కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w25 మే పేజీలు 14-19
  • ఎప్పటికీ ఉండే నగరం కోసం ఎదురుచూడండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఎప్పటికీ ఉండే నగరం కోసం ఎదురుచూడండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టని వ్యక్తిని నమ్మండి
  • నాయకత్వం వహిస్తున్నవాళ్లకు విధేయత చూపించండి
  • సహోదర ప్రేమ చూపిస్తూ, ఆతిథ్యం ఇస్తూ ఉండండి
  • ముందుముందు ఏం జరుగుతుంది?
  • చివరివరకు నమ్మకంగా సహించడానికి సహాయం చేసే ఉత్తరం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • యెహోవా మీద ఆధారపడుతున్నామని చూపించే నిర్ణయాలు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • మనకు తెలియనివి తెలీదని ఒప్పుకోవాలంటే వినయం కావాలి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోండి
    2025-2026 ప్రాంతీయ సమావేశ కార్యక్రమం, ప్రాంతీయ పర్యవేక్షకునితో
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
w25 మే పేజీలు 14-19

అధ్యయన ఆర్టికల్‌ 21

పాట 21 రాజ్యానికి మొదటిస్థానం ఇస్తూ ఉండండి

ఎప్పటికీ ఉండే నగరం కోసం ఎదురుచూడండి

“మనం రానున్న నగరం కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నాం.”—హెబ్రీ. 13:14.

ముఖ్యాంశం

ఇప్పుడు అలాగే భవిష్యత్తులో పనికొచ్చే ఏ సలహాలు హెబ్రీయులు 13వ అధ్యాయంలో ఉన్నాయో చూస్తాం.

1. మొదటి శతాబ్దంలోని యెరూషలేముకు ఏం జరుగుతుందని యేసు చెప్పాడు?

యేసు చనిపోయే కొన్ని రోజులు ముందు ఒక ప్రవచనం చెప్పాడు. ఆ ప్రవచనం మొదటిసారి యూదా వ్యవస్థ చివరిరోజుల్లో నెరవేరింది. ఒకరోజు యెరూషలేము నగరాన్ని ‘సైన్యాలు చుట్టుముడతాయి’ అని ఆయన హెచ్చరిక ఇచ్చాడు. (లూకా 21:20) అంతేకాదు, ఆ రోమా సైనికుల్ని చూసిన వెంటనే, యూదయను వదిలి వెళ్లిపోవాలని యేసు తన శిష్యులకు చెప్పాడు.—లూకా 21:21, 22.

2. యూదయలో అలాగే యెరూషలేములో ఉన్న క్రైస్తవులకు అపొస్తలుడైన పౌలు ఏ సలహా ఇచ్చాడు?

2 యెరూషలేమును రోమా సైనికులు చుట్టుముట్టడానికి కొన్ని సంవత్సరాల ముందు అపొస్తలుడైన పౌలు ఒక ఉత్తరం రాశాడు. దాన్నే ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పుస్తకం అని పిలుస్తున్నాం. ఆ ఉత్తరంలో పౌలు, భవిష్యత్తు కోసం ఎలా సిద్ధంగా ఉండాలో యూదయలో, యెరూషలేములో ఉన్న క్రైస్తవులకు కొన్ని సలహాల్ని ఇచ్చాడు. ఇంతకీ వాళ్లకు ఏం జరగబోతుంది? త్వరలో యెరూషలేము నేలమట్టం అవుతుంది. కాబట్టి ఆ క్రైస్తవులకు ప్రాణాల మీద ఆశ ఉంటే వాళ్ల ఇళ్లను, వ్యాపారాల్ని వదిలి వెళ్లడానికి రెడీగా ఉండాలి. అందుకే, పౌలు యెరూషలేము గురించి ఇలా రాశాడు: “ఎప్పటికీ నిలిచివుండే నగరం మనకు ఇక్కడ లేదు, మనం రానున్న నగరం కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నాం.”—హెబ్రీ. 13:14.

3. “నిజమైన పునాదులుగల నగరం” అంటే ఏంటి? దానికోసం మనం ఎందుకు ఎదురుచూస్తూ ఉండాలి?

3 యెరూషలేమును, యూదయను వదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న క్రైస్తవుల్ని అక్కడి ప్రజలు అవమానించారు, ఎగతాళి చేశారు. కానీ క్రైస్తవులు ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల వాళ్ల ప్రాణాల్ని కాపాడుకున్నారు. ఇప్పుడు కూడా చాలామంది మనల్ని పిచ్చోళ్లుగా చూస్తారు. ఎందుకంటే మనకు డబ్బు మీద ఆశ లేదు, మనుషుల మీద నమ్మకం లేదు. ఎందుకు? ఎందుకంటే త్వరలోనే దేవుని రాజ్యం ఈ చెడ్డ లోకాన్ని నాశనం చేస్తుందని మనకు తెలుసు. మనం “నిజమైన పునాదులుగల నగరం కోసం” ఎదురుచూస్తున్నాం. అదే దేవుని రాజ్యం!a (హెబ్రీ. 11:10; మత్త. 6:33) ఈ ఆర్టికల్‌లోని ప్రతీ ఉపశీర్షికలో మూడు విషయాల్ని చూస్తాం. (1) “రాబోయే నగరం” గురించి ఎదురుచూస్తూ ఉండడానికి మొదటి శతాబ్దంలోని క్రైస్తవులకు పౌలు ఇచ్చిన సలహా ఎలా పనికొచ్చింది? (2) భవిష్యత్తులో జరగబోయే వాటికి పౌలు వాళ్లను ఎలా సిద్ధం చేశాడు? (3) పౌలు ఇచ్చిన సలహా ఇప్పుడు మనకెలా పనికొస్తుంది?

మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టని వ్యక్తిని నమ్మండి

4. క్రైస్తవులకు యెరూషలేము ఎందుకంత ముఖ్యమైంది?

4 క్రైస్తవులకు యెరూషలేము ఒక ముఖ్యమైన నగరం అనే చెప్పాలి. ఎందుకంటే క్రీ.శ. 33 లో మొదటి శతాబ్దంలోని క్రైస్తవుల సంఘం అక్కడే మొదలైంది. అలాగే పరిపాలక సభ సభ్యులు కూడా ఆ నగరంలోనే ఉండేవాళ్లు. అంతేకాదు, ఆ నగరంలో ఉన్న చాలామంది క్రైస్తవులకు సొంత ఇళ్లు, ఆస్తిపాస్తులు ఉన్నాయి. అయినప్పటికీ, యెరూషలేమునే కాదు, యూదయను కూడా వదిలి వెళ్లిపొమ్మని యేసు తన అనుచరులకు హెచ్చరిక ఇచ్చాడు.—మత్త. 24:16.

5. రాబోయే వాటికి పౌలు క్రైస్తవుల్ని ఎలా సిద్ధం చేశాడు?

5 రాబోయే వాటికి క్రైస్తవులు సిద్ధంగా ఉండాలి. దానికోసమే, యెహోవా యెరూషలేము నగరాన్ని ఎలా చూస్తున్నాడో అర్థంచేసుకునేలా పౌలు వాళ్లకు సహాయం చేశాడు. యెరూషలేములో ఉన్న ఆలయం గానీ, యాజకత్వం గానీ, బలులు గానీ యెహోవాకు ఇక ఏమాత్రం పవిత్రమైనవి కావని పౌలు వాళ్లకు గుర్తుచేశాడు. (హెబ్రీ. 8:13) ఆ నగరంలో చాలామంది మెస్సీయను వద్దనుకున్నారు. అలాగే వాళ్లు ఇక యెహోవాను ఆరాధించడానికి యెరూషలేముకు వెళ్లాల్సిన అవసరంలేదు. ఎందుకంటే అది నాశనం కాబోతుంది.—లూకా 13:34, 35.

6. హెబ్రీయులు 13:5, 6 లో పౌలు ఇచ్చిన సలహా క్రైస్తవులకు ఎందుకు అవసరం?

6 పౌలు హెబ్రీయులకు ఉత్తరం రాసే సమయానికి యెరూషలేము చాలా అభివృద్ధి చెందింది. ఆ కాలంలో ఉన్న ఒక రోమా రచయిత, “తూర్పున ఉన్న నగరాలన్నిటిలో యెరూషలేము ఎంతో పేరుగాంచిన నగరం” అని పిలిచాడు. అంతేకాదు, ప్రతీ సంవత్సరం యూదులు వేర్వేరు దేశాల నుండి ప్రయాణించి యెరూషలేములో జరిగే పండుగల్ని చూడడానికి వచ్చేవాళ్లు. ఆ నగరం ఎప్పుడూ పర్యాటకులతో కిటకిటలాడేది కాబట్టి వ్యాపారాలు చేసుకునే కొంతమంది క్రైస్తవులకు మంచి రాబడి ఉండేది. అందుకేనేమో పౌలు వాళ్లకు ఇలా చెప్పాడు: “డబ్బును ప్రేమించకండి, ఉన్నవాటితో సంతృప్తిగా జీవించండి.” ఆ తర్వాత, మనలో ప్రతీ ఒక్కర్ని చూసుకుంటానని యెహోవా లేఖనాల్లో ఇచ్చిన గట్టి భరోసాను పౌలు రాశాడు: “నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టను, నిన్ను ఎన్నడూ వదిలేయను.” (హెబ్రీయులు 13:5, 6 చదవండి; ద్వితీ. 31:6; కీర్త. 118:6) యెరూషలేము అలాగే యూదయలో ఉన్న క్రైస్తవులకు ఆ భరోసా చాలా అవసరం. ఎందుకంటే, ఈ ఉత్తరం అందుకున్న కొంతకాలానికే వాళ్లు తమ ఇళ్లను, వ్యాపారాన్ని, వాళ్లకు సంబంధించిన ప్రతీదాన్ని వదిలి వెళ్లాలి. ముందుముందు వాళ్లకు వచ్చే ఎలాంటి పరిస్థితినైనా వాళ్లు ఎదుర్కోవాలి.

7. ఇప్పుడే మనం యెహోవా మీద ఎందుకు నమ్మకాన్ని పెంచుకోవాలి?

7 మనకేంటి పాఠం? త్వరలో “మహాశ్రమ” మొదలౌతుంది, ఈ చెడ్డ లోకం నాశనమౌతుంది. (మత్త. 24:21) కాబట్టి మొదటి శతాబ్దంలోని క్రైస్తవుల్లాగే మనం కూడా అప్రమత్తంగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. (లూకా 21:34-36) మహాశ్రమ సమయంలో యెహోవా తన ప్రజల్ని ఎప్పుడూ విడిచిపెట్టడని పూర్తిగా నమ్మి, మన వస్తువుల్లో కొన్నిటిని లేదా అన్నిటినీ వదిలేయాల్సి రావచ్చు. అయితే, ఇప్పుడు కూడా అంటే మహాశ్రమ మొదలవ్వకముందే మనం యెహోవాను ఎంత నమ్ముతున్నామో చూపించే అవకాశం ఉంది. మనం ఇలా ప్రశ్నించుకోవచ్చు: ‘నా పనులు, నా లక్ష్యాలు యెహోవా నన్ను చూసుకుంటానని ఇచ్చిన మాట మీద నాకు నమ్మకం ఉందని చూపిస్తున్నాయా? లేదా డబ్బు మీద నమ్మకం ఉందని చూపిస్తున్నాయా?’ (1 తిమో. 6:17) అవును, మొదటి శతాబ్దంలో జరిగిన దాన్నుండి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. అయితే, రాబోయే “మహాశ్రమ” ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలీదు. మరి, మహాశ్రమ మొదలైనప్పుడు ఏం చేయాలో మనకు ఎలా తెలుస్తుంది?

నాయకత్వం వహిస్తున్నవాళ్లకు విధేయత చూపించండి

8. యేసు తన శిష్యులకు ఏం చెప్పాడు?

8 పౌలు రాసిన ఉత్తరం హెబ్రీయులకు అందిన కొన్ని సంవత్సరాల తర్వాత, యెరూషలేము నగరాన్ని రోమా సైన్యం చుట్టుముట్టడం క్రైస్తవులు చూశారు. వాళ్లు పారిపోవడానికి, యెరూషలేము నగరం నాశనమవ్వడానికి అదొక సూచన. (మత్త. 24:3; లూకా 21:20, 24) మరి వాళ్లు ఎక్కడికి పారిపోవాలి? యేసు సూటిగా ఇలా చెప్పాడు: “యూదయలో ఉన్నవాళ్లు కొండలకు పారిపోవడం మొదలుపెట్టాలి.” (లూకా 21:21) అయితే, ఆ ప్రాంతంలో చాలా కొండలు ఉన్నాయి. మరి వీళ్లందరూ ఏ కొండకు పారిపోవాలి?

