కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g94 2/8 పేజీలు 16-17
  • “మానవునికి అత్యంత ఉపయోగకరమైన చెట్టు”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “మానవునికి అత్యంత ఉపయోగకరమైన చెట్టు”
  • తేజరిల్లు!—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • కొబ్బరి నుండి తయారు చేయబడినవి
  • “ద్రాక్షారసం కన్నా ఎంతో రుచికరమైంది”
  • కొబ్బరి వంటకం
  • భువిపైనున్న అత్యంత ప్రయోజనకరమయిన కాయల్లో ఒక కాయ
    తేజరిల్లు!—2003
  • అసాధారణమైన రుచిగల పీత
    తేజరిల్లు!—1995
తేజరిల్లు!—1994
g94 2/8 పేజీలు 16-17

“మానవునికి అత్యంత ఉపయోగకరమైన చెట్టు”

కెన్యానందలి తేజరిల్లు! ప్రతినిధి

చాలామందికి కొబ్బరి చెట్టంటే సోమరిగా వున్నట్లు కనిపించే చెట్టు, అంటే అది విశ్రాంతికి, విరామానికి గుర్తు. కాని కెన్యా తీరప్రాంతం వెంబడివున్న మోంబాసా ద్వీపంలో జీవిస్తున్న ప్రజలకు, అది మరెంతో విలువైనది. కొంతమంది ఈ మృదువైన పెద్ద చెట్టును “జీవవృక్షం” అని పిలుస్తారు. ఈ తీరప్రాంత వాసులకు, ఈ చెట్టు సౌందర్యాన్నేగాక, మానవ జీవిత కనీస అవసరతలను తీర్చే అద్భుతమైన సామర్థ్యాన్ని కూడా కలిగివుంది.

కొబ్బరి చెట్టు వల్ల ఎన్నో ఆచరణాత్మక ఉపయోగాలు ఉన్నాయి. అందుకే యీ కొబ్బరి చెట్టు “సమృద్ధి గల చెట్టు,” “మానవజాతి గడపమీద పాలసీసా,” “మానవునికి అత్యంత ఉపయోగకరమైన చెట్టు” అని పిలువబడుతుందంటే అందులో ఆశ్చర్యంలేదు. ది కోకొనట్‌ పామ్‌—ఎ మోనోగ్రాఫ్‌ అనే పుస్తకం ఇలా చెబుతుంది: “మానవజాతికి మరే ఇతర చెట్టుకన్నా ఇది బహుశ ఎన్నో ఉపయోగకరమైన వాటిని అందజేస్తుంది.”

కొబ్బరి నుండి తయారు చేయబడినవి

కెన్యా తీరప్రాంత ప్రజలు కొబ్బరి చెట్టును ఎన్నో జ్ఞానయుక్తమైన రీతుల్లో వినియోగించుకుంటున్నారు. ఉదాహరణకు, ఈ ప్రాంతంలోని కదె అనే గృహిణిని గమనించండి. ఆమె ఈ ఉష్ణమండల వాతావరణంలో బాల్యం నుండి జీవిస్తుంది. “కొబ్బరి మీ ఇంట్లో ఎప్పుడూ ప్రాముఖ్యమైన పాత్ర వహించిందా?” అని మేము అడిగాము.

ఆమె ఇలా సమాధానమిచ్చింది: “నేను చిన్నపిల్లగా ఉన్నప్పటినుండి మా వంటగదిలో కొబ్బరిని వాడడం నాకు బాగా గుర్తుంది. దాని పైటెంక చాలా గట్టిగా, బాగా మన్నేదిగా ఉంటుంది గనుక, అది గిన్నెలు, చెంచాలు, గరిటెలుగా చక్కగా పనికివచ్చేది. పెద్ద టెంకలు చారు పోసుకునే గిన్నెలుగా, తెడ్లుగా ఉపయోగించాము. ఇంట్లో ఉపయోగించటానికి వీటిని ఎలా మలిచి, తయారు చేయాలనేది మా విద్యలో ఒక భాగంగా నేర్పించేవారు.”

కదె భర్త మబాగా కూడా తీరప్రాంతంలోనే పెరిగాడు, వంటగది వెలుపల కూడా వాటి ఉపయోగం గురించి అతను ఎంతో చెప్పగలడు. “ఈ చెట్టు జీవితంలో ఒక ఆవశ్యకమైన భాగమని పెరుగుతున్న బాలునిగా నేను గమనించాను” అని అతను గుర్తుచేసుకుంటున్నాడు.

ఉదాహరణకు, గట్టిగా, దృఢంగా ఉండే కొబ్బరి చెట్టుమొద్దును “మేము వాసాలు, స్తంభాలు, దూలాలు, గుంజలు, ఇంకా ఇతర అనేక నిర్మాణ వస్తువుల కొరకు ఉపయోగిస్తాము” అని అతను చెబుతున్నాడు.

కొబ్బరి ఆకుల మాటేమిటి? మబాగా ఇలా వివరించాడు: “పైకప్పుగా ఉపయోగించటానికి పెద్ద తడికెలను చేసేందుకు ఈ ఆకులను చేతులతో అల్లడం ద్వారా అనేక గ్రామాల్లోని స్త్రీలు తమ జీవనం గడుపుకుంటారు.” ఇంటిపై తీక్షణమైన సూర్యుని ఎండ పడుతున్నప్పటికీ, లోపలున్నవారికి చల్లగా, సౌకర్యంగా ఉంటుంది. కొబ్బరి ఆకుల పైకప్పు ఎండ నుండి కాపాడటమేగాక, ఇంటిని చల్లబరచటానికి గాలి కూడా వచ్చేలా చేస్తుంది. ఇంతకంటే శ్రేష్ఠమైన పైకప్పు ఉండదు. అల్లబడిన కొబ్బరి ఆకులు గోడలు, కంచెలు, తలుపులుగా చక్కగా పనికి వస్తాయి.

చక్కగా నవ్వుతూ మాబాగా ఇలా పొడిగించాడు: “కొబ్బరి పీచు గురించి మనం మరచిపోకూడదు. భూమిలో పాతిన పదునైన చెక్క లేక ఇనుప పరికరం మీద కొబ్బరికాయను తగిలించి క్రిందికి అదిమి వంచడం ద్వారా పీచును తీయవచ్చు. మనం కొబ్బరికాయను రెండు చేతుల్లో పట్టుకుని, పరికరం కొనకు తగిలించి, టెంక నుండి పీచు వూడివచ్చేలా దాన్ని క్రిందికి లాగాలి.” నేలపైవేసే చాపలు, రగ్గులు, తివాచీలు, బ్రష్షులు, చీపుర్లు, పరుపులలో పెట్టే పదార్థంగా కూడా పనికివచ్చే అందమైన బంగారు రంగు నారను ఆ పీచునుండి తీయవచ్చు.

“ద్రాక్షారసం కన్నా ఎంతో రుచికరమైంది”

ఆహారంలో కూడా కొబ్బరి ప్రముఖ పాత్ర వహిస్తుంది, దాని పెరుగుదలలోని దాదాపు అన్ని స్థాయిల్లో దాన్ని ఉపయోగిస్తారు. (స్థానిక భాషయైన కిస్వాహిలిలో దాఫూ అని పిలువబడే) ఇంకా పూర్తిగా తయారుకాని కొబ్బరికాయలో స్వచ్ఛమైన, సంపూర్ణమైన, పోషణకరమైన, ఎంతో కమ్మని రుచిగల పానీయం ఉంటుంది. కేవలం టెంక పైభాగంలో రంధ్రం చేయడం ద్వారా దాని ప్రకృతిసిద్ధమైన పాత్రలోనే ఈ పానీయాన్ని సేవించవచ్చు, ఉష్టమండల దాహానికి నిజంగా తగిన పానీయం! ఈ పానీయాన్ని గురించి పేరుగాంచిన అన్వేషకుడగు మార్కో పోలో ఇలా అన్నాడట: “ఆ ద్రవం నీళ్లంత తేటగా, చల్లగా, రుచికరంగా, ద్రాక్షారసం లేక మరే విధమైన పానీయం కన్నా మధురంగా ఉంటుంది.”

స్థానికమైన ఈ పానీయాన్ని మొదటిసారి రుచి చూసినప్పుడు సందర్శకులు తరచూ అలాంటి భావాన్నే వ్యక్తంచేస్తారు. ద్రవం అయిపోయిన తరువాత, పగులకొట్టిన టెంకనుండి మెత్తని గుజ్జును తీసుకోవచ్చు. ఇది మెత్తగా, తియ్యగా, తాజాగా ఉంటుంది. సందర్శకులకైతే, పూర్తిగా తయారుకాని కొబ్బరికాయ రుచులు అసాధారణమైనవిగా ఉంటాయి, కాని తీరప్రాంత వాసులకు మాత్రం ఈ పానీయం ప్రతిరోజు త్రాగేదే, త్రాగే నీరు కరువైనప్పుడు దాన్ని ఎక్కువగా సేవిస్తారు.

కొబ్బరి వంటకం

ముదిరిన కొబ్బరికాయలోని చాలా విలువైన భాగం దానిలోవుండే కొబ్బరి, లేక కాయ. దాన్ని టెంక నుండి వేరుచేసి తినవచ్చు, దాన్ని తురిమి రకరకాల వంటకాలలో ఉపయోగించవచ్చు లేక దాన్ని పిండి శ్రేష్ఠమైనపాలను తీయవచ్చు.

“చిన్నపిల్లగా నేను, వంటలో వాడటానికి కొబ్బరిపాలు ఎప్పుడు సిద్ధంగా ఉండేలా చూసేదాన్ని” అని కదె గుర్తుచేసుకుంటుంది. సాంప్రదాయసిద్ధంగా, చేప, కోడి, బీన్సు, బియ్యము, ఆలుగడ్డలు, దుంపలు, రొట్టెలు వంటివాటి రుచిని పెంచటానికి కొబ్బరిపాలు వాడతారు. అయితే ఆ పాలను కదె ఎలా తీస్తుందో తెలుసుకోవాలని మనం ఆసక్తి కలిగివున్నాము.

“మేము ఉంబుజెను ఉపయోగిస్తాము” అని కదె వివరిస్తుంది. నేలనుండి 15 సెంటీమీటర్లపైన నిలబడివుండే ఒక చిన్న చెక్క పీటను కిస్వాలి గ్రాంథిక భాషలో ఉంబుజె అంటారు. దాన్నుండి పైకి వచ్చినట్లున్న పదునైన పళ్లుగల కొన ఉంటుంది, ముఖ్యంగా చేతితో కొబ్బరిని తురమటానికి అది రూపొందించబడింది. “ఉంబుజెపై కూర్చోవటం పిల్లలమైన మాకు చాలా సరదాగా ఉండేది. మేము ఒక సగం కొబ్బరికాయను తీసుకుని పదునైన పళ్లుగల ఆ కొనమీద కొబ్బరికాయ లోపలి భాగంలోవున్న కొబ్బరి అంతా వచ్చేలా తురుముతాము. తరువాత తురిమిన కొబ్బరిని తాటిమట్టలతో చేసిన పెద్ద గరాటులాంటి జల్లెడలో వేస్తాం. ఆ తరువాత మేము రుచికరమైన కొబ్బరి పాలను పిండితీస్తాము.”

కొబ్బరి నిజంగా ఒక పండు, అది ఇతర ఉష్టమండల పండ్లకన్నా చాలా మేలైనది. బొప్పాయి, అనాస, మామిడి, అరటి, కమల, పాషన్‌ పండ్ల వంటి తాజా ముక్కలపై తాజా కొబ్బరి తురుము, లేక కొబ్బరిపాలు వేసి తయారుచేసే పదార్థాన్ని గురించి ఊహిస్తేనే నోరూరిపోతుంది.

పాత సామెత ఒకటి ఇలా చెబుతుంది: “కొబ్బరిచెట్టును నాటినవాడు . . . తన కొరకు ఆహారాన్ని, పానీయాన్నే గాక తన పిల్లల కొరకు ఒక పిత్రార్జితాన్ని సంపాదించినట్లే.” కాబట్టి సోమరిగా కనిపించే కొబ్బరి చెట్టు ఎంతమాత్రం సోమరికాదు. అది నిజంగా మానవునికి అత్యంత ఉపయోగకరమైన చెట్టా, కాదా అని వాదిస్తే ఈ ఆఫ్రికాదేశంలో అది కచ్చితంగా కల్పవృక్షమే! (g93 10/22)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి