కొండ గొరిల్లాలను సందర్శించడం
టాన్జానియాలోని తేజరిల్లు! విలేఖరి ద్వారా
రువాండా మరియు డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సరిహద్దుల్లో ఉన్న అగ్నిపర్వత ప్రాంతంలో దాదాపు 320 గొరిల్లాలు మాత్రమే నివసిస్తున్నాయి. మరో 300 గొరిల్లాలు ఉగాండాలోని దుర్గమమైన అడవిలో నివసిస్తున్నాయి. అవే కొండ గొరిల్లాలు. ప్రపంచంలో అత్యంత క్లిష్టపరిస్థితుల్లో ఉన్న సస్థన జీవుల కోవలో ఇవి ఉన్నాయ్!
అమెరికా జంతుశాస్త్రజ్ఞురాలైన డైయన్ ఫోసీ ఈ ప్రాణుల దుర్గతిని గూర్చిన చింతను ప్రజలలో కలిగించేందుకు చాలా కృషి చేశారు. 1960ల చివరి భాగంలో కొండ గొరిల్లాలను అధ్యయనం చేసేందుకు ఫోసీ ఆఫ్రికాకు వచ్చారు. ఆ సమయంలో గొరిల్లాల వేట జరుగుతున్నందువల్ల అవి త్వరగా అప్రత్యక్షం కానారంభించాయి. ఔత్సాహికురాలైన ఆ శాస్త్రజ్ఞురాలు ఆ విరుంగ పర్వతాల్లో ఏకాంతవాసంలాంటి జీవితాన్ని గడిపి, ఆ తర్వాత, అక్కడ నివసిస్తున్న గొరిల్లాలతో త్వరలోనే స్నేహం చేశారు. ఫోసీ తాను కనుగొన్న విషయాలను పత్రికా శీర్షికలుగాను, గొరిల్లాస్ ఇన్ ద మిస్ట్ అనే పుస్తకంలోను ప్రచురించారు. చట్టవిరుద్ధంగా వేటాడేవాళ్ళకు వ్యతిరేకంగా పోరాడుతూ, నిజానికి యుద్ధంలాంటిదే చేస్తూ, రోమములు గల తన స్నేహితులను రక్షించాలన్న ఆమె నిర్ణయం సమయం గడుస్తున్న కొలదీ మరింత దృఢపడింది. అయితే, తన ఉద్యమంలో తానే సమిధగా మారింది. 1985లో ఎవరో ఆగంతకుడు ఆమెను హత్యచేశాడు.
శాంతస్వభావం గల ఈ ప్రాణులను స్వయంగా చూడవచ్చన్న నిరీక్షణతో, నేనూ, నా భార్యా గొరిల్లాల నివాసస్థలానికి సాహసయాత్ర చేద్దామని 1993లో నిర్ణయించుకున్నాం. మా సాహసయాత్రను గూర్చిన స్మృతులను నెమరవేసుకోనివ్వండి.
రువాండాలోని 3,700 మీటర్ల ఎత్తున్న వీసోక్ అగ్నిపర్వతం క్రిందిభాగం నుండి పైభాగానికి వోల్కానోస్ నేషనల్ పార్క్ చివరిభాగానికి మా గైడ్ మమ్మల్ని తీసుకువెళ్ళడంతో మా సాహసయాత్ర ప్రారంభమవుతుంది. ఆ యాత్రకు ఒక గంట పడుతుంది. ఓ గంట సేపు మేము అవసరమైన విశ్రాంతి తీసుకుంటుండగా, గొరిల్లాల ఎదుట మేమెలా వ్యవహరించాలో మా గైడ్‌లు మాకు వివరించారు. ఈ ప్రత్యేక జాతి జంతువుల సముదాయాన్ని దర్శించేందుకు రోజుకు ఎనిమిది మంది సందర్శకులను మాత్రమే అనుమతిస్తారని మాకు చెప్పారు. అలా చేయడం అవి వ్యాధులకు గురయ్యే అపాయాన్ని తగ్గిస్తుంది, అలాగే వాటికి కలత కలగడాన్ని నివారిస్తుంది.
