అధ్యయన ఆర్టికల్ 45
పాట 111 మన సంతోషానికి కారణాలు
ఇతరుల్ని చూసుకునేవాళ్లు సంతోషంగా ఎలా ఉండొచ్చు?
“ఏడుస్తూ విత్తనాలు చల్లేవాళ్లు సంతోషంతో కేకలు వేస్తూ పంట కోస్తారు.”—కీర్త. 126:5.
ముఖ్యాంశం
ఇతరుల్ని చూసుకునేవాళ్లకు ఏ ఇబ్బందులు ఉంటాయి? వాళ్లు తమ సంతోషాన్ని ఎలా కాపాడుకోవచ్చు?
1-2. ఇతరుల్ని చూసుకునేవాళ్ల గురించి యెహోవాకు ఏమనిపిస్తుంది? (సామెతలు 19:17) (చిత్రాలు కూడా చూడండి.)
కొరియాలో ఉంటున్న జిన్ అనే బ్రదర్ ఇలా అంటున్నాడు: “నాకు, నా భార్యకు పెళ్లయి 32 ఏళ్లు దాటాయి. అయితే ఐదేళ్ల క్రితం, ఆమెకు ఒక పెద్ద జబ్బు వచ్చింది. దానివల్ల ఆమెకు కదలడం కూడా కష్టమే. కాబట్టి నేనే ఆమెను దగ్గరుండి చూసుకుంటున్నాను. నా భార్య అంటే నాకు ఇష్టం కాబట్టి ఆమెను చూసుకోవడం నాకు కష్టం కాదు. రోజూ రాత్రి ఆమె పేషెంట్ బెడ్ మీద పడుకుంటుంది. నేను ఆమె పక్కనే మంచం వేసుకుని పడుకుంటాను. మేము ఇద్దరం చేతులు పట్టుకుని పడుకుంటాం.”
2 మీకు ఇష్టమైనవాళ్లను అంటే మీ అమ్మానాన్నల్ని; భర్తను లేదా భార్యను; పిల్లల్ని లేదా ఎవరైనా ఫ్రెండ్‌ని మీరు చూసుకుంటున్నారా? మీ సమాధానం అవును అయితే, మీకు ఇష్టమైనవాళ్లను దగ్గరుండి చూసుకునే అవకాశం దొరికినందుకు మీకు చాలా తృప్తిగా అనిపించవచ్చు. ఇష్టమైనవాళ్లను అలా దగ్గరుండి చూసుకుంటున్నారంటేనే మీకు యెహోవా మీద భక్తి ఉందని అర్థమౌతుంది. (1 తిమో. 5:4, 8; యాకో. 1:27) కొన్నిసార్లు, మీరు పడుతున్న కష్టం వేరేవాళ్లకు అస్సలు తెలియకపోవచ్చు. అప్పుడప్పుడు కష్టాలన్నీ మీ ఒక్కరికే ఉన్నట్టు అనిపించవచ్చు. బహుశా బయటికి మీరు నవ్వుతూ ఉన్నా, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం మీ కన్నీళ్లు కట్టలు తెంచుకోవచ్చు. (కీర్త. 6:6) అయితే, బయటివాళ్లకు మీ కష్టాలు కనిపించినా, కనిపించకపోయినా యెహోవా మాత్రం దాన్ని తప్పకుండా చూస్తాడు. (నిర్గమకాండం 3:7 తో పోల్చండి.) ఆయన మీ కన్నీళ్లను, త్యాగాలను చాలా విలువైనవిగా చూస్తాడు. (కీర్త. 56:8; 126:5) మీకు ఇష్టమైనవాళ్లకు సహాయం చేయడం కోసం మీరు చేసే ప్రతీ చిన్న పనిని ఆయన చూస్తాడు. ఆయన మీకు అప్పు ఉన్నట్టు ఫీలౌతున్నాడు. ఆయన దాన్ని ఖచ్చితంగా తీరుస్తానని కూడా మాటిస్తున్నాడు.—సామెతలు 19:17 చదవండి.
