కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g97 5/8 పేజీలు 18-21
  • ఛెర్నోబిల్‌ విషాదం నడుమ దృఢమైన నిరీక్షణ

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఛెర్నోబిల్‌ విషాదం నడుమ దృఢమైన నిరీక్షణ
  • తేజరిల్లు!—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రమాదం జరిగిన రోజు
  • అనంతర పరిణామాలు
  • రేడియేషన్‌ వలన ఆరోగ్య సమస్యలు
  • సింహావలోకనం
  • విస్తరించిన భయం నడుమ నమ్మకం
  • చెర్నోబిల్‌కు చేసిన ఒక రోజు ప్రయాణం
    తేజరిల్లు!—2006
  • అణు భయం చివరికి అంతరించిందా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • రేడియోధార్మిక పరమాణు ధూళి ఆందోళన కల్గిస్తున్న విషయం
    తేజరిల్లు!—2001
  • యెహోవాను సేవించడానికి ఆమె వయస్సు మీరిపోలేదు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
మరిన్ని
తేజరిల్లు!—1997
g97 5/8 పేజీలు 18-21

ఛెర్నోబిల్‌ విషాదం నడుమ దృఢమైన నిరీక్షణ

ఉక్రెయిన్‌లోని తేజరిల్లు! విలేఖరి ద్వారా

చరిత్రలోనే అత్యంత ఘోరమైన న్యూక్లియర్‌-పవర్‌-ప్లాంట్‌ దుర్ఘటన 1986, ఏప్రిల్‌ 26న ఉక్రెయిన్‌లోని ఛెర్నోబిల్‌లో జరిగింది. తర్వాత ఆ సంవత్సరం చివర్లో అప్పటి సోవియట్‌ అధ్యక్షుడు మిఖాయిల్‌ గోర్భచెవ్‌ “మావవజాతి తానుగా ఉనికిలోనికి తీసుకువచ్చిన గొప్ప శక్తులను నియంత్రణలో పెట్టలేకపోతుంది” అనేదానికి ఈ దుస్సంఘటన ఒక క్రూరమైన జ్ఞాపిక అని అన్నాడు.

ఛెర్నోబిల్‌ దుర్ఘటన ప్రాముఖ్యతను నొక్కిచెబుతూ 1987 ఫిబ్రవరిలోని సైకాలజీ టుడే యొక్క జర్మన్‌ సంచిక ఇలా నివేదించింది: “ఛెర్నోబిల్‌లోని రియాక్టరు దుర్ఘటన . . . ఆధునిక నాగరికత చరిత్రలోనే ఒక గొప్ప మలుపు. ఆ విపత్తు శతాబ్దాలవరకు మనపై గొప్ప మొత్తంలో ప్రభావం చూపేదైవుంది.” “ఇప్పటివరకు జరిపిన అణు పరీక్షలన్నింటివలనా, విస్ఫోటనం చెందిన బాంబులన్నింటివలనా విడుదలైన రేడియేషన్‌కన్నా, ప్రపంచంలోని గాలిలోకీ, పైమట్టిలోకీ, నీటిలోనికీ ఈ దుర్ఘటనవల్ల [విడుదల చేయబడిన] దీర్ఘకాలిక రేడియేషన్‌ ఎక్కువ” అని ద న్యూయార్క్‌ టైమ్స్‌ అంది.

“సోవియట్‌ రియాక్టరు కరిగిపోవడం ఫలితంగా రాబోయే 50 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా 60,000 మంది క్యాన్సర్‌ వలన మరణిస్తారని అంచనా వేయబడుతుంది . . . మరి 5,000 మంది గంభీరమైన జన్యు సంబంధ వైకల్యంతో బాధపడతారు, దాదాపు 1,000 మంది వరకు పుట్టుకనుండే ఆరోగ్య సంబంధ లోపాలననుభవిస్తారు” అని జర్మన్‌ వార్తాపత్రిక హానోఫర్ష ఆల్జమైన ముందే చెప్పింది.

ఛెర్నోబిల్‌ దుస్సంఘటన వలన భయం, చింతా, అనిశ్చింతలతో కూడిన మేఘాలు లక్షలాదిమందిని అవరించి, వారి జీవితాలను అంధకారమయం చేశాయి. అయినా, కొంతమంది ఇంత గొప్ప విషాదంలోనూ ఒక దృఢమైన నిరీక్షణను అనుభవించసాగారు. రుడ్నిక్‌ కుటుంబాన్ని పరిశీలించండి, ఆ కుటుంబంలో విక్టర్‌, ఆన్నా వారి ఇద్దరు కూతుళ్లైన ఈలనా, ఆన్యాలు ఉన్నారు. 1986 ఏప్రిల్‌లో రుడ్నిక్‌ కుటుంబం ఛెర్నోబిల్‌ రియాక్టరు నుండి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలోవున్న ప్రిపెట్‌లో నివసించేది.

ప్రమాదం జరిగిన రోజు

ఆ విషాదకరమైన శనివారపు ఉదయం పాడైపోయిన రియాక్టరు దగ్గర అగ్నిమాపక దళంవారి సాహసోపేతమైన చర్య మరింత ఘోరం జరగకుండా నివారించింది. కొన్ని గంటల్లోనే అగ్నిమాపక దళంవారికి రేడియేషన్‌ వ్యాధి సోకింది, వారిలో చాలామంది తర్వాత చనిపోయారు. 1970లలో ఛెర్నోబిల్‌వద్ద డిప్యూటీ చీఫ్‌ ఇంజినీర్‌గా ఉన్న గ్రిగోర్యీ మెడ్వెడెఫ్‌ తన పుస్తకమైన బర్న్‌డ్‌ సోల్స్‌లో ఇలా వర్ణించాడు: “రేడియో ధార్మిక మేఘం, రియాక్టరు ఉన్న ప్రాంతాన్ని పట్టణంనుండి వేరు చేసే చిన్న దేవదారుచెట్ల క్షేత్రం మీదుగా ప్రయాణించి, ఆ చిన్న అడవిని రేడియో ధార్మిక బూడిదతో కప్పేసింది.” ఎన్నో టన్నుల పరిమాణంలో రేడియో ధార్మిక పదార్థపు ఆవిరి వాతావరణంలోనికి విడుదలైనట్లు నివేదించబడింది!

అయితే, 40,000 మందికిపైగా నివాసులు ఉన్న నగరమైన ప్రిపెట్‌లో ఆ శనివారం పరిస్థితి మామూలుగానే ఉన్నట్లు అనిపించడం గమనార్హం. పిల్లలు వీధుల్లో ఆడుకున్నారు, ప్రజలు మే 1న జరిగే సోవియట్‌ సెలవుదినాన్ని జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. దుర్ఘటనను గూర్చిన ప్రకటన ఏమీ లేదు, ప్రమాద హెచ్చరికలేవీ చేయబడలేదు. ఆన్నా రుడ్నిక్‌ తన మూడేళ్ల కూతురైన ఈలనాతో షికారుకని బయటికి వచ్చినప్పుడు ఆన్నా మారుటి తండ్రి వారిని కలిశాడు. ఆయన దుర్ఘటన గురించి విన్నాడు. రేడియేషన్‌ ప్రమాదం గురించి భయపడి ఆయన వారిని త్వరగా దాదాపు 16 కిలోమీటర్లవతల ఉన్న తన ఇంటికి తీసుకెళ్లిపోయాడు.

రేడియో ధార్మిక మేఘం వాతావరణంలో పైకిలేచి, ఉక్రెయిన్‌, బెలోరష్యా (ఇప్పుడు బెలారస్‌), రష్యా, పోలండ్‌ల మీదుగా వందల కిలోమీటర్ల దూరానికి వీచింది, చివరికి జర్మనీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్‌ల మీదుగా ప్రయాణించింది. తర్వాతి సోమవారం స్వీడన్‌, డెన్మార్క్‌లలోని శాస్త్రజ్ఞులు రేడియో ధార్మికతలో హెచ్చైన మోతాదులను రికార్డు చేసినప్పుడు వ్యాకులపడనారంభించారు.

అనంతర పరిణామాలు

సోవియట్‌ సేనలూ, అగ్నిమాపక దళంవారూ, నిర్మాణ నిపుణులూ, మరితరులూ ఛెర్నోబిల్‌కు పంపించబడ్డారు. దాదాపు 6,00,000 మందితో కూడిన ఈ గుంపును “లిక్విడేటర్లు” అని పిలిచారు. వారు పాడైన రియాక్టరును రెండుమీటర్ల మందంలో పది అంతస్థుల ఎత్తులోని స్టీలు, కాంక్రీటులతో కూడిన శిలా నిర్మాణంతో కప్పేసి యూరప్‌లో మరింత ఘోరమైన దుర్ఘటన జరగకుండా నివారించారు.

తర్వాత కొద్ది రోజులకే దగ్గర్లోని ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయించడం ప్రారంభమైంది. “మేము మా బట్టలూ, డబ్బూ, దస్తావేజులూ, ఆహారమూ—అన్నింటినీ విడిచి మా ఇండ్లను వదిలిపెట్టాల్సివచ్చింది” అని విక్టర్‌ వివరించాడు. “ఆన్నా రెండవ బిడ్డతో గర్భంతో ఉండడంతో మేము చాలా వ్యాకులపడ్డాము” అని కూడా ఆయన అన్నాడు.

దాదాపు 1,35,000 మంది ప్రజలు కదిలివెళ్లిపోవల్సివచ్చింది—రియాక్టరుకు 30 కిలోమీటర్ల దూరంలోపల ఉన్నవారందరూ తమ నివాసాలను విడిచిపెట్టేశారు. రుడ్నిక్‌ కుటుంబం తమ బంధువుల ఇంట్లోకి మారింది. అయితే, ఈ బంధువులు రుడ్నిక్‌ కుటుంబం తమకు కూడా రేడియో ధార్మికత సోకేలా చేస్తుందేమోనని భయపడ్డారు. “వారు ఆందోళన చెంది, చివరికి మమ్మల్ని వెళ్లిపొమ్మని కోరారు” అని ఆన్నా అంటుంది. తమ ఇండ్లను విడిచివచ్చిన ఇతరులకు కూడా అటువంటి బాధాకరమైన అనుభవాలే ఎదురయ్యాయి. చివరికి, రుడ్నిక్‌ కుటుంబం 1986 సెప్టెంబరులో రష్యాలోని మాస్కోకు నైరుతి దిశలో దాదాపు 170 కిలోమీటర్ల అవతలున్న కలుగాలో స్థిరపడింది.

“అప్పుడు మేము తిరిగి వెనక్కి వెళ్లే ఆశలు పెట్టుకునే అవకాశం లేదని చివరికి అర్థంచేసుకున్నాము” అని ఆన్నా అంటుంది. “మేము పుట్టి పెరిగిన మా ప్రియమైన ఇంటిని కోల్పోయాము. పూలూ పచ్చిక బయళ్లూ తివాచీల్లా ఉండి, వాగులో కలువపూలతోవున్న అందమైన ప్రాంతం అది. అడవిలో బెర్రీ పళ్లూ, కుక్కగొడుగులూ సమృద్ధిగా పెరిగేవి.”

ఉక్రెయిన్‌ అందానికి మచ్చ ఏర్పడడం మాత్రమే గాక, సోవియట్‌ యూనియన్‌యొక్క ధాన్యాగారంగా దాని పాత్రపై కూడా ప్రభావం పడింది. ఆ శరదృతువులో దేశంలోని పంటలో చాలామట్టుకు కలుషితమైంది. అదేవిధంగా స్కాండినేవియాలో 70 శాతం రైన్‌డీర్‌ మాంసం వినియోగానికి పనికిరానిదని ప్రకటించబడింది, ఎందుకంటే అవి రేడియేషన్‌ సోకిన లిచెన్‌ మొక్కలను మేశాయి. జర్మనీలోని కొన్ని భాగాల్లో కలుషితమయ్యాయనే భయంతో కూరగాయలు పొలాల్లోనే కుళ్లిపోయేలా విడిచిపెట్టబడ్డాయి.

రేడియేషన్‌ వలన ఆరోగ్య సమస్యలు

5,76,000 మంది రేడియేషన్‌కి బహిర్గతమయ్యారని ప్రమాదం జరిగిన ఐదు సంవత్సరాల తర్వాత విడుదల చేయబడిన అధికారిక సంఖ్యలు చెబుతున్నాయి. క్యాన్సరుకు సంబంధించిన అలాగే క్యాన్సరుకు సంబంధించని వ్యాధులు అటువంటి ప్రజల్లో ఎక్కువగా ఉన్నట్లు నివేదించబడ్డాయి. ముఖ్యంగా యౌవనులు దాని ప్రభావానికి గురయ్యారు. “ఛెర్నోబిల్‌లోని అణు విస్ఫోటనం వలన పెద్ద మొత్తంలో పడిన రేడియో ధార్మిక ధూళికి బహిర్గతమైన ఏడాదికన్నా తక్కువ వయస్సున్న పిల్లల్లో, దాదాపు 40 శాతంమంది పిల్లలు పెద్దవారయ్యాక థైరాయిడ్‌ క్యాన్సర్‌ వలన బాధపడవచ్చు” అని యూరప్‌లోని ప్రఖ్యాత థైరాయిడ్‌ నిపుణులలో ఒకరు నమ్ముతున్నారని 1995, డిశంబరు 2వ సంచికలో న్యూ సైంటిస్ట్‌ పత్రిక నివేదించింది.

తాను గర్భవతిగా ఉన్న సమయంలో ఆన్నా రేడియేషన్‌కి బహిర్గతమైనందున ఆమె గర్భస్రావం చేయించుకోవాలని డాక్టర్లు పట్టుబట్టారు. విక్టర్‌, ఆన్నాలు నిరాకరించినప్పుడు, బిడ్డ వైకల్యంతో పుట్టినప్పటికీ తాము శ్రద్ధవహిస్తామని వాగ్దానం చేస్తూ వారు ఒక పత్రంపై సంతకం పెట్టాల్సివచ్చింది. ఆన్యాకు వైకల్యం లేకపోయినా, ఆమెకు మయోపియా, శ్వాసకోశ సమస్యలు, హృదయనాళాల సంబంధ సమస్యలు వంటివి ఉన్నాయి. దానికి తోడు, ఆ విపత్తు జరిగిన నాటినుండి రుడ్నిక్‌ కుటుంబంలోని ఇతర సభ్యుల ఆరోగ్యం క్షీణించింది. విక్టర్‌, ఈలనాలిద్దరికీ గుండె సంబంధ సమస్యలు వచ్చాయి, ఛెర్నోబిల్‌ వలన వికలాంగులుగా నమోదైన అనేకమందిలో ఆన్నా కేవలం ఒక్కర్తె మాత్రమే.

అందరికంటే ఎక్కువగా రేడియేషన్‌ సోకినవారిలో పాడైన రియాక్టరును సీల్‌ చేసిన లిక్విడేటర్లు ఉన్నారు. ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయడానికి సహాయపడిన వేలాదిమంది అకాల మరణంచెందారని చెప్పబడుతుంది. బ్రతికి బయటపడ్డ చాలామందికి నాడీమండల సంబంధ, మనశ్శరీర సంబంధ సమస్యలు ఉన్నాయి. కృంగుదల విస్తరించింది, ఆత్మహత్యలు సర్వసాధారణమయ్యాయి.

బ్రతికి బయటపడిన తర్వాత తీవ్రమైన ఆరోగ్య సమస్యలు అనుభవించిన వారిలో ఆంజలా ఒకామె. విపత్తు సంభవించినప్పుడు, ఆమె ఛెర్నోబిల్‌కి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉక్రెయిన్‌ రాజధాని అయిన కీవ్‌లో నివసించేది. కానీ తర్వాత, ఆమె రియాక్టరు దగ్గరున్న లిక్విడేటర్లకు సామగ్రిని సరఫరా చేయడంలో కొంత సమయం గడిపింది. మరొకరు కీవ్‌ దగ్గరున్న ఇర్‌పన్‌లో నివసించే స్వెత్లానా, ఈమెకు క్యాన్సర్‌ వచ్చింది, తర్వాత సర్జరీ కూడా చేయించుకుంది.

సింహావలోకనం

1996 ఏప్రిల్‌లో ఆ విపత్తు జరిగి పది సంవత్సరాలు గడిచిన తర్వాత, మిఖాయిల్‌ గోర్భచెవ్‌ ఇలా ఒప్పుకున్నాడు: “మేమసలు అటువంటి పరిస్థితికి సిద్ధపడిలేము.” అదే సమయంలో రష్యా అధ్యక్షుడు ఎల్త్సిన్‌ ఇలా వ్యాఖ్యానించాడు: “ఇంత తీవ్రమైన పరిణామాలతో, నివారించడానికి ఇంత కష్టతరమైన పరిణామాలతో ఇంత గొప్ప పరిమాణంలోని దౌర్భాగ్యాన్ని మానవజాతి ఎన్నడూ అనుభవించలేదు.”

ప్రాముఖ్యంగా, సైంటిఫిక్‌ అమెరికన్‌యొక్క జర్మన్‌ సంచిక ఛెర్నోబిల్‌ దుర్ఘటన తర్వాతి పరిణామాలను ఒక మధ్యస్థాయి పరమాణు యుద్ధం తర్వాత సంభవించివుండే ఫలితాలతో పోల్చింది. ఈ దుర్ఘటన మూలంగా మరణించినవారి సంఖ్యను కొంతమంది దాదాపు 30,000 అని అంచనా వేస్తారు.

గత సంవత్సరపు వార్తా నివేదిక ఒకదాని ప్రకారం, ఈ ప్రమాదం జరిగి పది సంవత్సరాలైనప్పటికీ, ఇంకా ఆ కేంద్రం చుట్టు ప్రక్కల 29 కిలోమీటర్ల దూరం వరకూ ఉన్న ప్రాంతం మానవ జీవనానికి అనర్హమైనదిగా ఉంది. అయితే, “647 మంది నివాసులు కృత నిశ్చయంతో దొంగతనంగా జొరబడి, అధికారులకు లంచాలిచ్చి ప్రవేశించడమో లేక ఆ మండలంలో బహిరంగంగా తిరగడమో చేశారు” అని ఆ నివేదిక తెల్పుతుంది. అదింకా ఇలా అంటుంది: “ఆ కేంద్రం చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలో ఎవ్వరూ నివసించడం లేదు. తర్వాతి 20 కిలోమీటర్ల పరిధిలో కొన్ని వందలమంది తిరిగివచ్చి నివసిస్తున్నారు.”

విస్తరించిన భయం నడుమ నమ్మకం

ఒకప్పుడు ఛెర్నోబిల్‌ దగ్గర నివసించిన వేలాదిమందికైతే జీవితం దుర్భరంగా ఉండింది, ఇప్పటికీ అలాగే ఉంది. ఆ ప్రదేశాన్ని ఖాళీ చేసిన వారిపైన జరిపిన అధ్యయనం ఒకటి, 80 శాతంమంది తమ క్రొత్త గృహాల్లో అసంతోషంగా ఉన్నట్లు వెల్లడించింది. వారు విషాదంగానూ, అలసిపోయినట్లూ, అశాంతితోనూ, చిరాకుగానూ, ఒంటరిగానూ ఉన్నట్లు భావిస్తున్నారు. ఛెర్నోబిల్‌ కేవలం ఒక పరమాణు కేంద్రంలోని ప్రమాదం మాత్రమే కాదు—అది గొప్ప నిష్పత్తుల్లోని సామాజిక, మానసిక సంక్షోభం. ఆశ్చర్యకరం కానిరీతిలోనే, చాలామంది ప్రముఖ సంఘటనలను ఛెర్నోబిల్‌పూర్వ సంఘటనలు అని ఛెర్నోబిల్‌-అనంతర సంఘటనలు అని సూచిస్తుంటారు.

ఇతరులు అనేకమందికి భిన్నంగా, రుడ్నిక్‌ కుటుంబం పరిస్థితిని గమనార్హమైన రీతిలో చక్కగా ఎదుర్కొంది. వారు యెహోవాసాక్షులతో బైబిలును పఠించడం ప్రారంభించారు, తత్ఫలితంగా, నీతియుక్తమైన నూతన లోకం గురించి దేవుని వాక్యంలో కనుగొనబడే వాగ్దానాలలో వారు బలమైన విశ్వాసాన్ని పెంపొందించుకున్నారు. (యెషయా 65:17-25; 2 పేతురు 3:13; ప్రకటన 21:3, 4) తర్వాత 1995లో, విక్టర్‌, ఆన్నాలు నీటి బాప్తిస్మం ద్వారా దేవునికి తమ సమర్పణను సూచించారు. వారి కుమార్తె ఈలనా కూడా తర్వాత బాప్తిస్మం తీసుకుంది.

విక్టర్‌ ఇలా వివరిస్తున్నాడు: “బైబిలును పఠించడం మన సృష్టికర్తైన యెహోవా దేవున్ని గురించీ, భూమిమీది మానవజాతి ఎడల ఆయన సంకల్పాల గురించీ తెలుసుకోవడాన్ని మాకు సాధ్యపర్చింది. మేమిక ఎంతమాత్రమూ కృంగుదలతో లేము, ఎందుకంటే దేవుని రాజ్యం వచ్చినప్పుడు అటువంటి ప్రమాదాలు ఇక ఎన్నడూ జరగవని మాకు తెలుసు. ఛెర్నోబిల్‌లో మా ప్రియమైన ఇంటి చుట్టూ ఉన్న పల్లె ప్రాంతం నిర్మానుష్య స్థితినుండి కోలుకుని అద్భుతమైన పరదైసులో ఒక భాగమయ్యే సమయం కొరకు మేము ఎదురు చూస్తున్నాము.”

నీతియుక్తమైన దేవుని నూతన లోకాన్ని గూర్చిన దేవుని వాగ్దానాలలో నమ్మకముంచే ఆంజలా, స్వెత్లానాలకు రేడియేషన్‌ వలన వచ్చిన అస్వస్థతలు ఉన్నప్పటికీ వారికి కూడా అదే ఉత్సాహపూరితమైన దృక్కోణం ఉంది. “సృష్టికర్తను గురించిన, ఆయన సంకల్పాలను గురించిన జ్ఞానం లేకపోతే జీవితం చాలా కష్టంగా ఉంటుంది. కానీ యెహోవాతో సన్నిహిత సంబంధం కలిగివుండడం నేను అనుకూల దృక్పథంతో ఉండడానికి సహాయం చేస్తుంది. నా కోరిక ఏమిటంటే నేను పూర్తికాలం బైబిలును ప్రకటించేదానిగా ఆయనకు సేవ చేయడంలో కొనసాగడమే” అని ఆంజలా అంటుంది. స్వెత్లానా దానికి ఇలా జోడించింది: “నా క్రైస్తవ సహోదర సహోదరీలు నాకు గొప్ప సహాయకంగా ఉన్నారు.”

“కాలవశముచేతను, అనూహ్యంగానూ” జరిగే ప్రమాదాలు ప్రజలు ఎక్కడున్నాసరే, ఎవరైనాసరే ప్రభావితం చేస్తాయని బైబిలు పఠనం అలాంటివారికి వెల్లడిచేసింది. (ప్రసంగి 9:11, NW) కానీ బైబిలు విద్యార్థులు తమ కష్టాలు ఎంత ఘోరంగా ఉన్నప్పటికీ, యెహోవా మరమ్మతు చేయలేని ఏ చెరుపూ లేదనీ, స్వస్థపర్చలేని ఏ రోగమూ లేదనీ, ఆయన పరిహరించలేని ఏ నష్టమూ లేదని నేర్చుకున్నారు.

మీరు కూడా దేవుని వాగ్దానాలలో నమ్మకాన్ని పెంపొందించుకుని, తద్వారా ఒక ప్రకాశమానమైన నిరీక్షణను ఎలా ఆనందించవచ్చు? బైబిలు పుస్తకమైన సామెతల రచయిత సమాధానమిస్తున్నాడు: “నీవు యెహోవాను ఆశ్రయించునట్లు నీకు నీకే గదా నేను ఈ దినమున వీటిని ఉపదేశించియున్నాను?” (సామెతలు 22:19) అవును, మీరు ఒక క్రమమైన బైబిలు పఠనం ద్వారా జ్ఞానాన్ని పొందవల్సిన అవసరత ఉంది. మీరు దీన్ని చేయడంలో మీకు సహాయం చేయడానికి మీ ప్రాంతంలోని యెహోవాసాక్షులు సంతోషిస్తారు. మీకు అనుకూలమైన సమయంలో, అనుకూలమైన స్థలంలో ఒక ఉచిత బైబిలు పఠన కార్యక్రమాన్ని అందించడాన్ని వారు ప్రతిపాదిస్తారు.

[20వ పేజీలోని చిత్రం]

“ఇంత తీవ్రమైన పరిణామాలతో, నివారించడానికి ఇంత కష్టతరమైన పరిణామాలతో ఇంత గొప్ప పరిమాణంలోని దౌర్భాగ్యాన్ని మానవజాతి ఎన్నడూ అనుభవించలేదు.” రష్యా అధ్యక్షుడు ఎల్త్సిన్‌

[21వ పేజీలోని చిత్రం]

ఛెర్నోబిల్‌ కేవలం ఒక పరమాణు కేంద్రంలోని ప్రమాదం మాత్రమే కాదు—అది గొప్ప నిష్పత్తుల్లోని సామాజిక, మానసిక సంక్షోభం

[18వ పేజీలోని చిత్రసౌజన్యం]

Tass/Sipa Press

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి