కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w24 అక్టోబరు పేజీలు 18-23
  • “మనుషుల్లో వరాల్ని” విలువైనవిగా చూడండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “మనుషుల్లో వరాల్ని” విలువైనవిగా చూడండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘సేవలు అందించే’ సంఘ పరిచారకులు
  • ‘మీ మధ్య కష్టపడి పనిచేసే’ సంఘపెద్దలు
  • బలపర్చే ప్రాంతీయ పర్యవేక్షకులు
  • “మనుషుల్లో వరాలు” మనకు అవసరం
  • సహోదరులారా—మీకు సంఘ పరిచారకులు అవ్వాలనే లక్ష్యం ఉందా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • సంఘ పరిచారకులు విలువైన సేవలు అందిస్తారు
    యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
  • సహోదరులారా—మీకు సంఘ పెద్ద అవ్వాలనే లక్ష్యం ఉందా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • పెద్దలు మరియు పరిచారకుల మధ్య అనుగుణ్యతను కాపాడుకొనుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
w24 అక్టోబరు పేజీలు 18-23

అధ్యయన ఆర్టికల్‌ 42

పాట 103 కాపరులు మనుషుల్లో వరాలు

“మనుషుల్లో వరాల్ని” విలువైనవిగా చూడండి

“ఆయన పైకి వెళ్తున్నప్పుడు . . . , మనుషుల్లో వరాల్ని ఇచ్చాడు.”—ఎఫె. 4:8.

ముఖ్యాంశం

సంఘ పరిచారకులు, పెద్దలు, ప్రాంతీయ పర్యవేక్షకులు మనకు ఎలా సహాయం చేస్తారో చూస్తాం. వీళ్లు ఎంతో నమ్మకంగా మనకోసం చేసేవాటికి కృతజ్ఞత ఎలా చూపించాలో కూడా తెలుసుకుంటాం.

1. యేసు మనకోసం ఏమేం చేశాడు?

ఇచ్చే విషయంలో యేసుకు ఏ మనిషీ సాటిరాడు. ఆయన భూమ్మీద ఉన్నప్పుడు తన శక్తిని ధారాళంగా ఉపయోగించి అద్భుతాలు చేసి ఇతరులకు సహాయం చేశాడు. (లూకా 9:12-17) ఆయన ఇచ్చిన అన్నిటికన్నా బెస్ట్‌ గిఫ్ట్‌, మనకోసం తన ప్రాణాన్ని త్యాగం చేయడం. (యోహా. 15:13) ఆయన తిరిగి బ్రతికించబడ్డాక కూడా పెద్ద మనసుతో మనకు ఇస్తూనే ఉన్నాడు. మాటిచ్చినట్టే మనకు బోధించడానికి, మనల్ని ఓదార్చడానికి పవిత్రశక్తిని ఇవ్వమని యెహోవాను అడిగాడు. (యోహా. 14:16, 17, అధస్సూచి; 16:13) అంతేకాదు భూమంతటా శిష్యుల్ని చేసే పనిని మనం ఇంకా బాగా చేసేలా మీటింగ్స్‌ ద్వారా సహాయం చేస్తూ ఉన్నాడు.—మత్త. 28:18-20.

2. ఎఫెసీయులు 4:7, 8 లో చెప్పిన “మనుషుల్లో వరాలు” అంటే ఎవరు?

2 యేసు ఇచ్చిన ఇంకొక బహుమతి గురించి ఇప్పుడు ఆలోచిద్దాం. యేసు పరలోకానికి వెళ్లాక “మనుషుల్లో వరాల్ని ఇచ్చాడు” అని అపొస్తలుడైన పౌలు రాశాడు. (ఎఫెసీయులు 4:7, 8 చదవండి.) సంఘాన్ని వేర్వేరు విధాలుగా బలపర్చడానికి యేసు ఈ వరాల్ని ఇచ్చాడని పౌలు వివరించాడు. (ఎఫె. 1:22, 23; 4:11-13) మన కాలంలో ఈ “మనుషుల్లో వరాలు” ఎవరంటే సంఘ పరిచారకులు, సంఘపెద్దలు, ప్రాంతీయ పర్యవేక్షకులు.a వీళ్లు కూడా మనలాంటి మనుషులే కాబట్టి పొరపాట్లు చేస్తుంటారు. (యాకో. 3:2) అయినా మన ప్రభువైన యేసుక్రీస్తు వాళ్లను ఉపయోగించి మనకు సహాయం చేస్తున్నాడు. వాళ్లు ఆయన మనకు ఇచ్చిన వరాలు.

3. ‘మనుషుల్లో వరాలుగా’ ఉన్న బ్రదర్స్‌కు మనందరం ఎలా సహాయం చేయవచ్చో ఒక ఉదాహరణతో చెప్పండి.

3 సంఘాన్ని బలపర్చడానికి యేసు “మనుషుల్లో వరాల్ని” ఇచ్చాడు. (ఎఫె. 4:12) వాళ్లు ఈ ముఖ్యమైన బాధ్యతను చేస్తుండగా మనందరం వాళ్లకు సహాయం చేయవచ్చు. దీన్ని అర్థం చేసుకోవడానికి ఈ ఉదాహరణ గురించి ఆలోచించండి. రాజ్యమందిరాన్ని కట్టేటప్పుడు కొంతమంది నేరుగా నిర్మాణ పనిని చేస్తుంటారు. ఇతరులు వాళ్లకు సహాయం చేస్తూ అవసరమైన ఆహారాన్ని, వస్తువుల్ని ఇస్తారు, వేరే విధానాల్లో చేయందిస్తారు. అదేవిధంగా మనలో ప్రతీఒక్కరం మన మాటల ద్వారా పనుల ద్వారా సంఘ పరిచారకులకు, సంఘపెద్దలకు, ప్రాంతీయ పర్యవేక్షకులకు సహాయం చేయవచ్చు. వాళ్లు కష్టపడి పనిచేసినప్పుడు మనం ఎలా ప్రయోజనం పొందుతామో ఇప్పుడు చూద్దాం. అలాగే వాళ్లమీద, ‘మనుషుల్లో వరాల్ని’ ఇచ్చిన యేసుమీద కృతజ్ఞతను ఎలా చూపించవచ్చో తెలుసుకుందాం.

‘సేవలు అందించే’ సంఘ పరిచారకులు

4. మొదటి శతాబ్దంలో సంఘ పరిచారకులు ఏయే విధాలుగా “సేవలు అందించేవాళ్లు”?

4 మొదటి శతాబ్దంలో కొంతమంది సహోదరులు సంఘ పరిచారకులుగా నియమించబడ్డారు. (1 తిమో. 3:8) “ఇతరులకు సేవలు అందించేవాళ్లు” అని అపొస్తలుడైన పౌలు రాసింది, వీళ్ల గురించే అయ్యుంటుంది. (1 కొరిం. 12:28) సంఘ పరిచారకులు కొన్ని ముఖ్యమైన పనులు చేసి పెట్టేవాళ్లు. దాంతో పెద్దలు బోధించే పనిమీద, సంఘాన్ని కాసే పనిమీద మనసుపెట్టగలిగారు. ఉదాహరణకు లేఖనాల్ని కాపీ చేసే (నకలు రాసే) పనిలో వాళ్లు సహాయం చేసుంటారు లేదా కాపీ చేయడానికి అవసరమైన వస్తువుల్ని కొనడం లాంటి పనుల్ని చేసుంటారు.

5. మనకాలంలో సంఘ పరిచారకులు ఏయే విధాలుగా సేవలు అందిస్తున్నారు?

5 సంఘ పరిచారకులు చేసే కొన్ని ముఖ్యమైన పనుల గురించి ఆలోచించండి. (1 పేతు. 4:10) అకౌంట్స్‌ని-టెరిటరీని చూసుకోవడం, ప్రచురణల్ని ఆర్డర్‌ పెట్టడం, అవి ప్రచారకులకు అందుబాటులో ఉండేలా చూడడం, ఆడియో-వీడియో పనులు చూసుకోవడం, అటెండెంట్‌గా ఉండడం, రాజ్యమందిరం క్లీనింగ్‌లో, రిపేరు పనుల్లో సహాయం చేయడం లాంటివి వాళ్లు చేస్తుంటారు. ప్రచారకులందరూ మీటింగ్స్‌ని మంచిగా ఆనందించడానికి, ప్రీచింగ్‌ని క్రమపద్ధతిలో చేయడానికి ఈ పనులన్నీ సహాయం చేస్తాయి. (1 కొరిం. 14:40) అంతేకాదు కొంతమంది సంఘ పరిచారకులు క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్‌లో భాగాలు చేస్తారు, బహిరంగ ప్రసంగాలు కూడా ఇస్తారు. కొంతమంది సంఘ పరిచారకుల్ని ఫీల్డ్‌ సర్వీస్‌ గ్రూపు ఓవర్‌సీర్‌కు సహాయకుడిగా కూడా నియమించవచ్చు. ఇంకొన్నిసార్లు అర్హులైన సంఘ పరిచారకులు పెద్దలతో కలిసి కాపరి సందర్శనాలకు కూడా వెళ్తారు.

6. కష్టపడి పనిచేస్తున్న సంఘ పరిచారకుల్ని మెచ్చుకోవడానికి కొన్ని కారణాలు ఏంటి?

6 సంఘ పరిచారకులు సంఘంలో చేసే సేవ గురించి కొంతమందికి ఏం అనిపిస్తుంది? బొలీవియాలో ఉంటున్న బెబెర్లిb అనే సిస్టర్‌ ఇలా చెప్తుంది: “సంఘ పరిచారకుల వల్ల నేను మీటింగ్స్‌ని పూర్తిగా ఎంజాయ్‌ చేయగలుగుతున్నాను. వాళ్లు చేస్తున్న పనివల్ల నేను పాటలు పాడగలుగుతున్నాను, కామెంట్స్‌ చెప్పగలుగుతున్నాను, టాక్స్‌ వినగలుగుతున్నాను, వీడియోలు-చిత్రాల నుండి నేర్చుకోగలుగుతున్నాను. వాళ్లు మీటింగ్‌లో అందరూ సురక్షితంగా ఉండేలా చూసుకుంటారు, జూమ్‌ ద్వారా మీటింగ్‌కి హాజరయ్యేవాళ్లకు సహాయం చేస్తారు. మీటింగ్‌ తర్వాత కూడా రాజ్యమందిరాన్ని శుభ్రం చేసే విషయంలో ముందుంటారు. అకౌంట్స్‌ పనులు చేస్తారు, అవసరమైన ప్రచురణలు ఉండేలా చూసుకుంటారు. వాళ్లకు ఎంత థ్యాంక్స్‌ చెప్పినా తక్కువే.” కొలంబియాలో ఉంటున్న సిస్టర్‌ లెస్లీ వాళ్లాయన సంఘపెద్దగా సేవచేస్తున్నాడు. ఆమె ఇలా అంటుంది: “మా ఆయనకు వేర్వేరు పనుల్లో సంఘ పరిచారకుల అవసరం చాలా ఉంది. వాళ్లే గనుక లేకపోతే ఆయన ఇంకా బిజీగా ఉండేవాడు. అందుకే ఉత్సాహంగా, ఇష్టంగా సహాయం చేయడానికి ముందుకొచ్చిన ఈ బ్రదర్స్‌కి చాలా థ్యాంక్స్‌.” మన సంఘంలో ఉన్న సంఘ పరిచారకుల గురించి కూడా మనకు అలానే అనిపిస్తుంది కదా!—1 తిమో. 3:13.

7. సంఘ పరిచారకుల మీద కృతజ్ఞతను ఎలా చూపించవచ్చు? (చిత్రం కూడా చూడండి.)

7 సంఘ పరిచారకుల మీద మనకు మనసు నిండా కృతజ్ఞత ఉంది. అయితే ఆ “కృతజ్ఞతను” బయటికి చూపించమని బైబిలు ప్రోత్సహిస్తుంది. (కొలొ. 3:15) ఫిన్‌లాండ్‌లో క్రిస్‌టాఫ్‌ అనే సంఘపెద్ద తన కృతజ్ఞతను ఏయే విధాలుగా చూపిస్తాడో చెప్తున్నాడు: “నేను ఒక కార్డు గానీ, మెసేజ్‌ గానీ పంపిస్తాను. అందులో ఒక లేఖనంతో పాటు ఆ సంఘ పరిచారకుడు నన్ను ఎలా ప్రోత్సహించాడో రాస్తాను. లేదా ఆయన చేస్తున్న సేవ ఎంత విలువైనదో రాస్తాను.” న్యూ కలెడోనియాలో ఉంటున్న పాస్కల్‌, జాయెల్‌ అనే జంట తరచూ సంఘ పరిచారకుల కోసం ప్రార్థన చేస్తుంటారు. పాస్కల్‌ ఇలా అంటున్నాడు: “ఈమధ్య మేము సంఘ పరిచారకుల గురించి ఎక్కువగా ప్రార్థిస్తున్నాం. వాళ్లను ఇచ్చినందుకు యెహోవాకు థ్యాంక్స్‌ చెప్తూ వాళ్లకు తోడుగా ఉండమని, వాళ్లకు ఎప్పుడూ సహాయం చేయమని ఆయన్ని అడుగుతున్నాం.” అలాంటి ప్రార్థనల్ని యెహోవా వింటాడు, సంఘమంతా ఎంతో ప్రయోజనం పొందుతుంది.—2 కొరిం. 1:11.