మీరు మీకిష్టమైనవాళ్లను చూసుకుంటున్నారా? (2వ పేరా చూడండి)
3. తెరహును చూసుకుంటున్నప్పుడు అబ్రాహాముకు, శారాకు ఎంత కష్టమై ఉంటుంది?
3 ఇష్టమైనవాళ్ల అవసరాలు చూసుకున్న చాలామంది స్త్రీ-పురుషుల గురించి బైబిలు చెప్తుంది. ఉదాహరణకు అబ్రాహాము, శారా గురించే తీసుకోండి. వాళ్లు ఊరును విడిచి వెళ్తున్నప్పుడు, అబ్రాహాము వాళ్ల నాన్న తెరహుకు దాదాపు 200 ఏళ్లు. అయినా అతను వాళ్లతో కలిసి వెళ్లాడు. వాళ్లు హారానుకు వెళ్లడానికి ఇంచుమించు 960 కిలోమీటర్లు ప్రయాణించాలి. (ఆది. 11:31, 32) అబ్రాహాముకు, శారాకు తెరహు అంటే ఇష్టమే. కానీ అతన్ని చూసుకోవడం ముఖ్యంగా ఇలా ప్రయాణాలు చేస్తున్నప్పుడు అతన్ని చూసుకోవడం ఎంత కష్టమై ఉంటుందో ఆలోచించండి. వాళ్లు ఎక్కువ శాతం ఒంటెలు, గాడిదల మీదే ప్రయాణించి ఉంటారు. కాబట్టి ఆ ప్రయాణం వల్ల వయసైపోయిన తెరహు ఒళ్లు హూనమైపోయి ఉంటుంది, అతనితో పాటు వచ్చిన వాళ్లందరూ కూడా బాగా అలసిపోయి ఉంటారు. వాళ్లకు ఒక్క బొట్టు శక్తి కూడా ఉండి ఉండదు. కానీ యెహోవా వాళ్లకు కావాల్సిన శక్తిని ఇచ్చాడు. యెహోవా అబ్రాహాము, శారాకు బలాన్ని ఇచ్చినట్టే మీకు కూడా ఇస్తాడు.—కీర్త. 55:22.
4. మనం ఈ ఆర్టికల్‌లో ఏం చూస్తాం?
4 ఇతరుల్ని చూసుకునేవాళ్లు ఆ పనిని ఓపిగ్గా చేయాలంటే, వాళ్లకు సంతోషం అనే లక్షణం ఉండాలి. (సామె. 15:13) సంతోషంగా ఉండే వ్యక్తి, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా తన చిరునవ్వును మాత్రం చెదరనివ్వడు. (యాకో. 1:2, 3) మరి, మనం అలాంటి సంతోషాన్ని ఎలా పెంచుకోవచ్చు? ఒక విధానం ఏంటంటే, యెహోవా మీద ఆధారపడడం. మనం ప్రార్థనలో మంచిగా ఆలోచించేలా సహాయం చేయమని యెహోవాను అడగవచ్చు. అయితే, వాళ్లు తమ సంతోషాన్ని కాపాడుకోవడానికి ఇంకా ఏయే పనులు చేయవచ్చో ఈ ఆర్టికల్‌లో చూస్తాం. అలాగే ఇతరులు వాళ్లకు ఎలా సహాయం చేయవచ్చో కూడా చూస్తాం. ముందుగా, ఇతరుల్ని చూసుకునేవాళ్లు ఎందుకు తమ సంతోషాన్ని కాపాడుకోవాలో, వాళ్ల సంతోషాన్ని చెరిపేసే ఏయే ఇబ్బందులు ఉంటాయో చూద్దాం.
ఇతరుల్ని చూసుకునేవాళ్లకు సంతోషంగా ఉండడం ఎందుకు కష్టం?
5. ఇతరుల్ని చూసుకునేవాళ్లు ఎందుకు తమ సంతోషాన్ని కాపాడుకోవాలి?
