కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w25 మే పేజీలు 2-7
  • నమ్మకమైన దేవదూతల ఆదర్శాన్ని పాటించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నమ్మకమైన దేవదూతల ఆదర్శాన్ని పాటించండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవదూతలు వినయం చూపిస్తారు
  • దేవదూతలు ప్రజల్ని ప్రేమిస్తారు
  • దేవదూతలు సహనం చూపిస్తారు
  • సంఘాన్ని పవిత్రంగా ఉంచడానికి దేవదూతలు సహాయం చేస్తారు
  • దేవదూతలు—‘పరిచారం చేయడానికి పంపబడిన సేవకులైన ఆత్మలు’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • దేవదూతలు అంటే ఎవరు?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • దేవదూతలు మీకు ఎలా సహాయం చేయగలరంటే
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • దేవదూతలు మనపై ఎలా ప్రభావం చూపిస్తారు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
w25 మే పేజీలు 2-7

అధ్యయన ఆర్టికల్‌ 19

పాట 6 ఆకాశాలు యెహోవా మహిమను ప్రకటిస్తున్నాయి

నమ్మకమైన దేవదూతల ఆదర్శాన్ని పాటించండి

“దూతలారా, మీరంతా యెహోవాను స్తుతించండి.”—కీర్త. 103:20.

ముఖ్యాంశం

నమ్మకమైన దేవదూతల నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు.

1-2. (ఎ) దేవదూతలకు, మనకు తేడా ఏంటి? (బి) దేవదూతలకు, మనకు ఎలాంటి పోలికలు ఉన్నాయి?

యెహోవా మనల్ని సత్యంలోకి ఆకర్షించినప్పుడు ప్రేమగల కుటుంబంలోకి మనల్ని ఆహ్వానించాడు. అందులో బ్రదర్స్‌సిస్టర్స్‌ మాత్రమే కాదు, లక్షలమంది నమ్మకమైన దేవదూతలు కూడా ఉన్నారు. (దాని. 7:9, 10) ఒకసారి ఆలోచిస్తే దేవదూతలకు మనకు మధ్య, ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉందని మనకు అనిపించవచ్చు. ఉదాహరణకు, దేవదూతలు మనకన్నా ఎన్నో ఏళ్ల క్రితం సృష్టించబడ్డారు. (యోబు 38:4, 7) వాళ్లు మనకన్నా చాలా శక్తిమంతులు. అపరిపూర్ణ మనుషులమైన మనం ఉండలేనంత పవిత్రంగా, నీతిగా దేవదూతలు ఉన్నారు.—లూకా 9:26.

2 దేవదూతలకు మనకు తేడాలు ఉన్నా, చాలా పోలికలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు దేవదూతల్లా మనం యెహోవా లక్షణాల్ని చూపించగలుగుతాం. అలాగే మనకు సొంతగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉంది. దేవదూతల్లా మనకు కూడా వేర్వేరు పేర్లు, వేర్వేరు వ్యక్తిత్వాలు, యెహోవా సేవలో వేర్వేరు బాధ్యతలు ఉన్నాయి. అంతేకాదు వాళ్లలాగే సృష్టికర్త గురించి నేర్చుకుని, ఆయన్ని ఆరాధించాలనే బలమైన కోరిక మనకుంది.—1 పేతు. 1:12.

3. ఏ విషయాల్లో మనం నమ్మకమైన దేవదూతల ఆదర్శాన్ని పాటించవచ్చు?

3 దేవదూతలకు మనకు చాలా పోలికలు ఉన్నాయి కాబట్టి వాళ్లనుండి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు, ప్రోత్సాహం పొందవచ్చు. వినయం, ప్రజల పట్ల ప్రేమ, సహనం, సంఘాన్ని పవిత్రంగా ఉంచడం లాంటి విషయాల్లో మనం దేవదూతల ఆదర్శాన్ని ఎలా పాటించవచ్చో ఈ ఆర్టికల్‌లో చూస్తాం.

దేవదూతలు వినయం చూపిస్తారు

4. (ఎ) దేవదూతలు వినయాన్ని ఎలా చూపిస్తారు? (బి) దేవదూతలు ఎందుకు వినయంగా ఉంటారు? (కీర్తన 89:7)

4 నమ్మకమైన దేవదూతలు వినయం చూపిస్తారు. వాళ్లకు చాలా అనుభవం, శక్తి, తెలివి ఉన్నప్పటికీ వాళ్లు యెహోవా నిర్దేశాలకు లోబడతారు. (కీర్త. 103:20) వాళ్లు నియామకాలు చేస్తుండగా గొప్పలు చెప్పుకోరు లేదా వాళ్లకున్న అసాధారణ శక్తిని చూపించుకోరు. వాళ్లకు పేరు రాకపోయినా దేవుని ఇష్టాన్ని సంతోషంగా చేస్తారు.a (ఆది. 32:24, 29; 2 రాజు. 19:35) యెహోవాకు చెందాల్సిన మహిమను వాళ్లు అస్సలు ఆశించరు. దేవదూతలు ఎందుకింత వినయంగా ఉంటారు? ఎందుకంటే వాళ్లు యెహోవాను ప్రేమిస్తారు, ఆయన్ని చాలా గౌరవిస్తారు.—కీర్తన 89:7 చదవండి.

5. అపొస్తలుడైన యోహానును సరిదిద్దుతున్నప్పుడు ఒక దేవదూత ఎలా వినయం చూపించాడు? (చిత్రం కూడా చూడండి.)

5 దేవదూతలు చూపించే వినయం గురించి ఒక ఉదాహరణ గమనించండి. క్రీ.శ. 96 లో ఒక దేవదూత అపొస్తలుడైన యోహానుకు ఒక అద్భుతమైన దర్శనాన్ని చూపించాడు. ఆ దేవదూత పేరు బైబిల్లో లేదు. (ప్రక. 1:1) దర్శనం చూడగానే యోహాను ఏం చేశాడు? ఆ దేవదూతను ఆరాధించడానికి ప్రయత్నించాడు. అయితే ఆ నమ్మకమైన దేవదూత వెంటనే అతన్ని ఆపుతూ ఇలా అన్నాడు: “వద్దు! అలా చేయొద్దు! నేను కూడా నీలాగే . . . నీ సహోదరుల్లాగే ఒక దాసుణ్ణి మాత్రమే. దేవుణ్ణే ఆరాధించు!” (ప్రక. 19:10) ఆ దేవదూత తననుతాను ఎంత తగ్గించుకున్నాడో కదా! అందరి దృష్టి ఆయన మీద పడాలని, ఆయన్ని మెచ్చుకోవాలని దేవదూత ఏమాత్రం కోరుకోలేదు. ఆయన వెంటనే యోహాను దృష్టిని యెహోవా వైపుకు మళ్లించాడు. అదే సమయంలో ఆయన యోహానును చిన్నచూపు చూడలేదు. యోహాను కన్నా ఆ దేవదూత చాలాకాలంగా యెహోవాను సేవిస్తున్నా, చాలా శక్తి ఉన్నా, ఎంతో వినయంగా ఆ అపొస్తలుల్లాగే తను కూడా ఒక దాసుడే అని చెప్పాడు. ఆ దేవదూత వృద్ధుడైన యోహానును సరిదిద్దాల్సి వచ్చినా తిట్టడం గానీ, కఠినంగా ప్రవర్తించడం గానీ చేయలేదు. బదులుగా ఆయన దయగా మాట్లాడాడు. యోహాను చాలా ఆశ్చర్యపోయాడు, భయపడ్డాడు కాబట్టే అలా ఆరాధించడానికి ప్రయత్నించాడని దేవదూత అర్థం చేసుకున్నాడు.

తనను వంగి నమస్కరించి, ఆరాధించడానికి ప్రయతిస్తున్న అపొస్తలుడైన యోహానును దేవదూత ఆపుతున్నాడు.

యోహానుతో మాట్లాడేటప్పుడు దేవదూత వినయం చూపించాడు (5వ పేరా చూడండి)


6. దేవదూతల్లాగే మనం కూడా వినయాన్ని ఎలా చూపించవచ్చు?

6 దేవదూతల్లాగే మనం కూడా వినయాన్ని ఎలా చూపించవచ్చు? యెహోవా సేవలో మనం ఏం చేసినా గొప్పలు చెప్పుకోకూడదు లేదా మనం సాధించిన వాటికి ఘనత తీసుకోకూడదు. (1 కొరిం. 4:7) అంతేకాదు, యెహోవా సేవను ఎక్కువకాలం చేశామని లేదా కొన్ని సేవావకాశాలు ఉన్నాయని మనం వేరేవాళ్ల కన్నా గొప్ప అని అనుకోకూడదు. నిజానికి మన బాధ్యతలు ఎంత పెరిగితే మనల్ని మనం అంత తగ్గించుకోవాలి. (లూకా 9:48) దేవదూతల్లాగే, మనం ఇతరులకు సేవచేయడానికే ప్రయత్నించాలి. మనమే అందరికన్నా గొప్ప అని చూపించుకోవడానికి ప్రయత్నించకూడదు.

7. సరిదిద్దాల్సి వచ్చినప్పుడు లేదా సలహా ఇవ్వాల్సి వచ్చినప్పుడు మనం వినయాన్ని ఎలా చూపించవచ్చు?

7 బ్రదర్స్‌సిస్టర్స్‌ని గానీ, మన పిల్లల్ని గానీ సరిదిద్దాల్సి వచ్చినప్పుడు లేదా సలహా ఇవ్వాల్సి వచ్చినప్పుడు వినయం చూపించాలి. సలహా ఇస్తున్నప్పుడు మనం కొన్నిసార్లు సూటిగా ఉండాల్సి రావచ్చు. కానీ అవతలి వ్యక్తి మనసును విరిచేలా కాకుండా, యోహానును సరిదిద్దిన దేవదూతలాగే దయగా మాట్లాడాలి. వేరేవాళ్లు మనకంటే గొప్ప అని అనుకున్నప్పుడే మనం గౌరవపూర్వకంగా, దయగా, బైబిలు ఆధారంగా సలహా ఇస్తాం.—కొలొ. 4:6.

దేవదూతలు ప్రజల్ని ప్రేమిస్తారు

8. (ఎ) దేవదూతలకు మనుషులంటే ఇష్టమని లూకా 15:10 ఎలా చూపిస్తుంది? (బి) మనం ప్రీచింగ్‌ చేస్తున్నప్పుడు దేవదూతలు మనకు ఎలా సహాయం చేస్తారు? (చిత్రం కూడా చూడండి.)

8 మనుషులకు తమకు ఎటువంటి సంబంధం లేదన్నట్టు దేవదూతలు ఉండరు. వాళ్లకు మనుషులంటే చాలా ఇష్టం. పాపం చేసిన వ్యక్తి పశ్చాత్తాపపడినప్పుడు, అంటే ఒక తప్పిపోయిన గొర్రె యెహోవా దగ్గరికి తిరిగొచ్చినప్పుడు లేదా ఒక వ్యక్తి మార్పులు చేసుకుని సత్యంలోకి వచ్చినప్పుడు దేవదూతలు సంతోషిస్తారు. (లూకా 15:10 చదవండి.) ప్రకటనా పనిలో కూడా దేవదూతలు చాలా చురుగ్గా పనిచేస్తారు. (ప్రక. 14:6) దేవదూతలు ప్రజలకు నేరుగా ప్రకటించకపోయినా, యెహోవా గురించి నేర్చుకోవాలి అనుకుంటున్న వాళ్ల దగ్గరికి బ్రదర్స్‌సిస్టర్స్‌ని నడిపిస్తారు. అయితే ఫలానా వ్యక్తి దగ్గరికి దేవదూతే మనల్ని నడిపించాడని మనం ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే ప్రజలకు సహాయం చేయడానికి లేదా తన సేవకుల్ని నడిపించడానికి యెహోవా వేరేవాటిని, అంటే పవిత్రశక్తిని కూడా ఉపయోగిస్తాడు. (అపొ. 16:6, 7) అయితే ఒకటి మాత్రం స్పష్టం: దేవుడు చాలావరకు దేవదూతల్ని ఉపయోగిస్తున్నాడు. కాబట్టి ప్రీచింగ్‌ చేస్తున్నప్పుడు మనకు దేవదూతల మద్దతు ఉంటుందని మనం నమ్మకంతో ఉండవచ్చు.—“వాళ్ల ప్రార్థనలకు జవాబులు దొరికాయి” అనే బాక్సు చూడండి.b

కార్ట్‌ పట్టుకుని రోడ్డు మీద నడుస్తున్న ఒక జంట పైన దేవదూతలు ఉన్నారు. బెంచీ మీద కూర్చుని బాధపడుతున్న ఒక అమ్మాయిని గమనించేలా దేవదూతలు ఆ సిస్టర్‌ని నడిపించారు.

ఒక జంట కార్ట్‌ విట్‌నెసింగ్‌ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తున్నారు. దారిలో, బాధపడుతున్న ఒకామెను సిస్టర్‌ చూసింది. దేవుని సహాయం కోసం వెదికేవాళ్ల వైపు దేవదూతలు మనల్ని నడిపించగలరని సిస్టర్‌ గుర్తుతెచ్చుకుని, ఆమెను ఊరడిస్తూ మాట్లాడాలని అనుకుంది. (8వ పేరా చూడండి)


వాళ్ల ప్రార్థనలకు జవాబులు దొరికాయి

ప్రార్థనలకు జవాబు ఇవ్వడానికి యెహోవా ఈ అనుభవాల్లో దేవదూతల్ని ఉపయోగించాడా?

  • పెరూ దేశంలో 12 ఏళ్ల ఒక అమ్మాయి వాళ్ల అమ్మతో కలిసి టెలిఫోన్‌ సాక్ష్యంలో ఒకామెతో మాట్లాడింది. సహాయం కోసం ఎవరో ఒకరిని పంపించమని ఆమె దేవుణ్ణి అడుగుతూ ఉంది. ఆ అమ్మాయి చేసిన కాల్‌ ఆమె ప్రార్థనలకు జవాబుగా అనుకొని బైబిలు స్టడీకి ఒప్పుకుంది. తర్వాత ఆమె మీటింగ్స్‌కి రావడం కూడా మొదలుపెట్టింది.

  • రొమేనియాకు చెందిన ఒకామె కొంతకాలం స్టడీ తీసుకుని ఆపేసింది. తర్వాత ఆమె ఇటలీకి వెళ్లి ఒక కుటుంబం కోసం పనిచేసేది. అప్పుడు ఆమెకు మళ్లీ స్టడీ తీసుకోవాలని అనిపించింది. అక్కడ యెహోవాసాక్షులు ఎవ్వరూ తెలీక, సహాయం చేయమని ఆమె యెహోవాకు ప్రార్థన చేసింది. తర్వాత ఆ ఇంట్లోవాళ్లు ఆమెను షాప్‌కి వెళ్లమన్నారు. అయితే ఆ షాప్‌ చూసుకునే ఆయనతో మాత్రం మాట్లాడొద్దని చెప్పారు. వాళ్లు ఇలా అన్నారు: “ఆయన ఒక యెహోవాసాక్షి. షాప్‌కి వచ్చినవాళ్లతో బైబిలు గురించి మాట్లాడతాడు.” ఆమె షాప్‌కి వెళ్లినప్పుడు వాళ్లు చెప్పినట్టే ఆ బ్రదర్‌ ఆమెకు సాక్ష్యం ఇచ్చాడు. ఆమె ప్రార్థనలకు జవాబు దొరికినట్టు అనిపించింది. తర్వాత ఆమె బైబిలు స్టడీ తీసుకోవడం మొదలుపెట్టి మార్పులు చేసుకుంది. ఆమెను చూసి ఆమె కొడుకుల్లో ఒకరు స్టడీ తీసుకోవడం మొదలుపెట్టారు, మీటింగ్స్‌కి కూడా వస్తున్నారు.

  • కారు అమ్మేయాలని యెహోవాసాక్షులైన ఒక జంట అనుకున్నారు. అది కొనడానికి వచ్చిన భార్యాభర్తలకు ఆ జంట సాక్ష్యం ఇచ్చారు. ఖర్చులు తగ్గించుకుని, బైబిలు గురించి ఎక్కువమందికి చెప్పడానికే కారు అమ్మేస్తున్నామని వాళ్లకు చెప్పారు. అప్పుడు కారు కొనడానికి వచ్చిన అతను ఇలా అన్నాడు: “నేను నిన్ననే ప్రార్థించాను: ‘ప్లీజ్‌ దేవా, నాకు సహాయం చేయడానికి ఎవరినైనా పంపించు. నా జీవితంలో ఏ ఆశా లేనట్టు అనిపిస్తుంది, నాకు నీ గురించి తెలుసుకోవాలని ఉంది.’” ఇలా అనుకోకుండా యెహోవాసాక్షుల్ని కలవడం అతని ప్రార్థనలకు జవాబులా అనిపించింది. అతను, అతని భార్య, వాళ్ల ఇద్దరు పిల్లలు బైబిలు స్టడీ తీసుకోవడం మొదలుపెట్టారు. వాళ్లంతా కలిసి ఇప్పుడు మీటింగ్స్‌కి వస్తున్నారు.

9. మనం కూడా దేవదూతల్లాగే ప్రజల్ని ఎలా ప్రేమించవచ్చు?

9 మనం కూడా దేవదూతల్లాగే ప్రజల్ని ఎలా ప్రేమించవచ్చు? ఎవరైనా తిరిగి చేర్చుకోబడ్డారు అనే ప్రకటన విన్నప్పుడు దేవదూతల్లాగే మనం కూడా సంతోషించవచ్చు. వాళ్లను మనం ప్రేమిస్తున్నామని, తిరిగి యెహోవా సేవ చేస్తున్నందుకు సంతోషిస్తున్నామని చెప్పవచ్చు. (లూకా 15:4-7; 2 కొరిం. 2:6-8) అంతేకాదు, ప్రకటనా పనిలో మనం చేయగలిగినదంతా చేయడం ద్వారా దేవదూతల ఆదర్శాన్ని పాటించవచ్చు. (ప్రసం. 11:6) ప్రీచింగ్‌లో దేవదూతలు మనకు మద్దతిస్తున్నట్టే, మనం కూడా బ్రదర్స్‌సిస్టర్స్‌కి మద్దతు ఇచ్చే అవకాశాల కోసం చూడవచ్చు. ఉదాహరణకు, కొత్తగా సత్యంలోకి వచ్చి అప్పుడప్పుడే ప్రీచింగ్‌ చేయడం మొదలుపెట్టిన వాళ్లతో కలిసి పని చేయగలమా? వృద్ధులతో, అనారోగ్యంతో బాధపడుతున్న బ్రదర్స్‌సిస్టర్స్‌తో కలిసి ప్రీచింగ్‌ చేయగలమా?

10. శారా ఉదాహరణ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

10 మన పరిస్థితుల వల్ల ఎక్కువ సేవ చేయలేకపోతుంటే అప్పుడేంటి? అప్పుడు కూడా దేవదూతలు మనకు సహాయం చేస్తారని నమ్మవచ్చు. ఇండియాలో ఉంటున్న శారాc అనే సిస్టర్‌ ఉదాహరణ గమనించండి. దాదాపు 20 ఏళ్లు పయినీరుగా చేసిన తర్వాత, అనారోగ్య సమస్య వల్ల శారా మంచానికే పరిమితమైంది. అప్పుడు ఆమె చాలా బాధలో మునిగిపోయింది. కానీ బ్రదర్స్‌సిస్టర్స్‌ చూపించిన ప్రేమ, వాళ్లు చేసిన సహాయం అలాగే ఆమె క్రమంగా బైబిలు చదవడం ద్వారా తిరిగి తన సంతోషాన్ని పొందింది. అయితే ఆమె కొత్త పరిస్థితులకు తగ్గట్టు తన పరిచర్యను కూడా మార్చుకోవాల్సి వచ్చింది. ఆమె కనీసం, కూర్చుని ఉత్తరాలు కూడా రాయలేదు కాబట్టి, టెలిఫోన్‌ సాక్ష్యం మాత్రమే చేయగలిగింది. ఆమె తన రిటన్‌ విజిట్‌ వాళ్లకు కాల్‌ చేసింది. వాళ్లు ఆసక్తి ఉన్న వేరేవాళ్ల గురించి చెప్పారు. దానివల్ల కొన్ని నెలలకే శారా 70 బైబిలు స్టడీలు మొదలుపెట్టింది. అవన్నీ తను ఒక్కతే చేయలేక సంఘంలో ఉన్న బ్రదర్స్‌సిస్టర్స్‌కి కొన్ని ఇచ్చేసింది. అలా స్టడీ తీసుకుంటున్న చాలామంది, ఇప్పుడు మీటింగ్స్‌కి కూడా వస్తున్నారు. శారాలా ప్రీచింగ్‌లో చేయగలిగినదంతా చేస్తున్న బ్రదర్స్‌సిస్టర్స్‌తో కలిసి పనిచేయడానికి దేవదూతలు ఎంత సంతోషిస్తారో కదా!

దేవదూతలు సహనం చూపిస్తారు

11. సహనం చూపించే విషయంలో నమ్మకమైన దేవదూతలు తిరుగులేని ఉదాహరణ అని ఎందుకు చెప్పవచ్చు?

11 సహనం చూపించే విషయంలో నమ్మకమైన దేవదూతలకు తిరుగులేదు. వాళ్లు ఎన్నో వేల సంవత్సరాల నుండి అన్యాయాన్ని, చెడుతనాన్ని సహిస్తూ వస్తున్నారు. ఒకప్పుడు వాళ్లతో కలిసి సేవచేసిన సాతాను, ఎంతోమంది ఇతర దూతలు యెహోవాకు ఎదురుతిరగడం వాళ్లు చూశారు. (ఆది. 3:1; 6:1, 2; యూదా 6) ఒక సందర్భంలోనైతే, ఒక శక్తివంతుడైన చెడ్డదూత నేరుగా నమ్మకమైన ఒక దేవదూతను వ్యతిరేకించాడని బైబిలు చెప్తుంది. (దాని. 10:13) అంతేకాదు ఆదాముహవ్వల కాలం నుండి, కేవలం కొద్దిమంది మనుషులు మాత్రమే యెహోవాను ఆరాధించాలని నిర్ణయించుకోవడం కూడా ఆ దేవదూతలు చూస్తున్నారు. అయినాసరే నమ్మకమైన దేవదూతలు సంతోషంగా, ఉత్సాహంగా యెహోవా సేవ చేస్తూనే ఉన్నారు. సరైన సమయంలో దేవుడు అన్యాయాన్ని నామరూపాలు లేకుండా చేస్తాడని వాళ్లకు తెలుసు.

12. సహించడానికి మనకేది సహాయం చేస్తుంది?

12 దేవదూతల్లా మనం ఎలా సహనం చూపించవచ్చు? దేవదూతల్లాగే మనకు కూడా అన్యాయం, వ్యతిరేకత ఎదురవ్వచ్చు. అయినా వాళ్లలాగే, యెహోవా సరైన సమయంలో చెడుతనాన్ని తుడిచిపెట్టేస్తాడని మనం నమ్ముతాం. కాబట్టి నమ్మకమైన దేవదూతల్లాగే “మనం మానకుండా మంచిపనులు చేద్దాం.” (గల. 6:9) అంతేకాదు సహించేలా సహాయం చేస్తానని దేవుడు మాటిస్తున్నాడు. (1 కొరిం. 10:13) ఓర్పును-సంతోషాన్ని ఇచ్చే దేవుని పవిత్రశక్తి కోసం ప్రార్థించండి. (గల. 5:22; కొలొ. 1:11) మరి వ్యతిరేకత ఎదురైతే ఏం చేయాలి? కంగారుపడకుండా యెహోవా మీద పూర్తిగా నమ్మకముంచండి. ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు, మీ వెన్నంటే ఉంటాడు.—హెబ్రీ. 13:6.

సంఘాన్ని పవిత్రంగా ఉంచడానికి దేవదూతలు సహాయం చేస్తారు

13. చివరి రోజుల్లో దేవదూతలకు ఏ ప్రత్యేకమైన పని ఉంది? (మత్తయి 13:47-49)

13 చివరి రోజుల్లో దేవదూతలకు యెహోవా ఒక ప్రత్యేకమైన పనిని అప్పగించాడు. (మత్తయి 13:47-49 చదవండి.) వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న ఎన్నో లక్షలమంది ప్రకటనా పని వల్ల ఆకర్షించబడుతున్నారు. అయితే నిజక్రైస్తవులుగా అవ్వడానికి కొంతమంది మార్పులు చేసుకుంటారు, ఇంకొంతమంది చేసుకోరు. “నీతిమంతుల మధ్య నుండి దుష్టుల్ని వేరు చేసే” పని దేవదూతలకు ఇవ్వబడింది. అంటే సంఘాన్ని పవిత్రంగా ఉంచడానికి వాళ్లు సహాయం చేస్తారు. దానర్థం కొన్ని కారణాల వల్ల యెహోవాకు దూరమైపోయినవాళ్లు సంఘానికి అస్సలు తిరిగి రారని కాదు; లేదా సంఘంలో అసలు సమస్యలే ఉండవని కాదు. కానీ ఒకటి మాత్రం ఖచ్చితం, సంఘాల్ని పవిత్రంగా ఉంచడానికి దేవదూతలు చాలా కష్టపడి పనిచేస్తున్నారు.

14-15. సంఘాన్ని పవిత్రంగా ఉంచే విషయంలో దేవదూతల్లా మనం ఏం చేయవచ్చు? (చిత్రాలు కూడా చూడండి.)

14 సంఘాన్ని పవిత్రంగా ఉంచడానికి దేవదూతల్లాగే మనం ఏం చేయవచ్చు? సంఘాన్ని నైతికంగా, ఆధ్యాత్మికంగా పవిత్రంగా ఉంచడానికి మనవంతు మనం కృషిచేస్తూ ఉండాలి. దానికోసం మనం చేయాల్సిన ప్రాముఖ్యమైన పని, మన హృదయాన్ని కాపాడుకోవడం. అంటే యెహోవాను ప్రేమించేవాళ్లతో స్నేహం చేయాలి, యెహోవాతో ఉన్న సంబంధాన్ని దెబ్బతీసే దేన్నుండైనా దూరంగా ఉండాలి. (కీర్త. 101:3) మన తోటి బ్రదర్స్‌సిస్టర్స్‌ కూడా యెహోవాతో మంచి సంబంధం కలిగివుండేలా మనం సహాయం చేయవచ్చు. ఉదాహరణకు, ఎవరైనా ఘోరమైన పాపం చేశారని తెలిస్తే మనం ఏం చేయాలి? సంఘపెద్దలతో మాట్లాడమని వాళ్లకు ప్రేమగా చెప్పాలి. ఒకవేళ వాళ్లు అలా చెప్పకపోతే, మనమే సంఘపెద్దలతో ఆ విషయాన్ని చెప్పాలి. యెహోవాతో ఉన్న బంధాన్ని పాడుచేసుకున్న బ్రదర్స్‌సిస్టర్స్‌ ఎవ్వరికైనా వీలైనంత త్వరగా సహాయం అందాలని మనం కోరుకుంటాం.—యాకో. 5:14, 15.

15 విచారకరంగా, కొంతమంది ఘోరమైన పాపాలు చేసినందుకు సంఘం నుండి తొలగించబడతారు. అలాంటప్పుడు మనం వాళ్లతో ‘సహవాసం మానేయాలి.’d (1 కొరిం. 5:9-13) ఈ ఏర్పాటు వల్ల సంఘం పవిత్రంగా ఉంటుంది. అంతేకాదు, సంఘం నుండి తొలగించబడిన వాళ్లతో సహవాసం మానేయడం ద్వారా వాళ్లమీద ప్రేమ ఉందని చూపిస్తాం. ఈ విషయంలో మనం యెహోవాకు లోబడడం చూసినప్పుడు, వాళ్లు కూడా తిరిగి యెహోవా దగ్గరికి రావాలని అనుకోవచ్చు. అలా తిరిగొస్తే యెహోవా, దేవదూతలతోపాటు మనం కూడా సంతోషిస్తాం.—లూకా 15:7.

చిత్రాలు: 1. ఇద్దరు సిస్టర్స్‌ పార్క్‌లో ఒక బెంచీ మీద కూర్చుని కాఫీ తాగుతున్నారు. ఒక సిస్టర్‌ మాట్లాడుతుంటే, ఇంకో సిస్టర్‌ ఎటో చూస్తోంది. 2. తర్వాత, ఇందాక ఫోటోలో మాట్లాడిన సిస్టర్‌, రాజ్యమందిరంలో ఇద్దరు పెద్దలతో మాట్లాడుతోంది.

తోటి విశ్వాసి ఘోరమైన పాపం చేశారని తెలిస్తే, మనం ఏం చేయాలి? (14వ పేరా చూడండి)e


16. దేవదూతలకు ఉన్న ఏ లక్షణాల్ని మీరు చూపించాలి అనుకుంటున్నారు?

16 దేవదూతల నుండి నేర్చుకుని, వాళ్లతో కలిసి పనిచేసే గొప్ప అవకాశాన్ని యెహోవా మనకు ఇచ్చాడు. దేవదూతల వినయాన్ని, ప్రజలపట్ల వాళ్లకున్న ప్రేమను, వాళ్ల సహనాన్ని, సంఘాన్ని పవిత్రంగా ఉంచడానికి వాళ్లు చేసే కృషిని చూసి మనం ఎంతో నేర్చుకోవచ్చు. అలా మనం కూడా నమ్మకమైన దేవదూతల్లా ఉంటే, యెహోవా కుటుంబంలో శాశ్వతంగా ఉంటాం.

ఈ కింది విషయాల్లో దేవదూతల ఆదర్శాన్ని ఎలా పాటించవచ్చు?

  • వినయం

  • ప్రజల పట్ల ప్రేమ

  • సంఘాన్ని పవిత్రంగా ఉంచే విషయంలో వాళ్లు చేసే కృషి

పాట 123 దైవపరిపాలనా పద్ధతికి నమ్మకంగా లోబడదాం

a కోటానుకోట్ల దేవదూతల్లో ఇద్దరి పేర్లు మాత్రమే బైబిల్లో కనిపిస్తాయి—మిఖాయేలు, గబ్రియేలు.—దాని. 12:1; లూకా 1:19.

b వాచ్‌ టవర్‌ పబ్లికేషన్స్‌ ఇండెక్స్‌ (ఇంగ్లీష్‌) అనే పుస్తకంలో “Angels“ అనే ముఖ్యాంశం కింద, “angelic direction (examples)“ అనే అంశంలో మీకు ఇంకా ఎన్నో అనుభవాలు కనిపిస్తాయి.

c పేరుని మార్చాం.

d 2024 పరిపాలక సభ అప్‌డేట్‌ #2లో వివరించినట్టు, సంఘం నుండి తొలగించబడిన వ్యక్తి మీటింగ్‌కి వస్తే, వాళ్లను క్లుప్తంగా పలకరించాలా వద్దా, ఆహ్వానించాలా వద్దా అని ప్రచారకులు తమ బైబిలు శిక్షిత మనస్సాక్షిని బట్టి నిర్ణయించుకోవచ్చు.

e చిత్రాల వివరణ: పెద్దలతో మాట్లాడమని ఒక సిస్టర్‌ తన ఫ్రెండ్‌తో చెప్తోంది. కొన్ని రోజుల తర్వాత, తన ఫ్రెండ్‌ మాట్లాడకపోయేసరికి ఆ సిస్టర్‌ విషయాన్ని పెద్దలకు చెప్తోంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి