పరిపాలక సభ నుండి ఉత్తరం
ప్రియమైన తోటి యెహోవాసాక్షులకు,
నేడు 70 లక్షలకు పైగావున్న నమ్మకమైన యెహోవా సేవకులైన మీకు ఈ ఉత్తరాన్ని రాయడం చాలా సంతోషంగా ఉంది. వేరే దేశం నుండి వచ్చిన తోటి విశ్వాసులను కలిసినప్పుడు, వాళ్లతో ఏదో ప్రత్యేకమైన అనుబంధం ఉన్నట్లు మనకు అనిపిస్తుంది. (యోహా. 13:34, 35) వివిధ దేశాల్లోని మీ సహోదరసహోదరీల విశ్వాసం, యథార్థత గురించిన ఆసక్తికరమైన అనుభవాలను మన ప్రచురణల్లో చదివినప్పుడు కూడా మీకు అలాగే అనిపిస్తుంది.
ప్రపంచ నలుమూలల నుండి వస్తున్న నివేదికలను చూస్తే, మీలో చాలామంది ప్రతీవారం కుటుంబ ఆరాధన చేస్తున్నారని అర్థమౌతోంది. మీలో చిన్నపిల్లలున్న తల్లిదండ్రులు కుటుంబ ఆరాధన పిల్లలకు ఆహ్లాదకరంగా ఉండేలా చేయడానికి కొత్తకొత్త పద్ధతులు ఉపయోగిస్తున్నారు. (ఎఫె. 6:4) భార్యాభర్తలు కలిసి అధ్యయనం చేయడంవల్ల వాళ్ల వైవాహిక బంధం మరింత బలపడుతోంది. (ఎఫె. 5:28-33) నిజానికి, దేవుని వాక్యాన్ని లోతుగా అధ్యయనం చేసే ఈ ఏర్పాటువల్ల ఆయా వ్యక్తులతో పాటు కుటుంబాలు కూడా ప్రయోజనం పొందుతున్నాయి.—యెహో. 1:8, 9.
ఇటీవల సంభవించిన ప్రకృతి విపత్తులవల్ల మీలో కొందరు ఎన్నో రకాలుగా నష్టపోవడం మాకెంతో బాధ కలిగిస్తోంది. అలాంటి సమయాల్లో సహాయం చేయడానికి చాలామంది వెంటనే ముందుకొచ్చారు. వాళ్లందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. (అపొ. 11:28-30; గల. 6:9, 10) అంతేకాదు, మీలో కొందరు సంఘంలో తోటి సహోదరుల అవసరాల్ని గుర్తించి, వాళ్లకు సహాయం చేయడానికి చొరవ తీసుకుంటున్నారు. మొదటి శతాబ్దంలోని దొర్కాలాగే మీరు “సత్క్రియలను, ధర్మకార్యములను” ఎక్కువగా చేస్తున్నారు. (అపొ. 9:36) ఇదంతా యెహోవా చూస్తున్నాడనే, తప్పకుండా తగిన ప్రతిఫలమిస్తాడనే నమ్మకంతో ఉండండి.—మత్త. 6:3, 4.
కొన్ని దేశాల్లో, ‘కట్టడ వల్ల కీడు కల్పించాలనే’ ఉద్దేశంతో కొందరు చట్టాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటూ మీ హక్కుల్ని కాలరాస్తున్నారు. (కీర్త. 94:20-22) అలాంటి హింస గురించి యేసు ముందుగానే చెప్పాడని గుర్తించి, మీరు యెహోవాను ఆశ్రయిస్తూ ధైర్యంగా దాన్ని సహిస్తున్నారు. (యోహా. 15:19, 20) ‘మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువు అడిగే ప్రతివానికి సమాధానం చెబుతున్న’ మీకోసం మేము రోజూ ప్రార్థిస్తున్నామని గుర్తుంచుకోండి.—1 పేతు. 3:13-15.
అనైతికతను వ్యాప్తి చేయడానికి సాతాను మోసపూరితమైన పద్ధతుల్ని ఉపయోగించి పట్టువిడువకుండా ప్రయత్నిస్తున్నా మీలో లక్షలాదిమంది సంవత్సరాలుగా నైతిక పరిశుభ్రతను కాపాడుకుంటున్నారు. అందుకు మిమ్మల్ని హృదయపూర్వకంగా మెచ్చుకుంటున్నాం. లోకంలోని నైతిక విలువలు అంతకంతకూ దిగజారుతున్నా, మీరు మాత్రం ‘ప్రభువు మహాశక్తినిబట్టి ఆయనయందు బలం’ పొందుతున్నారు. (ఎఫె. 6:10) మీరు ‘దేవుడు ఇచ్చిన సర్వాంగకవచాన్ని’ ధరించుకోవడం వల్ల ‘అపవాది తంత్రాలను ఎదిరించి’ దృఢంగా నిలబడుతున్నారు. (ఎఫె. 6:11, 12) మీ మంచి మాదిరిని చూపిస్తూ యెహోవా, తనను నిందించే సాతానుకు తిరుగులేని జవాబిస్తున్నాడని గుర్తుంచుకోండి.—సామె. 27:11.
2011లో, యేసు మరణ జ్ఞాపకార్థ ఆచరణకు 1,93,74,737 మంది హాజరయ్యారని తెలుసుకొని మేమెంతో సంతోషించాం. గత ఏప్రిల్‌లో సహాయ పయినీర్ల కోసం ఇచ్చిన పిలుపుకు మీలో చాలామంది చక్కగా స్పందించడం కొంతమేరకు దానికి దోహదం చేసింది. అలా, యెహోవా దేవుని యథార్థ సాక్షులు ఆయనను ముక్తకంఠంతో స్తుతించడాన్ని కోట్లాదిమంది వినగలిగారు. (రోమా. 10:18) మీరు ఆ నెలలో సహాయ పయినీరు సేవ చేసిన 26,57,377 మందిలో ఒకరైనా లేదా ఏదోవిధంగా ఎక్కువ సేవ చేయడానికి కృషి చేసినవారైనా మీరందరూ ఇష్టపూర్వకంగా ముందుకొచ్చి, ఆసక్తిగా సేవ చేసి మమ్మల్నెంతో ఆనందింపజేశారు.—కీర్త. 110:3; కొలొ. 3:23.
గత సంవత్సరం 2,63,131 మంది యెహోవాకు తాము చేసుకున్న సమర్పణకు గుర్తుగా బాప్తిస్మం తీసుకున్నారు. అందుకు మేము యెహోవాకు కృతజ్ఞతలు చెబుతున్నాం. మీరు మాతో కలిసి, “రమ్ము . . . వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పిగొనిన వానిని రానిమ్ము, ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము” అనే ఆహ్వానాన్ని ఇతరులకు ఇస్తున్నందుకు మీకు కూడా కృతజ్ఞతలు చెబుతున్నాం. (ప్రక. 22:17) దేవుని రాజ్యానికి సంబంధించిన అనేక కోణాలను 2011 జిల్లా సమావేశంలో పరిశీలించిన తర్వాత “దేవుని రాజ్యం వచ్చుగాక!” అని నిండుమనసుతో చెబుతున్నాం. “త్వరగా వచ్చుచున్నాను” అని యేసు ఇచ్చిన హామీ వల్ల ఉత్తేజితులమై, యోహానులాగే మనమూ “ఆమేన్. ప్రభువైన యేసూ, రమ్ము” అని హృదయపూర్వకంగా అంటాం.—ప్రక. 22:20.
ప్రియమైన సహోదరసహోదరీలారా, పులకరింపజేసే ఆ రోజు కోసం మీరు ఎదురుచూస్తుండగా “క్రియతోను, సత్యముతోను” యెహోవాను ప్రేమిస్తున్న మీలో ప్రతీ ఒక్కరిని మేము ప్రేమిస్తున్నామనే నమ్మకంతో ఉండండి.—1 యోహా. 3:18.
మీ సహోదరులు,
యెహోవాసాక్షుల పరిపాలక సభ