Mary_Ukraine/stock.adobe.com
అప్రమత్తంగా ఉండండి!
రాజకీయ నాయకుల మీద ప్రజల నమ్మకం తగ్గుతుంది—బైబిలు ఏం చెప్తుంది?
2024 సంవత్సరంలో ఎన్నికలు ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో జరగబోతున్నాయి. కానీ చాలామందికి రాజకీయ నాయకుల మీద నమ్మకం తగ్గుతుంది.
అమెరికాలో జరిగిన ఒక సర్వేలో చాలామంది ఏమన్నారంటే, రాజకీయ నాయకులు ‘ప్రజలకు మంచి చేయడం గురించి కాదు గానీ సొంత లాభాల గురించి ఆలోచిస్తున్నారు.’a—ప్యూ రిసెర్చ్ సెంటర్, సెప్టెంబరు 19, 2023.
చాలామంది యౌవనస్థులు కూడా రాజకీయ నాయకుల్ని నమ్మట్లేదు.
“సాధారణంగా, ఈరోజుల్లో టీనేజర్లు సమస్యలకు పరిష్కారం గురించే ఆలోచిస్తున్నారు, కానీ వాళ్లు కోరుకున్న పరిష్కారాలు రాజకీయ నాయకులు ఇవ్వట్లేదని సర్వేలు” కోడై కూస్తున్నాయి.—ది న్యూయార్క్ టైమ్స్, జనవరి 29, 2024.
“ఒక సర్వే ప్రకారం, యౌవనస్థులు యూటూబర్లను నమ్మినంతగా రాజకీయ నాయకుల్ని నమ్మట్లేదు.”—ది కొరియా టైమ్స్, జనవరి 22, 2024.
మంచి భవిష్యత్తు కోసం రాజకీయ నాయకుల మీద ఆశ పెట్టుకోవచ్చా? మనం ఎవర్ని నమ్మొచ్చు?
ఎవర్ని నమ్ముతున్నారో జాగ్రత్తగా చూసుకోండి
ఎవర్ని నమ్ముతున్నారో చూసుకోవడం ప్రజలకే మంచిది. “అనుభవం లేనివాడు ప్రతీ మాట నమ్ముతాడు, వివేకం గలవాడు ఆచితూచి అడుగులు వేస్తాడు” అని బైబిలు చెప్తుంది.—సామె. 14:15.
ఏది అబద్ధమో, ఏది నిజమో ఎలా తెలుసుకోవచ్చు? ఈ వీడియో చూడండి “గాలి వార్తలా? వాస్తవాలా?”
నిజమే, నిజాయితీగా ప్రజలకు మంచి చేయాలనుకునే రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. కానీ వాళ్లు ప్రజలకు చేయాలనుకున్నవన్నీ చేయలేకపోవచ్చు. అందుకే బైబిలు ఈ జాగ్రత్త చెప్తుంది:
“మానవ నాయకుల మీద నమ్మకం పెట్టుకోకండి; వాళ్లు మిమ్మల్ని కాపాడలేరు.”—కీర్త. 146:3, గుడ్ న్యూస్ ట్రాన్స్లేషన్.
ఈ నాయకుని మీద మీరు నమ్మకం పెట్టుకోవచ్చు
చాలా సమర్థుడైన, నమ్మకస్థుడైన నాయకున్ని దేవుడు ఎన్నుకున్నాడని బైబిలు చెప్తుంది. ఆయనే యేసు క్రీస్తు. (లూకా 1:32, 33) పరలోకం నుండి పరిపాలించే ప్రభుత్వానికి అంటే దేవుని రాజ్యానికి రాజు యేసు.—మత్త. 6:10.
యేసు మీద మీరు ఎందుకు నమ్మకం పెట్టుకోవచ్చో, మన కష్టాల్ని ఆయన ఎలా తీరుస్తాడో తెలుసుకోండి. ఈ ఆర్టికల్స్ చదవండి “దేవుని రాజ్యానికి రాజు ఎవరు?” అలాగే “దేవుని రాజ్యం ఏమి సాధిస్తుంది?”
a ప్యూ రిసెర్చ్ సెంటర్, “అమెరికన్స్ డిస్మిసల్ వ్యూస్ ఆఫ్ ది నేషన్స్ పాలిటిక్స్,” సెప్టెంబరు 2023.