వస్తుసంపదను వెంబడించుట
తైవాన్‌లోని తేజరిల్లు! ప్రతినిధి
‘డబ్బు సంతోషాన్ని కొనలేదు!’ దాదాపు ప్రజలందరూ యీ మాటలను అంగీకరిస్తున్నప్పటికీ, వారిలో చాలామంది వస్తుసంపదే సంతోషకరమైన జీవితానికి మార్గమన్నట్లు, విరామంలేకుండా యిప్పటికీ దాన్ని వెంబడిస్తున్నారు. ఎందుకో మరి? అయినప్పటికీ, మానవజాతి యొక్క అనేక సమస్యలకు పరిష్కారం వస్తుసంబంధమైన విజయంలోను, సంపదలోను ఉన్నట్లు కనిపిస్తుంది.
ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ, ప్రతి బిడ్డ ఐశ్వర్యవంతమైన జీవితాన్ని అనుభవిస్తే అది ఎంత భిన్నమైన లోకంగా ఉంటుందో ఒకసారి ఊహించండి! ప్రపంచంలోని మురికివాడల్లో జీవించే లక్షలాది మంది ప్రజల పేదరికము, కష్టాలు యిక ఉండవు. ధనిక, పేద దేశాలను యిప్పుడు పీడిస్తున్న నిరాశ్రయమనే సమస్య యిక ఉండదు.
సంతోషానికి ఎంతో అవసరమైన మంచి ఆరోగ్యాన్ని గూర్చిన మాటేమిటి? వైద్యశాస్త్రం అతివేగంగా అభివృద్ధిచెందుతున్నప్పటికీ, చాలామంది ప్రజలు తాము దాని సేవలనందుకోలేరని తెలుసుకుంటున్నారు. మరొకవైపు, ఆకలి, కుపోషణ అనేవి యిప్పటికీ లక్షలాది మంది ప్రజల దైనందిన జీవితానుభవాలే. ప్రపంచవ్యాప్తంగా వస్తు సమృద్ధి ఉన్నట్లయితే, ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా జీవించే అవకాశం ఉంటుంది, అలా అందరూ సంతోషకరమైన జీవితాలను గడపవచ్చు, కాదంటారా?
భూమికి సహితం మేలు చేకూరుతుంది. ఎలా? భూమియొక్క పర్యావరణం యిప్పుడు, కొంత వరకు శిలాజ ఇంధనాలను కాల్చడం వలన వచ్చే మరణకరమైన కాలుష్యం మూలంగా నాశనమౌతుంది. అయినప్పటికీ, శక్తిని పరిశుభ్రమైన విధానాల్లో ఉపయోగించేందుకు అవసరమైన సాంకేతిక శాస్త్రాన్ని ఉపయోగించకపోవడానికిగల ఒక కారణం, అది చాలా ఖరీదైనదన్నదే. పర్యావరణానికి మరో తీవ్రమైన అపాయాన్ని కలిగించే వర్షపాత అడవుల నాశనానికి ముఖ్యంగా ఆర్థిక కారకాలు నిందింపబడుతున్నాయి.
వస్తు సంపద మన అనేక సమస్యలను పరిష్కరించేదిగాను, కష్టాలనుండి ఉపశమనాన్నిచ్చేదిగాను కనిపించవచ్చు, కాబట్టి ప్రజలు సంతోషాన్ని ధనంతో ముడిపెట్టడంలో ఆశ్చర్యం లేదు. ఉదాహరణకు, పాశ్చాత్యులు ఒకరినొకరు కొత్త సంవత్సర దినమున “హ్యాపీ న్యూ ఇయర్!” అని శుభాకాంక్షలు తెలుపుకుంటుండగా, చైనాదేశస్థులు నూతన చాంద్రమాన సంవత్సర సందర్భంలో పారంపర్యంగా, ‘శ్రీమంతులగుదురు గాక!’ అనే శుభాకాంక్షను తెలుపుతూ ఒకరికొకరు “కుంగ్షీ ఫా స్సి” అని వందనం చేసుకుంటారు. అవును, వస్తుసంపదకు అత్యున్నత స్థానం యివ్వకపోయినా, దానికి అధిక ప్రాముఖ్యతనిస్తూ, దాన్నే వెంబడిస్తున్న ప్రజలున్న లోకంలో మనం జీవిస్తున్నామనే విషయాన్ని మనం కాదనలేము. విజయమా లేదా అపజయమా అన్నది తరచూ, వస్తు సంపదనుబట్టి కొలవబడుతుంది.
వస్తుసంపదను అనుభవించడంలో తప్పు ఏమీ లేనప్పటికీ, అది సంతోషానికి హామీ యివ్వగలదా? వాటికి ఎంత ప్రాముఖ్యతనివ్వాలి? వస్తు సంపద నిజంగా శ్రేష్ఠమైన లోకానికి కీలకమా?