కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g94 12/8 పేజీలు 4-6
  • వస్తుసంపద సంతోషానికి హామీ ఇవ్వగలదా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వస్తుసంపద సంతోషానికి హామీ ఇవ్వగలదా?
  • తేజరిల్లు!—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘అనేకమైన జటిల ప్రశ్నలు’
  • సమస్యకు మూలము
  • ప్రపంచవ్యాప్తంగావున్న సమస్య
  • తైవాన్‌లోని వరి పొలాల్లో సువార్తను ప్రకటించడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు—తైవాన్‌లో
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
  • వస్తుసంపదను వెంబడించుట
    తేజరిల్లు!—1994
  • యెహోవా ఏం చెప్పినా కాదనకుండా చేయాలని మేము నేర్చుకున్నాం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
మరిన్ని
తేజరిల్లు!—1994
g94 12/8 పేజీలు 4-6

వస్తుసంపద సంతోషానికి హామీ ఇవ్వగలదా?

“మా పాఠశాలలోని సుమారు 50 మంది విద్యార్థుల్లో, ఒకరు లేదా యిద్దరు మాత్రమే షూ ధరించేవారు,” అని 1950లలో దక్షిణ తైవాన్‌లో పెరిగిన 45 ఏండ్ల బోచింగ్‌ గుర్తుచేసుకుంటున్నాడు. “మేము వాటిని కొనుక్కోలేకపోయాము. అయినప్పటికీ, మమ్మల్ని మేము ఎన్నడూ పేదవారిగా పరిగణించలేదు. మాకవసరమైనవి మాకుండేవి.”

అది దాదాపు 40 సవంత్సరముల క్రితము సంగతి. అప్పటి నుండి, బోచింగ్‌ జీవితము మరియు ఆ దీవిలోని మిగిలిన రెండు కోట్ల నివాసుల జీవితాలు చాలా మారిపోయాయి. ఫ్యాక్ట్స్‌ అండ్‌ ఫిగర్స్‌—ది రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా ఆన్‌ తైవాన్‌ అనే పుస్తకం వివరిస్తున్న ప్రకారం, “తైవాన్‌ వ్యవసాయ సమాజము నుండి గొప్ప పారిశ్రామిక సమాజంగా మారింది.” పందొమ్మిది వందల డెబ్బైల చివరికెల్లా తైవాన్‌ “స్థిరంగా, అభివృద్ధి చెందుతున్న సమాజంగా,” ఎంచబడింది.

నిజంగా, తైవాన్‌లో ప్రతిచోట సమృద్ధికి రుజువు కనిపిస్తుంది. దీవంతటా అత్యాధునికమైన, ఉన్నతమైన హర్మ్యాలుగా, అతి వేగంగా కట్టబడిన ఆఫీసు కాంప్లెక్స్‌లు మొదలుకొని, దిగుమతి చేయబడిన ఖరీదైన వాహనాలతో నిండే రహదారులవరకు ఉన్న తైవాన్‌ సంపద యితర అభివృద్ధి చెందుచున్న దేశాలకు అసూయ కలిగించేదిగా ఉంది. తైవాన్‌లోని ప్రముఖ ఆంగ్ల-భాషా వార్తాపత్రికయైన చైనా పోస్ట్‌ అతిశయంగా చెప్పుకుంటున్నట్లుగా, నేడు “తైవాన్‌ ప్రజలు చైనా చరిత్రలో అత్యున్నతమైన జీవనస్థాయిని అనుభవిస్తున్నారు.”

‘అనేకమైన జటిల ప్రశ్నలు’

ఈ వస్తుసంపద అంతా ప్రజలకు నిజమైన సంతోషాన్ని మరియు సంతృప్తిని యిచ్చిందా? తైవాన్‌ ప్రజలు అభిమానిస్తున్నప్పటికీ, యీ ఘన విజయానికి మరొక పక్షం కూడా ఉంది. చైనా పోస్ట్‌ మరి ముఖ్యంగా యిలా పేర్కొంది: “అమిత మోతాదులోని సంపదతో పాటు క్లిష్టమైన, జటిలమైన అనేక సమస్యలు వచ్చాయి.” మూల్యం చెల్లించకుండా తైవాన్‌ వస్తుసంపద కలుగలేదు.

