అధ్యయన ఆర్టికల్ 44
పాట 138 తలనెరుపులో ఉన్న సొగసు
ముసలితనంలో మీ సంతోషాన్ని చెక్కు చెదరనివ్వకండి
‘వాళ్లు ముసలితనంలో ఫలిస్తూ ఉంటారు.’—కీర్త. 92:14.
ముఖ్యాంశం
ముసలివాళ్లు తమ సంతోషాన్ని కాపాడుకోవడం ఎందుకు ప్రాముఖ్యం? వాళ్లు దాన్ని ఎలా చేయవచ్చు?
1-2. ముసలివాళ్లౌతున్న తన సేవకుల్ని యెహోవా ఎలా చూస్తాడు? (కీర్తన 92:12-14; చిత్రం కూడా చూడండి.)
ముసలివాళ్లు అవ్వడం గురించి మనుషులు రకరకాలుగా స్పందిస్తారు. ఉదాహరణకు, దీని గురించి ఆలోచించండి: మీ నిగనిగలాడే నల్లని వెంట్రుకల మధ్య మొదటిసారి ఒక తెల్ల వెంట్రుక రావడం మీకు గుర్తుందా? బహుశా ఎవ్వరూ చూడకముందే మీరు దాన్ని పీకేయడానికి ప్రయత్నించి ఉంటారు. కానీ అలా తెల్ల వెంట్రుకల్ని తీసేసినంత మాత్రాన అవి రాకుండా ఆగవు. ఈ ఉదాహరణ బట్టి, మనుషులు ఎన్ని ప్రయత్నాలు చేసినా వృద్ధాప్యాన్ని తప్పించుకోలేరని అర్థమౌతుంది.
2 అయితే, ముసలివాళ్లౌతున్న తన సేవకుల్ని యెహోవా ఎలా చూస్తాడు? (సామె. 16:31) వాళ్లను అందమైన చెట్లలా చూస్తాడు. (కీర్తన 92:12-14 చదవండి.) ఈ పోలిక సరైనదే. ఎందుకంటే, మామూలుగా చెట్లకు వయసు పెరిగేకొద్దీ, అవి ఆకులతో పచ్చగా తయారై, సువాసన వెదజల్లే పూలతో ముస్తాబై, అందంగా కనిపిస్తాయి. అలాంటి ఒక అందమైన చెట్టే, “జపనీస్ ఫ్లవరింగ్ చెర్రీ.” ఆ చెట్లలో కొన్ని, వెయ్యి కన్నా ఎక్కువ ఏళ్ల నాటివి, అవి చూడడానికి చాలా అందంగా ఉంటాయి. ఆ చెట్లలాగే ముసలివాళ్లౌతున్న తన నమ్మకమైన సేవకులు కూడా యెహోవాకు చాలా అందంగా కనిపిస్తారు. ఆయన తెల్ల వెంట్రుకల్ని కాదుగానీ వాటి వెనక ఉన్న మనిషిని చూస్తాడు. అంతేకాదు వాళ్లకున్న సహనం, విశ్వసనీయత లాంటి అందమైన లక్షణాల్ని చూస్తాడు. ఎన్నో ఏళ్లుగా వాళ్లు చేస్తున్న నమ్మకమైన సేవను యెహోవా అస్సలు మర్చిపోడు.
చెట్లకు వయసు పెరిగేకొద్ది, అవి ఆకులతో పచ్చగా తయారై, సువాసన వెదజల్లే పూలతో ముస్తాబై, ఇంకా అందంగా కనిపిస్తాయి. అలాగే ముసలివాళ్లౌతున్న తన నమ్మకమైన సేవకులు కూడా యెహోవాకు చాలా అందంగా కనిపిస్తారు (2వ పేరా చూడండి)
3. యెహోవా తన ఇష్టాన్ని నెరవేర్చడానికి ముసలివాళ్లను ఉపయోగించుకున్న కొన్ని సందర్భాలను చెప్పండి.
3 ఒక వ్యక్తికి వయసు పైబడినంత మాత్రాన యెహోవా దృష్టిలో అతని విలువ తగ్గిపోదు.a నిజానికి యెహోవా తన ఇష్టాన్ని నెరవేర్చడానికి చాలాసార్లు ముసలివాళ్లను ఉపయోగించుకున్నాడు. ఉదాహరణకు, శారా వృద్ధాప్యంలో ఉన్నప్పుడు గొప్ప జనాంగానికి తల్లి అవుతుందని, మెస్సీయకు పూర్వికురాలు అవుతుందని యెహోవా చెప్పాడు. (ఆది. 17:15-19) మోషేకు వయసైపోయినప్పుడు, ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుండి విడిపించే పనిని యెహోవా అప్పగించాడు. (నిర్గ. 7:6, 7) అలాగే అపొస్తలుడైన యోహాను ముసలివాడయ్యాక, బైబిల్లోని ఐదు పుస్తకాల్ని రాసేలా యెహోవా ప్రేరేపించాడు.
4. సామెతలు 15:15 ప్రకారం, వృద్ధాప్యంలో వచ్చే రకరకాల సమస్యల్ని తట్టుకోవడానికి పెద్దవయసు వాళ్లకు ఏం సహాయం చేస్తుంది? (చిత్రం కూడా చూడండి.)
4 వయసు పైబడడం వల్ల ముసలివాళ్లు రకరకాల సమస్యలతో పోరాడతారు. ఒక పెద్దవయసు సిస్టర్ సరదాగా ఇలా అంటుంది: “ముసలివాళ్లు అవ్వడం ఒక సాహసమనే చెప్పుకోవాలి.” అయితే, సంతోషంగాb ఉంటే వయసు పైబడేకొద్దీ వచ్చే ఇబ్బందుల్ని తట్టుకోవడం వృద్ధులకు కాస్త తేలిక అవుతుంది. (సామెతలు 15:15 చదవండి.) అందుకే ఈ ఆర్టికల్‌లో, ముసలివాళ్లు తమ సంతోషాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలో చూస్తాం. అలాగే మన సంఘంలో ఉన్న వృద్ధులకు ఎలా సహాయం చేయాలో చూస్తాం. అయితే ముందుగా, అసలు వృద్ధాప్యంలో సంతోషాన్ని కాపాడుకోవడం ఎందుకు కష్టంగా ఉంటుందో చూద్దాం.
సంతోషంగా ఉంటే, వయసు పైబడేకొద్దీ వచ్చే ఇబ్బందుల్ని తట్టుకోవడం వృద్ధులకు కాస్త తేలిక అవుతుంది (4వ పేరా చూడండి)
మీ సంతోషాన్ని చెరిపేసేవి ఏంటి?
5. మీ సంతోషాన్ని చెరిపేసేవి ఏంటి?
5 మీ సంతోషాన్ని చెరిపేసేవి ఏంటి? బహుశా ఇంతకుముందు చేసినవి ఇప్పుడు చేయలేకపోవడం చూసి మీకు బాధగా అనిపిస్తుండవచ్చు. మీరు మంచి వయసులో ఉన్న ఆ రోజులు మళ్లీ వస్తే బాగుండు అని అనుకుంటుండవచ్చు. (ప్రసం. 7:10) రూబీ అనే సిస్టర్‌కి కూడా కొన్నిసార్లు చాలా బాధగా అనిపించేది. ఆమె ఇలా చెప్తుంది: “నా నొప్పుల వల్ల నేను సరిగ్గా కదల్లేను, బట్టలు వేసుకోవడం కూడా నాకు చాలా కష్టంగా ఉంటుంది. నేను కనీసం సాక్స్ వేసుకోవడానికి నా పాదాన్ని కూడా కదపలేను, నా చేతులంతా తిమ్మిరెక్కేసి ఎక్కడికక్కడ పట్టేయడం వల్ల ఆఖరికి చిన్నచిన్న పనులు చేసుకోవడం కూడా గగనమైపోయింది.” బెతెల్‌లో సేవ చేసిన బ్రదర్ హెరాల్డ్ ఇలా అంటున్నాడు: “నన్ను నేను చూసుకుంటే అసలు నేనేనా అనిపిస్తుంది, నాకు చాలా కోపం వస్తుంది. నేను వయసులో ఉన్నప్పుడు చాలా బలంగా ఉండేవాణ్ణి. టైం దొరికితే చాలు నాకు ఇష్టమైన బేస్‌బాల్ ఆడేవాణ్ణి. ‘హెరాల్డ్ మన టీమ్‌లో ఉంటే గెలుపు మనదే!’ అని వేరేవాళ్లు అంటుండేవాళ్లు. కానీ ఇప్పుడేమో కనీసం బాల్‌ని కూడా వేయలేను అనిపిస్తుంది.”
6. (ఎ) ముసలివాళ్లు డీలా పడిపోవడానికి ఇంకా ఏ కారణాలున్నాయి? (బి) బండి లేదా కారు నడపడం ఆపేయాలా వద్దా అని ఎలా నిర్ణయించుకోవచ్చు? (ఈ పత్రికలో ఉన్న “నేను డ్రైవింగ్ చేయడం ఆపేయాలా?” అనే ఆర్టికల్ చూడండి.)
6 మీరు ఒకరిమీద ఆధారపడాల్సి రావడం వల్ల డీలా పడిపోవచ్చు. ముఖ్యంగా, మిమ్మల్ని ఎవరైనా ఒకరు చూసుకోవాల్సిన పరిస్థితిలో ఉంటే, లేదా మీ పిల్లల్లో ఎవరి దగ్గరైనా మీరు ఉంటుంటే వాళ్లకు భారంగా ఉన్నామేమో అనిపించవచ్చు. బహుశా మీ ఆరోగ్యం క్షీణించడం వల్ల; మీ కంటి చూపు తగ్గిపోవడం వల్ల మీకు నచ్చిన ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లలేకపోవచ్చు లేదా బండి, కారు లాంటివి నడపలేకపోవచ్చు. దానివల్ల మీకు చాలా చికాకుగా అనిపించవచ్చు. కానీ మీ పనులు మీరు చేసుకోవడం వల్లో, ఒంటరిగా ఉండడం వల్లో, కారు నడపడం వల్లో యెహోవా గానీ ఇతరులు గానీ మీకు విలువ కట్టరని గుర్తుంచుకోండి. మీకు ఏమనిపిస్తుందో యెహోవా అర్థం చేసుకోగలడు. ఆయనకు మీరు లోపల ఎలా ఉన్నారు అనేదే ముఖ్యం. మీ మనసు నిండా ఆయన మీద, బ్రదర్స్-సిస్టర్స్ మీద ప్రేమ, కృతజ్ఞత ఉంటే చాలు.—1 సమూ. 16:7.
7. తాము బ్రతికి ఉండగా అంతం రాదేమో అని బాధపడేవాళ్లు దేన్ని గుర్తుపెట్టుకోవచ్చు?
7 బహుశా మీరు బ్రతికి ఉండగా అంతం రాదేమో అని బాధపడుతుండవచ్చు. అప్పుడు మీరు దేని గురించి ఆలోచించవచ్చు? ఈ చెడ్డ లోకాన్ని నాశనం చేయడానికి యెహోవా ఓపిగ్గా ఎదురు చూస్తున్నాడని గుర్తుపెట్టుకోండి. (యెష. 30:18) అయితే, ఆయన ఏ కారణం లేకుండా ఓపిక పట్టట్లేదు. ఆయన ఓపిక చూపించడం వల్ల లక్షలమంది ప్రజలు తన గురించి తెలుసుకుని, తనను ఆరాధించగలుగుతున్నారు. (2 పేతు. 3:9) కాబట్టి మీకెప్పుడైనా బాధగా అనిపిస్తే, యెహోవా ఓపిక పట్టడం వల్ల ఎంతమంది ప్రజలకు మేలు జరుగుతుందో ఆలోచించండి. అలా మేలు పొందిన వాళ్లలో మీ సొంత కుటుంబ సభ్యులు కూడా ఉండే ఉంటారు.
8. వయసు పైబడడం వల్ల ముసలివాళ్లు ఎలా తయారవ్వచ్చు?
8 మన వయసు ఏదైనా, కొన్నిసార్లు మనకు ఆరోగ్యం బాలేనప్పుడు చిరాకులో ఏదోకటి అనేసి, తర్వాత బాధపడతాం. (ప్రసం. 7:7; యాకో. 3:2) ఉదాహరణకు, నమ్మకస్థుడైన యోబు బాధలో ఉన్నప్పుడు, “వెర్రిమాటలు” మాట్లాడాడు. (యోబు 6:1-3) అంతేకాదు, ముసలివాళ్లకు ఉన్న ఏదైనా జబ్బును బట్టి కూడా కొన్నిసార్లు వాళ్లు అనరాని మాటలు అంటుంటారు, లేదా చేయరాని పనులు చేస్తుంటారు. కానీ వాళ్లు అలాంటివాళ్లు కాదని మనకు తెలుసు. నిజమే, మనం మన వయసును లేదా అనారోగ్యాన్ని సాకుగా ఉపయోగించుకుని దురుసుగా మాట్లాడొద్దు లేదా మొండిగా ఉండొద్దు. ఒకవేళ ఎవరితోనైనా మనం దురుసుగా మాట్లాడాం అనిపిస్తే, వెంటనే క్షమాపణ చెప్పడానికి వెనకాడొద్దు.—మత్త. 5:23, 24.
మీ సంతోషాన్ని చెక్కు చెదరకుండా ఎలా చూసుకోవచ్చు?
వృద్ధాప్య సమస్యల్లో కూడా ఎలా సంతోషంగా ఉండొచ్చు? (9-13 పేరాలు చూడండి)
9. మీరు వేరేవాళ్ల సహాయం ఎందుకు తీసుకోవాలి? (చిత్రాలు కూడా చూడండి.)
9 వేరేవాళ్ల సహాయం తీసుకోండి. (గల. 6:2) మొదట్లో, అది మీకు కొంచెం కష్టంగా అనిపించవచ్చు. ఎందుకంటే, గ్రేటల్ అనే సిస్టర్ ఇలా చెప్తుంది: “నాకు వేరేవాళ్ల సహాయం తీసుకోవడం ఇష్టం ఉండదు. ఎందుకంటే, నేను వాళ్లకు భారం అవుతానేమో అనుకునేదాన్ని. కానీ వినయంగా నా ఆలోచన మార్చుకుని, సహాయం తీసుకోవడానికి సమయం పట్టింది.” మీరు అలా సహాయం తీసుకుంటే, ఇవ్వడంలో ఉన్న సంతోషాన్ని రుచి చూసే అవకాశాన్ని ఇతరులకు ఇచ్చిన వాళ్లౌతారు. (అపొ. 20:35) అంతేకాదు, వాళ్లు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో, ఎంత పట్టించుకుంటున్నారో చూసి మీరు మురిసిపోతారు.
(9వ పేరా చూడండి)
10. కృతజ్ఞత చూపించడం ఎందుకు మర్చిపోకూడదు? (చిత్రాలు కూడా చూడండి.)
10 కృతజ్ఞత చూపించండి. (కొలొ. 3:15; 1 థెస్స. 5:18) వేరేవాళ్లు మనకోసం ఏదైనా మంచిపనులు చేసినప్పుడు మన హృదయం నిండా కృతజ్ఞత ఉండొచ్చు కానీ, దాన్ని మాటల్లో చెప్పడం మనం కొన్నిసార్లు మర్చిపోతుంటాం. కానీ ఒక చిన్న చిరునవ్వు లేదా ఒక థ్యాంక్యూ చెప్పినప్పుడు మనం వాళ్లకు విలువిస్తున్నామని, వాళ్లు చేసిన దానికి కృతజ్ఞత ఉందని చూపిస్తాం. బెతెల్‌లో వృద్ధులను చూసుకునే లేయా అనే సిస్టర్ ఇలా చెప్తుంది: “నేను చూసుకునే ఒక వృద్ధ సిస్టర్ నాకు థ్యాంక్యూ కార్డ్స్ రాసిచ్చేది. అవి చాలా చిన్నగా ఉన్నా ముద్దుగా అనిపించేవి, అవి నాకు బాగా నచ్చేవి. నేను ఆమెకు చేసినదానికి అలా కృతజ్ఞత చూపించినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించేది.”
(10వ పేరా చూడండి)
11. మీరు వేరేవాళ్లకు ఎలా సహాయం చేయవచ్చు? (చిత్రాలు కూడా చూడండి.)
11 వేరేవాళ్ల కోసం ఏదోకటి చేయండి. మీ సమయాన్ని, శక్తిని వేరేవాళ్ల కోసం ఉపయోగించడం గురించే ఆలోచిస్తే, మీ సమస్యల గురించి ఆలోచించడానికి అసలు టైం ఉండదు. ఒక ఆఫ్రికన్ సామెత, ముసలివాళ్లను లైబ్రరీతో పోలుస్తుంది. కానీ జ్ఞానంతో నిండిన ఆ పుస్తకాలు అరలోనే ఉంటే మనతో మాట్లాడలేవు, కథలు చెప్పలేవు. కానీ వృద్ధులారా, మీరు “నడిచే లైబ్రరీలా” ఉండండి. మీరు చొరవ తీసుకుని యౌవనులతో మీ అనుభవాన్ని, జ్ఞానాన్ని పంచుకోండి. వాళ్ల గురించి అడిగి తెలుసుకోండి, వాళ్లు చెప్తున్నప్పుడు వినండి. యెహోవా ప్రమాణాల ప్రకారం జీవించడం ఎందుకు మంచిదో, దానివల్ల వాళ్లు ఎందుకు సంతోషంగా ఉంటారో చెప్తూ ఉండండి. యౌవనుల్ని ఓదార్చినప్పుడు, బలపర్చినప్పుడు మీరు తప్పకుండా సంతోషిస్తారు.—కీర్త. 71:18.
(11వ పేరా చూడండి)
12. యెషయా 46:4 ప్రకారం, వృద్ధులకు యెహోవా ఏమని మాటిచ్చాడు? (చిత్రాలు కూడా చూడండి.)
12 బలం కోసం యెహోవాకు ప్రార్థన చేయండి. మీకు చాలా బలహీనంగా, నీరసంగా అనిపించవచ్చేమో గానీ యెహోవా మాత్రం “ఎప్పుడూ సొమ్మసిల్లడు, అలసిపోడు.” (యెష. 40:28) మరి, అంత బలాన్ని యెహోవా దేనికోసం ఉపయోగిస్తాడు? ఆయన ఆ బలాన్ని తన నమ్మకమైన వృద్ధులను బలపర్చడానికి ఉపయోగిస్తాడు. (యెష. 40:29-31) నిజానికి, వాళ్లను అలా బలపరుస్తానని ఆయన మాటిచ్చాడు. (యెషయా 46:4 చదవండి.) యెహోవా మాటమీద నిలబడే దేవుడు. (యెహో. 23:14; యెష. 55:10, 11) మీరు ప్రార్థన చేసినప్పుడు యెహోవా ప్రేమను, ఆయన మద్దతును రుచి చూస్తారు. అప్పుడు మీకు కలిగే ఆనందాన్ని ఎవ్వరూ చెరిపేయలేరు.
(12వ పేరా చూడండి)
13. రెండో కొరింథీయులు 4:16-18 ప్రకారం, మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? (చిత్రాలు కూడా చూడండి.)
13 మీరున్న పరిస్థితి కొంతకాలమే అని గుర్తుపెట్టుకోండి. మనకొచ్చే ఏ కష్టమైనా కొంతకాలమే ఉంటుందని గుర్తుపెట్టుకుంటే, వాటిని తట్టుకోవడం తేలికౌతుంది. అలాగే వృద్ధాప్యం, అనారోగ్యం లాంటివి కూడా తాత్కాలికం అని బైబిలు చెప్తుంది. (యోబు 33:25; యెష. 33:24) కాబట్టి మీ శ్రేష్ఠమైన జీవితం పాత రోజుల్లో లేదు, కొత్త లోకంలో ఉంది. అది తెలుసుకుని సంతోషించండి. (2 కొరింథీయులు 4:16-18 చదవండి.) అయితే, మీకు సహాయం చేయడానికి వేరేవాళ్లు ఏం చేయవచ్చు?
(13వ పేరా చూడండి)
వేరేవాళ్లు ఎలా సహాయం చేయవచ్చు?
14. వృద్ధుల్ని కలవడం, వాళ్లకు కాల్ చేయడం ఎందుకు చాలా ప్రాముఖ్యం?
14 పెద్దవయసు వాళ్లను కలుస్తూ ఉండండి, వాళ్లకు కాల్ చేస్తూ ఉండండి. (హెబ్రీ. 13:16) వృద్ధులకు ఏకాకిగా అనిపిస్తుంది. ఇంటికే పరిమితమైన కెమ్మి అనే బ్రదర్ ఇలా చెప్తున్నాడు: “నేను పొద్దున నుండి సాయంత్రం వరకు నాలుగు గోడల మధ్యే ఉండాలి. కాబట్టి నాకు విపరీతమైన బోరు కొడుతుంది. కొన్నిసార్లు బోనులో ఉన్న ఒక ముసలి సింహంలా నాకు అనిపిస్తుంది. నాకు చిరాకు, కోపం వస్తాయి.” మనం వృద్ధుల్ని కలిసినప్పుడు వాళ్లు మనకు చాలా ప్రాముఖ్యమని, మనం వాళ్లను ప్రేమిస్తున్నామని ధైర్యం చెప్తాం. బహుశా, మన సంఘంలో ఉన్న వృద్ధుల్ని కలవాలని, ఫోన్ చేయాలని అనుకొని ఎప్పుడైనా మర్చిపోయామా? అవును, మనందరం బిజీగా ఉంటాం. కానీ వృద్ధులను కలవడం లాంటి ప్రాముఖ్యమైన పనుల్ని చేయడానికి మనకు ఏది సహాయం చేస్తుంది? (ఫిలి. 1:10) బహుశా, మీ సంఘంలో ఉన్న వృద్ధులకు మెసేజ్ చేయాలని, కాల్ చేయాలని మీకు గుర్తుండడానికి క్యాలెండర్‌లో నోట్ చేసుకోవచ్చు. అలాగే వాళ్లను కలవడానికి ఒక సమయం పెట్టుకోండి, టైం ఉంటే చూద్దాంలే అనుకోకండి.
15. యౌవనులు, వృద్ధులు కలిసి ఏమేం చేయవచ్చు?
15 మీరు ఒకవేళ యౌవనులైతే, పెద్దవయసు వాళ్లతో ఏం మాట్లాడాలి, వాళ్లతో కలిసి ఏం పని చేయాలి అని అనిపించొచ్చు. అయితే, దాని గురించి మీరు గింజుకోనవసరం లేదు. కేవలం వాళ్లతో ఒక మంచి ఫ్రెండ్‌గా ఉంటే చాలు. (సామె. 17:17) మీటింగ్‌కు ముందు, తర్వాత పెద్దవయసు వాళ్లను కాసేపు ఆగి పలకరించవచ్చు. బహుశా, వాళ్లకు బాగా నచ్చిన లేఖనం ఏంటి అని అడగవచ్చు, లేదా చిన్నప్పుడు వాళ్లు చేసిన అల్లరి గురించి అడగవచ్చు. మీతోపాటు బ్రాడ్‌కాస్టింగ్ చూడడానికి పిలవొచ్చు. అంతేకాదు, పెద్దవయసు వాళ్లకు మీరు కొన్ని పనులు కూడా చేసిపెట్టవచ్చు. ఉదాహరణకు, వాళ్ల ఫోన్ లేదా టాబ్‌ని అప్‌డేట్ చేయవచ్చు. కొత్తకొత్త ప్రచురణలను డౌన్‌లోడ్ చేయవచ్చు. క్యారల్ అనే వృద్ధ సిస్టర్ ఇలా చెప్తుంది: “మీకు బాగా నచ్చిన పనుల్ని వృద్ధులతో కలిసి చేయండి. నాకు వయసైపోయినా సరే, నేను నా జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటాను. నాకు షాపింగ్‌కు వెళ్లడం, బయట తినడం, సృష్టిని చూడడం చాలా ఇష్టం.” మైరా అనే సిస్టర్ ఇలా చెప్తుంది: “నా ఫ్రెండ్స్‌లో ఒకరికి 90 ఏళ్లు. ఆమెకు, నాకు 57 ఏళ్ల తేడా ఉంది. కానీ మేము ఆ తేడాను మర్చిపోయి కలిసి సరదాగా ఉంటాం, జోకులు వేసుకుంటాం, కలిసి సినిమాలు చూస్తాం. అలాగే మాకు ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు ఒకరికొకరం తోడుగా ఉంటాం.”
16. హాస్పిటల్‌కి పెద్దవయసు వాళ్లతో పాటు వెళ్లడం ఎందుకు మంచిది?
16 వాళ్లకు తోడుగా హాస్పిటల్‌కి వెళ్లండి. పెద్దవయసు వాళ్లను మీ బండిమీద హాస్పిటల్‌కి తీసుకెళ్లడమే కాదు, వాళ్లతోపాటు ఉండి డాక్టర్లు, నర్సులు వాళ్లను బాగా చూసుకునేలా చేయవచ్చు. (యెష. 1:17) బహుశా డాక్టర్ చెప్పేది పెద్దవయసు వాళ్లకు అర్థమయ్యేలా ఒక పేపర్ మీద రాసి ఇవ్వచ్చు. రూత్ అనే ఒక పెద్దవయసు సిస్టర్ ఇలా చెప్తుంది: “సాధారణంగా డాక్టర్ దగ్గరకు నేను ఒక్కదాన్నే వెళ్ళేదాన్ని. కానీ డాక్టర్ నన్ను పెద్దగా పట్టించుకునేవాడు కాదు. కొన్నిసార్లయితే ‘అంతా బానే ఉంది, అన్నీ నీ పిచ్చిపిచ్చి డౌట్లు; సమస్య నీ తలలోనే ఉంది’ అంటుండేవాళ్లు. కానీ నాతోపాటు ఎవరైనా వస్తే మాత్రం, డాక్టర్ చక్కగా మాట్లాడేవాడు. అందుకే, సమయం తీసుకుని నాతోపాటు వచ్చిన బ్రదర్స్‌సిస్టర్స్‌కి నేను ఎంతో కృతజ్ఞురాలిని.”
17. పెద్దవయసు వాళ్లతో కలిసి మీరు ఎలా ప్రీచింగ్ చేయవచ్చు?
17 వాళ్లతో కలిసి ప్రీచింగ్ చేయండి. కొంతమంది పెద్దవయసు బ్రదర్స్‌సిస్టర్స్‌కి ఇంటింటి పరిచర్య చేసేంత ఓపిక ఉండకపోవచ్చు. కాబట్టి ఎవరైనా వృద్ధ సిస్టర్‌ని మీతోపాటు కార్ట్ విట్నెసింగ్‌కు తీసుకెళ్లగలరా? కుదిరితే, ఆమె కూర్చునేలా కార్టు పక్కన ఒక కుర్చీ వేయవచ్చు. లేదా ఒక పెద్దవయసు బ్రదర్‌ని మీ స్టడీకి తీసుకెళ్లగలరా? కుదిరితే, ఆ స్టడీని వాళ్ల ఇంట్లోనే చేయవచ్చు. సంఘపెద్దలారా, క్షేత్రసేవ కూటాన్ని పెద్దవయసు బ్రదర్స్-సిస్టర్స్ ఇళ్లల్లో ఏర్పాటు చేయొచ్చేమో ఆలోచించండి. అప్పుడు వాళ్లు కూడా ప్రీచింగ్ చేయగలుగుతారు. ఇలా పెద్దవయసు వాళ్లకోసం మనం ఏ చిన్న పని చేసినా యెహోవా చాలా సంతోషిస్తాడు.—సామె. 3:27; రోమా. 12:10.
18. తర్వాతి ఆర్టికల్‌లో ఏం చూస్తాం?
18 వృద్ధుల్ని యెహోవా ప్రేమిస్తాడని, విలువిస్తాడని ఈ ఆర్టికల్‌లో గుర్తుచేసుకున్నాం. యెహోవాలాగే మనం కూడా సంఘంలో ఉన్న వృద్ధుల్ని ప్రేమిస్తాం, వాళ్లకు విలువిస్తాం! నిజమే వృద్ధాప్యం కొంచెం బాధగానే ఉంటుంది. కానీ, యెహోవా సహాయంతో మన సంతోషాన్ని కాపాడుకోవచ్చు. (కీర్త. 37:25) మీ శ్రేష్ఠమైన జీవితం పాత రోజుల్లో కాదు, కొత్త లోకంలో ఉంటుందని తెలుసుకోవడం ఎంత ప్రోత్సాహంగా ఉందో కదా! అయితే, మన ఇంట్లో ఉన్న వృద్ధుల్ని గానీ, పిల్లవాడిని గానీ, ఏదైనా అనారోగ్యంతో ఉన్న స్నేహితుణ్ణి గానీ చూసుకుంటుంటే అప్పుడేంటి? మన సంతోషాన్ని ఎలా కాపాడుకోవచ్చు? ఈ ప్రశ్నల గురించి తర్వాతి ఆర్టికల్‌లో చూస్తాం.
పాట 30 నా తండ్రి, నా దేవుడు, నా స్నేహితుడు
a jw.org అలాగే JW లైబ్రరీలో, వృద్ధులారా—మీకు ఓ ముఖ్యమైన బాధ్యత ఉంది అనే వీడియో చూడండి.