పరిపాలక సభ నుండి ఉత్తరం
ప్రియమైన సహోదరసహోదరీల్లారా,
“విశ్వాసముతోకూడిన మీ పనిని, ప్రేమతోకూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతోకూడిన మీ ఓర్పును, మేము మన తండ్రియైన దేవుని యెదుట మానక జ్ఞాపకము చేసికొనుచు, మా ప్రార్థనలయందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.” (1 థెస్స. 1:2, 3) ఆ మాటలు మీ పై మాకున్న ప్రేమను చాలా చక్కగా వర్ణిస్తున్నాయి! మిమ్మల్ని బట్టి, మీరు చేస్తున్న పనిని బట్టి మేము యెహోవాకు కృతజ్ఞతలు చెప్తున్నాం. ఎందుకు?
గత సంవత్సరమంతా మీరు ‘విశ్వాసంతో పనిచేసి, ప్రేమతో ప్రయాస పడి’ రాజ్య సంబంధమైన పనుల్లో తీరిక లేకుండా ఉన్నారు. మీలో చాలామంది మీ పరిచర్యను పెంచుకునే మార్గాలను వెతికారు. మీలో కొంతమంది రాజ్య సువార్తికుల అవసరం ఉన్న ప్రాంతాలకు, కొందరైతే వేరే దేశాలకు వెళ్లారు. ఇంకొంతమంది బహిరంగ సాక్ష్యంలో పాల్గొంటూ ఇంకా ఎక్కువ పరిచర్య చేశారు. జ్ఞాపకార్థ ఆచరణ సమయంలో, ప్రాంతీయ పర్యవేక్షకుని సందర్శనం ఉన్న నెలలో, 2014 ఆగస్టు నెల ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో మీలో చాలామంది సహాయ పయినీరు సేవచేయడానికి ముందుకొచ్చారు. మీలో ఒక్కొక్కరి పరిస్థితులు ఒక్కోలా ఉన్నా, మీరు యెహోవాను మనస్ఫూర్తిగా సేవిస్తున్నారు. అందుకు మేం మిమ్మల్ని మెచ్చుకుంటున్నాం. (కొలొ. 3:23, 24) నిజానికి మేము యెహోవాకు కృతజ్ఞత చెప్పడానికి ఒక కారణం, మీరు ‘విశ్వాసంతో చేసిన పనులే.’
ప్రపంచవ్యాప్తంగా మన సంస్థకు సంబంధించిన వేర్వేరు నిర్మాణ పనుల విషయంలో “ప్రేమతో కూడిన మీ ప్రయాసమును” కూడా మేమెంతో మెచ్చుకుంటున్నాం. యెహోవా ప్రజల సంఖ్య అంతకంతకూ ఎక్కువవుతోంది కాబట్టి, ఆ భవన నిర్మాణాలు మాకు ఇప్పుడు అత్యవసరం. (యెష. 60:22) ఒక్కసారి ఆలోచించండి, గత సంవత్సరం అత్యధికంగా రిపోర్టు అయిన ప్రచారకుల సంఖ్య 82,01,545. సగటున ప్రతీనెల 94,99,933 బైబిలు అధ్యయనాలు జరిగాయి. ఈ పెరుగుదల వల్ల చాలాచోట్ల బ్రాంచి భవనాలను పెంచాల్సి ఉంది లేదా వాటికి మార్పులు చేయాల్సి ఉంది. అంతేకాదు, మనకు ఇంకా ఎక్కువ రాజ్యమందిరాలు కావాలి! దానితోపాటు మన అనువాదకులు తమ భాష మాట్లాడే ప్రాంతంలో నివసిస్తూ అక్కడ పనిచేయడానికి, చాలా ప్రాంతాల్లో అనువాద కార్యాలయాల అవసరం కూడా ఉంది.
కాబట్టి, మనల్ని మనం ఇలా ప్రశ్నించుకుందాం, ‘ఈ నిర్మాణ పనుల్లో సాయం చేయడానికి నేనేమి చేయవచ్చు?’ మనలో కొంతమందికి ఈ నిర్మాణ పనుల్లో పాల్గొనడం వీలవుతుంది. ఈ పనులు చేసే నైపుణ్యాలు మనకున్నా లేకపోయినా మన దగ్గరున్న విలువైన వాటిని ఈ ముఖ్యమైన ప్రాజెక్టుల కోసం విరాళంగా ఇచ్చే గొప్ప అవకాశం మనందరికీ ఉంది. (సామె. 3:9, 10) మందిర గుడారం నిర్మిస్తున్న సమయంలో ఇశ్రాయేలీయులు ఎంతగా ముందుకు వచ్చారంటే, ‘మీరు ఇంకేమీ తీసుకురావద్దు’ అని ప్రకటన చేయాల్సి వచ్చింది. (నిర్గ. 36:5-7) బైబిల్లోని ఆ ఉదాహరణలు తప్పకుండా మన హృదయాల్ని తాకి మనల్ని కదిలింపచేస్తాయి. ఈ ముఖ్యమైన పనులు చేస్తూ పవిత్రసేవలో “ప్రేమతో” మీరు పడుతున్న “ప్రయాసము,” మేము యెహోవాకు కృతజ్ఞతలు చెప్పడానికి మరో కారణం.
మేము ఆనందించడానికి గల ప్రత్యేక కారణం మన సహోదరులు సహనం చూపిస్తూ స్థిరంగా ఉండడం. ఉదాహరణకు, దక్షిణ కొరియాలోని మన ప్రియమైన సహోదరుల గురించి చూడండి. 1950 నుండి ఆ దేశంలో మన యువ సహోదరుల్ని సైనిక సేవలో చేరనందుకు జైలుకు పంపిస్తున్నారు. వాళ్లు కొంతకాలం జైల్లోనే గడపాల్సి వస్తుంది. అలా తరతరాలుగా కొనసాగుతున్నా మన సహోదరులు ఈ పరీక్షల్ని విశ్వాసంతో స్థిరంగా సహిస్తున్నారు. వాళ్లు చూపిస్తున్న సహనం మా విశ్వాసాన్ని బలపరుస్తుంది!
ఎరిట్రియాలో మన సహోదరులు ముగ్గురు 20 కన్నా ఎక్కువ సంవత్సరాలు జైల్లో ఉన్నారు. మిగతావాళ్లు అంతకన్నా తక్కువ కాలంపాటు జైల్లో ఉన్నారు. వాళ్లలో సహోదరీలు, వాళ్ల పిల్లలు కూడా ఉన్నారు. వాళ్లను విడిపించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రస్తుతానికి ఏ ఫలితాలు రాలేదు. మన సహోదరులు మాత్రం రాజీపడలేదు. ఘోరమైన పరిస్థితుల్లో కూడా వాళ్లు యెహోవా పట్ల యథార్థంగా ఉన్నారు. ఈ నమ్మకమైన సహోదరులను ఎప్పుడూ మా ప్రార్థనల్లో గుర్తు చేసుకుంటున్నాం.—రోమా. 1:8, 9.
మన నమ్మకాల వల్ల మీలో చాలామంది జైలుకు వెళ్లి ఉండకపోవచ్చు. కానీ వృద్ధాప్యాన్ని, తీవ్ర అనారోగ్య సమస్యలను, సత్యంలో లేని భర్త/భార్య లేదా కుటుంబ సభ్యుల వ్యతిరేకతను, ఇతర వ్యక్తిగత సమస్యలను ఎదుర్కొంటున్నారు. అవి బహుశా మీకు మాత్రమే తెలుసు. అయినా, మీరు యెహోవా సేవలో నమ్మకంగా కొనసాగుతున్నారు. (యాకో. 1:12) అందుకు మిమ్మల్ని మెచ్చుకుంటున్నాం. మేము యెహోవాకు కృతజ్ఞతలు చెప్పడానికి ఇంకొక కారణం విశ్వాసంతో మీరు చూపిస్తున్న సహనం.
“యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి” అని మేము చెప్పడానికి విశ్వాసంతో మీరు చేస్తున్న పనులు, ప్రేమతో మీరు పడుతున్న ప్రయాస, మీ సహనమే మంచి కారణాలు. (కీర్త. 106:1) మేము మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాం. తన సేవలో మీరు నిరంతరం కొనసాగేలా మిమ్మల్ని బలపర్చి, కాపాడి, ఆశీర్వదించమని యెహోవాకు ప్రార్థిస్తున్నాం.
మీ సహోదరులు,
యెహోవాసాక్షుల పరిపాలక సభ