ఒకప్పుడు నేరాలు లేని యీ దీవిలో ఆవరిస్తున్న “క్లిష్టమైన మరియు జటిలమైన సమస్యలను” గూర్చి చైనా పోస్ట్‌ యీ విధంగా అంటుంది: “ఇటీవలి సంవత్సరాల్లో నేరము, అక్రమము మన సంపన్న దేశంలో నియమానువర్తులైన పౌరుల జీవితాలకు, ఆస్థులకు మిక్కిలి భీతిని కలిగిస్తూ, భయానకంగా పెరిగిపోయాయి.” “సంపద తైవాన్‌ను కామాతురతగల దేశంగా చేస్తుంది,” అనే పేరుగల వ్యాసంలో పోస్ట్‌ అనే దినపత్రిక “స్త్రీల అర్థనగ్నతను ప్రదర్శించే రెస్టారెంట్లు, బార్లు” మరియు మంగలిషాపు పేరున నడపబడే చట్టవిరుద్ధమైన వేశ్యా గృహాలు పెరగడం వలన వచ్చే సమస్యలను బట్టి విచారం వెలిబుచ్చింది. దౌర్జన్యంగా డబ్బులాగడం మరియు డబ్బుకొరకు పిల్లలను అపహరించడం మరొక సమస్యగా తయారయింది. పిల్లలను అపహరించడం “తైవాన్‌లో కొత్తగా ఆదరణ పొందుతున్న పరిశ్రమ” అన్నట్లు ఒక నివేదిక మాట్లాడుతుంది. చాలా మంది జూదం మూలంగా కల్గే అప్పులను, లేదా మరితర ఆర్థిక నష్టాలను పూడ్చడానికి మార్గంగా యీ నేరాలకు పాల్పడుతున్నారు.

పిల్లలు ఊరకనే అమాయకంగా నేరానికి గురికావడం లేదు. వాళ్ళు నేరాలు చేయడంలో ఎక్కువగా పాల్గొంటున్నారు. కేవలం 1989లోనే బాలురు చేసిన నేరాల సంఖ్య 30 శాతం పెరిగిపోయిందని నివేదికలు చెబుతున్నాయి. కుటుంబ విచ్ఛిన్నం మూలంగానే యిలా జరుగుతుందని కొందరి అభిప్రాయం, మరియు గణాంకశాస్త్రం చూపించేది కూడా దీనికి పొందికగా ఉంది. ఉదాహరణకు, 1977 నుండి 1987 వరకు, తైవాన్‌లో వివాహిత దంపతుల సంఖ్య తగ్గిపోయింది, అయితే విడాకుల రేటు రెండు రెట్లకు మించిపోయింది. చైనా సంస్కృతి స్థిరమైన సమాజంలోని కుటుంబం యొక్క ప్రాముఖ్యతను పారంపర్యంగా నొక్కి చెబుతున్నందున, చెడిపోతున్న పరిస్థితులను గూర్చి అనేకులు వ్యసనపడడంలో ఆశ్చర్యమేమీ లేదు.

సమస్యకు మూలము

సంపన్న దేశంలో సామాజిక వ్యవస్థ నశించిపోవడానికి గల కారణాన్ని నిర్థారించే ప్రయత్నంలో అనేక వివరణలు యివ్వబడ్డాయి. కొందరు ప్రజలు తత్వజ్ఞాన తలంపుతో, యిది విజయం కొరకు కట్టిన వెల అని అంటున్నారు. కాని విజయాన్ని లేదా సంపదను నిందించడం, తిండిపోతును బట్టి ఆహారాన్ని నిందించినట్లు ఉంటుంది. భుజించే వారందరూ తిండిపోతులు కారు, వస్తుసంపద ఉన్న ప్రతి ఒక్కరు నేరస్థులు కారు. వస్తుసంపద దానంతట అదే నేరానికి, సామాజిక అవ్యవస్థకు కారణం కాదు.

చైనా పోస్ట్‌లో సంపాదకుడు దీనికి తోడ్పడే ముఖ్య కారణాన్ని గూర్చి సూచిస్తూ, యిలా చెబుతున్నాడు: “మనం అనేక దశాబ్దాలుగా వస్తుసంపదకు అమిత ప్రాముఖ్యతనిచ్చాము. మన సమాజంలో నేడు నైతిక మూల్యాలు మరియు ఆత్మీయ మూల్యాలు తగ్గిపోవడానికి ఇదే కారణమైంది.” (ఐటాలిక్కులు మావి.) అవును, వస్తువులను సంపాదించడానికి ప్రాముఖ్యతనివ్వడం, ధనాపేక్షకు, పేరాశకు నడిపిస్తుంది. అది స్వార్థానికి నడిపిస్తుంది. ఇలాంటిస్వభావం కుటుంబ విచ్ఛిన్నానికి దారి తీస్తుంది, సామాజిక కీడులను పెంచుతుంది. బైబిలు, 2,000 సంవత్సరాలకు ముందు వ్రాసినది యిప్పుడు కూడా నిజమే: “[ధనము కాదుగాని] ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము.”—1 తిమోతి 6:10.

ప్రపంచవ్యాప్తంగావున్న సమస్య

వేలాదిమంది తైవాన్‌ ప్రజలు, శాంతిని, సమాధానాన్ని,—సురక్షితమును వెతుక్కుంటూ యితర దేశాలకు వలస వెళ్ళారు. కాని తైవాన్‌ ఎదుర్కొనే సమస్యలు తైవాన్‌లో మాత్రమే ఎదురవ్వడం లేదు. అవి ప్రపంచమంతటా విస్తృతంగా వ్యాపించాయి.

కొన్ని సంవత్సరాల క్రితం, ఒక అధ్యయనం తెలిపిందేమంటే అమెరికాలోని, కాలిఫోర్నియానందలి అధిక సంపన్నమైన మండలంలోనే (కౌంటీ), ఆ దేశంలోని మరెక్కడికన్నా విడాకుల రేటు ఎక్కువగా ఉండేది. కొన్ని ప్రాంతాల్లో వివాహాలు విచ్ఛిన్నంకావడం వల్లనే దాదాపు 90 శాతం స్థిరాస్తుల లావాదేవీలు జరిగాయి. దేశంలో సగటున చూస్తే యిక్కడ ఆత్మహత్యల సంఖ్య రెండు రెట్లని నివేదించబడింది. దేశంలోని అత్యధిక మద్యపాన వినియోగ రేట్లలో ఇదొకటి, అమెరికాలో మరెక్కడికన్నా, సగటున అనేకమంది మానసిక రోగ నిపుణులు ఇతర మానసిక వైద్యులు యీ మండలంలోనే (కౌంటీ) ఉన్నారని చెప్పబడింది.

“మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును,” అని యేసుక్రీస్తు చెప్పినప్పుడు ఆయన ఒక ప్రాథమిక సత్యాన్ని వెలిబుచ్చాడు. (మత్తయి 4:4) వస్తుసంపద ఎంత సమృద్ధిగా ఉన్నా అది ఒక వ్యక్తియొక్క ప్రతి అవసరతను తీర్చలేదు, లేదా అది సంతోషానికి హామీ యివ్వలేదు. దానికి విరుద్ధంగా, ఒక చైనా సామెత తరచూ చెబుతున్నట్లుగా, “ఒకడు బాగా భుజించి, వెచ్చదనాన్ని పొందినప్పుడు, అతడి ఆలోచనలు తగని కోరికలవైపుకు మరియు శారీరక కోరికలవైపుకు మళ్ళుతాయి.” తైవాన్‌లోను, ప్రతిచోటను జరుగుతున్న విషయాలు ఉదాహరించబడినట్లు కేవలం వస్తుసంపద ఉండడం తరచూ నైతిక నాశనానికి మరియు సామాజిక నాశనానికి, వాటి వల్ల వచ్చే సమస్యలకు దారి తీస్తుంది.

వస్తుసంపద నిజమైన, శాశ్వతమైన సంతోషానికి ఒక కారణం కావడానికి ఏమి అవసరం? జవాబు కోసం దయ చేసి, తరువాతి శీర్షికను చదవండి.

[6వ పేజీలోని చిత్రం]

“ఒకరు బాగా భుజించి, వెచ్చదనాన్ని పొందినప్పుడు, అతడి ఆలోచనలు తగని కోరికలవైపుకు, శారీరక కోరికలవైపుకు మళ్ళుతాయి.”—చైనా సామెత

[5వ పేజీలోని చిత్రం]

వస్తుసంపద చిన్న పట్టణాలను సందడిగా ఉండే, నియోన్‌ బల్బులు గల నగరాలుగా మార్చింది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి