యేసు జీవితము పరిచర్య
జన్మదిన వేడుకలో హత్య
యేసు తనశిష్యులకు ఉపదేశములనిచ్చిన తరువాత, ఆ ప్రాంతములోనికి వారిని ఇద్దరిద్దరినిగా పంపెను. బహుశ సహోదరులైన పేతురు, అంద్రెయ; అలాగే యాకోబు, యోహాను; ఫిలిప్పు, బర్తలొమయి; తోమా, మత్తయి; యాకోబు, తద్దయి; మరియు సీమోను, ఇస్కరియోతు యూదా కలిసివెళ్లియుండవచ్చును. ఈ ఆరు జతల సువార్తికులు వారు వెళ్లు ప్రతిచోట రాజ్యసువార్త ప్రకటించి అద్భుతరీతిగా స్వస్థతలు చేసిరి.
ఈ లోగా బాప్తిస్మమిచ్చు యోహాను ఇంకా చెరసాలలోనే ఉండెను. ఇప్పటికి దాదాపు రెండు సంవత్సరముల నుండి అతడు అక్కడ ఉంటున్నాడు. హేరోదు అంతిప తన సోదరుడైన ఫిలిప్పు భార్య హేరోదియను, తన భార్యగా ఉంచుకొనుట న్యాయముకాదని లోగడ యోహాను బహిరంగముగా ప్రకటించెనని నీవు గుర్తుతెచ్చుకొనవచ్చును. మోషే ధర్మశాస్త్రమును అనుసరించుచున్నానని హేరోదు అంతిప చెప్పుకొనెను గనుక యోహాను వారి వ్యభిచార సంగమమును బయటపెట్టుట సరియే. బహుశ హేరోదియ కోరినమీదట హేరోదు యోహానును చెరసాలలో వేయించియుండవచ్చును.
యోహాను నీతిమంతుడని హేరోదు అంతిప ఎరిగి అతని మాటలు సంతోషముతో వినుచుండెను. అందువలన యోహానును ఏమిచేయవలెనో నిర్ణయించుకోలేని స్థితిలో ఉండెను. మరోవైపు, హేరోదియ యోహానును ద్వేషించి అతనిని చంపించగోరెను. తుదకు ఆమె ఎదురుచూచుచున్న అవకాశము వచ్చింది.
సా.శ. 32లో పస్కాపండుగకు కొద్దిరోజులముందు హేరోదు తన జన్మదినోత్సవమునకు ఘనమైన ఏర్పాట్లుచేసెను. అచ్చటికి సమకూడిన వారిలో హేరోదుయొక్క సహస్రాధిపతులు, ప్రధానులు, గలిలయ దేశప్రముఖులు ఉన్నారు. సాయంకాలమున హేరోదియ తన మొదటి భర్తయైన ఫిలిప్పు వలన పుట్టిన కుమార్తెయగు సలోమి అను చిన్నది, అతిథులకొరకు నాట్యమాడుటకు లోపలికి పంపబడినది. నిస్సందేహముగా అమిత మోహముతో కూడిన ఆమె నాట్యప్రదర్శనకు పురుషులు దాసోహమైరి.
హేరోదు సలోమి విషయమై మిక్కిలి సంతోషించెను. “నీ కిష్టమైనది ఏదైనను నన్నడుగుము, నేను నీ కిచ్చెదను,” అని అతడు అన్నాడు. ఇంకా అతడిట్లు ఒట్టుపెట్టుకున్నాడు: “నీవు నా రాజ్యములో సగముమట్టుకు ఏమి అడిగినను నీ కిచ్చెదను.”
బదులిచ్చుటకుముందు, తనతల్లితో సంప్రదించుటకు సలోమి వెళ్లింది. “నేను ఏమి అడగాలి?” అని ఆమె ప్రశ్నించింది.
చివరికి అవకాశం లభించింది! “బాప్తిస్మమిచ్చు యోహాను తల అడుగు” అని హేరోదియ నిస్సంకోచముగా సమాధానమిచ్చింది.
వెంటనే సలోమి హేరోదునొద్దకు తిరిగివచ్చి యిట్లు కోరింది: “బాప్తిస్మమిచ్చు యోహాను తల పళ్లెములోపెట్టి యిప్పుడే నాకిప్పింపగోరుచున్నాను.”
హేరోదు బహుగా దుఃఖించెను. కాని తనతో కూర్చుండియున్నవారు తన ఒట్టును వినినందున అది ఒక నీతిమంతుని హత్యచేయుట అయినప్పటికిని ఇయ్యను అని చెప్పనొల్లకపోయెను. వెంటనే ఒక తలారి అతని భయంకర ఆజ్ఞను పురస్కరించుకొని చెరసాలకు పంపబడెను. త్వరలోనే అతడు యోహాను తలగల పళ్లెముతో తిరిగివచ్చి దానిని సలోమికి యిచ్చెను. ఆమె దానిని తన తల్లియొద్దకు తీసుకొనిపోయెను. యోహాను శిష్యులు జరిగిన దానిని వినినప్పుడు, వారువచ్చి ఆయన శరీరమును తీసుకొనిపోయి పాతిపెట్టి, ఆ విషయమును యేసునకు తెలియజేసారు.
అటుపిమ్మట, యేసు ప్రజలను స్వస్థపరచుచు, దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని హేరోదు వినినప్పుడు, నిజముగా యేసు మృతులలోనుండి లేచిన యోహానేయని మిగుల భయపడెను. అటుతరువాత అతడు ఆయన బోధ వినుటకుకాదుగాని అతని భయము సరియైనదాకాదా అని నిశ్చయపర్చుకొనుటకు యేసును మిక్కిలి చూడగోరెను. మత్తయి 10:1-5; 11:1; 14:1-12; మార్కు 6:14-29; లూకా 9:7-9.
◆ యోహాను ఎందుకు చెరసాలలో ఉండెను, హేరోదు అతనిని ఎందుకు చంపగోరలేదు?
◆ చివరికి హేరోదియ యోహానును ఎలా చంపించగల్గింది?
◆ యోహాను మరణము తరువాత, హేరోదు ఎందుకు యేసును చూడగోరెను? (w87 8/15)
[9వ పేజీలో పూర్తిపేజీ చిత్రం ఉంది]