బైబిలు ఉద్దేశము
దేవుడు ప్రతిఫలమిస్తాడా?
అవును, ఆయన ప్రతిఫలమిస్తాడు. అలాగైతే, ప్రతిఫలాన్ని దృష్టిలో పెట్టుకొని దేవుని సేవించడం స్వార్థమా? కాదు, ఆయన తనంతట తానే నమ్మకస్థులైన తన సేవకుల ముందు ప్రతిఫలాన్ని ఉంచుతున్నాడు. నిజానికి, నీతికి, ప్రేమకు దేవుడైన యెహోవా, తనను సేవించేవారికి ప్రతిఫలమియ్యడానికి తనను తానే బద్ధునిగా చేసుకున్నాడు. హెబ్రీయులు 11:6లోని కొంతభాగంలో ఆయన వాక్యం యీ విధంగా చెబుతుంది: ‘దేవునియొద్దకు వచ్చువాడు రెండు సంగతులు నమ్మవలెను. మొదటిది ఆయన ఉన్నాడని. రెండవది తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడని.’—ఫిలిప్స్.
దేవునియందు యథార్థమైన విశ్వాసాన్ని ప్రదర్శించడం ఆయనతో స్నేహ బంధాన్ని కలిగిస్తుంది, యీ స్నేహబంధం ప్రతిఫలానికి దారితీస్తుంది. దేవుని ప్రీతిని మనస్ఫూర్తిగా వెదికేవారిని ఆయన ఆశీర్వదిస్తాడు.
ప్రేమపూర్వక క్రియలే ప్రతిఫలాలు
తనను ప్రేమించేవారికి తాను ప్రతిఫలమిచ్చే దేవుడని మనం తెలుసుకోవాలని యెహోవా కోరుకుంటున్నాడు. ఉదాహరణకు దయగల తల్లిదండ్రులు, తల్లిదండ్రులపై గల ప్రేమనుబట్టి యిష్టపూర్వకంగా యింట్లో చిన్న-చిన్న పనులు చేసే పిల్లలకు ప్రతిఫలమిచ్చే మార్గాలను వెదకుతారు. తల్లిదండ్రులు బిడ్డకు ప్రత్యేక బహుమతిని ప్రతిఫలముగా యిస్తూ, జీవిత కనీసావసరాలకన్నా ఎక్కువగానే ఏర్పాట్లు చేస్తూండవచ్చు. కొన్నిసార్లు, బిడ్డ భవిష్యత్తు భద్రత కొరకు బ్యాంకులో డబ్బువేయడం కూడా బహుమతి కావచ్చు. అలాగే, దేవుడు ప్రేమతో, యథార్థతతో తమకొరకు చేసేవాటియెడల మెప్పును శ్రద్ధను చూపని ప్రజలవంటివాడు కాడు. యెహోవా కరుణాహృదయం గలవాడు, మరియు తన స్నేహితులకు సమీపస్థుడగువాడు. మీరు ఆయనయందు దృఢ విశ్వాసంకల్గి ఉన్నట్లయితే, ఆయన “నిన్ను ఏమాత్రమును విడువడు, నిన్ను ఎన్నడును ఎడబాయడు.”—హెబ్రీయులు 13:5.
దేవునికి కొద్దిపాటి సేవమాత్రమే చేసేవారినందరిని కూడా, తనను గూర్చి తెలుసుకోడానికి మరిన్ని అవకాశాలనిస్తూ, ఆయన వారిని మెచ్చుకుంటాడు, అభినందిస్తాడు. మత్తయి 10:40-42నందలి యేసు మాటలు యీ విషయాన్ని యిలా ఉదాహరిస్తున్నాయి: “మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును; నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవాని చేర్చుకొనును. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనువాడు ప్రవక్తఫలము పొందును; నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనువాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని యెవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.”
యేసును ఆయన తండ్రియైన యెహోవా పంపాడు. కాబట్టి, క్రీస్తు శిష్యులను—వారు ప్రవక్తలైనా, నీతిమంతులైనా, లేదా చిన్నవారైనా—సుముఖతతో చేర్చుకుంటే వారు క్రీస్తును, క్రీస్తును పంపిన దేవుడ్ని చేర్చుకున్నట్లే. ఆ వ్యక్తి నిశ్చయముగా ఆశీర్వదించబడతాడు; అతనికి ప్రతిఫలం లభించకపోదు. అతని ఆత్మీయ సంపదల నిక్షేపపుపెట్టె నిండుతుంది. ఎందుకని? ఎందుకంటే దేవుని రాజ్యానికి మద్దతునిచ్చే అతి చిన్న సేవను కూడా యెహోవా జ్ఞాపకముంచుకుంటాడు, మరియు ఆ పనికి ప్రతిఫలం లభించకపోదు.—హెబ్రీయులు 6:10.
ఆసక్తికరమైనదేమిటంటే, యేసు శిష్యుడైన పేతురు తనకు, మరియు తన తోటి అపొస్తలులకు ఏమైనా ప్రతిఫలముందా అని యేసును నేరుగా అడిగాడు: “ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకును?” (మత్తయి 19:27) యేసు ఆ ప్రశ్నను అనుచితంగా పరిగణించలేదు, కాని అనుకూలమైన జవాబిస్తూ యిలా అన్నాడు: “నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్కచెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును నూరురెట్లు పొందును; ఇదిగాక నిత్యజీవమును స్వతంత్రించుకొనును.”—మత్తయి 19:29.
ప్రస్తుత మరియు బావి ప్రతిఫలాలు
యేసు అనుచరులు యిప్పుడు మరియు భవిష్యత్తులోను ప్రతిఫలం పొందుతారని ఆయన యిచ్చిన జవాబు తెలుపుతుంది. ప్రస్తుతం లభించే ఒక ప్రతిఫలమేదంటే, విస్తృతమౌతున్న ఆత్మీయ సహోదర సహోదరీల అంతర్జాతీయ కుటుంబంలో భాగం కావడము. క్రైస్తవమత సామ్రాజ్యంలోని చర్చీలు, సభ్యత్వం క్షీణించిపోతున్నందువల్ల, మద్దతు లేకపోవడంవల్ల క్రుంగిపోతుండగా, యెహోవాసాక్షులు కూడుకునే మందిరాలు నిండిపోతున్నాయి. ప్రతిసంవత్సరం లక్షలాదిమంది క్రొత్త సాక్షులు బాప్తిస్మం పొందుతున్నారు.
మరొక ప్రతిఫలమేమంటే, దేవునితో స్నేహబంధము మరియు ఆయనను గూర్చిన జ్ఞానము తెచ్చిపెట్టే సంతృప్తితో కూడిన మనశ్శాంతి, మరియు సంతోషములే. అవును, “సంతుష్టి సహితమైన దైవభక్తి” గొప్ప లాభమైయున్నది. (1 తిమోతి 6:6) అపొస్తలుడైన పౌలు చెప్పినట్లు, “నేనేస్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగియుండ నేర్చుకొని యున్నాను,” అని ఒకడు చెప్పగలిగినప్పుడు, అది వాస్తవంగా సంతోషం గల హృదయపరిస్థితిని ప్రతిబింబిస్తుంది, అది సంతృప్తి.—ఫిలిప్పీయులు 4:11.
పౌలు తన మరణానికి కొద్ది కాలం ముందు, యేసు యొక్క అభిషక్త అనుచరులైన ‘చిన్న మంద’ యొక్క భవిష్యత్తు ప్రతిఫలాన్ని—పరలోక జీవితము కొరకైన పునరుత్థానమనే ప్రతిఫలాన్ని గూర్చి వ్రాశాడు: “ఇకమీదట నా కొరకు నీతికిరీటముంచబడియున్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతియైన ప్రభువు అది నాకును, నాకుమాత్రమే కాకుండ తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికిని అనుగ్రహించును.”—లూకా 12:32; 2 తిమోతి 4:7, 8.
యేసు యొక్క “వేరే గొఱ్ఱెలకు” చెందిన లక్షలాదిమంది ఆయన అనుచరులు పరదైసుగా మార్పుచెందిన భూమిపై నిత్యజీవమనే భవిష్యత్తు ప్రతిఫలం కొరకు నిరీక్షిస్తున్నారు. (యోహాను 10:16) యేసు ముందుగానే హామీ యిచ్చినట్లు, చనిపోయే ఆయన అనుచరులు ‘నీతిమంతుల పునరుత్థానమందు ప్రత్యుపకారము పొందుదురు.’—లూకా 14:14.
ప్రతిఫలాన్ని ఊహించుకోండి
అలాంటి ఆశీర్వాదాలు, కచ్చితంగా ఎలా ఉంటాయో ఎవరికిని తెలియకపోయినప్పటికీ, వాటిని గూర్చి ఊహించుకోడానికి ప్రయత్నం చేయడం సముచితము. “మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మ్రింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమీది బాష్పబిందువులను తుడిచివేయును,” అని యెషయా 25:8లో వర్ణించబడిన సంతోషాన్ని మీరు ఊహించలేరా? యెషయా 32:17లోని మాటలను ఊహించడానికి ప్రయత్నం చేయండి: “నీతి సమాధానము కలుగజేయును నీతివలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును.” అవును, మానవులందరు నిజమైన స్నేహబంధంలో ఐకమత్యంతో పనిచేస్తారు. (యెషయా 65:21-25) నేడు కూడా, శ్రద్ధతో పనిచేయడం వలన మంచి యిండ్లు, శ్రేష్ఠమైన నాణ్యతగల వస్తువులు చేకూరుతాయి. అప్పుడు, దేవుని నూతన లోకంలో, ఆరోగ్యవంతులైన ప్రజలు పరిపూర్ణ పరిస్థితుల్లో జీవితమును ఆనందదాయకంగా చేసుకోడానికి అవసరమైన దేనినైనా ఉత్పత్తిచేయగలరు.—కీర్తన 37:4.
మనం చేసే ఏదైనా అభినందనీయమైన సేవనుబట్టి దేవుడు మనకు బహుమతిని యివ్వడం లేదుగాని, మనం వారసత్వంగా పొందిన పాపపు స్థితిలో ఉన్నప్పటికీ, ఆయన ప్రేమవలన మనకు బహుమతిని యిస్తున్నాడు. (రోమీయులు 5:8-10) అయినప్పటికీ, మనం ఎదురు చూస్తున్న ప్రతిఫలానికి, మన ప్రవర్తనకు సంబంధముంది. మనం గట్టి విశ్వాసముతోను మరియు సహనంతోను మనస్ఫూర్తిగా యెహోవాను వెదకాలి. (హెబ్రీయులు 10:35-39) వేరే మాటల్లో చెప్పాలంటే “ప్రభువువలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని యెరుగుదురు గనుక, మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి.” అవును, ఆయన ప్రతిఫలమిస్తాడు.—కొలస్సయులు 3:23, 24.