“ఒక్కసారి అడవిలో అడుగుపెట్టాక, మనం తప్పనిసరిగా తగ్గు స్వరంలోనే మాట్లాడాలి. అలాగైతేనే, మనం అడవిలోని ఇతర మృగాలనూ, పక్షులనూ గమనించడం వీలవుతుంది, కొండ గొరిల్లాలే కాక, బంగారు వర్ణ కోతులు, డుయ్‌కర్స్, బుష్‌బక్‌లు, ఏనుగులు, అంతెందుకు అడవి గేదెలు కూడా కనిపిస్తాయి” అని ఒక గైడ్ మాకు గుర్తు చేశాడు.
పార్క్‌లో గాయపరిచే దురదగొండి మొక్కలూ, చీమలూ ఉంటాయనీ, పొగమంచుతోనున్న, బురదగావున్న అడవి ప్రదేశంలో జాగ్రత్తగా నడవవలసి ఉంటుందని కూడా మాకు చెప్పారు. నేనూ నా భార్యా ముఖాముఖాలు చూసుకున్నాం. మేము ఇలాంటి ప్రయాణానికి సరైనవిధంగా సిద్ధపడలేదు! కాని స్నేహశీలులైన గైడ్‌లు మాకు రెయిన్ కోట్లనూ, బూట్లనూ అరువిచ్చారు.
గొరిల్లాలకు మానవుల వ్యాధులు చాలా సులభంగా అంటుకుంటాయి. అందుకే వాటిని పరిరక్షించేందుకుగాను, అనారోగ్యంతో ఉన్న వ్యక్తినిగానీ, లేదా తనకు అంటువ్యాధి ఉందని తెలిసిన వ్యక్తిని గానీ వెంట రానివ్వరని మా గైడ్ తర్వాత వివరించాడు. “గొరిల్లాలతో ఉన్నప్పుడు మీకు దగ్గో తుమ్మో వస్తున్నట్లయితే, వాటికి దూరంగా వెళ్ళండి, మీ నోటినీ, ముక్కునూ మూసుకోవడానికి ప్రయత్నించండి. పొగ మంచుతోకూడిన వాళ్ళ గృహంలో మనం అతిథులమని గుర్తుంచుకోండి!” అని ఒక గైడ్ చెప్పాడు.
వాటిని ముట్టుకోగల్గేంత సమీపంలో!
పర్వతం ఎక్కుతున్న కొలదీ నిట్రంగా ఉంది. మేము 3,000 మీటర్ల ఎత్తుకు చేరుకున్నాం. గాలి పలుచగా ఉంది. ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉంది. దారులు చాలా ఇరుగ్గా ఉన్నాయి. కానీ, అడ్డంగా పెద్దగా పెరిగిన కొమ్మలుగల హజీనియా చెట్ల అందాన్ని మనం ఆస్వాదించగలం. ఆ కొమ్మలపై నాచు మొక్కలూ, ఫెర్న్ మొక్కలూ, ఆర్కిడ్ మొక్కలూ బాగా దట్టంగా పెరిగి ఆ అడవికి పరదైసు సమానమైన అందాన్నిస్తున్నాయి.
గొరిల్లాలు తాజా ఆహారం కొరకైన అన్వేషణలో ఎప్పుడూ మకాం మారుస్తూనే ఉంటాయి. అయినప్పటికీ అవి ముందు రోజు కనిపించిన చోటు కోసం గైడ్‌లు ఇప్పుడు వెదకడం మొదలుపెట్టారు. “అటు చూడండి!” అని అంటూ ఒకరు ఆశ్చర్యాన్ని వెలిబుచ్చారు. అక్కడ కనిపిస్తున్నది సిల్వర్‌బ్యాక్ గొరిల్లా యొక్క పచ్చికతో కప్పివేయబడిన పడక, లేదా నివాసస్థలమది.
“సిల్వర్‌బ్యాక్ గొరిల్లాను ఊమూగోమ్ అని పిలుస్తారు. మగ గొరిల్లాకు దాదాపు 14 సంవత్సరాలు వచ్చినప్పుడు, దాని వెనుక భాగం వెండిలా తెల్లగా మారుతుంది. అప్పుడు అది వాళ్ళ సముదాయం యొక్క లీడర్‌గా పరిగణించబడుతుంది. ఆ సిల్వర్‌బ్యాక్ మాత్రమే మిగిలిన అన్ని ఆడ గొరిల్లాలతోనూ జతకూడుతుంది. చిన్న గొరిల్లాలు ఏవైనా అందుకు ప్రయత్నిస్తే బహిష్కరించబడతాయి! అయినప్పటికీ, శత్రు గొరిల్లా ఆ సిల్వర్‌బ్యాక్‌ను చంపగల్గితే, ఆ శత్రువు దాని సంతానాన్ని కూడా చంపేస్తుంది. అప్పుడు క్రొత్త లీడర్ నాయకత్వం వహిస్తూ, సముదాయంలోని ఆడ గొరిల్లాలతో కలిసి పిల్లలకు జన్మనిస్తుంది” అని గైడ్ వివరించాడు.
గైడ్‌ల వెంట అందమైన వెదురు బొంగుల వనంలోనికి ప్రవేశించాం. మా గుంపులోని ఒకరు “ఒక గొరిల్లా ఎంత కాలం జీవించగలదు?” అని అడిగారు.
“దాదాపు 40 సంవత్సరాల వరకూ” అని నెమ్మది స్వరంలో జవాబు వచ్చింది.
గుర్రుమనే చిన్న శబ్దం వినిపించినప్పుడు, “ష్‌ష్!” అని ఒకరు చిన్న స్వరంలో అన్నారు. “ఏమిటా శబ్దం? ఒక గొరిల్లాదా?” కాదు, గొరిల్లా ప్రతిస్పందనను రాబట్టేందుకని మా గైడే గొరిల్లాలా గుర్రుమన్నాడు. మేము వాటికి చాలా దగ్గర్లో ఉండి ఉంటాం!
నిజంగానే, మా నుండి కేవలం ఐదు మీటర్ల దూరంలో దాదాపు 30 గొరిల్లాలు! నిశ్శబ్దంగా నేలమీద కూర్చోమని మాకు చెప్పారు. “వాటివైపుకు వ్రేలు పెట్టి చూపకండి. మీరు వాటి మీదకు ఏదో విసురుతున్నారని అవి తలంచవచ్చు. దయచేసి బిగ్గరగా అరవకండి. ఫోటోలు తీసేటప్పుడు నెమ్మదిగా జాగ్రత్తగా కదలండి. ఫ్లాష్ ఉపయోగించకండి” అని ఒక గైడ్ వేడుకున్నాడు.
మేము వాటిని ముట్టుకోగల్గేంత సమీపంలో ఉన్నాం! కానీ ఎవరూ ఆ పని చేసే ప్రలోభంలో పడకముందే, “వాటిని ముట్టుకోకండి!” అని ఒక గైడ్ మంద్రస్వరంలో చెప్పాడు. అలా చెప్పి ముగియక ముందే, రెండు పిల్లగొరిల్లాలు మమ్మల్ని పరిశోధించడానికి వచ్చాయి. మా గైడ్ చిన్న కొమ్మను తీసుకుని మృదువుగా వాటిని చరిచాడు. జిజ్ఞాసగల ఆ చిన్ని గొరిల్లాలు ఏటవాలు ప్రాంతంమీదుగా దొర్లుతూ చిన్నపిల్లలకు మల్లే కుస్తీ పడుతున్నాయి. ఆట పోట్లాటగా మారేసరికి వాళ్ళ “అమ్మ” జోక్యం చేసుకుంది.
సిల్వర్‌బ్యాక్ దూరం నుండి మమ్మల్ని గమనిస్తోంది. అకస్మాత్తుగా, అది మావైపుకు కదిలి వచ్చి, మేము కూర్చున్నదానికి కేవలం కొన్నిమీటర్ల దూరంలో కూర్చుంది. అది చాలా పెద్దగా ఉంది, దాదాపు 200 కిలోల బరువుండవచ్చు! అది మమ్మల్ని ఓ కంట కనిపెడ్తున్నా మమ్మల్ని మరీ అంతగా గమనించే సమయం లేనంతగా తినడంలో బిజీగా ఉంది. నిజానికి, తినడమే గొరిల్లా యొక్క ముఖ్యమైన కార్యక్రమం! ఒక సిల్వర్‌బ్యాక్ రోజుకు 30 కిలోల వరకూ ఆహారాన్ని భుజించవచ్చు. గుంపులోని ప్రతి మృగమూ ఉదయం నుండి సాయంకాలం వరకూ ఆహారాన్ని అన్వేషించడంలో బిజీగా ఉంటుంది. కొన్నిసార్లు తాము కనుగొన్న “మంచి ఆహారపదార్థాల” కోసం అవి పోటీపడడాన్ని చూడవచ్చు.
పెద్ద సెనెసియో మొక్క లోపలి మెత్తని భాగం వాటికిష్టమైన భోజనం. టేప్ గడ్డినీ, కొన్ని మొక్కల వేళ్ళనూ, వెదురు కొమ్మలను కూడా ఇష్టంగా ఆరగిస్తాయి. కొన్ని సార్లు అవి ముండ్లతుప్ప, దురదగొండి, గేలీయూమ్ చెట్ల ఆకులతో, మరియు వివిధ వేళ్ళతోనూ, లతలతోనూ వెదురు కొమ్మలను కలుపుకుని “సాలడ్”ను కూడా చేసుకుంటాయి. “గొరిల్లాలు దురదగొండి చెట్లను పట్టుకుని శుభ్రం చేసేటప్పుడు వాటికి గాయాలు తగలవా ఏంటి?” అని ఒకరు అడిగారు. “వాటి అరచేతుల్లోని చర్మపు పొర చాలా మందంగా ఉంటుంది” అని ఒక గైడ్ వివరించాడు.
మేము ఈ ప్రశాంతమైన దృశ్యాన్ని ఆస్వాదిస్తుండగా, అకస్మాత్తుగా, ఒక పెద్ద మగ గొరిల్లా వెనుక పాదాలపై లేచి నిలబడి, తన పిడికిళ్ళతో ఛాతీని బాదుకుంటూ, భయంకరంగా, కీచుకంఠంతో అరిచింది! ఒక గైడ్‌పై దాడిచేసేందుకు అది దూసుకు వచ్చింది, కానీ అది ఆయన ఎదుటి వరకూ రాకుండా అకస్మాత్తుగా ఆగిపోయింది. అది గైడ్‌ను భయపెట్టేలా ఉగ్రంగా చూసింది! కానీ మా గైడ్ భయపడలేదు. బదులుగా ఆయన నేలమీద కూర్చుని, గుర్రుమంటు, నెమ్మదిగా వెనక్కు కదిలాడు. సిల్వర్‌బ్యాక్ తన బలంతో, శక్తితో మమ్మల్ని కేవలం ముగ్ధులను చేయాలనుకున్నట్లు అనిపించింది. నన్ను నమ్మండి. అది అందులో సఫలీకృతమైంది!
తిరుగు ప్రయాణానికి సిద్ధంకమ్మని గైడ్‌లు మాకు సంజ్ఞ చేశారు. “పొగమంచులో” అతిథులముగా ఈ అద్భుతమైన శాంతస్వభావంగల ప్రాణులతో గంట కన్నా కాస్త ఎక్కువ సమయమే గడిపాము. మా సందర్శనం చాలా కొద్దిసేపే అయినా, మేమెన్నటికి మరవలేని అనుభవాల్లో అదీ ఒకటై ఉంది. మానవుడూ, మృగమూ సదాకాలము శాంతియుతంగా కలిసివుండేటువంటి రానున్న క్రొత్తలోకాన్ని గూర్చిన బైబిలు వాగ్దానాన్ని తలపోయడం తప్ప మరేమి చేయగలం!—యెషయా 11:6-9.
[24వ పేజీలోని చిత్రం]
కొండ గొరిల్లాలు ఉండే ప్రాంతాలు
డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో
కివు సరస్సు
ఉగాండా
రువాండా
ఆఫ్రికా
ప్రాంతం పెద్దగా చూపబడుతుంది
[క్రెడిట్ లైను]
Mountain High Maps® Copyright © 1997 Digital Wisdom, Inc.