కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g98 2/8 పేజీలు 19-21
  • నా తలిదండ్రులు నా వివాహానికి వ్యతిరేకిస్తే?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నా తలిదండ్రులు నా వివాహానికి వ్యతిరేకిస్తే?
  • తేజరిల్లు!—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • చిన్న వయస్సు అంటే ఎంత చిన్న?
  • మతపర భేదాలు కారణమైనప్పుడు
  • జాతిపరమైన లేక సంస్కృతిపరమైన తేడాలుంటే?
  • తల్లిగానీ తండ్రిగానీ వ్యతిరేకించడం సహేతుకంగా లేనట్లు అనిపిస్తే
  • శాంతిని వెంటాడడము
  • వివాహ జతను ఎంపిక చేసుకోవడంలో దైవిక మార్గనిర్దేశం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • వివాహం—దేవుని ప్రేమపూర్వక ఏర్పాటు
    ‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’
  • పెళ్లి దేవుడు ఇచ్చిన బహుమతి
    దేవుని ప్రేమలో ఎప్పటికీ నిలిచివుండండి
  • నీ వివాహానికి శ్రేష్ఠమైన పునాది వేసికొనుట
    నీ కుటుంబ జీవితమును సంతోషభరితముగా చేసికొనుము
మరిన్ని
తేజరిల్లు!—1998
g98 2/8 పేజీలు 19-21

యౌవనస్థులు ఇట్లడుగుదురు

నా తలిదండ్రులు నా వివాహానికి వ్యతిరేకిస్తే?

లకీష, ఆమె బాయ్‌ఫ్రెండు పెళ్లి చేసుకుందామనుకుంటున్నారు, కానీ ఆమె తల్లి దానికి సమ్మతించడం లేదు. “నాకు ఈ ఏడు 19 నిండుతాయి” అని లకీష అంటుంది, “కానీ మా అమ్మేమో నాకు 21 వచ్చేంత వరకు మమ్మల్ని ఆగమంటుంది.”

ఒకవేళ మీరు పెళ్లి చేసుకోవాలని పధకం వేసుకుంటుంటే, ఈ విషయంలో మీ తలిదండ్రులు సంతోషంగా ఉండాలని కోరుకోవడం సహజమే. మీ తలిదండ్రులు మీరు ఎంపిక చేసుకున్న జతపట్ల అసమ్మతిని తెలిపినప్పుడు అది మిమ్మల్ని నిజంగా నొప్పించగలదు. మీరేమి చేయాలి? వారి ఇష్టాయిష్టాలను లక్ష్యపెట్టకుండా మీ పెళ్లి ఏర్పాట్లతో ముందుకు సాగిపోవాలా?a

మీరు చట్టరీత్యా వివాహ వయస్సుకు చేరుకుంటే, తలిదండ్రుల సమ్మతి లేకుండానే చట్టరీత్యా వివాహం చేసుకోగల్గే సామర్థ్యం ఉంటే అలా చేయడానికి మీరు ప్రేరేపించబడవచ్చు. అయితే, ఒకరి తలిదండ్రులను సన్మానించడానికి వారికి గౌరవాన్ని చూపడానికి వయోపరిమితులు ఉన్నట్లు బైబిలు చెప్పడం లేదు. (సామెతలు 1:8) మరి మీరు వారి అనుభూతులను పరిగణనలోనికి తీసుకోవడానికి నిరాకరిస్తే, వారితో మీకుగల సంబంధానికి దీర్ఘకాలం ప్రభావం చూపే హానిని కలుగజేసుకుంటుండవచ్చు. అంతేగాక, మీ వివాహానికి వ్యతిరేకించడానికి వారిదగ్గర సరియైన కారణాలు ఉండే అవకాశముంది—ఒకవేళ నిజంగానే సరైన కారణాలు ఉన్నాయేమో?

చిన్న వయస్సు అంటే ఎంత చిన్న?

