మా పాఠకులనుండి
పిల్లలను పెంచుట ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయునిగా, “మీ పిల్లలు—వారికి శ్రేష్ఠమైనది చేయుట” అనే అంశంపైని మీ శీర్షికలను నేనెంతగానో మెచ్చుకుంటున్నాను. (జనవరి 8, 1993) తమ పిల్లలయెడల నిజమైన ఆసక్తి కనపర్చక చాలా బిజీగావున్న తలిదండ్రుల పిల్లలతో వ్యవహరించడమే, ఈనాడు ఉపాధ్యాయులు ఎదుర్కొనే మహాగొప్ప సవాలు. ఇటీవల మా పాఠశాలలో ఒక సాయంత్రం జరిగిన తలిదండ్రుల సమావేశంలో, ఈ శీర్షికలోని అంశాలను నేను వారితో చర్చించాను. మా చర్చ చాలా వివేచన యుక్తమని, ఆలోచనను పురికొల్పేదని తలిదండ్రులు గమనించారు.
యం. పి., అమెరికా
మీ బాణం గురితప్పలేదు. నేను ఇంతవరకూ చదివిన వాటిలోకెల్లా అవి అతి శ్రేష్ఠమైన శీర్షికలు. చెడు ఉదాహరణలు ఎలావుంటాయని చూపించడమేకాకుండా వాటికి తగిన పరిష్కారాన్ని కూడా మీరు చూపించారు.
యం. ఆర్., జర్మనీ
శీర్షికలు చాలా చక్కగా వ్రాయబడ్డాయి. అయితే బాల్య హింసను గూర్చి మీరు అంత స్పష్టంగా సూచించడాన్ని నేను ఆక్షేపించవలసి వస్తోంది. నేను నిర్ఘాంత పోయాను.
యఫ్. యం., కెనడా
అమాయక, నిస్సహాయ పిల్లలయెడల తలిదండ్రులు చేసే హింసనుగూర్చి చదవడం నిజంగానే నిర్ఘాంతపరుస్తుంది. ఇటువంటి విషయాలను గూర్చి చదవడం అంత రమ్యంగా వుండదని కొందరు పాఠకులు భావిస్తారన్న విషయాన్ని మేము అర్థంచేసుకోగలం. అయితే, ఈనాడు పిల్లలు ఎదుర్కొనే వాస్తవిక అపాయాలు తలిదండ్రులకు తెలియాలి. (2 కొరింథీయులు 2:11 పోల్చండి.) కాబట్టి వీలైనంత రమ్యంగా రచిస్తూనే యిలాంటి విషయాల్లో నిర్దిష్ట సమాచారాన్ని అందించడం మా బాధ్యతగా భావించాము.—ఎడి
తలిదండ్రులకు ఉత్తరం “అమ్మనాన్నలకు ఉత్తరం” అనే శీర్షిక నాకు కంటతడి తెప్పించింది. (జనవరి 8, 1993) అది, నా తలిదండ్రులు తమ ఎనిమిది మంది పిల్లలను పెంచడంలో ఎంత దుర్భర పరిస్థితినెదుర్కొన్నారో నేను గ్రహించేటట్టు చేసింది. అందుకే నా 42వ ఏట నేను స్వయంగా నా తల్లిదండ్రులకు ఒక కృతజ్ఞతా ఉత్తరాన్ని రాశాను.
జే. డి., అమెరికా
ఈ యౌవనస్థుడు వ్రాసిన వాటిల్లో ఏ ఒక్కదాన్ని కూడా నా తలిదండ్రులు నాకివ్వలేదు. అందుకే దాన్ని చదవడం నాకు చాలా బాధ కలిగించింది. అయితే దాన్ని నేను మరలా చదివినప్పుడు నా కొరకును యితరులనేకుల కొరకును మన పరలోక తండ్రి యెహోవా ఎంతో చేస్తున్నాడని నేను గ్రహించగల్గాను. ఆయన నాకు ప్రేమను నేర్పించి, అవసరమైనప్పుడల్లా నాకు క్రమశిక్షణనిచ్చాడు. ఆవిధంగా, చిన్నతనంలో నేను అనుభవించిన బాధనుండి ఆయన నాకు కొంత విముక్తినిచ్చాడు.
చ. ఎ., అమెరికా
ఒలీవ నూనె జనవరి 8, 1993 సంచికలో “బహుముఖ ఒలీవ నూనె” అనే చక్కటి శీర్షికను అందించినందుకు కృతజ్ఞతలు. నేను ఒక ఆసుపత్రిలో ఆహార సలహాదారురాలిని, కాగా క్రొవ్వును తగ్గించడంలో, కొలెస్ట్రోల్‌ను తగ్గించడంలో ప్రజలకు నేను సలహాలిస్తుంటాను. ఈ శీర్షిక ఎంతో నిర్దిష్టంగావుంది, అంతేకాకుండా నా బోధలోకూడా అది చాలా ఉపయుక్తంగా వుంది.
డి. ఎస్., అమెరికా
ప్రపంచ పరిశీలన చిన్నచిన్న వార్తా విషయాలను ఈ “ప్రపంచ పరిశీలన”లో ప్రచురిస్తున్నందుకు కృతజ్ఞతలు. నేను చీకూచింతా లేని, సమస్యలు లేని జీవితాన్ని అనుభవించాను గనుక, ఇవి అంత్యదినాలని నాకుగా నేను పునర్నిర్ధారించుకోవాలి. “ప్రపంచ పరిశీలన” అనే ఈ శీర్షిక, ఈ లోకము నిజంగా ఎంత చెడిపోయింది, ఎంతగా దిగజారిపోయిందని నన్ను ఒప్పించడానికి ఒక గొప్ప సహాయకంగా పనిచేస్తోంది. దయచేసి వీటిని క్రమంగా ప్రచురించండి.
యం. జి., అమెరికా
నూతన లోకం “అందరిని సంతృప్తిపర్చే ఒక నూతన లోకం” (ఫిబ్రవరి, 8, 1993) అనే ఈ శీర్షిక పరంపర అంశంపై ఈ సంవత్సరం యింతవరకూ ప్రచురించిన చక్కని శీర్షికల్లో ఒకటి. అందు ఎత్తిచూపబడిన లేఖనాలు, ఎంతో రమ్యమైన ఉపమానాలూ నాలో ప్రగాఢమైన అభినందనను కలిగించాయి. ఇది అనేక మంది పాఠకుల హృదయాల్ని చేరుతుందని నేనాశిస్తున్నాను.
ఐ. జెడ్., ఇటలీ