9. ఏ కొండలకు పారిపోవాలని క్రైస్తవులు ఎందుకు ఆలోచించి ఉంటారు? (మ్యాపు కూడా చూడండి.)

9 క్రైస్తవులు పారిపోగల కొన్ని కొండల గురించి చూడండి. ఉదాహరణకు, సమరయ కొండలు, గలిలయలో ఉన్న కొండలు, హెర్మోను కొండ, లెబానోను కొండలు, యొర్దాను నదికి అవతల ఉన్న కొండలు. (మ్యాపు చూడండి.) ఈ కొండల పక్కనున్న కొన్ని నగరాలు దాక్కోవడానికి సురక్షితంగా అనిపించి ఉండవచ్చు. ఉదాహరణకు, గామ్ల అనే నగరాన్ని తీసుకోండి. అది ఎత్తయిన కొండ మీద ఉంది కాబట్టి అక్కడికి చేరుకోవడం చాలాచాలా కష్టం. కొంతమంది యూదులు అక్కడ దాక్కోవడం సురక్షితమని అనుకున్నారు. కానీ రోమా సైన్యం ఆ నగరాల్ని దాడిచేసి, అందులో ఉన్న చాలామందిని చంపేసింది.b

మొదటి శతాబ్దంలో ఇశ్రాయేలు చుట్టుపక్కల ఉన్న కొన్ని నగరాలు, పర్వతాలు చూపించే మ్యాపు. యెరూషలేముకు ఉత్తరాన ఉన్న పర్వతాలు ఏంటంటే: లెబానోను, గలిలయ, సమరయ, గిలాదు పర్వతాలు అలాగే హెర్మోను పర్వతం, తాబోరు కొండ. యెరూషలేముకు ఉత్తరాన ఉన్న నగరాలు ఏంటంటే: గామ్ల, కైసరయ, పెల్లా. యెరూషలేముకు దక్షిణాన ఉన్న పర్వతాలు ఏంటంటే: యూదయ, అబారీము, అలాగే మసాడా నగరం ఉంది. రోమన్లు ముట్టడి చేస్తూ వెళ్లిన ప్రాంతాలు అలాగే క్రీ.శ 67 నుండి 73 వరకు యూదులు పోగొట్టుకున్న ప్రాంతాలు మ్యాపులో కనిపిస్తాయి.

తొలి క్రైస్తవులు పారిపోవడానికి చాలా కొండలు ఉన్నాయి. కానీ అన్నీ సురక్షితమైనవి కావు (9వ పేరా చూడండి)


10-11. (ఎ) క్రైస్తవుల్ని యెహోవా ఎలా నడిపించి ఉంటాడు? (హెబ్రీయులు 13:7, 17) (బి) నాయకత్వం వహిస్తున్నవాళ్లకు విధేయత చూపించడం వల్ల క్రైస్తవులు ఎలాంటి ప్రయోజనం పొందారు? (చిత్రం కూడా చూడండి.)

10 నాయకత్వం వహిస్తున్న సహోదరుల ద్వారా యెహోవా క్రైస్తవుల్ని నడిపించాడని అర్థమౌతుంది. చరిత్రకారుడైన ఈసుబియస్‌ ఆ తర్వాత ఇలా రాశాడు: “యుద్ధం కన్నా ముందే పెరయలో ఉన్న పెల్లా అనే నగరానికి పారిపోయి అక్కడ స్థిరపడమని . . . కొంతమంది ఆమోదం పొందిన పురుషులకు దేవుడు తెలియజేశాడు. వాళ్ల ద్వారా యెరూషలేములో ఉన్న సంఘానికి ఆ విషయం తెలిసింది.” దాక్కోవడానికి పెల్లా సురక్షితమైన ప్రాంతమనే తెలుస్తుంది. ఎందుకంటే అది యెరూషలేముకు ఎంతో దూరంలో లేదు కాబట్టి అక్కడికి చేరుకోవడం చాలా తేలిక. అందులోనూ పెరయలో చాలామంది యూదులుకాని వాళ్లే ఉన్నారు కాబట్టి రోమన్లకు ఎదురుతిరిగి, వాళ్లతో పోరాడేవాళ్లు ఎవ్వరూలేరు.—మ్యాపు చూడండి.

11 “నాయకత్వం వహిస్తున్నవాళ్లకు విధేయత” చూపించండి అని పౌలు ఇచ్చిన సలహాను, కొండలకు పారిపోయిన క్రైస్తవులు పాటించారు. (హెబ్రీయులు 13:7, 17 చదవండి.) దానివల్ల వాళ్లు తమ ప్రాణాల్ని కాపాడుకున్నారు. “నిజమైన పునాదులుగల నగరం కోసం” అంటే దేవుని రాజ్యం కోసం ఎదురుచూసిన వాళ్లను దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టలేదని చరిత్ర నిరూపించింది.—హెబ్రీ. 11:10.

మొదటి శతాబ్దంలోని కొంతమంది క్రైస్తవులు తమ వస్తువులన్నీ తీసుకొని పర్వతాలు దాటుకుంటూ నడుస్తున్నారు.

పెల్లా అంత ప్రమాదకరమైనది కాదు (10-11 పేరాలు చూడండి)


12-13. చాలా కష్టమైన సమయాల్లో యెహోవా తన ప్రజల్ని ఎలా నడిపించాడు?

12 మనకేంటి పాఠం? యెహోవా తన ప్రజలకు నిర్దిష్టమైన నిర్దేశాలు ఇవ్వడానికి నాయకత్వం వహిస్తున్న సహోదరుల్ని ఉపయోగిస్తాడు. కష్టమైన కాలంలో కూడా యెహోవా తన ప్రజల్ని నడిపించడానికి కాపరులను ఉపయోగించాడని చెప్పే ఉదాహరణలు బైబిల్లో కోకొల్లలు! (ద్వితీ. 31:23; కీర్త. 77:20) అలాగే ఇప్పుడు కూడా యెహోవా, నాయకత్వం వహిస్తున్న సహోదరుల్ని ఉపయోగిస్తున్నాడని మనం చూస్తూనే ఉన్నాం.

13 ఉదాహరణకు, కోవిడ్‌లో “నాయకత్వం వహిస్తున్న” సహోదరులు మనకు కావాల్సిన నిర్దేశాలు ఇచ్చారు. బ్రదర్స్‌సిస్టర్స్‌ ఆధ్యాత్మిక అవసరాల్ని తీర్చడానికి ఏం చేయాలో సంఘపెద్దలకు నిర్దేశాలు అందాయి. కోవిడ్‌ వచ్చిన కొన్ని రోజులకే చరిత్రలో నిలిచిపోయిన ఒక సమావేశం జరిగింది. అది ఇంటర్నెట్‌, టి.వీ, రేడియో ద్వారా 500 కన్నా ఎక్కువ భాషల్లో జరిగింది. ఆధ్యాత్మిక ఆహారం అస్సలు ఆగలేదు. దానివల్ల మనందరం ఐక్యంగా ఉండగలిగాం. అయితే, భవిష్యత్తులో మనకు ఎలాంటి కష్టాలు వచ్చినాసరే, నాయకత్వం వహిస్తున్న సహోదరులు తెలివైన నిర్ణయాలు తీసుకునేలా యెహోవా సహాయం చేస్తూనే ఉంటాడనే పూర్తి నమ్మకంతో మనం ఉండవచ్చు. యెహోవా మీద నమ్మకం, విధేయతతో పాటు మహాశ్రమ కోసం సిద్ధపడడానికి, ప్రపంచాన్ని కుదిపేసే ఆ సమయంలో తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి మనకు ఇంకా ఏ లక్షణాలు అవసరం?

సహోదర ప్రేమ చూపిస్తూ, ఆతిథ్యం ఇస్తూ ఉండండి

14. హెబ్రీయులు 13:1-3 ప్రకారం, యెరూషలేము నాశనం అవ్వడానికి ముందు క్రైస్తవులు ఏ లక్షణాల్ని చూపించుకోవాల్సి వచ్చింది?