ఉదాహరణకు, మీది మరీ చిన్న వయస్సు అని మీ తలిదండ్రులు అంటున్నారా? పెళ్లికి ఇంత వయస్సు ఉండాలని బైబిలు చెప్పడం లేదు. కానీ పెళ్లి చేసుకునే ముందు, ఒక వ్యక్తి ప్యూబర్టీ తర్వాతి సంవత్సరాలు అయిన “యౌవనపు వికాసం దాటి” ఉండాలని బైబిలు సిఫారసు చేస్తుంది, ఆ సంవత్సరాలలో లైంగిక వాంఛలు అతి తీవ్రంగా ఉంటాయి. (1 కొరింథీయులు 7:36, NW) ఎందుకు? ఎందుకంటే అటువంటి నవయౌవనులు వైవాహిక జీవితాన్ని విజయవంతంగా కొనసాగించేందుకు కావాల్సిన భావోద్వేగ పరిణతిని, ఆత్మనిగ్రహాన్ని, ఆధ్యాత్మిక లక్షణాలను పెంపొందించుకోవడంలోని తొలిదశల్లోనే ఉన్నారు.—పోల్చండి 1 కొరింథీయులు 13:11; గలతీయులు 5:22, 23.

20 ఏండ్ల డేల్‌ పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నప్పుడు తన తలిదండ్రులు వ్యతిరేకించగా విస్మయం చెందాడు. “నాది మరీ చిన్న వయస్సనీ అనుభవం శూన్యమనీ వారన్నారు” అంటున్నాడాయన, “నేనేమో మేమిద్దరం పెళ్లికి సిద్ధంగా ఉన్నామనీ, పోగా పోగా అవే అనుభవంలోకి వస్తాయనీ అనుకున్నాను, కానీ మా అమ్మానాన్నలు నేను వట్టి భావావేశాలమీద ఆధారపడి ముందుకు సాగడంలేదని నిశ్చయపర్చుకోవాలని అనుకున్నారు. వారు అనేక ప్రశ్నలు అడిగారు. నేను దైనందిన కార్యకలాపాల్లో నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానా, డబ్బు వ్యవహారాలు చూసుకోగలనా, కుటుంబాన్ని భౌతికంగా, భావోద్వేగపరంగా, ఆధ్యాత్మికంగా సంరక్షించాలన్న వాస్తవాన్ని అర్థం చేసుకున్నానా? నేను తండ్రికావడానికి సిద్ధంగా ఉన్నానా? సంభాషించడం ఎలాగో నేను నిజంగా నేర్చుకున్నానా? జీవిత భాగస్వామి అవసరాలను నేను నిజంగా అర్థం చేసుకున్నానా? మరొక యౌవనస్థురాలిపట్ల శ్రద్ధ వహించనారంభించడానికి ముందు ఒక యౌవనస్థునిగా నన్ను నేను మరింత అర్థం చేసుకోవాలని వారు భావించారు.

“మేము వేచి ఉండాలని ఇష్టపడకపోయినప్పటికీ, పరిణతి చెందేందుకు సమయం ఉండేలా మా పెళ్లిని వాయిదా వేసుకున్నాము. చివరికి మేము పెళ్లిచేసుకున్నప్పుడు, మరింత స్థిరమైన పునాదితోను, వివాహాన్ని దృఢపర్చే మరిన్ని మంచి లక్షణాలు సామర్థ్యాలతోను వివాహబంధంలోనికి ప్రవేశించాము.”

మతపర భేదాలు కారణమైనప్పుడు

టెరీ తన మత విశ్వాసాన్ని పంచుకోని ఒక వ్యక్తిపట్ల ప్రేమ భావాల్ని పెంపొందించుకుని, ఆయనతో రహస్యంగా డేటింగ్‌ చేసింది. పెళ్లి చేసుకోవాలన్న తమ ఉద్దేశాన్ని వెల్లడించిన తర్వాత, తన తల్లి తన వివాహానికి వ్యతిరేకిస్తుందని తెలుసుకుని టెరీ వ్యాకులపడింది. “నా గురించి మా అమ్మ అలా భావించకూడదని నేను కోరుకుంటున్నాను” అని విలపిస్తుంది టెరీ. “మా మధ్య ఇంకా తల్లీకూతుళ్ల సంబంధం ఉండాలని కోరుకుంటున్నాను.”

కానీ నిజానికి ఆ బంధాన్ని బలహీనం చేస్తున్నదెవరు? టెరీ తల్లి అడ్డంకులు సృష్టించేదిగా ఉందా లేక సహేతుకంగా ప్రవర్తించడం లేదా? కాదు, “ప్రభువునందు మాత్రమే” పెండ్లి చేసుకోమని బైబిలు క్రైస్తవులకు ఇస్తున్న సలహాను ఆమె సమర్థిస్తుంది అంతే. (1 కొరింథీయులు 7:39) నిజానికి, “మీరు అవిశ్వాసులతో అసమమైన జోడుగా ఉండకండి” అని బైబిలు ఆజ్ఞాపిస్తుంది. (2 కొరింథీయులు 6:14, 15, NW) ఎందుకలా?