‘మీ మధ్య కష్టపడి పనిచేసే’ సంఘపెద్దలు

8. తన తోటి పెద్దలు ‘కష్టపడి పనిచేసేవాళ్లని’ పౌలు ఎందుకు రాశాడు? (1 థెస్సలొనీకయులు 5:12, 13)

8 మొదటి శతాబ్దంలోని పెద్దలు సంఘం కోసం కష్టపడి పనిచేసేవాళ్లు. (1 థెస్సలొనీకయులు 5:12, 13 చదవండి; 1 తిమో. 5:17) వాళ్లు మీటింగ్స్‌ చూసుకోవడం, పెద్దల సభగా నిర్ణయాలు తీసుకోవడం లాంటివి చేస్తూ సంఘానికి ‘నాయకత్వం వహించేవాళ్లు.’ సంఘాన్ని కాపాడడానికి బ్రదర్స్‌-సిస్టర్స్‌కి ప్రేమగా సూటిగా సలహాలు ఇస్తూ ‘ఉపదేశించేవాళ్లు.’ (1 థెస్స. 2:11, 12; 2 తిమో. 4:2) అయితే వాళ్లు తమ కుటుంబాల్ని పోషించుకోవడానికి, తమనుతాము ఆధ్యాత్మికంగా బలంగా ఉంచుకోవడానికి కూడా కష్టపడేవాళ్లు.—1 తిమో. 3:2, 4; తీతు 1:6-9.

9. మనకాలంలో పెద్దలకు ఉన్న కొన్ని బాధ్యతలు ఏంటి?

9 ఇప్పుడు కూడా సంఘపెద్దలు చాలా బిజీగా ఉంటారు. వాళ్లు మంచివార్త ప్రచారకులు. (2 తిమో. 4:5) ఉత్సాహంగా ప్రీచింగ్‌ చేస్తూ మంచి ఆదర్శాన్ని ఉంచుతారు. టెరిటరీలో ప్రీచింగ్‌కి సంబంధించిన ఏర్పాట్లు చేస్తారు. నైపుణ్యంగా ప్రకటించడానికి, బోధించడానికి మనకు శిక్షణ ఇస్తారు. వాళ్లు కరుణతో, పక్షపాతం లేకుండా తీర్పుతీరుస్తారు. సంఘంలో ఎవరైనా ఘోరమైన పాపం చేసినప్పుడు, ఆ వ్యక్తి యెహోవాతో తన బంధాన్ని బాగుచేసుకునేలా సహాయం చేయడానికి పెద్దలు బాగా కృషిచేస్తారు. అదేసమయంలో సంఘమంతా పవిత్రంగా ఉండేలా చూసుకుంటారు. (1 కొరిం. 5:12, 13; గల. 6:1) పెద్దలు ముఖ్యంగా కాపరులు. (1 పేతు. 5:1-3) వాళ్లు బాగా ప్రిపేర్‌ అయ్యి ప్రసంగాలు ఇస్తారు, సంఘంలో ప్రతీఒక్కరి గురించి తెలుసుకోవడానికి కృషి చేస్తారు, కాపరి సందర్శనాలు చేస్తారు. ఇంకొంతమంది పెద్దలైతే రాజ్యమందిర నిర్మాణ పనులు, రిపేర్‌ పనులు చేస్తారు, సమావేశాల్ని ఏర్పాటు చేస్తారు, ఆసుపత్రి అనుసంధాన కమిటీల్లో, రోగి సందర్శనా గ్రూపుల్లో కూడా సేవ చేస్తారు. వీటితోపాటు ఇంకా వేర్వేరు పనులు కూడా చేస్తారు. సంఘపెద్దలు నిజంగా మనకోసం చెమటోడ్చి కష్టపడతారు!

10. కష్టపడి పనిచేస్తున్న సంఘపెద్దల్ని మెచ్చుకోవడానికి కొన్ని కారణాలు ఏంటి?

10 కాపరులు మనల్ని బాగా చూసుకుంటారని, మనం ‘ఇక భయపడిపోం, బెదిరిపోం’ అని యెహోవా ముందే చెప్పాడు. (యిర్మీ. 23:4) ఫిన్‌లాండ్‌లో ఉంటున్న యోహాన అనే సిస్టర్‌, వాళ్ల అమ్మకు ఒంట్లో బాలేనప్పుడు ఆ మాటల అర్థాన్ని రుచి చూసింది. ఆమె ఇలా చెప్తుంది: “నా ఫీలింగ్స్‌ గురించి వేరేవాళ్లకు చెప్పడం నాకు కష్టంగా అనిపిస్తుంది. కానీ నాకు అంతగా తెలియని ఒక సంఘపెద్ద నేను చెప్పేవన్నీ ఓపిగ్గా విన్నాడు, మాతో కలిసి ప్రార్థన చేశాడు. యెహోవా నన్ను ప్రేమిస్తున్నాడని భరోసా ఇచ్చాడు. ఆయన ఏం చెప్పాడో నాకు సరిగ్గా గుర్తులేదు గానీ నా భయం పోయిందని మాత్రం నాకు గుర్తుంది. సరైన సమయంలో సహాయం చేయడానికి యెహోవాయే ఆయన్ని పంపించాడని నేను నమ్ముతున్నాను.” మీ సంఘంలో ఉన్న పెద్దలు మీకెలా సహాయం చేశారు?

11. పెద్దల మీద మనం ఎలా కృతజ్ఞత చూపించవచ్చు? (చిత్రం కూడా చూడండి.)

11 సంఘపెద్దలు “చేసే పనిని బట్టి” మనం వాళ్ల మీద మనసారా కృతజ్ఞత చూపించాలని యెహోవా కోరుతున్నాడు. (1 థెస్స. 5:12, 13) ఫిన్‌లాండ్‌లో ఉంటున్న హెన్రీయెట అనే సిస్టర్‌ ఇలా చెప్తుంది: “పెద్దలు వేరేవాళ్లకు ఇష్టంగా సహాయం చేస్తారు. అంటే వాళ్ల దగ్గర వేరేవాళ్ల కన్నా ఎక్కువ టైం, ఎక్కువ శక్తి ఉన్నాయని కాదు, వాళ్ల జీవితంలో అసలు సమస్యలే లేవని కూడా కాదు. కొన్నిసార్లు నేను వాళ్లతో ‘మీకొక విషయం చెప్పనా? మీరు నిజంగా చాలా మంచి పెద్ద’ అని చెప్తుంటాను.” తుర్కియేలోc ఉంటున్న సెర అనే సిస్టర్‌ ఇలా చెప్తుంది: “ఒక బండి ముందుకు వెళ్తూ ఉండాలంటే పెట్రోల్‌ అవసరం. పెద్దలు కూడా ముందుకెళ్తూ ఉండాలంటే వాళ్లకు ‘ప్రోత్సాహం’ అవసరం. కాబట్టి మనం వాళ్లకు కార్డు రాయవచ్చు, భోజనానికి పిలవవచ్చు, వాళ్లతో కలిసి ప్రీచింగ్‌కి వెళ్లొచ్చు.” కష్టపడి పనిచేసే పెద్దల్లో ఎవరికైనా మీరు థ్యాంక్స్‌ చెప్పాలనుకుంటున్నారా? అలాగైతే ఆయనకు కృతజ్ఞత చూపించడానికి అవకాశాల కోసం చూడండి.—1 కొరిం. 16:18.

సంఘపెద్ద మీటింగ్‌లో టాక్‌ ఇస్తున్నాడు. చిత్రాలు: పెద్దలకు మనం ఈ మార్గాల్లో కృతజ్ఞత చూపించవచ్చు. 1. ఒక సంఘపెద్ద, అతని భార్యను ఒక జంట భోజనానికి పిలిచారు. 2. ఒక వృద్ధ సహోదరి ప్రార్థిస్తుంది. 3. ఆ వృద్ధ సహోదరి కార్డ్‌ రాస్తుంది.

బండి ముందుకు వెళ్తూ ఉండాలంటే పెట్రోల్‌ అవసరం. బాధ్యతలు ఉన్న సహోదరులు కూడా ముందుకెళ్తూ ఉండాలంటే వాళ్లకు ‘ప్రోత్సాహం’ అవసరం (7, 11, 15 పేరాలు చూడండి)


బలపర్చే ప్రాంతీయ పర్యవేక్షకులు

12. మొదటి శతాబ్దంలో సంఘాల్ని బలపర్చడానికి ఎవర్ని కూడా నియమించారు? (1 థెస్సలొనీకయులు 2:7, 8)

12 యేసు ఇచ్చిన “మనుషుల్లో వరాలు” సంఘం కోసం ఇంకో విధంగా కూడా పనిచేస్తారు. యేసు నిర్దేశం కింద యెరూషలేములో ఉన్న పెద్దలు పౌలును, బర్నబాను, ఇంకొంతమందిని ప్రయాణ పర్యవేక్షకులుగా పంపించారు. (అపొ. 11:22) ఎందుకు? సంఘ పరిచారకులు, పెద్దల్లానే వీళ్లను కూడా సంఘాన్ని బలపర్చడానికి నియమించారు. (అపొ. 15:40, 41) ఈ సహోదరులు సుఖాల్ని త్యాగం చేసి, ఆఖరికి తమ ప్రాణాల్ని కూడా తెగించి ఇతరులకు బోధించారు, ప్రోత్సాహాన్ని ఇచ్చారు.—1 థెస్సలొనీకయులు 2:7, 8 చదవండి.

