మా పాఠకుల నుండి
విభజించే తేడాలు “తేడాలు మనల్ని విభజించాలా?” (ఆగస్టు 8, 1996) అనే శీర్షికా పరంపరను బట్టి మీకు మా కృతజ్ఞతలను తెలపాలని మేము ఆశిస్తున్నాము. మేము ఇక్కడ మెక్సికోలో దాదాపు ఒక సంవత్సరంగా అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా జట్టులో భాగంగా పని చేస్తున్నాము. అనేక నెలల తర్వాత కూడా, సర్దుకోవడం మాకు కష్టంగా ఉంటూ వచ్చింది. కానీ ఎందుకో మాకు అర్థం కాలేదు. అసలు సమస్య విభిన్న సంస్కృతి వల్ల కలిగే షాక్ అని గుర్తించేందుకు ఈ శీర్షికలు మాకు సహాయపడ్డాయి. “ఇతర సంస్కృతుల ఎడల మెప్పు . . . మన జీవితాలను సుసంపన్నం చేయగలదు” అన్న ప్రస్తావనను మేము హృదయంలో పదిలం చేసుకుని, ఇప్పటికే మా నియామకంలో మేము మరింత ఆనందాన్ని కనుగొంటున్నాం.
కె. హెచ్., మరియు జె. హెచ్., మెక్సికో
ఈ గమనార్హమైన అంశం చర్చించబడి విపులీకరించబడిన విధానాన్నిబట్టి నేను చలించిపోయాను. మానవ చరిత్రలో తేడాలు నిజంగా ఎంతో ద్వేషాన్ని రేకెత్తించాయి. మిగిలిన సంస్కృతులను గొప్ప అవగాహనతో దృష్టించేందుకు ఈ పరంపర నాకు ఇప్పుడు సహాయపడుతుంది. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఈ శీర్షికలను చదివి ఇతరులను గూర్చిన తమ వ్యతిరేక దృక్కోణాలను మార్చుకోగల్గాలని ఆశిస్తున్నాను!
జి. ఓ., నైజీరియా
ఈ శీర్షికలు నా కంట తడిపెట్టించాయి. నాకు ఒక స్నేహితురాలుంది, నేను ఎక్కువ సమయం ఆమెతోనే ఉంటాను. కానీ మా ఇద్దరి మధ్య ఒక అదృశ్యమైన అడ్డుగోడ ఉన్నట్లు నాకెప్పుడూ అనిపించేది. మేము విభిన్న సంస్కృతులనుండి వచ్చిన వాళ్ళమని నేను ఇప్పుడు గుర్తిస్తున్నాను. భవిష్యత్తులో నేను ఆమెతో వ్యవహరించే విధానంలో ఈ సమాచారం చాలా పెద్ద మార్పును తెస్తుంది.
ఎ. ఎఫ్., అమెరికా
మానవశాస్త్రంపై మా కాలేజీ వ్యాసం కొరకు నేను పరిశోధన చేస్తున్నప్పుడు నేను ఆఫ్రికాలోని ఒక దేశంలో అనేక వారాలు గడిపాను. నేను స్థానిక యెహోవాసాక్షులను చాలా మందిని పరిచయం చేసుకోగలిగాను, మరియు వారి కూటాలకు హాజరు కాగలిగాను. అది నిజంగా ఎంతో ఉత్తేజకరమైన అనుభవం! శీర్షిక చెప్పినట్లు, మిగిలిన సంస్కృతుల ప్రజలతో పరిచయం చేసుకోవడం నిజంగా మనలను సుసంపన్నులుగా చేస్తుంది. నేను క్రొత్తవైన అర్థవంతమైన స్నేహాలను చేసుకోగలిగాను.
ఎస్. బి., ఇటలీ
యూఎఫ్‌ఓలు “బైబిలు ఉద్దేశము: యూఎఫ్‌ఓలు దేవుడు పంపిన సందేశకులా?” (ఆగస్టు 8, 1996) అనే శీర్షికను బట్టి మీకు కృతజ్ఞతలు. గ్రహాంతర జీవులను గూర్చిన నివేదికలను మా ప్రాంతంలోని కొందరు నమ్ముతారు. బైబిలు ఈ విషయాన్ని చర్చించడం లేదని అనుకుని, వారు బైబిలును గూర్చి సంశయిస్తున్నారు. సాతాను మరియు దయ్యములు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారనీ, గ్రహాంతర జీవులను గూర్చిన ఆధారరహితమైన నివేదికలను నమ్మడం జ్ఞానరహితమని గ్రహించేందుకు ఈ శీర్షిక మాకు తోడ్పడింది.
ఎ. డబ్ల్యు., తైవాన్
ట్యూలప్‌లు “ట్యూలప్—సంచలనాత్మకమైన గత చరిత్రగల ఒక పువ్వు” (ఆగస్టు 8, 1996) అనే అద్భుతమైన శీర్షికకు కృతజ్ఞతలు. ట్యూలప్‌ల ఉద్భవాన్ని గురించి, వాటిని పెంచడాన్ని గూర్చిన ఆధికారిక సమాచారమూ చాలా ఆసక్తికరమైనదిగా ఉంది.
డి.జి., అమెరికా
సరదాగా ఉండడం నాకు 12 ఏండ్లు. “యౌవనస్థులు ఇట్లు అడుగుదురు. . .ఇతర యౌవనులు అంత సరదాగా ఎందుకు ఉంటారు?” (ఆగస్టు 8, 1996) అనే శీర్షికను చదివి నేను నిజంగా ఆనందించాను. నేనూ అదే ప్రశ్న అడుగుతూ ఉండేదాన్ని. మా స్కూల్లో పార్టీలకు, డ్యాన్సులకు, మరితర కార్యకలాపాలకు పేర్లిచ్చుకోవచ్చు. నేను వెళ్ళాలని తరచూ కోరుకునేదాన్ని. కానీ నేను చేసే ఎంపికలకు యెహోవా ముందు నేను జవాబుదారీనని గ్రహించేందుకు ఈ శీర్షిక నాకు సహాయపడింది. అందుకే నేను నా క్రైస్తవ స్నేహితులతో సన్నిహితంగా ఉంటాను.
ఎ. ఎస్., అమెరికా
మీరు శీర్షికలో చర్చించినట్లే, [బైబిలు రచయితయైన] ఆసాపుకు కలిగిన అవే భావాలు నాకూ కలిగిన సమయాలు ఉన్నాయి. నేను స్కూల్లో సమస్యలతో వ్యవహరించేందుకు కావలసిన మరింత శక్తిని ఈ శీర్షిక నాకిచ్చింది.
ఎ. ఎస్., జపాన్
తాము లోకస్థుల పార్టీల్లో పాల్గొనేందుకు “అనుమతించ”బడనందువల్ల కొందరు యౌవనస్థులు ఏకాకులైనట్లు, లేదా నష్టపోతున్నట్లు భావిస్తారన్నది నిజమే. కాని యెహోవాసాక్షుల పిల్లలందరూ అలా భావించరు! నా విషయం చెబితే, లోకస్థుల పార్టీల్లో జరిగే అనేక విషయాలంటే నాకు ఏవగింపు కలుగుతుంది, నా క్రైస్తవ స్నేహితులు కూడా అలాగే భావిస్తారు. మేము ఏదో నష్టపోతున్నట్లు భావించం! నిస్సందేహంగా మరనేకులూ అంతే.
కె. హెచ్., అమెరికా
మారిన ప్రాధాన్యతలు “ఆయన ఎందుకు తన ప్రాధాన్యతలను మార్చుకున్నాడు” (ఆగస్టు 8, 1996) అనే శీర్షిక నన్ను ఎంతగానో ప్రోత్సహించింది అని నేను చెప్పవలసిందే. నేను 13 కన్నా ఎక్కువ సంవత్సరాలుగా పూర్తికాల సువార్తికురాలిగా సేవ చేస్తున్నాను, మరధికంగా ఒత్తిళ్ళతోనున్న ఈ లోకంలో ప్రాముఖ్యమైనవాటిని నిర్ణయించడమన్నది ఎల్లప్పుడూ సులభంగా ఉండదు. ప్రతి సంవత్సరం, పూర్తికాల పరిచర్యలో ఉండడం అనేది మరింత సవాలుగా తయారవుతుంది. పూర్తికాల సేవకునిగా మారేందుకు మంచి జీతం లభించే నేచర్ రిజర్వ్ వార్డన్ ఉద్యోగాన్ని జెరమీ వదులుకున్న విషయాన్ని తలపోయడం పరిచర్యకు నా జీవితంలో ప్రముఖ స్థానాన్నిస్తూనే ఉండేందుకు ప్రయత్నించడం తగినదేనన్న నిశ్చయతను నాకిచ్చింది.
ఎన్. కె., అమెరికా