ఒక విషయం ఏమిటంటే, ఒక వివాహం సంతోషభరితంగాను, విజయవంతంగాను ఉండాలంటే మతపరంగానూ ఏకమై ఉండడం చాలా కీలకమైన కారకము. మతాంతర వివాహాల్లో సాధారణంగా ఉండే ఒత్తిళ్లు, మానసిక ఆందోళనల వంటివి తరచూ విడాకులకు దారితీస్తాయని నిపుణులు అంటున్నారు. ఒకరి మత విశ్వాసాల విషయంలో రాజీపడమనే ఒత్తిడికి గురయ్యే సాధ్యత—లేక ఆ విశ్వాసాలను అసలుకే త్యజించమనే ఒత్తిడికి గురయ్యే సాధ్యత—ఉంటుందన్నదే అందుకు ప్రముఖమైన కారణం. అవిశ్వాసి అయిన వివాహజత మీ ఆరాధనలో జోక్యం చేసుకోనప్పటికీ, మీ అత్యంత దృఢమైన నమ్మకాలను ఆయనతో లేక ఆమెతో పంచుకోవడానికి వీలుకాని దుఃఖకర పరిస్థితిలో మీరు జీవించాల్సివస్తుంది. వైవాహిక ఆనందానికి ఇది సూత్రంగా అన్పిస్తుందా?

అందుకని టెరీ కష్టతరమైన నిర్ణయం తీసుకోవల్సివచ్చింది. “నేను యెహోవా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, కానీ నా బాయ్‌ఫ్రెండుని కోల్పోవడం నాకిష్టం లేదు” అంటుంది టెరీ. మీరు రెండు అభిప్రాయాలతో ఉండలేరు. దేవుని ప్రమాణాల విషయంలో రాజీపడి అదే సమయంలో ఆయన అనుగ్రహాన్నీ ఆయన ఆశీస్సులనూ పొందలేరు.

అయితే, మీరు ఒక తోటి క్రైస్తవుణ్ణి పెళ్లిచేసుకోవడానికి మీ తలిదండ్రులు వ్యతిరేకించవచ్చు. ఒక విశ్వాసితో అసమమైన జోడు కాగల సాధ్యత ఉందా? అవును ఉంది, ఒకవేళ ఆ వ్యక్తికి మీకున్నటువంటి ఆధ్యాత్మిక లక్ష్యాలు లేక దైవభక్తి ఉండకపోవచ్చు. ఒకవేళ విషయం అదే అయితే లేదా అతని సంఘంలోని సహోదరుల్లో “మంచిపేరు పొందినవాడు” కాకపోతే మీరు ఆ వ్యక్తిని పెళ్లిచేసుకునే విషయంలో మీ తలిదండ్రులు చింత కలిగివుండడం యుక్తమే.—అపొస్తలుల కార్యములు 16:2.

జాతిపరమైన లేక సంస్కృతిపరమైన తేడాలుంటే?

లిన్‌ తలిదండ్రులు వేరే కారణాన్నిబట్టి అభ్యంతరాలు తెలియజేశారు: ఆమె వేరే జాతి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అనుకుంది. ఈ విషయంలో బైబిలు ఏమని బోధిస్తుంది? అది మనకు “దేవుడు పక్షపాతి కాడని,” ‘ఆయన యొకనినుండి ప్రతి జాతిమనుష్యులను సృష్టించాడని’ చెబుతుంది. (అపొస్తలుల కార్యములు 10:34, 35; 17:26, 27) మనుష్యులందరికీ మూలం ఒకటే, దేవుని దృష్టిలో అందరికీ సమాన విలువ ఉంది.

అయినప్పటికీ, వివాహిత దంపతులకందరికీ “శరీరసంబంధమైన శ్రమలు” ఉంటాయి కానీ జాత్యంతర వివాహం చేసుకున్న దంపతులు అదనపు సవాళ్లను ఎదుర్కొంటుండవచ్చు. (1 కొరింథీయులు 7:28) ఎందుకు? ఎందుకంటే ద్వేషంతో నిండిన నేటి లోకంలోని అనేకమంది ప్రజలు జాతి విషయంలో దేవుని దృక్కోణాన్ని అంగీకరించరు. కొన్ని పాశ్చాత్య దేశాల్లో జాత్యంతర వివాహాలనేవి సర్వసాధారణం అయినప్పటికీ అలాంటి మిశ్రిత దంపతులు తీవ్రమైన పూర్వనిర్ధారిత పక్షపాతాన్ని ఎదుర్కొంటున్న ప్రాంతాలు ఇంకా కొన్ని ఉన్నాయి. అందుకని అటువంటి ఒత్తిళ్లను ఎదుర్కొనే సామర్థ్యం మీలో లేదని మీ తలిదండ్రులు భయపడుతుండవచ్చు.

“మేము చాలా కష్టాల్ని ఎదుర్కొంటామని మా అమ్మానాన్నలు భావించారు” అని లిన్‌ అంగీకరిస్తుంది. జ్ఞానయుక్తంగా లిన్‌ వారి భావాలపట్ల గౌరవాన్ని ప్రదర్శిస్తూ పెళ్లి చేసుకోవడానికి తొందరపడలేదు. ఆమె తలిదండ్రులు లిన్‌లోని పరిణతిని గమనించి, ఆమె ప్రేమించిన వ్యక్తితో వారు చక్కని పరిచయాన్ని అభివృద్ధి చేసుకున్నాక, ఈ పెళ్లి తీసుకురాగల ఒత్తిళ్లను ఆమె భరించగలదని వారికి క్రమంగా తగినంత నమ్మకం ఏర్పడింది. లిన్‌ ఇలా అంటుంది: “మేమిద్దరం నిజంగానే కలిసి సంతోషంగా జీవించగలమని వారికి ఒక్కసారి నమ్మకం కుదిరిన తర్వాత వారు కూడా సంతోషంగా ఉన్నారు.”

అయితే, కొన్నిసార్లు జాతికాదు గానీ సంస్కృతి సమస్యై కూర్చుంటుంది. జీవించేవిధానమూ, అపేక్షలూ, ఆహారం సంగీతం వినోదం వంటి విషయాల్లో అభిరుచులూ మీకన్నా చాలా భిన్నంగా ఉన్న వ్యక్తితో సహజీవనం చేయడం పోగాపోగా మీకు కష్టతరంగా ఉంటుందనే చింతను మీ తలిదండ్రులు వ్యక్తం చేయవచ్చు. ఏదేమైనా, వేరే జాతికి లేక విభిన్న సంస్కృతికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం గొప్ప సవాళ్లను ముందుంచగలదు. మీరు నిజంగా వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా?

తల్లిగానీ తండ్రిగానీ వ్యతిరేకించడం సహేతుకంగా లేనట్లు అనిపిస్తే

కానీ మీ తలిదండ్రులు వ్యతిరేకించడం పూర్తిగా సహేతుకంగా లేనట్లు మీరు భావిస్తే అప్పుడేమిటి? ఫేత్‌ అనే యువతి తన తల్లి గురించి ఇలా చెబుతుంది: “మా అమ్మ చాలాసార్లు విడాకులు పొందింది. పెళ్లిచేసుకోబోయే వ్యక్తిని నిజంగా తెలుసుకోవడం ఎన్నడూ సాధ్యం కాదనీ, అప్పటికే చాలా ఆలస్యం అయిపోతుందనీ ఆమె అంటుంది. నేను పెళ్లి చేసుకుని సుఖపడననే ఒక నిశ్చయానికి ఆమె వచ్చేసింది.” సాధారణంగా, తలిదండ్రుల పెళ్లే విఫలమైనప్పుడు, తమ పిల్లల వివాహం విషయంలో వాస్తవిక దృష్టిని కలిగివుండడం వారికి సాధ్యంకాదు. కొన్ని సందర్భాల్లో, తమ పిల్లల వివాహానికి వ్యతిరేకించడంలో వారికి ప్రశ్నించదగ్గ ఉద్దేశాలే ఉండవచ్చు, ఉదాహరణకు వారికి తమ బిడ్డ జీవితాన్ని అదుపు చేయాలన్న కోరిక ఉండవచ్చు.

ఒకవేళ మీ తలిదండ్రులు సరైన తర్కాన్ని వినడానికి సుముఖత చూపకపోతే, మీరేమి చేయగలరు? యెహోవాసాక్షుల విషయంలోనైతే కుటుంబ సమస్యల్ని పరిష్కరించడంలో సహాయం చేయమని సంఘ పెద్దలను కోరవచ్చు. వారు ఒకరి పక్షం వహించకుండా, కుటుంబ సభ్యులు విషయాల్ని ప్రశాంతమైన, శాంతికరమైన, ఫలవంతమైన రీతిలో చర్చించడానికి సహాయం చేయగలరు.—యాకోబు 3:18.

శాంతిని వెంటాడడము

నిజమే, మీ వివాహానికి వ్యతిరేకత చూపడానికి మీ తలిదండ్రులకు మరెన్నో ఇతర కారణాలు ఉండవచ్చు, ఉదాహరణకు ఆర్థిక చింతలు లేక కాబోయే వివాహజత వ్యక్తిత్వము వంటి ఇతర కారణాలు ఉండవచ్చు. అంతేగాక, ఒకవేళ మీ కాబోయే వివాహజత క్రైస్తవత్వాన్ని స్వీకరించక మునుపు విచ్చలవిడి జీవితాన్ని జీవించినట్లైతే, ఈ ఎయిడ్స్‌ యుగంలో, లైంగికంగా సంక్రమించే ఇతర వ్యాధుల ఈ యుగంలో మీ తలిదండ్రులు యుక్తమైన రీతిలోనే చింతను ప్రదర్శించవచ్చు.b

మీరు మీ తలిదండ్రుల ఇంట్లో జీవించినంత కాలం, మీపై వారికి ఉన్న అధికారాన్ని గుర్తించడం మీ బాధ్యత. (కొలొస్సయులు 3:20) కానీ మీరు మీ కాళ్లపై నిలబడుతున్నప్పటికీ, మీ స్వంత నిర్ణయాలు మీరు తీసుకోగల్గే వయస్సులో ఉన్నప్పటికీ మీ తలిదండ్రుల చింతలను కొట్టిపారేయకండి. వినడానికి సుముఖత చూపించండి. (సామెతలు 23:22) వివాహం చేసుకున్న తర్వాత సంభవించగల పరిణామాలను జాగ్రత్తగా మదింపు చేసుకోండి.—లూకా 14:28 పోల్చండి.

మీరలా చేసిన తర్వాత, బహుశ మీరింకా పెళ్లి చేసుకోవాలనే నిశ్చయించుకోవచ్చు. సహజంగానే అటువంటి నిర్ణయానికి పూర్తి బాధ్యతను మీరే వహించవలసి ఉంటుంది. (గలతీయులు 6:5) మీ తలిదండ్రుల ఆలోచనా దృక్పథాన్ని మీరు పరిగణనలోనికి తీసుకోవడానికి మీరు పూర్తి ప్రయత్నం చేసినట్లైతే, బహుశ వారు మీ నిర్ణయానికి కాస్త అసమ్మతితోనైనా మద్దతునివ్వడానికి ఒప్పించబడవచ్చు. కానీ వారు ఇంకా అభ్యంతరాలను వెలిబుచ్చుతున్నట్లైతే మీరు ఆగ్రహపడడం కానీ లేక కోపం తెచ్చుకోవడం కానీ చేయకండి. గుర్తుంచుకోండి: మీ తలిదండ్రులకు మీపట్ల ప్రేమ ఉంది, మీ భవిష్యత్‌ సుఖం విషయమై వారు చింతను కలిగివున్నారు. వారితో సమాధానంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉండండి. మీరు మీ వివాహంలో విజయాన్ని అనుభవిస్తుండగా బహుశ వారి వైఖరి నెమ్మదిగా మెత్తబడవచ్చు.

మరోవైపు, మీరు మీ తలిదండ్రులు చెప్పినదానంతటినీ నిజంగా పరిశీలిస్తే, మిమ్మల్నీ మీరు అత్యుత్సాహంతో త్వరలో పెళ్లాడబోతున్న వ్యక్తినీ యథార్థంగా పరిశీలిస్తే, మీ తలిదండ్రులు చెప్పేది చివరికి నిజమేనేమో అనే విస్మయాన్ని కల్గించే ముగింపుకు మీరు వస్తే ఆశ్చర్యపోవద్దు.

[అధస్సూచీలు]

a ఈ శీర్షికలోని సమాచారం, ఒకరు తమ వివాహజతను స్వంతంగా ఎంపిక చేసుకునే సంప్రదాయం ఉన్న దేశాల్లోని యౌవనుల కొరకు వ్రాయబడింది.

b తేజరిల్లు! యొక్క మార్చి 22, 1994 (ఆంగ్లం) సంచికలోని “ఎయిడ్స్‌ ఉన్నవారికి సహాయం చేయడం” అనే శీర్షికను చూడండి.

[21వ పేజీలోని చిత్రం]

వివాహం చేసుకోవడానికి మీది మరీ చిన్న వయస్సని మీ తలిదండ్రులు భావించవచ్చు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి