మా పాఠకుల నుండి
దేవుని ఉనికి “దేవుడు ఉనికిలో ఉన్నాడా?” అనే శీర్షిక పరంపర ఎంత సహాయకరంగా ఉందో నేను వివరించలేను. (మార్చి 8, 1999) నేను ఏ దేవుని గురించి అయితే ఎంతో విని, ఆయనను కనుగొనలేకపోయానో ఆ దేవుణ్ణి అది నాకు చూపించింది. నాలాంటి ప్రజలకు సత్యమార్గాన్ని ప్రకాశింపజేసినందుకు నా హృదయాంతరాళాల నుండి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
కె. పి., బ్రెజిల్
అంధురాలినైనా ఉపయోగకరంగా ఉన్నాను మార్చి 8, 1999 శీర్షికలోని “అంధురాలినైనా ఆనందంగా ఉన్నాను, ఇతరులకు ఉపయోగకరంగా ఉన్నాను” అన్న పోలీటీమీ వెనెట్‌స్యోనోస్ జీవిత కథకు కృతజ్ఞతలు. ఆమెకు గల ధైర్యం, దేవుని పట్ల ఆమెకుగల స్థిరమైన విశ్వాసం నా హృదయాన్ని కదిలించాయి. ఒకప్రక్క, అసాధారణమైన ఆ స్త్రీ జీవితం కష్టనష్టాలతో నిండి ఉంది. కానీ మరోప్రక్క, వెలకట్టలేనన్ని ప్రయోజనాలతో నిండి ఉంది. ఈ కష్టతరమైన జీవిత పరుగు పందెంలో అలసిపోయి ఉన్న వారికి ఆమె కథ గొప్ప సహాయాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తుందని నేను నమ్ముతున్నాను.
కె. ఆర్., రష్యా
దుస్తులు నాకు 11 సంవత్సరాలు, “మన వస్త్రధారణా విధానం—అది ప్రాముఖ్యమైన విషయమేనా?” అన్న శీర్షికలోని చక్కని సలహాల కోసమై మీకు కృతజ్ఞతలు మాటల్లో చెప్పలేను. (మార్చి 8, 1999) ఇదివరకు, నా తోటి విద్యార్థుల్లా దుస్తులు ధరించాలని భావించేదాన్ని. కానీ ఈ శీర్షిక నా బట్టలు శుభ్రంగా ఉండాలి గానీ అసభ్యకరంగానో లేదా మరీ విపరీతంగానో ఉండకూడదని నేను తెలుసుకొనేందుకు సహాయం చేసింది.
ఎ. యస్., ఎస్టోనియా
నా దుస్తులు పాత ఫ్యాషన్‌వనో లేక మరీ చాదస్తంగా ఉంటాయనో ఇతరులు అన్నప్పుడు నేను చాలా బాధపడతాను. మీ శీర్షిక చాలా ప్రోత్సాహకరమైనదిగా ఉంది, ఎందుకంటే బైబిలు సూత్రాలను అనుసరించడం ప్రయోజనకరమని అది నొక్కి తెల్పింది.
ఆర్. ఎల్., బ్రెజిల్
చాలా సంవత్సరాలుగా నాకు యెహోవాసాక్షులంటే జాలిగా, ఎగతాళిగా అనిపించేది. అప్పుడు నా స్నేహితుడు మార్చి 8, 1999 తేజరిల్లు! పత్రికను నాకిచ్చాడు. ఆ పత్రికను చదవడం చాలా ఆనందదాయకంగా ఉంది, సాక్షుల గురించి నాకున్న అభిప్రాయం మారిపోయింది. బట్టలు కొనే విషయంలో నేను ప్రవర్తించే విధానాన్ని వర్ణించిన, దుస్తులపై ఉన్న శీర్షిక నన్ను ప్రత్యేకంగా ప్రభావితం చేసింది. ఇకమీదట, మరీ ఖరీదైనవీ మరీ అధునాతనమైనవీ అయిన వస్త్రాలే కావాలని నేను పట్టుబట్టను. నాకు మీ పత్రికలు మరిన్ని అందేలా చూడమని నేను నా స్నేహితుణ్ని అడుగుతాను !
యు. బి., జర్మనీ
ఇతరుల గురించి మాట్లాడుకోవడం యువత ఇలా అడుగుతోంది . . . “ఇతరుల గురించి మాట్లాడుకుంటే ఏమిటంత హాని?” అనే శీర్షికనుబట్టి మీకు కృతజ్ఞతలు. (మార్చి 8, 1999) కొంతకాలం క్రితం, ఈసారి సంఘంలో నుండి బహిష్కరించబడబోయే వ్యక్తిని నేనే అని ఎవరో వదంతిని వ్యాప్తిజేసినప్పుడు, ఇతరుల గురించి చెడుగా మాట్లాడుకోవడమన్నది ఎంత బాధాకరంగా ఉండవచ్చో నేను వ్యక్తిగతంగా అనుభవించాను. ఆ అబద్ధం చాలా బాధపెట్టింది ! దీనికి కారకుడైన వ్యక్తి క్షమాపణ అడిగినప్పటికీ, అతనిపై నాకున్న నమ్మకం పోయింది.
ఆర్. యమ్., స్విట్జర్లాండ్
మా స్కూల్‌లో ఇతరుల గురించి ఎక్కువగా చెడుగా మాట్లాడుకుంటారు, కాబట్టి ఈ శీర్షిక నాకు ప్రోత్సాహాన్నీ, బలాన్నీ ఇచ్చింది. ఇతరులు నిజంగా చెడ్డవాళ్లలా కనిపించేలా చేయడానికి నేను ఇతరుల గురించి చెడుగా మాట్లాడేదాన్నని చెప్పడానికి నేను చాలా సిగ్గుపడుతున్నాను. స్నేహితులు ఇతరుల గురించి వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నప్పుడు నేను వినడమే కాదు ఆ సంభాషణలో పాల్గొనేదాన్ని కూడా. కాబట్టి నేను ఈ శీర్షికను చదివినప్పుడు, నేను చాలా దిగ్భ్రాంతి చెందాను, అందులోని ప్రతీ వాక్యము నేను చేస్తున్న దానికి సలహానిస్తున్నట్లే ఉంది. ఇతరుల గురించి చెడుగా మాట్లాడిన దాన్నంతటిని బట్టీ నేను చాలా సిగ్గుపడుతున్నాను. మా స్కూల్‌లో ఇతరుల గురించి చెడుగా మాట్లాడుకోవడం కొనసాగుతూనే ఉంటుందని నాకు తెలుసు, కానీ నేను అందులో భాగం వహించకుండా ఉండేందుకు దృఢనిశ్చయం చేసుకున్నాను.
యమ్. డబ్ల్యు., జపాన్