14 మహాశ్రమ మొదలైనప్పుడు మనం ముందెప్పటికన్నా ఎక్కువ ప్రేమ చూపించుకోవాలి. ఈ విషయంలో యెరూషలేములో, యూదయలో ఉన్న క్రైస్తవుల నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు. వాళ్లు ఎప్పుడూ ఒకరిమీద ఒకరు ప్రేమ చూపించుకుంటూనే ఉన్నారు. (హెబ్రీ. 10:32-34) అయితే, యెరూషలేము నాశనం అవ్వడానికి కొన్ని సంవత్సరాల ముందు మాత్రం వాళ్ల మధ్యున్న ‘సహోదర ప్రేమను’c అలాగే ‘ఆతిథ్య’ స్ఫూర్తిని ఇంకా ఎక్కువ స్థాయిలో చూపించుకోవాల్సి వచ్చింది. (హెబ్రీయులు 13:1-3 చదవండి.) మనం కూడా ఈ వ్యవస్థ చివర్లో జీవిస్తున్నాం కాబట్టి వాళ్లలాగే ప్రేమ చూపించుకుంటూ ఉండాలి.

15. కొండలకు పారిపోతున్న క్రైస్తవులు ఒకరికొకరు సహోదర ప్రేమను, ఆతిథ్యాన్ని ఎందుకు చూపించుకోవాల్సి వచ్చింది?

15 రోమా సైనికులు యెరూషలేమును చుట్టుముట్టాక, ఉన్నపళంగా వెనక్కి వెళ్లిపోయారు. అప్పుడు క్రైస్తవులు పారిపోవడానికి అవకాశం దొరికింది. అయితే, వాళ్లు చాలా తక్కువ వస్తువులతో పారిపోయి ఉంటారు. (మత్త. 24:17, 18) కాబట్టి వాళ్లు కొండలకు పారిపోతున్నప్పుడు, కొత్త ప్రాంతంలో స్థిరపడుతున్నప్పుడు ఒకరి తోడు ఒకరికి చాలా అవసరమై ఉంటుంది. చాలామంది బ్రదర్స్‌సిస్టర్స్‌కి ఆహారం, బట్టలు, తల దాచుకోవడానికి ఒక చోటు అవసరమై ఉంటాయి. వాళ్లు ఒకర్నొకరు పట్టించుకుంటూ, తమకు ఉన్నవాటిని వేరేవాళ్లతో పంచుకోవడానికి, ప్రేమ చూపించుకోవడానికి అవకాశం దొరికింది.—తీతు 3:14.

16. తోటి బ్రదర్స్‌సిస్టర్స్‌కి సహాయం అవసరమైనప్పుడు మన ప్రేమను ఎలా చూపించవచ్చు? (చిత్రం కూడా చూడండి.)

16 మనకేంటి పాఠం? మన బ్రదర్స్‌-సిస్టర్స్‌ అవసరంలో ఉన్నప్పుడు వాళ్లకు సహాయం చేయాలంటే మనకు ప్రేమ ఉండాలి. యుద్ధాల వల్ల, ప్రకృతి విపత్తుల వల్ల వేరే ప్రాంతాలకు వచ్చిన మన బ్రదర్స్‌సిస్టర్స్‌కి ఆధ్యాత్మికంగా అలాగే వస్తుపరంగా సహాయం చేయడానికి దేవుని ప్రజలు ఇష్టంగా ముందుకు వచ్చారు. యుక్రెయిన్‌లో ఉంటున్న ఒక సిస్టర్‌ యుద్ధం వల్ల తన ఇంటిని వదిలిపెట్టి వచ్చింది. ఆమె ఇలా చెప్తుంది: “తోటి బ్రదర్స్‌ ద్వారా యెహోవా నిర్దేశాన్ని, సహాయాన్ని మేము రుచిచూశాం. యుక్రెయిన్‌లో, హంగరీలో, ఇప్పుడు జర్మనీలో కూడా వాళ్లు మమ్మల్ని ప్రేమగా ఆహ్వానించారు.” తోటి బ్రదర్స్‌సిస్టర్స్‌ అవసరాల్ని ఎవరైతే చూసుకుంటారో, ఆతిథ్య స్ఫూర్తిని చూపిస్తారో వాళ్లు యెహోవా చేతిలో పనిముట్లుగా ఉన్నారు.—సామె. 19:17; 2 కొరిం. 1:3, 4.

తమ ఇంటిని వదిలేసి వచ్చినవాళ్లకు పెద్ద వయసు దంపతులు ఆశ్రయం ఇస్తున్నారు. వాళ్లతోపాటు ఒక సూట్‌కేసు అలాగే కొన్ని బ్యాగులు ఉన్నాయి.

ఈ రోజుల్లో తమ ఇళ్లను వదిలేసి వచ్చిన క్రైస్తవులకు మన సహాయం అవసరం (16వ పేరా చూడండి)


17. సహోదర ప్రేమను, ఆతిథ్య స్ఫూర్తిని ఇప్పుడే పెంచుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?

17 భవిష్యత్తులో ఒకరి తోడు ఒకరికి ఇంకా ఎక్కువ అవసరం పడుతుంది. (హబ. 3:16-18) కాబట్టి, అప్పుడు మనకు చాలా అవసరమైన లక్షణాలు అంటే సహోదర ప్రేమను, ఆతిథ్య స్ఫూర్తిని ఇప్పుడే పెంచుకునేలా యెహోవా శిక్షణ ఇస్తున్నాడు.

ముందుముందు ఏం జరుగుతుంది?

18. మొదటి శతాబ్దంలోని హెబ్రీ క్రైస్తవుల్లా మనం ఎలా ఉండవచ్చు?

18 చరిత్ర చెప్తున్నట్టు, కొండలకు పారిపోయిన క్రైస్తవులు యెరూషలేము మీదికి వచ్చిన నాశనాన్ని తప్పించుకున్నారు. వాళ్లు ఆ నగరాన్ని వదిలేసినందుకు యెహోవా వాళ్లను ఎప్పుడూ వదిలేయలేదు! మనకాలంలో పరిస్థితి ఏంటి? భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఖచ్చితంగా మనకు తెలీదు కానీ ఎప్పుడూ సిద్ధంగా ఉండండి అని యేసు ఇచ్చిన హెచ్చరిక మాత్రం మనకు ఉంది. (లూకా 12:40) అలాగే పౌలు హెబ్రీయులకు రాసిన సలహా మనకు ఉంది. ఆ సలహా అప్పుడున్న క్రైస్తవులకు ఎంత పనికొచ్చిందో ఇప్పుడు మనకూ అంతే పనికొస్తుంది. అంతేకాదు, మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టనని యెహోవా ఇచ్చిన మాట మనకుంది. (హెబ్రీ. 13:5, 6) అలా ఎప్పటికీ నిలిచివుండే పట్టణాన్ని అంటే దేవుని రాజ్యాన్ని ఆత్రుతతో వెతుకుతూ ఉందాం. అది తీసుకొచ్చే శాశ్వతకాల దీవెనల్ని సొంతం చేసుకుందాం.—మత్త. 25:34.

మీరెలా జవాబిస్తారు?

  • యెహోవా మీద నమ్మకాన్ని ఇప్పుడే పెంచుకోవడం ఎందుకు అవసరం?

  • “మహాశ్రమ” సమయంలో విధేయత చూపించడం ఎందుకు ప్రాముఖ్యం?

  • సహోదర ప్రేమను, ఆతిథ్య స్ఫూర్తిని ఇప్పుడే పెంచుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?

పాట 157 శాంతి ఉంటుందిక నిత్యం!

a సాధారణంగా, బైబిలు కాలాల్లో నగరాల్ని ఒక రాజు పరిపాలించేవాడు. అలాంటి నగరాన్ని ఒక రాజ్యంగా చూసేవాళ్లు.—ఆది. 14:2.

b ఇది క్రీ.శ. 67 లో అంటే క్రైస్తవులు యూదయ అలాగే యెరూషలేము నగరాల్ని వదిలి వెళ్లిన కొంతకాలానికే జరిగింది.

c “సహోదర ప్రేమ” అని అనువదించబడిన పదం దగ్గరి బంధువుల మధ్యున్న ప్రేమను సూచిస్తుంది. కాని పౌలు ఇక్కడ, సంఘంలోని వాళ్ల మధ్య ఉండే దగ్గరి ప్రేమ బంధం గురించి చెప్పడానికి ఉపయోగించాడు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి