బాప్తిస్మమిచ్చే యోహాను నిజంగానే జీవించాడా?
బాప్తిస్మమిచ్చే యోహాను అనే వ్యక్తి గురించి సువార్త పుస్తకాలు చెప్తున్నాయి. ఆయన యూదయలో దేవుని రాజ్యం గురించి ప్రకటించాడు. మరి, ఈ మనిషి గురించి బైబిలు చెప్పేది నిజమేనా? చూద్దాం:
బైబిలు ఇలా చెప్తుంది: “బాప్తిస్మమిచ్చే యోహాను యూదయ ఎడారిలో ప్రకటించడం మొదలుపెట్టాడు; అతను, ‘పరలోక రాజ్యం దగ్గరపడింది కాబట్టి పశ్చాత్తాపపడండి’ అని చెప్తూ ఉన్నాడు.” (మత్తయి 3:1, 2) ఈ మాటలు నిజం అనడానికి ఇంకెక్కడైనా రుజువులు ఉన్నాయా? ఉన్నాయి.
మొదటి శతాబ్దపు చరిత్రకారుడైన ఫ్లేవియస్ జోసిఫస్, “బాప్తిస్మమిచ్చే యోహాను అనే పేరున్న వ్యక్తి” గురించి చెప్పాడు. అతను యూదుల్ని, ‘నీతిగా బ్రతకమని, దేవుని మీద భయభక్తులు ఉంచమని, బాప్తిస్మం తీసుకోమని ప్రోత్సహించాడు’ అని జోసిఫస్ రాశాడు.—జ్యూయిష్ ఆంటిక్విటీస్, పుస్తకం XVIII.
గలిలయ, పెరయ జిల్లాలకు పరిపాలకుడిగా ఉన్న హేరోదు అంతిపను యోహాను గద్దించాడని బైబిలు చెప్తుంది. హేరోదు కేవలం పేరుకే ఒక యూదుడు; అతను ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నానని చెప్పుకునేవాడు. హేరోదు తన అన్న భార్య అయిన హేరోదియను పెళ్లి చేసుకున్నందుకు యోహాను అతన్ని మందలించాడు. (మార్కు 6:18) దీనికి బైబిల్లోనే కాకుండా, వేరేచోట కూడా ఆధారం ఉంది.
హేరోదు అంతిప “హేరోదియను ప్రేమించి, తనను పెళ్లి చేసుకోమని సిగ్గులేకుండా అడిగాడు” అని చరిత్రకారుడైన జోసిఫస్ రాశాడు. అప్పుడు హేరోదియ దానికి ఒప్పుకుని, తన భర్తను వదిలేసి అంతిపను పెళ్లి చేసుకుంది.
బైబిలు ఇలా చెప్తుంది: “యెరూషలేము నుండి, యూదయ అంతటి నుండి, అలాగే యొర్దాను చుట్టుపక్కల ప్రాంతాలన్నిటి నుండి ప్రజలు [యోహాను] దగ్గరికి వెళ్తూ ఉన్నారు . . . యొర్దాను నదిలో అతని దగ్గర బాప్తిస్మం తీసుకున్నారు.”—మత్తయి 3:5, 6.
ఈ విషయాన్ని జోసిఫస్ కూడా రాశాడు. ప్రజలు యోహానును చూడడానికి “గుంపులుగుంపులుగా” వచ్చేవాళ్లు అని, “ఆయన ప్రసంగాలు విని చాలా ప్రోత్సాహం పొందేవాళ్లు” అని జోసిఫస్ చెప్పాడు.
కాబట్టి, బాప్తిస్మమిచ్చే యోహాను నిజంగానే జీవించాడని మొదటి శతాబ్దపు చరిత్రకారుడైన జోసిఫస్ నమ్మాడు. మనం కూడా నమ్మవచ్చు.