5 ఇతరుల్ని చూసుకునేవాళ్లు తమ సంతోషాన్ని కోల్పోతే, వాళ్లు త్వరగా అలసిపోతారు. (సామె. 24:10) అలాంటప్పుడు వాళ్లు ఊరికే చిరాకుపడిపోతారు, ఇతరుల్ని సరిగ్గా చూసుకోలేకపోవచ్చు. ఇంతకీ ఇతరుల్ని చూసుకునేవాళ్లు ఏ ఇబ్బందుల వల్ల తమ సంతోషాన్ని కోల్పోతారు?
6. ఇతరుల్ని చూసుకునే కొంతమంది ఎందుకు విపరీతంగా అలసిపోతారు?
6 వాళ్లు విపరీతంగా అలసిపోతారు. లేయా అనే సిస్టర్ ఇలా అంటుంది: “ఇతరుల్ని చూసుకునేవాళ్లకు చాలా ఒత్తిడి ఉంటుంది. ఒకరోజు ఎంత బాగా గడిచినా సాయంత్రం అయ్యే సరికి, ఇక ఏ పనీ చేసే ఓపిక ఉండదు. కొన్నిసార్లయితే, కనీసం మెసేజ్‌లకు రిప్లై కూడా ఇవ్వబుద్ధి కాదు.” ఇంకొంతమందికి, కంటి నిండా నిద్ర ఉండదు. లేదా అలసట తీర్చుకునే పరిస్థితి కూడా ఉండదు. ఈనా అనే సిస్టర్ ఇలా అంటుంది: “నేను కంటి నిండా నిద్రపోయి చాలా రోజులౌతుంది. మా అత్తగారిని చూసుకోవడానికి నేను రాత్రుళ్లు ప్రతీ రెండు గంటలకు ఓసారి లేస్తుంటాను. నేను, నా భర్త సరదాగా బయటకు వెళ్లి చాలా ఏళ్లు అవుతుంది.” బాగోలేనివాళ్లను చూసుకుంటున్న కొంతమంది, పెళ్లిళ్లకు-పార్టీలకు వెళ్లలేరు లేదా యెహోవా సేవలో నియామకాలు కూడా ఒప్పుకోలేరు. దానివల్ల వాళ్లకు చాలా ఒంటరిగా, పరిస్థితులు వాళ్లను కట్టిపడేసినట్లు అనిపిస్తుంది.
7. ఇతరుల్ని చూసుకునేవాళ్లకు ఎలా అనిపిస్తుంది?
7 వాళ్లు రకరకాల ఫీలింగ్స్‌తో నలిగిపోతూ ఉంటారు. జెస్సికా అనే సిస్టర్ ఇలా అంటుంది: “నాకు చాలా చేయాలనిపిస్తుంది. కానీ అన్నీ చేయలేను. కాసేపు నడుం వాలిస్తే, నేను మా నాన్నను సరిగ్గా చూసుకోవట్లేదేమో, నేను స్వార్థంగా ఆలోచిస్తున్నానేమో అని నాకు చాలా సిగ్గుగా అనిపిస్తుంది.” కొంతమందికైతే, వాళ్ల పరిస్థితి మీద చాలా చిరాకు, కోపం వస్తుంది. అన్నీ వదిలేసి ఎక్కడికైనా పారిపోవాలని అనిపిస్తుంది. ఇంకొంతమంది, తాము ఇష్టపడేవాళ్లను సరిగ్గా చూసుకోవట్లేదేమో అని బాధపడతారు. మరికొంతమంది, చిరాకులో వాళ్లు చూసుకుంటున్నవాళ్లను ఏదోకటి అనేసి, ఆ తర్వాత అనవసరంగా అన్నామే అని బాధపడతారు. (యాకో. 3:2) ఒకప్పుడు ఆరోగ్యంగా, బలంగా ఉన్న వ్యక్తిని ఇప్పుడు ఇలా చూసినప్పుడు కొంతమంది గుండె తరుక్కుపోతుంది. బార్బరా అనే సిస్టర్ ఇలా అంటుంది: “నేను ఇష్టపడే వ్యక్తి ఆరోగ్యం రోజురోజుకు క్షీణించడం చూసి తట్టుకోలేకపోతున్నాను. అదే నాకు అన్నిటికన్నా పెద్ద కష్టం.”
8. ఇతరుల్ని చూసుకునేవాళ్లను మెచ్చుకుంటూ మాట్లాడితే వాళ్లకు ఎలా అనిపిస్తుంది?
8 ఇతరులు తమను లెక్కచేయట్లేదనట్టు వాళ్లకు అనిపిస్తుంది. ఎందుకు? ఎందుకంటే వాళ్ల కష్టాన్ని, వాళ్లు చేస్తున్న త్యాగాల్ని చాలామంది మెచ్చుకోరు, థ్యాంక్యూ చెప్పరు. మనం మాట్లాడే చిన్న మాటైనా వాళ్లకు ఎంతో సంతోషాన్నిస్తుంది. (1 థెస్స. 5:18) మెలిసా అనే సిస్టర్ ఇలా అంటుంది: “కొన్నిసార్లు నేను అలసిపోయి ఏడ్చేసేదాన్ని. కానీ నేను ఎవరినైతే చూసుకుంటున్నానో వాళ్లు, ‘నువ్వు నాకోసం చేస్తున్న దానికి చాలా థాంక్స్’ అని చెప్పినప్పుడు నాకు వంద ఏనుగుల బలం వచ్చినట్టు అనిపిస్తుంది. వాళ్లు చెప్పిన ఆ మాటలు మరుసటి రోజు వాళ్లను సంతోషంగా చూసుకోవడానికి నాకు సహాయం చేస్తాయి.” అహమద్ అనే బ్రదర్ ఇతరులు ఆయనకు థాంక్స్ చెప్పినప్పుడు ఎలా అనిపిస్తుందో చెప్తున్నాడు. తన భార్యవాళ్ల చెల్లి కూతురు వీళ్లతోపాటే ఉంటుంది. ఆ పాపకు ఫిట్స్ ఉన్నాయి. ఆయన ఇలా అంటున్నాడు: “ఆ చిన్నపాప కోసం మేము ఎంత పెద్ద త్యాగాలు చేస్తున్నామో ఆమెకు పూర్తిగా అర్థంకాకపోయినా, ఆమె తన చిట్టిచిట్టి చేతులతో మా కోసం ‘ఐ లవ్ యు’ అని రాసినప్పుడు మా మనసు ఆనందంతో గంతులు వేస్తుంది.”
సంతోషాన్ని ఎలా కాపాడుకోవచ్చు?
9. ఇతరుల్ని చూసుకునేవాళ్లు అణకువను ఎలా చూపించవచ్చు?
9 అణకువగా ఉండండి. (సామె. 11:2) మనకు చాలా చేయాలని ఉన్నా మనకు అన్నీ చేసేంత టైమ్, శక్తి ఉండవు. కాబట్టి మీరు ఏం చేయగలుగుతారో, ఏం చేయలేరో కొన్ని పరిమితులు పెట్టుకోండి. దానికోసం మీరు అప్పుడప్పుడు ‘నో’ అని కూడా చెప్పాల్సి ఉంటుంది. అయినా అది పెద్ద పాపం ఏం కాదు! మీరు అణకువగా ఉంటున్నారు అంతే. ఒకవేళ ఎవరైనా మీకు సహాయం చేయడానికి ముందుకొస్తే, వాళ్ల సహాయాన్ని కాదనకండి. జై అనే బ్రదర్ ఇలా అంటున్నాడు: “మనం ఒకే టైమ్‌లో ఐదు-ఆరు పనులు చేయలేం, కాబట్టి మీ పరిమితుల్ని అర్థం చేసుకోండి. దానికి మించి చేయకుండా ఉంటే మీ సంతోషాన్ని కాపాడుకోవచ్చు.”
10. ఇతరుల్ని చూసుకునేవాళ్లు ఎందుకు లోతైన అవగాహన చూపించాలి? (సామెతలు 19:11)
10 లోతైన అవగాహన చూపించండి. (సామెతలు 19:11 చదవండి.) మీరు లోతైన అవగాహన చూపిస్తే ఇతరులు మీకు కోపం తెప్పించినా, మీరు ప్రశాంతంగా ఉంటారు. లోతైన అవగాహన ఉన్నవాళ్లు ఒకవ్యక్తి ఫలానా విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో ఆలోచిస్తారు. నిజమే, కొన్నిరకాల మొండి జబ్బుల వల్ల కొంతమంది దురుసుగా ప్రవర్తిస్తారు. (ప్రసం. 7:7) ఉదాహరణకు, ఒకవ్యక్తి దయగా, అర్థంచేసుకునేవాడిగా ఉండొచ్చు. కానీ అతనికి ఉన్న జబ్బు వల్ల మొండివాడిగా, వాదించేవాడిగా మారి ఉండవచ్చు. లేదా ప్రతీదానికి వంకలు పెడుతూ, ఓ పట్టాన దేనికీ ఒప్పుకోకపోవచ్చు. మీరు ఏదైనా పెద్ద జబ్బుతో బాధపడుతున్నవాళ్లకు సహాయం చేస్తుంటే, వాళ్ల జబ్బు గురించి తెలుసుకోవడం మీకు కొంచెం సహాయం చేయవచ్చు. మీరు ఆ వ్యక్తి జబ్బు గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే, ఆ వ్యక్తిని అంత ఎక్కువ అర్థంచేసుకోగలుగుతారు. అతనికున్న ఆ అనారోగ్యం వల్లే అతను అలా ప్రవర్తిస్తున్నాడు గానీ నిజానికి ఆ వ్యక్తి అలాంటివాడు కాదని మీకు తెలుస్తుంది.—సామె. 14:29.
11. ఇతరుల్ని చూసుకునేవాళ్లు ప్రతీరోజు ఏ ముఖ్యమైన పనికోసం సమయాన్ని పక్కన పెట్టాలి? (కీర్తన 132:4, 5)
11 యెహోవాతో మీ స్నేహాన్ని పెంచుకోవడానికి టైం తీసుకోండి. కొన్నిసార్లు మీరు ఎక్కువ ప్రాముఖ్యమైన వాటికోసం కొన్ని పనుల్ని పక్కన పెట్టాల్సి రావచ్చు. అలా “ఎక్కువ ప్రాముఖ్యమైన” ఒక విషయం ఏంటంటే, యెహోవాతో మీకున్న స్నేహాన్ని పెంచుకోవడం. (ఫిలి. 1:10) రాజైన దావీదు తన జీవితంలో యెహోవాను ఆరాధించడానికే మొదటిస్థానం ఇచ్చాడు. (కీర్తన 132:4, 5 చదవండి.) అలాగే, మనం కూడా బైబిలు చదవడానికి, ప్రార్థన చేయడానికి రోజులో కొంత టైంని పక్కన పెట్టాలి. ఎలీసా అనే సిస్టర్ ఇలా అంటుంది: “నేను నా సంతోషాన్ని కాపాడుకోవడానికి ప్రార్థన, బైబిలు చదవడం చాలా సహాయం చేశాయి. నేను ఓదార్పునిచ్చే కీర్తనల్ని చదివి ధ్యానించేదాన్ని, నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే అది ప్రార్థన వల్లే. నేను రోజంతా ప్రశాంతంగా ఉండేలా సహాయం చేయమని చాలాసార్లు యెహోవాను అడిగేదాన్ని.”
12. ఇతరుల్ని చూసుకునేవాళ్లు ఎందుకు సమయం తీసుకుని తమ ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోవాలి?
12 మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొంత టైం తీసుకోండి. బిజీగా ఉండేవాళ్లకు, ముఖ్యంగా ఇతరుల్ని చూసుకునేవాళ్లకు మంచి ఆహారం తీసుకోవడం కష్టమౌతుంది. ఎందుకంటే షాపుకు వెళ్లి తాజా కూరగాయలు కొనుక్కోవడానికి గానీ, పౌష్టికాహారం వండుకోవడానికి గానీ వాళ్ల దగ్గర టైం ఉండదు. కానీ మనం మంచి ఆహారం తిన్నప్పుడు, మంచిగా ఎక్సర్‌సైజ్ చేసినప్పుడు మన శరీరం, మనసు బాగుంటాయి. కాబట్టి మీకున్న ఆ కొంచెం టైంలోనే మంచి ఆహారం తీసుకోండి, ఎక్సర్‌సైజ్ చేసేలా చూసుకోండి. (ఎఫె. 5:15, 16) దానికితోడు కంటి నిండా నిద్రపోండి. (ప్రసం. 4:6) నిద్రపోయినప్పుడు మన మెదడులో ఉన్న వ్యర్థాలు పోతాయని పరిశోధనలు చూపిస్తున్నాయి. బ్యానర్ హెల్త్ వాళ్లు ప్రచురించిన, “నిద్రకు, ఒత్తిడికి ఏంటి సంబంధం?” అనే ఇంగ్లీష్ ఆర్టికల్, ‘మనం సరిగ్గా నిద్రపోతే మనకు ఆందోళన తగ్గుతుందని, ఒత్తిడిని కూడా చక్కగా ఎదుర్కొంటాం’ అని చెప్తుంది. అంతేకాదు, సరదాగా సమయం గడపడానికి కూడా చూడండి. (ప్రసం. 8:15) ఇతరుల బాగోగులను చూసుకుంటున్న ఒకామె తన సంతోషాన్ని ఎలా కాపాడుకుంటుందో చెప్తూ ఇలా అంది: “వాతావరణం బాగుంటే, నేను బయటికెళ్లి దాన్ని ఆస్వాదిస్తాను. కనీసం నెలకు ఒక్కసారైనా ఫ్రెండ్‌తో కలిసి సరదాగా సమయం గడిపేలా చూస్తాను.”
13. నవ్వడం ఎందుకు మంచిది? (సామెతలు 17:22)
13 కాస్త సరదాగా ఉండండి. (సామెతలు 17:22 చదవండి; ప్రసం. 3:1, 4) నవ్వు మీ ఒంటికి, మనసుకు మంచి మందు. మీరు ఎవరినైనా చూసుకుంటుంటే, మీరు అనుకున్నది అనుకున్నట్టు ఎప్పుడూ జరగకపోవచ్చని గుర్తుపెట్టుకోండి. చిరాకు తెప్పించే అలాంటి పరిస్థితుల్లో కూడా ఏదైనా నవ్వు తెప్పించే విషయం జరిగిందేమో చూడండి. దాన్నిబట్టి నవ్వుకోండి! అప్పుడు మీకు వాటిని తట్టుకోవడం ఈజీగా ఉంటుంది. అలాగే మీరు ఎవరికైతే సహాయం చేస్తున్నారో, వాళ్లతో కలిసి నవ్వడం ద్వారా మీకు, వాళ్లకు ఉన్న బంధం కూడా పెరుగుతుంది.
14. ఒక మంచి స్నేహితునితో మాట్లాడడం మీకు ఎలా సహాయం చేయవచ్చు?
14 ఒక మంచి స్నేహితునితో మాట్లాడండి. పైన చెప్పినవన్నీ మీరు చేసినా, కొన్ని సందర్భాల్లో మీకు ఇంకా ఊపిరాడనట్లు అనిపించవచ్చు. అలాంటప్పుడు ఒక మంచి స్నేహితునితో మీ మనసులో ఉన్నదంతా చెప్పుకోండి. అప్పుడు మీరు కాస్త ఊపిరి పీల్చుకోగలుగుతారు. అయితే, మీరు చెప్తున్నదాని బట్టి మిమ్మల్ని లెక్కగట్టకుండా లేదా అతిగా స్పందించకుండా ఉండే స్నేహితుడితోనే మాట్లాడండి. (సామె. 17:17) అతను లేదా ఆమె శ్రద్ధగా విన్నప్పుడు, మీకు భరోసా ఇస్తూ నాలుగు మంచి మాటలు చెప్పినప్పుడు మీరు మీ సంతోషాన్ని కాపాడుకోగలుగుతారు.—సామె. 12:25.
15. నిరీక్షణ గురించి ఆలోచించడం మీకెలా సంతోషాన్ని తెస్తుంది?
15 పరదైసులో మీరు ఇద్దరు కలిసి ఏం చేస్తారో ఊహించుకోండి. ఇతరుల్ని చూసుకునే మీ పని తాత్కాలికం అని, అలాగే యెహోవా మనుషుల్ని చేసినప్పుడు ఇచ్చిన పని ఇది కాదని గుర్తుంచుకోండి. (2 కొరిం. 4:16-18) “వాస్తవమైన జీవితం” ముందుముందు రానుంది. (1 తిమో. 6:19) పరదైసులో మీరేం చేస్తారో మీకిష్టమైనవాళ్లతో మాట్లాడుతూ ఉంటే, మీకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. (యెష. 33:24; 65:21) హేథర్ అనే సిస్టర్ ఇలా అంటుంది: “నేను ఎవరికైతే సహాయం చేస్తానో ఆమెతో ఎప్పుడూ ఇలా అంటూ ఉంటాను, ‘మనం పరదైసులో కలిసి బట్టలు కుడదాం, కలిసి పరిగెడదాం, కలిసి బండి నడుపుదాం, చనిపోయి లేసిన మనకిష్టమైన వాళ్లకోసం బ్రెడ్ చేద్దాం, వంట చేద్దాం.’ యెహోవా మాకిచ్చిన నిరీక్షణను బట్టి మేము ఇద్దరం కలిసి ఆయనకు థాంక్స్ చెప్తాం.”
మనం ఎలా సహాయం చేయవచ్చు?
16. మన సంఘంలో ఇతరుల్ని చూసుకుంటున్నవాళ్లకు మనమెలా సహాయం చేయవచ్చు? (చిత్రం కూడా చూడండి.)
16 ఇతరుల్ని చూసుకునేవాళ్లు రెస్ట్ తీసుకునేలా మీరు సహాయం చేయవచ్చు. తమకిష్టమైన వాళ్లను చూసుకుంటున్న వాళ్లు, రెస్ట్ తీసుకునేలా సంఘంలో ఉన్నవాళ్లు సహాయం చేయవచ్చు. దానివల్ల, అలా చూసుకుంటున్న వాళ్లకు కొంచెం ప్రశాంతతను ఇచ్చినవాళ్లమౌతాం, అలాగే వాళ్ల సొంత పనుల్ని కూడా వాళ్లు చూసుకోగలుగుతారు. (గల. 6:2) కొంతమంది ప్రచారకులైతే దీనికోసమే ఒక షెడ్యూల్ వేసుకున్నారు. నటల్యా అనే సిస్టర్ భర్త మంచానికి పరిమితం అయ్యాడు. ఆమె ఇలా అంటుంది: “మా సంఘంలో ఉన్న ఒక బ్రదర్ వారానికి ఒకటి లేదా రెండుసార్లు మా ఆయన్ని చూడ్డానికి వస్తారు. వాళ్లిద్దరు కలిసి ప్రీచింగ్ చేస్తారు, కబుర్లు చెప్పుకుంటారు, సినిమాలు కూడా చూస్తారు. ఇలా కలిసి సమయం గడపడం అంటే మా ఆయనకు చాలా ఇష్టం. ఆ టైంలో నేను కూడా నా సొంత పనులు చూసుకోవడానికి లేదా సరదాగా బయట వాకింగ్‌కు వెళ్లడానికి వీలౌతుంది.” కొన్ని సందర్భాల్లో, మీకు వీలైతే ఏదైనా ఒకరోజు రాత్రి వాళ్ల ఇంట్లోనే నిద్రపోయేలా ప్లాన్ చేసుకోవచ్చు. దానివల్ల వాళ్లను చూసుకుంటున్నవాళ్లు ప్రశాంతంగా పడుకోగలుగుతారు.
మీ సంఘంలో ఇతరుల్ని చూసుకుంటున్నవాళ్లకు మీరెలా సహాయం చేయవచ్చు? (16వ పేరా చూడండి)a
17. ఇతరుల్ని చూసుకునేవాళ్లకు మీటింగ్స్‌లో మనమెలా సహాయం చేయవచ్చు?
17 ఇతరుల్ని చూసుకునేవాళ్లకు మీటింగ్స్‌లో సహాయం చేయండి. తమకు ఇష్టమైనవాళ్ల బాగోగుల్ని చూసుకుంటున్నవాళ్లు ఎప్పుడూ ఆ పని చేస్తూనే ఉండాలి. కాబట్టి మీటింగ్స్‌లో, ప్రాంతీయ సమావేశాల్లో, ప్రాదేశిక సమావేశాల్లో ఎక్కువ శ్రద్ధ పెట్టి వినలేరు. మరి సంఘంలో ఉన్నవాళ్లు ఎలా సహాయం చేయవచ్చు? అలాంటి ఒక మీటింగ్‌లోనో లేదా సమావేశంలో ఒక పూటో మనం బాలేని వ్యక్తి పక్కన కూర్చోవచ్చు. ఒకవేళ బాలేని వ్యక్తి ఇంటికే పరిమితం అయితే, మనం వాళ్ల ఇంటికెళ్లి మీటింగ్‌కు కనెక్ట్ అవ్వవచ్చు. దానివల్ల వాళ్లను చూసుకునేవాళ్లు మీటింగ్ శ్రద్ధగా వినగలుగుతారు లేదా నేరుగా మీటింగ్‌కు వెళ్లగలుగుతారు.
18. ఇతరుల్ని చూసుకునే వాళ్లకోసం ఇంకా ఏం చేయవచ్చు?
18 ఇతరుల్ని చూసుకునేవాళ్లను మెచ్చుకోండి, వాళ్ల కోసం ప్రార్థన చేయండి. ఇతరుల్ని చూసుకునేవాళ్లకు పెద్దలు తరచూ కాపరి సందర్శనాలు చేస్తూ ఉండాలి. (సామె. 27:23) మన పరిస్థితి ఏదైనా, సంఘంలో ఉన్న మనమందరం ఇతరుల్ని చూసుకునేవాళ్లను మెచ్చుకుంటూ ఉండాలి, వాళ్ల భుజం తడుతూ ఉండాలి. అలాగే వాళ్ల సంతోషాన్ని కాపాడుకునేలా సహాయం చేయమని, వాళ్లకు కావాల్సిన బలాన్ని ఇవ్వమని యెహోవాకు ప్రార్థిస్తూ ఉండాలి.—2 కొరిం. 1:11.
19. మనం దేనికోసం ఎదురుచూడొచ్చు?
19 అతి త్వరలో, యెహోవా మన కళ్లలో నుండి కారే ప్రతీ కన్నీటి బొట్టును తుడిచేస్తాడు. అనారోగ్యం, మరణం ఇక ఉండవు. (ప్రక. 21:3, 4) “కుంటివాళ్లు జింకలా గంతులేస్తారు.” (యెష. 35:5, 6) వృద్ధాప్యం, దానివల్ల కలిగిన బాధలు, మనకు ఇష్టమైనవాళ్లను చూసుకోవడం వల్ల కలిగిన బాధలాంటి “పాత సంగతులు గుర్తుకురావు.” (యెష. 65:17) యెహోవా మాటిచ్చిన అద్భుతమైన భవిష్యత్తు కోసం మీరు ఎదురుచూస్తున్నప్పుడు కూడా ఆయన మన చేతిని వదిలిపెట్టడు. మనం శక్తికోసం యెహోవాపై ఆధారపడుతూ ఉంటే “ఓర్పుతో, సంతోషంతో అన్నిటినీ సహించేలా” ఆయన చేస్తాడు.—కొలొ. 1:11.
పాట 155 సదా సంతోషమే
a చిత్రం వివరణ: ఒక పెద్దవయసు సిస్టర్ దగ్గర ఉండడానికి ఇద్దరు యౌవన సిస్టర్స్ వచ్చారు. దానివల్ల ఆమెను చూసుకుంటున్న సిస్టర్ కాసేపు వాకింగ్‌కి వెళ్లగలుగుతుంది.