ప్రపంచంలోకెల్లా అతిపెద్ద జీడిమామిడి చెట్టు
బ్రెజిల్‌లోని తేజరిల్లు! విలేఖరి
ప్రపంచంలోకెల్లా అతిపెద్దదా? గిన్నెస్ ఓ లివ్రో డాస్ రికార్డస్ 1994 ప్రకారం అదే అతి పెద్దది అయ్యుండవచ్చు. ఇక్కడ చిత్రీకరించబడిన రియో గ్రాండె డు నోర్టె తీరానికి సమీపాన ఉండే జీడిమామిడి చెట్టు నిజంగా బ్రెజిల్లో అతిపెద్దది. నిజానికి సగటు పరిమాణం గల 70 జీడిమామిడి చెట్లకు సమానమైన ఈ ఒక్క చెట్టే ప్రస్తుతం పెద్ద సిటీ బ్లాక్ ప్రాంతాన్నంతా ఆవరించి ఉంది!
జీడిమామిడి చెట్టు అనేది చిన్న పొద పరిమాణం నుండి 20 మీటర్ల ఎత్తున ఉన్న ఒక చెట్టు పరిమాణం వరకు ఉండి సతత హరితంగా ఉండే చెట్టు. జీడిమామిడి చెట్ల చిన్న పువ్వులు తోలులా గట్టిగా ఉండే పెద్ద ఆకులకు ఎంతో భిన్నంగా ఉంటాయి. భుజింపదగిన దాని పిక్కే రుచికరమైన జీడిపప్పు, అది బేరిపండు ఆకారంలో ఉండే జీడిమామిడి పండు లోపలకి బలవంతంగా చొచ్కుకున్నట్లుగా కనిపిస్తుంది. జీడిమామిడి చెట్టు విషపూరితమైన లతలకు చెందినదన్నది ఆశ్చర్యకరం, మరి దానితో వ్యవహరించేవారు జాగ్రత్త వహించాలి. ఈ పిక్కకు రెండు పెంకులు ఉంటాయి, ఈ రెండు పొట్ల మధ్య చర్మంపై పొక్కులను తెచ్చే నూనె ఉంటుంది. దానిని కాల్చే ప్రక్రియ పిక్కలోని విషపూరితమైన అంశాలను తీసివేస్తుంది.
వింతగా, మూత్ర పిండం ఆకారంలో ఉండే ఆ పిక్కను సృష్టించినవాడు దానిని మర్చిపోయి, తరువాత అంటించాడా అన్నట్లు, అది పండుకు వెలుపల పెరుగుతూ కనిపిస్తుంది. జీడిమామిడి పండు పిక్కను అంటిపెట్టుకుని ఉంటుంది. కనుక, కొందరు పిక్కనే వృక్షం యొక్క నిజమైన ఫలమని అంటారు. ఏది ఏమైనప్పటికీ, మీరు ఈ సారి జీడిపప్పులను తినేటప్పుడు ఒక్కసారి ఊహించండి—బహుశ మీరు ప్రపంచంలోని అతిపెద్ద జీడిమామిడి చెట్టు ఫలాన్ని తింటున్నారేమో!