‌ గార్డ్నర్‌, వూల్ఫ్‌హౌండ్‌లను మెచ్చుకునేవారిలో ఒకరు. గౌరవనీయురాలైన ఆమె, ఐరిష్‌ వూల్ఫ్‌హౌండ్‌లను పెంచుతున్నారు. ఆమె ఈ విధంగా వ్రాశారు: “ఈ లోకంలో దేనికీ హామీ ఇవ్వలేము. అంతరించబోయినట్లు అనిపించిన ఈ గొప్ప జాతి కుక్క విపత్తులను తప్పించుకుని బ్రతికిపోయినట్లేనని అనిపిస్తుంది, ఈ కుక్క ఇప్పటికీ ఎంతో జనాదరణ పొందుతూనే ఉంది.”

[17వ పేజీలోని చిత్రం]

దాదాపు నాలుగు వారాల వయస్సున్న వూల్ఫ్‌హౌండ్‌ పిల్లలు

[17వ పేజీలోని చిత్రాలు]

ఉత్తర ఐర్లాండ్‌లోని న్యూటౌనార్డ్‌లోవున్న, నెమ్మదిగా ఉండే వూల్ఫ్‌హౌండ్‌

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి