ప్రపంచ పరిశీలన
బిడ్డ ఆడా/మగా ముందే నిర్ణయించడం
పాపులర్ సైన్స్ పత్రిక ప్రకారం, “ఆడా మగా అనేది శుక్లము ఏ రకమన్నదానిపై ఆధారపడి ఉంటుంది కనుక, తండ్రి శుక్లాన్ని వేరు చేయడం ద్వారా బిడ్డ ఆడా/మగా ముందే నిర్ణయించుకోవడం ఇప్పుడు సాధ్యమే.” మొదట, ఫ్లూరోసెన్ట్ డైతో శుక్లానికి రంగు వేస్తారు. తర్వాత Y (పురుష) శుక్లం నుండి X (స్త్రీ) శుక్లాన్ని వేరుగా గుర్తించేందుకు లేజర్ కిరణాన్ని ఉపయోగిస్తారు. కంప్యూటర్ వాటి మధ్య తేడాను నోట్ చేస్తుంది, మామూలుగా ‘రక్త పరీక్షలకు ఉపయోగించే’ లెబోరటరీ పరికరం ‘X శుక్లానికి పాజిటివ్ ఎలక్ట్రిక్ చార్జ్‌ను, Y శుక్లానికి నెగటివ్ చార్జ్‌నూ ఇస్తుంది. తర్వాత వ్యతిరేక ఎలక్ట్రిక్ చార్జ్‌ల చివర్లలో ఉండే పరికరాలను ఉపయోగించి శుక్లాలను ఆకర్షించి వేరు చేస్తారు.’ పాడి పరిశ్రమ కొరకు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని మొదటి సారి వృద్ధిచేసిన శాస్త్రజ్ఞుని అభిప్రాయం ప్రకారం, ఇలా వేరుపరచడం అనేది 90 శాతం కరెక్టుగానే ఉంటుంది. ఆ తర్వాత, అండాన్ని ఫలదీకరించేందుకు ఎంపిక చేసిన శుక్లాలను ఉపయోగిస్తారు. “కావలసిన (ఆడా లేక మగా) భ్రూణం గర్భంలో ఉంచబడుతుంది.” అయితే, అలా ఆ ప్రక్రియ ద్వారా ఇంతవరకూ ఒక్క మానవ జననం మాత్రమే జరిగింది.
పిల్లల్లా మాట్లాడడం హానికరం
మాట్లాడాలని పిల్లలు మొదట్లో చేసే ప్రయత్నాలు తరచూ ముద్దు ముద్దుగా అనిపిస్తాయి. చాలా మంది తలిదండ్రులు తామూ చిన్నపిల్లల్లా మాట్లాడుతూ ఆప్యాయంగా ప్రతిస్పందిస్తారు. అయితే, అలా మాట్లాడడం పిల్లలు మాటలు నేర్చుకోవడంలో అభివృద్ధి సాధించడానికి అంతరాయం కలిగించవచ్చని వేజా పత్రికలో బ్రెజిల్ దేశస్థురాలైన మాటలు పలికించడంలో నిపుణురాలైన ఎలీయానీ రెజీన కార్రాస్‌కూ చెబుతుంది. పిల్లలు తప్పుగా ఉచ్చరించినప్పుడు తలిదండ్రులు దానినే పునరుక్తి చేయడం “తప్పుడు ఉచ్చారణను బలపరుస్తుంది” అని కార్రాస్‌కూ చెబుతుంది. అది మాటలను సరిగ్గా పలకలేకపోవడానికి కారణం కాగలదని ఆమె చెబుతుంది. అది సమాజంలో బిడ్డకు ఇతరులతో ఉండే సంబంధాలపై ప్రభావం చూపగలదని కూడా ఆమె చెబుతుంది. “తరచూ, అలాంటి పిల్లలు ఏకాకులై, బిడియం గలవారై, అభద్రతాభావంగలవారై తాము [హేళనకు] గురయ్యే పరిస్థితులను తప్పించుకు తిరుగుతారు.” చిన్న పిల్లలు పదాలను తప్పుగా ఉచ్చరించడం సహజమే. ఎడతెగక వారిని సరిదిద్దనవసరం లేదని కార్రాస్‌కూ తెలుపుతుంది. అయితే వారితో సరిగ్గా మాట్లాడడమూ, “వారు తెలివైనవారనీ, నేర్చుకునే సామర్థ్యం వారికుందనీ” గుర్తుంచుకోవడమూ ప్రాముఖ్యం.
నీళ్ళు కలుషితమవ్వడాన్ని తగ్గించేందుకు చైనా చర్యలను గైకొంటోంది
“చైనాలో నీళ్ళు కలుషితమవ్వడం చాలా పెద్ద సమస్యగా ఉంది, నీళ్ళు కలుషితమవ్వడాన్ని తగ్గించడమన్నది వెంటనే చేయవలసిన పని” అని చైనా జాతీయ పర్యావరణ సంరక్షణ ఏజెన్సీ ప్రతినిధి అంటున్నాడు. చైనాలో మరీ విపరీతంగా కలుషితమౌతున్న నదుల్లోని చెరువుల్లోని కాలుష్యాన్ని తగ్గించేందుకు చైనా ప్రభుత్వం చర్యలను గైకొంటుందని చైనా టుడే అనే పత్రిక నివేదిస్తుంది. ఉదాహరణకు, దేశంలో మరీ విపరీతంగా కలుషితమౌతున్న నదుల్లో ఒకటైన హూయై నదిలో చెత్త ప్రవేశించడాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం “హూయై వ్యాలీలోని కాగితం తయారు చేసే 999 చిన్న కర్మాగారాలను మూసివేసింది.” చైనాలో ధాన్యాలను, శక్తిని ఉత్పత్తి చేసే మండలమైన హూయై లోయలో సుమారు 1,540 లక్షలమంది ప్రజలు జీవిస్తున్నారు.
పఠన కార్యక్రమం నేరాలను తగ్గించేందుకు సహాయపడుతుంది
ఇంగ్లండ్‌లోని బ్రాడ్‌ఫర్డ్ నగరంలో బడిపిల్లల చదివే సామర్థ్యాన్ని మెరుగుపరచేందుకు రూపొందించిన, ప్రభుత్వ మూలధనంతో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం నాటకీయమైన మార్పులను తెచ్చింది అని ది ఇండిపెండెంట్ అనే బ్రిటీష్ వార్తాపత్రిక నివేదిస్తుంది. పఠన కార్యక్రమం చదివే సామర్థ్యాలను మెరుగుపరచడమే కాక, నేరాలను తగ్గించేందుకు సహాయపడిందన్న ఘనతను కూడా పొందింది! “ఇండ్లలో జొరబడి దొంగిలించే యౌవనస్థుల సంఖ్యకు బడిదొంగల సంఖ్యకు నేరుగా సంబంధముంది. పిల్లలు చదవగలిగితే, వాళ్లు స్కూల్లో జరుగుతున్న విషయాల్లోనే ఆసక్తి చూపే సాధ్యతే ఎక్కువ. బడి ఎగ్గొట్టే సాధ్యత చాలా తక్కువ. వాళ్ళు వీధుల్లో తిరగడం లేదు కనుక, వాళ్ళు ఇళ్ళలో చొరబడే సాధ్యత చాలా తక్కువ” అని బెట్టర్ రీడింగ్ పార్టనర్‌షిప్ అధికారియైన జాన్ వాట్‌సన్ చెబుతున్నాడు.
ఒలింపిక్స్ మరియు దారిద్ర్యం
“ఒలింపిక్స్‌లో కొన్ని దేశాలు గెలుచుకున్న అనేక పతకాలూ, ఆ క్రీడల సౌకర్యాల కొరకు సమిష్టి ప్రకటనల కొరకు పెట్టుబడి పెట్టిన డబ్బూ దారిద్ర్యానికి అంతం తేవలసిన ప్రపంచ బాధ్యతను గూర్చి ప్రశ్నలను లేవదీస్తున్నాయి” అని స్విట్జర్‌లాండ్‌లోని ఇఎన్‌ఐ బుల్లెటిన్ నివేదిస్తుంది. “ఉత్కృష్టతయందు ఆనందించవద్దని గానీ లేదా మానవుని నైపుణ్యాలలోని ఓరిమిలోని అసాధారణ శిఖరాలను ప్రశంసించవద్దని గానీ చెప్పడం లేదు” అని ఆస్ట్రేలియాలోని వర్ల్‌డ్ విజన్ ఏజెన్సీలో పనిచేస్తున్న గ్రెగ్ ఫూట్ అంటున్నాడు. “కానీ, మన పొరుగువారైన లక్షలాదిమందికి నడిచే బలాన్ని పొందేందుకు అవసరమైన భోజనం కూడా లేకపోగా మన మంచి అథ్లెట్ల సంపూర్ణ భోజనం కొరకు మనం ఎంతో ఖర్చు చేస్తున్నప్పుడు మనం అతి ప్రాథమికమైన వాటికి ప్రాముఖ్యతనిస్తున్నామా లేదాయని ప్రశ్నించుకోవలసిన అవసరముంది” అని కూడా ఆయన చెబుతున్నాడు. అట్లాంటాలో ఒలింపిక్స్ జరిగిన రెండు వారాలలో ప్రపంచవ్యాప్తంగా ఆకలితో మరియు నివారించగల వ్యాధులవలన 4,90,000 మంది పిల్లలు మరణించారని అంచనా వేయబడింది.
పేదరికం పెరుగుదల
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పూర్తిగా దారిద్ర్యంలో జీవిస్తున్నవారి సంఖ్య—సంవత్సరానికి 370 డాలర్ల కన్నా తక్కువగా సంపాదిస్తున్నవారి సంఖ్య సుమారు 130 కోట్లు. అంటే అది ప్రపంచ జనాభాలో దాదాపు మూడింట ఒక వంతన్నమాట. వారిలో చాలా మంది వర్ధమాన దేశాల్లో నివసిస్తున్నారు. సాధారణంగా ఈ ప్రజలు కావలసినంత ఆహారాన్నీ, సురక్షిత నీటినీ, ఆరోగ్య సంరక్షణను, కావలసినంత ఆశ్రయాన్నీ, విద్యాభ్యాసాన్నీ, ఉద్యోగాన్నీ పొందలేరు. చాలా వరకూ వారు నివసిస్తున్న సమాజాల్లో వారిని అల్పులుగా ఎంచుతారు. తమ పరిస్థితులను చక్కబెట్టుకునే శక్తి వారికి లేదు. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి పథకం అభిప్రాయం ప్రకారం, పూర్తి దారిద్ర్యంలో జీవిస్తున్న వారి సంఖ్య ప్రతి సంవత్సరం దాదాపు 2.5 కోట్ల చొప్పున పెరుగుతుంది.
ప్రతిరోజు పండ్లను తినండి
బ్రిటీష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురించబడిన, 11,000 మంది ప్రజలపై 17 సంవత్సరాలుగా చేసిన అధ్యయనం ప్రకారం, హృద్రోగం వచ్చే ప్రమాదాన్ని తగ్గించడమనేది ప్రతిరోజూ తాజా పండ్లను తినడంతో ముడిపడి ఉంది. అధ్యయనం చేయబడినవారిలో ప్రతిరోజు తాజా పండును తిన్నవారిలో 24 శాతం మంది గుండె ఆగి చనిపోయే ప్రమాదాన్ని తప్పించుకోగా, 32 శాతం మంది గుండెపోటు వల్ల చనిపోయే ప్రమాదాన్ని తప్పించుకున్నారు. అంత తరచుగా పండ్లు తిననివారిని పోల్చి చూస్తే ప్రతిరోజూ పండ్లు తిన్నవారిలో 21 శాతం మంది మరణాన్ని తప్పించుకున్నారు. భోజనంలో తాజా పండ్లు లేకపోవడం కొంత మంది ప్రజల్లో రక్తపోటు లేక హృద్రోగం వంటి రక్త ప్రసరణ సంబంధ వ్యాధులు అధికమయ్యేందుకు కారణమవ్వవచ్చు అని బ్రిటీష్ మరియు స్పానిష్ శాస్త్రజ్ఞుల జట్టు పేర్కొంటోంది. ఆరోగ్య సంబంధంగా గొప్ప ప్రయోజనం కలిగేందుకు రోజుకు కనీసం ఐదు గరిటెల కూరగాయలను లేదా పండ్లను తినాలని పరిశోధకులు ఇప్పుడు సిఫారసు చేస్తున్నారు. తాజా పండ్లు, కూరగాయలు లభ్యం కాకపోతే, ఫ్రిడ్జ్‌లో పెట్టిన పండ్లను కూరగాయలను తినడం కూడా అలాంటి ప్రయోజనాలనే ఇస్తుందని బ్రిటీష్ మెడికల్ జర్నల్ చెబుతుంది.
జీవితాంతం వరకూ స్నేహితుడు
జర్మనీలో ప్రతి పదిమందిలో తొమ్మిది మంది తమకు జీవితాంతం వరకూ స్నేహితుడు(రాలు) ఉన్నారని చెబుతారని నాసాయిషే నోయీ ప్రెస్ నివేదిస్తుంది. సొసైటీ ఫర్ ఎమ్‌పిరికల్ సైన్టిఫిక్ సోష్యల్ రిసర్చ్ చేసిన సర్వేలో ఇది వెల్లడిచేయబడింది. అది 16 నుండి 60 ఏండ్ల వయస్సులోని 1,000 కన్నా ఎక్కువ మంది ప్రజలను ప్రశ్నించింది. దీర్ఘకాలం నిలిచే స్నేహానికి అవసరమైన కారకాల్లో సంభాషణా, నిజాయితీ అనేవి అన్నింటికన్నా ముఖ్యమైనవిగా పరిగణించబడ్డాయి. విశ్వాసఘాతకమూ వంచనా అలాంటి స్నేహాలను నిలిపివేస్తాయని ఇంటర్వ్యూ చేయబడిన వారిలో దాదాపు అందరూ ఒప్పుకున్నారు. ఆ వార్తాపత్రిక ప్రకారం, “మంచి స్నేహితుడు అత్యవసర సమయంలో [తమకు] డబ్బు అప్పిస్తాడని కేవలం 16 శాతంమంది మాత్రమే నిరీక్షిస్తారు.” మరొకవైపు, అనారోగ్యంగా ఉన్న సమయాల్లో ఒక స్నేహితుని మద్దతు ఉండడమనేది చాలా ప్రాముఖ్యమని ఎక్కువమంది పరిగణిస్తారు.
పొగత్రాగడం కన్నా హానికరమైనదా?
స్టాటిస్టిక్స్ కెనడా అభిప్రాయం ప్రకారం, “సిగరెట్ త్రాగడం వల్ల కలిగే హానికన్నా ఎప్పుడూ కూర్చొని పనిచేసే జీవన విధానం వల్ల రెండు రెట్లు ఎక్కువగా ఆరోగ్యానికి హానికలుగుతుంది” అని ది మెడికల్ పోస్ట్ నివేదిస్తుంది. దాదాపు 70 లక్షల మంది కెనడాదేశస్థులు పొగత్రాగడం వల్ల బహుశా తీవ్రమైన ఆరోగ్య సమస్యలను అనుభవిస్తున్నారు, అకాల మరణానికి గురౌతున్నారు, 1.4 కోట్ల నుండి 1.7 కోట్ల మంది వ్యాయామం లేనందు వల్ల అలాంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. సమయం లేకపోవడం, శక్తి లేకపోవడం, ప్రేరణ లేకపోవడం క్రమంగా వ్యాయామం చేయడాన్ని ఆటంకపరచే ముఖ్య కారణాలుగా పేర్కొనబడుతున్నాయి. కూర్చొని పని చేసే ప్రజలు ఎక్కువగా క్రొవ్వు పదార్థాలున్న ఆహారాన్నే భుజిస్తూ పండ్లను కూరగాయలనూ తక్కువగా భుజిస్తున్నారు. “గుండెకు ఎక్కువ ప్రయోజనాన్ని చేకూర్చేందుకు కనీసం రోజు విడిచి రోజు కనీసం 30 నిమిషాలు మామూలు స్థాయిలోనో లేక తీవ్రస్థాయిలోనో ప్రజలతో వ్యాయామం చేయించాలన్నదే ఇప్పటి లక్ష్యం” అని పోస్ట్ చెబుతుంది.