13. ప్రాంతీయ పర్యవేక్షకులకు ఉన్న కొన్ని బాధ్యతలు ఏంటి?

13 ప్రాంతీయ పర్యవేక్షకులు చాలా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొంతమందైతే ఒక సంఘం నుండి ఇంకో సంఘానికి వెళ్లడానికి వందల కిలోమీటర్లు ప్రయాణిస్తారు. ప్రతీవారం ప్రాంతీయ పర్యవేక్షకుడు చాలా ప్రసంగాలు ఇవ్వాలి, కాపరి సందర్శనాలకు వెళ్లాలి, పయినీర్లతో-పెద్దలతో మీటింగ్స్‌ జరపాలి, క్షేత్రసేవా కూటాలు కూడా నిర్వహించాలి. ప్రాంతీయ, ప్రాదేశిక సమావేశాల కోసం ఏర్పాట్లు చేయాలి. ప్రసంగాల కోసం కూడా ప్రిపేర్‌ అవ్వాలి. ఇంకా పయినీరు పాఠశాలలో బోధించాలి. సర్క్యూట్లలో ఉన్న పయినీర్లతో ఒక ప్రత్యేక కూటాన్ని ఏర్పాటు చేయాలి. ఇవే కాకుండా కొన్ని ప్రాముఖ్యమైన, అత్యవసరమైన పనుల్ని బ్రాంచ్‌ ఆయనకు నియమిస్తుంది.

14. కష్టపడి పనిచేస్తున్న ప్రాంతీయ పర్యవేక్షకుల్ని మెచ్చుకోవడానికి కొన్ని కారణాలు ఏంటి?

14 ప్రాంతీయ పర్యవేక్షకులు చేసే పని నుండి సంఘాలు ఎలా ప్రయోజనం పొందుతాయి? ప్రాంతీయ పర్యవేక్షకుల సందర్శనాన్ని గుర్తు చేసుకుంటూ తుర్కియేలో ఉంటున్న ఒక బ్రదర్‌ ఇలా చెప్తున్నాడు: “వాళ్లు సందర్శించిన ప్రతీసారి బ్రదర్స్‌-సిస్టర్స్‌కి సహాయం చేయాలనే కోరిక నాలో ఇంకా పెరిగేది. నేను చాలామంది ప్రాంతీయ పర్యవేక్షకుల్ని కలిశాను. వాళ్లలో ఒక్కరు కూడా చాలా బిజీగా ఉన్నట్టు, మాట్లాడేంత తీరిక కూడా లేనట్టు కనిపించలేదు.” ముందు చెప్పిన యోహాన ప్రాంతీయ పర్యవేక్షకునితో ప్రీచింగ్‌ చేసినప్పుడు ఒక్కరు కూడా ఇంట్లో లేరు. ఆమె ఇలా అంటుంది: “అయినాసరే ఆ రోజుని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే దానికి కొన్ని రోజుల ముందే మా అక్కలు మా దగ్గర నుండి వేరే చోటుకు వెళ్లిపోయారు. నాకు వాళ్లు చాలా గుర్తొచ్చేవాళ్లు. ఆ రోజు ప్రాంతీయ పర్యవేక్షకుడు నన్ను ప్రేమతో ప్రోత్సహించాడు. ప్రస్తుతం మన ఇంట్లోవాళ్లతో, స్నేహితులతో బహుశా ఒక్క దగ్గరే ఉండలేమేమో గానీ కొత్తలోకంలో మాత్రం వాళ్లతో టైం గడపడానికి బోలెడన్ని అవకాశాలు ఉంటాయని చెప్పాడు.” మనలో చాలామందికి కూడా ప్రాంతీయ పర్యవేక్షకులతో గడిపిన ఎన్నో కమ్మని జ్ఞాపకాలు ఉండి ఉంటాయి.—అపొ. 20:37–21:1.

15. (ఎ) మూడో యోహాను 5-8 ప్రకారం, ప్రాంతీయ పర్యవేక్షకులకు మనం ఎలా కృతజ్ఞత చూపించవచ్చు? (చిత్రం కూడా చూడండి.) (బి) కష్టపడి పనిచేస్తున్న సహోదరుల భార్యల్ని మనం ఎందుకు మెచ్చుకోవాలి? దాన్ని ఎలా చేయవచ్చు? (“వాళ్ల భార్యల్ని గుర్తుచేసుకోండి” బాక్సు చూడండి.)

15 అపొస్తలుడైన యోహాను, సంఘాల్ని బలపర్చడానికి వచ్చిన సహోదరులకు ఆతిథ్యం ఇచ్చి, “దేవుడు ఇష్టపడే విధంగా వాళ్లను సాగనంపు” అని గాయియుకు చెప్పాడు. (3 యోహాను 5-8 చదవండి.) దానికోసం మనం చేయగలిగే ఒక పని ఏంటంటే, ప్రాంతీయ పర్యవేక్షకున్ని భోజనానికి ఆహ్వానించడం. ఇంకో పని, ఆయన సందర్శనంలో ప్రీచింగ్‌ ఏర్పాట్లకు మద్దతివ్వడం. ముందు చెప్పిన లెస్లీ తన కృతజ్ఞతను వేరే విధానాల్లో కూడా చూపిస్తుంది. ఆమె ఇలా చెప్తుంది: “వాళ్లకు ఏం అవసరమో అవి ఇవ్వమని నేను యెహోవాకు ప్రార్థన చేస్తాను. వాళ్ల సందర్శనం మాకు ఎలా సహాయం చేసిందో చెప్తూ నేను, మా ఆయన ఉత్తరాలు కూడా రాశాం.” ప్రాంతీయ పర్యవేక్షకులు సూపర్‌ హీరోలు కాదని గుర్తుంచుకోండి. వాళ్లకు కూడా మనలాగే చాలా కష్టాలు ఉంటాయి, అలసిపోతారు. కొన్నిసార్లు అనారోగ్యం, ఆందోళన, నిరుత్సాహం లాంటివి కూడా ఎదుర్కొంటారు. మీరు ప్రేమతో మాట్లాడే ఒకట్రెండు మాటలు లేదా మీరు ఇచ్చే చిన్న గిఫ్ట్‌ బహుశా మీ ప్రాంతీయ పర్యవేక్షకుడు చేసిన ప్రార్థనకు జవాబు అయ్యుండవచ్చు.—సామె. 12:25.

వాళ్ల భార్యల్ని గుర్తుచేసుకోండి

సంఘ పరిచారకులు, సంఘపెద్దలు, ప్రాంతీయ పర్యవేక్షకులు సంఘానికి సహాయం చేస్తున్నారంటే దానికోసం వాళ్ల భార్యలు ఎన్నో త్యాగాలు చేస్తున్నారు. ఒక సిస్టర్‌ ఇలా అంటుంది, “ఈ సిస్టర్స్‌ ఒకవిధంగా తమ భర్తల్ని యెహోవాకు అప్పు ఇచ్చారు. అందుకే యెహోవా వాళ్లను ప్రియమైన కూతుళ్లలా చూస్తాడు.” స్వార్థంలేని ఈ సిస్టర్స్‌ మీద కృతజ్ఞతను ఎలా చూపించవచ్చు?

  • వాళ్లకు థ్యాంక్స్‌ చెప్పండి. “మీ భర్తను సంఘం కోసం త్యాగం చేస్తున్నందుకు థ్యాంక్యూ” అనే చిన్న మాట వాళ్లకు కొండంత ప్రోత్సాహాన్ని ఇస్తుంది.

  • వాళ్ల గురించి ఆలోచించండి. మీ చింతల గురించి ఈ బ్రదర్స్‌తో మాట్లాడడానికి మొహమాటపడకండి. కానీ కొన్నిసార్లు వాళ్లు తమ కుటుంబానికి ప్రాముఖ్యత ఇవ్వాలని గుర్తుంచుకోండి. (1 తిమో. 3:4, 5, 12) వాళ్లు తమ భార్యాపిల్లలతో ప్రీచింగ్‌ చేయడానికి, కుటుంబ ఆరాధన చేసుకోవడానికి, సరదాగా సమయం గడపడానికి కూడా టైం పెట్టాలి.

  • వాళ్లకోసం ప్రార్థన చేయండి. వాళ్ల భర్తలు ఎలాగైతే ‘మనుషుల్లో వరాలో,’ బుద్ధిగల భార్యలు కూడా యెహోవా ఇచ్చే బహుమతులే. (సామె. 19:14) ఈ సిస్టర్స్‌ని ఇచ్చినందుకు యెహోవాకు థ్యాంక్స్‌ చెప్పండి, వాళ్లను బలపరుస్తూ ఉండమని ఆయన్ని అడగండి.

“మనుషుల్లో వరాలు” మనకు అవసరం

16. సామెతలు 3:27 ప్రకారం, బ్రదర్స్‌ ఏయే ప్రశ్నల గురించి ఆలోచించవచ్చు?

16 ‘మనుషుల్లో వరాలుగా’ సేవచేయడానికి ప్రపంచవ్యాప్తంగా చాలామంది బ్రదర్స్‌ మనకు అవసరం. మీరు బాప్తిస్మం తీసుకున్న బ్రదర్‌ అయితే, ఈ విధంగా సేవ చేయడానికి ముందుకు రాగలరా? (సామెతలు 3:27 చదవండి.) సంఘ పరిచారకుడిగా సేవచేయాలనే లక్ష్యాన్ని పెట్టుకోగలరా? మీరు ఇప్పటికే సంఘ పరిచారకులైతే, సంఘపెద్ద అవ్వాలనే లక్ష్యాన్ని పెట్టుకోగలరా?d రాజ్య సువార్తికుల కోసం పాఠశాలకు అప్లయి చేయడానికి మీ జీవితంలో సర్దుబాట్లు చేసుకోగలరా? ఆ పాఠశాల వల్ల యేసు మిమ్మల్ని ఇంకా బాగా ఉపయోగించుకునేలా మీరు ట్రైనింగ్‌ పొందుతారు. ఒకవేళ ఇవేవీ చేయలేరని మీకు అనిపిస్తే యెహోవాకు ప్రార్థన చేయండి. మీకు ఎలాంటి పని అప్పగించినా దాన్ని బాగా చేయడానికి తన పవిత్రశక్తిని ఇవ్వమని అడగండి.—లూకా 11:13; అపొ. 20:28.

17. మన రాజైన యేసుక్రీస్తు ఈ చివరిరోజుల్లో మనల్ని నడిపిస్తున్నాడు అనడానికి రుజువేంటి?

17 ఈ చివరిరోజుల్లో యేసు మనల్ని నడిపిస్తున్నాడు అనడానికి ‘మనుషుల్లో వరాలుగా’ ఉన్న ఈ బ్రదర్సే రుజువు. (మత్త. 28:20) ప్రేమ చూపిస్తూ, పెద్ద మనసుతో మనల్ని పట్టించుకుంటూ రాజైన యేసు మన అవసరాల్ని తీర్చడానికి ఈ బ్రదర్స్‌ని ఇచ్చినందుకు మనం ఆయనకు ఎంత కృతజ్ఞులమో కదా! కాబట్టి కష్టపడి పనిచేస్తున్న ఈ బ్రదర్స్‌ మీద కృతజ్ఞత చూపించే అవకాశాల కోసం వెదకండి. అలాగే యెహోవాకు థాంక్స్‌ చెప్పడం ఎప్పుడూ మర్చిపోకండి. ఎంతైనా “ప్రతీ మంచి బహుమతి, ప్రతీ పరిపూర్ణ వరం” ఇచ్చేది ఆయనే కదా!—యాకో. 1:17.

ఈ బ్రదర్స్‌ మీద మీరు ఎందుకు కృతజ్ఞత చూపించాలనుకుంటున్నారు?

  • సంఘ పరిచారకులు

  • సంఘపెద్దలు

  • ప్రాంతీయ పర్యవేక్షకులు

పాట 99 వేవేల సహోదరులు

a కొంతమంది పెద్దలు పరిపాలక సభ సభ్యులుగా, పరిపాలక సభ సహాయకులుగా, బ్రాంచి కమిటీ సభ్యులుగా సేవ చేస్తున్నారు. ఇంకొంతమంది పెద్దలేమో సంస్థలో వేరే పనులు కూడా చేస్తున్నారు. వీళ్లంతా “మనుషుల్లో వరాలే.”

b కొన్ని పేర్లను మార్చాం.

c ఒకప్పుడు టర్కీ అని పిలిచేవాళ్లు.

d మీరు సంఘ పరిచారకులుగా లేదా సంఘపెద్దలుగా సేవ చేయడానికి ముందుకు రావాలనుకుంటే 2024, నవంబరు కావలికోట సంచికలో ఉన్న “సహోదరుల్లారా—మీకు సంఘ పరిచారకులు అవ్వాలనే లక్ష్యం ఉందా?” “సహోదరుల్లారా—మీకు సంఘపెద్ద అవ్వాలనే లక్ష్యం ఉందా?” అనే ఆర్టికల్స్‌ చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి