కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w23 నవంబరు పేజీలు 2-7
  • యెహోవా పరదైసు గురించి ఇచ్చిన మాట తప్పడు!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా పరదైసు గురించి ఇచ్చిన మాట తప్పడు!
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా ఏమని మాటిచ్చాడు?
  • యెహోవా మాట నిలబెట్టుకుంటానని గ్యారంటీ ఇచ్చాడు
  • “ఇదిగో! నేను అన్నిటినీ కొత్తవిగా చేస్తున్నాను”
  • “ఈ మాటలు నమ్మదగినవి, సత్యమైనవి . . . అవి నెరవేరాయి!”
  • “నేనే ఆల్ఫాను, ఓమెగను”
  • పరదైసు గురించి యెహోవా ఇచ్చిన మాట మీద మన నమ్మకాన్ని ఎలా పెంచుకోవచ్చు?
  • ‘ఆల్ఫా, ఓమెగ’ అంటే ఏమిటి? ఆ పదం ఎవర్ని సూచిస్తుంది?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • క్రొత్త ఆకాశము క్రొత్త భూమి
    ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది
  • దేవుడు ఏ ఉద్దేశంతో మనుషుల్ని చేశాడు?
    బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?
  • భూమిపట్ల దేవుని సంకల్పం ఏమిటి?
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
w23 నవంబరు పేజీలు 2-7

అధ్యయన ఆర్టికల్‌ 46

యెహోవా పరదైసు గురించి ఇచ్చిన మాట తప్పడు!

“భూమ్మీద తమ కోసం దీవెనను వెదికే వాళ్లు సత్యవంతుడైన దేవుని చేత దీవించబడతారు.”—యెష. 65:16.

పాట 3 మా బలం, మా నిరీక్షణ, మా ధైర్యం

ఈ ఆర్టికల్‌లో …a

1. తన తోటి ఇశ్రాయేలీయులకు యెషయా ప్రవక్త ఏ విషయం చెప్పాడు?

యెషయా ప్రవక్త యెహోవాను “సత్యవంతుడైన” దేవుడని అన్నాడు. “సత్యం” అని అనువదించిన పదానికి అక్షరార్థంగా “ఆమేన్‌” అనే అర్థం ఉంది. (యెష. 65:16, అధస్సూచి.) “ఆమేన్‌” అంటే “అలాగే జరగాలి” లేదా “ఖచ్చితంగా” అనే అర్థం వస్తుంది. యెహోవా గురించి, యేసు గురించి చెప్తున్నప్పుడు బైబిలు “ఆమేన్‌” అని ఉపయోగిస్తే వాళ్లు చెప్పేది సత్యమని అది గ్యారంటీ ఇస్తుంది. కాబట్టి యెషయా తన తోటి ఇశ్రాయేలీయులకు చెప్తున్న విషయం చాలా స్పష్టంగా ఉంది. అదేంటంటే: యెహోవా ఏదైనా చెప్తే అది జరిగి తీరుతుంది అంతే! నిజానికి, యెహోవా అంతకుముందు ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకుంటూ వచ్చాడు.

2. భవిష్యత్తు గురించి యెహోవా ఇచ్చిన మాటను మనం ఎందుకు నమ్మవచ్చు? ఈ ఆర్టికల్‌లో ఏ ప్రశ్నలు పరిశీలిస్తాం?

2 మన భవిష్యత్తు గురించి యెహోవా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడని నమ్మవచ్చా? యెషయా జీవించిన దాదాపు 800 సంవత్సరాల తర్వాత, అపొస్తలుడైన పౌలు దేవుడిచ్చిన మాట ఎందుకు నమ్మదగినదో చెప్పాడు. పౌలు ఇలా అన్నాడు: ‘దేవుడు అబద్ధమాడడం అసాధ్యం.’ (హెబ్రీ. 6:18) ఒక మంచినీటి ఊట నుండి మంచి నీళ్లే వస్తాయి గానీ ఉప్పు నీళ్లు రావు. అలాగే, సత్యానికి మూలమైన యెహోవా నిజాలే చెప్తాడు గానీ అబద్ధాలు చెప్పడు. కాబట్టి, యెహోవా మన భవిష్యత్తు గురించి ఇచ్చిన మాటతో సహా, ఆయన చెప్పినవన్నీ నిలబెట్టుకుంటాడనే నమ్మకంతో ఉండవచ్చు. ఇంతకీ, మనకు ఎలాంటి భవిష్యత్తు ఇస్తానని యెహోవా మాటిచ్చాడు? ఆయన ఆ మాట నిలబెట్టుకుంటాడని గ్యారంటీ ఏంటి? అనే ప్రశ్నల గురించి ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.

యెహోవా ఏమని మాటిచ్చాడు?

3. (ఎ) దేవుని సేవకులకు ఎంతో ఇష్టమైన వాగ్దానం ఏంటి? (ప్రకటన 21:3, 4) (బి) దానిగురించి చెప్పినప్పుడు కొంతమంది ఎలా స్పందిస్తారు?

3 దేవుని సేవకులందరికీ ఎంతో ఇష్టమైన ఒక వాగ్దానాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. (ప్రకటన 21:3, 4 చదవండి.) “మరణం ఇక ఉండదు, దుఃఖం గానీ ఏడ్పు గానీ నొప్పి గానీ” ఇక ఉండని కాలం తీసుకొస్తానని యెహోవా మాటిస్తున్నాడు. హృదయాన్ని హత్తుకునే ఈ మాటల్ని మనం ప్రజలకు పరదైసు గురించి చెప్తున్నప్పుడు చూపిస్తాం. దానికి కొంతమంది ఎలా స్పందిస్తారు? “వినడానికైతే బాగుంది గానీ, నమ్మడానికి మాత్రం చాలా కష్టంగా ఉంది” అని వాళ్లు అనొచ్చు.

4. (ఎ) యెహోవాకు ఏ విషయాలు ముందే తెలుసు? (బి) యెహోవా మాటివ్వడం మాత్రమే కాకుండా ఇంకేం చేశాడు?

4 పరదైసులో జీవితం గురించి యెహోవా అపొస్తలుడైన యోహాను ద్వారా రాయించాడు. ఆ మాటల్ని ప్రస్తుతం మనం పరిచర్యలో ఉపయోగిస్తామని యెహోవాకు తెలుసు. అలాగే ఆ “కొత్త సంగతులు” నమ్మడం చాలామందికి కష్టంగా ఉంటుందని కూడా ఆయనకు ముందే తెలుసు. (యెష. 42:9; 60:2; 2 కొరిం. 4:3, 4) మరి, ప్రకటన 21:3, 4 లో ఉన్న విషయాలు నిజమౌతాయనే నమ్మకాన్ని మనం ఎలా బలపర్చుకోవచ్చు? ఆ నమ్మకాన్ని వేరేవాళ్లలో ఎలా కలిగించవచ్చు? యెహోవా కేవలం మాటిచ్చి వదిలేయలేదు గానీ ఆ మాటను నిలబెట్టుకుంటాడని నమ్మడానికి ఒప్పించే కారణాల్ని కూడా మనకు ఇచ్చాడు. ఏంటా కారణాలు?

యెహోవా మాట నిలబెట్టుకుంటానని గ్యారంటీ ఇచ్చాడు

5. దేవుడిచ్చిన మాటను నమ్మడానికిగల కారణాలు ఏ వచనాల్లో ఉన్నాయి? అవి ఏం చెప్తున్నాయి?

5 పరదైసు గురించి యెహోవా ఇచ్చిన మాట మనం నమ్మడానికి ఈ వచనాలు సహాయం చేస్తాయి: “సింహాసనం మీద కూర్చొని ఉన్న దేవుడు ఇలా అన్నాడు: ‘ఇదిగో! నేను అన్నిటినీ కొత్తవిగా చేస్తున్నాను.’ ఆయన ఇంకా ఇలా అన్నాడు: ‘ఈ మాటలు నమ్మదగినవి, సత్యమైనవి కాబట్టి రాయి.’ ఆయన నాతో ఇలా అన్నాడు: ‘అవి నెరవేరాయి! నేనే ఆల్ఫాను, ఓమెగను. నేనే ఆరంభాన్ని, ముగింపును.’”—ప్రక. 21:5, 6ఎ.

6. ప్రకటన 21:5, 6 వచనాలు దేవుడిచ్చిన మాటమీద మన నమ్మకాన్ని ఎలా పెంచుతాయి?

6 దేవుడిచ్చిన మాటమీద మన నమ్మకాన్ని మరింత పెంచుకోవడానికి ఈ వచనాలు ఎలా సహాయం చేస్తాయి? ప్రకటన ముగింపు అనే పుస్తకంలో ఆ వచనాల గురించి ఇలా ఉంది: ‘రాబోయే ఈ దీవెనల గురించి తన నమ్మకమైన సేవకులకు భరోసా ఇవ్వడానికి యెహోవాయే స్వయంగా ఒక డాక్యుమెంట్‌పై సంతకం పెట్టినట్టు ఆ మాటలు ఉన్నాయి.’b ప్రకటన 21:3, 4 లో దేవుడు ఇచ్చిన మాటను మనం చూడవచ్చు. అయితే 5, 6 వచనాల్లో ఉన్న మాటలు యెహోవా మనకు భరోసాను ఇస్తూ పెట్టిన సంతకంలా ఉన్నాయి. ఇంతకీ ఆ మాటలేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం.

7. 5వ వచనం ఎవరి మాటలతో మొదలౌతుంది? ఆ విషయం ఎందుకంత ప్రాముఖ్యం?

7 యెహోవా ఇచ్చిన గ్యారంటీ 5వ వచనంలో “సింహాసనం మీద కూర్చొని ఉన్న దేవుడు ఇలా అన్నాడు” అనే మాటలతో మొదలౌతుంది. (ప్రక. 21:5ఎ) ప్రకటన గ్రంథంలో యెహోవా స్వయంగా మూడుసార్లు మాట్లాడాడు. అందులో ఇదొక సందర్భం. ఈ భరోసాను ఒక శక్తివంతమైన దేవదూత ద్వారా గానీ లేదా పునరుత్థానమైన యేసు ద్వారా గానీ ఇవ్వలేదు. యెహోవాయే స్వయంగా ఇచ్చాడు! ఈ విషయం, ఆ తర్వాతి వచనాల్లోని మాటల్ని మనం నమ్మడానికి సహాయం చేస్తుంది. ఎందుకు? ఎందుకంటే యెహోవా “అబద్ధమాడలేని” దేవుడు. (తీతు 1:2) కాబట్టి ప్రకటన 21:5, 6 లో మనం చదివిన మాటలు ఖచ్చితంగా నిజమౌతాయి!

“ఇదిగో! నేను అన్నిటినీ కొత్తవిగా చేస్తున్నాను”

8. తను ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేరుతుందని యెహోవా ఎలా నొక్కి చెప్తున్నాడు? (యెషయా 46:10)

8 ఇప్పుడు, “ఇదిగో!” అనే పదం గురించి పరిశీలిద్దాం. (ప్రక. 21:5) “ఇదిగో!” అని అనువదించబడిన గ్రీకు పదం ప్రకటన పుస్తకంలో చాలాసార్లు ఉపయోగించారు. ఒక రెఫరెన్స్‌ పుస్తకం ఏం చెప్తుందంటే, “చదివే వ్యక్తి అవధానాన్ని తర్వాతి మాటల మీదకు మళ్లించడానికి ఆ పదాన్ని వాడతారు.” ఇంతకీ ఆ పదం తర్వాత ఏ మాటలున్నాయి? దేవుడు చెప్పిన ఈ మాటలు ఉన్నాయి: “నేను అన్నిటినీ కొత్తవిగా చేస్తున్నాను.” నిజమే యెహోవా భవిష్యత్తులో చేయబోయే మార్పుల గురించి మాట్లాడుతున్నాడు. అయితే ఆ మాటలు నిజమౌతాయని యెహోవా ఎంత నమ్మకంతో ఉన్నాడంటే, అవి ఇప్పటికే జరిగిపోయినట్టుగా ఆయన మాట్లాడాడు.—యెషయా 46:10 చదవండి.

9. (ఎ) “అన్నిటినీ కొత్తవిగా చేస్తున్నాను” అనే మాటలు యెహోవా చేసే ఏ రెండు పనుల్ని సూచిస్తున్నాయి? (బి) ఇప్పుడున్న “ఆకాశానికి,” “భూమికి” ఏం జరుగుతుంది?

9 తర్వాత, ప్రకటన 21:5 లో ఉన్న ఈ మాటల్ని గమనించండి: “నేను అన్నిటినీ కొత్తవిగా చేస్తున్నాను.” ఈ అధ్యాయంలోని ఆ మాటలు యెహోవా చేయబోయే రెండు పనుల గురించి చెప్తున్నాయి. మొదటిది, యెహోవా పాత వ్యవస్థను నాశనం చేస్తాడు. రెండోది, ఆయన కొత్త వ్యవస్థను తీసుకొస్తాడు. ప్రకటన 21:1 లో మనం ఇలా చదువుతాం: “ముందున్న ఆకాశం, భూమి గతించిపోయాయి.” ఇక్కడ “ముందున్న ఆకాశం“ సాతాను, అతని చెడ్డ దూతల గుప్పిట్లో ఉన్న ప్రభుత్వాల్ని సూచిస్తుంది. (మత్త. 4:8, 9; 1 యోహా. 5:19) బైబిల్లో “భూమి” అన్నప్పుడు, కొన్నిసార్లు భూమ్మీదున్న మనుషుల్ని సూచించింది. (ఆది. 11:1; కీర్త. 96:1) కాబట్టి ‘ముందున్న భూమి’ ఇప్పుడున్న చెడ్డ ప్రజల్ని సూచిస్తుంది. యెహోవా ఇప్పుడున్న “ఆకాశాన్ని,” “భూమిని” ఏదో పైపైన మెరుగులుదిద్ది వదిలేయడు గానీ, ఆయన వాటిని పూర్తిగా తుడిచిపెట్టేస్తాడు. వాటి స్థానంలో “కొత్త ఆకాశాన్ని, కొత్త భూమిని” తీసుకొస్తాడు. అంటే ఒక సరికొత్త ప్రభుత్వం భూమ్మీదున్న నీతిమంతుల్ని పరిపాలిస్తుంది.

10. యెహోవా వేటిని కొత్తవిగా చేస్తాడు?

10 ప్రకటన 21:5 లో యెహోవా వేటిని కొత్తవిగా చేస్తానని అంటున్నాడో చూస్తాం. ఈ విషయం గమనించండి: “నేను అన్ని కొత్తవాటిని చేస్తున్నాను” అని యెహోవా అనలేదు గానీ, “నేను అన్నిటినీ కొత్తవిగా చేస్తున్నాను” అని అన్నాడు. కాబట్టి యెహోవా భూమిని, మనుషుల్ని ఒకవిధంగా కొత్తవిగా చేస్తాడు. అంటే ఆయన మనుషుల్ని పరిపూర్ణుల్ని చేస్తాడు. భూమిని, యెషయా ముందే చెప్పినట్టు అచ్చం ఏదెను తోటలా ఉండే ఒక అందమైన పార్కులా చేస్తాడు. మనం ఎలా కొత్తగా అవుతామంటే, మనకున్న జబ్బులన్నీ పోయి, బాగౌతాం. గుడ్డివాళ్లు, కుంటివాళ్లు, చెవిటివాళ్లు కూడా బాగౌతారు. ఆఖరికి, చనిపోయినవాళ్లు కూడా ప్రాణాలతో తిరిగొస్తారు.—యెష. 25:8; 35:1-7.

“ఈ మాటలు నమ్మదగినవి, సత్యమైనవి . . . అవి నెరవేరాయి!”

11. యెహోవా యోహానుకు ఏమని చెప్పాడు? ఎందుకు?

11 మనం నమ్మడానికి దేవుడు ఇంకా ఏ గ్యారంటీ ఇస్తున్నాడు? యెహోవా యోహానుతో ఇలా అన్నాడు: “ఈ మాటలు నమ్మదగినవి, సత్యమైనవి కాబట్టి రాయి.” (ప్రక. 21:5) యెహోవా “రాయి” అని చెప్పడమే కాదు, వాటిని ఎందుకు రాయాలో కూడా చెప్పాడు. ఆయన ఇలా అన్నాడు: “ఈ మాటలు నమ్మదగినవి, సత్యమైనవి.” కాబట్టి మనం వాటిని పూర్తిగా నమ్మవచ్చు. యెహోవా “రాయి” అన్నప్పుడు యోహాను రాశాడు కాబట్టే, మనం దేవుడు మాటిచ్చిన పరదైసు గురించి చదవగలుగుతున్నాం, అందులో పొందబోయే దీవెనల గురించి ఆలోచించగలుగుతున్నాం.

12. “అవి నెరవేరాయి!” అని యెహోవా చెప్పడం ఎందుకు సరైనది?

12 ఆ తర్వాత యెహోవా ఇలా అన్నాడు: “అవి నెరవేరాయి!” (ప్రక. 21:6) ఆయన అలా అంటున్నప్పుడు, పరదైసు గురించి ఆయన ఇచ్చిన మాట అప్పటికే నెరవేరిపోయినట్టు మాట్లాడాడు. ఆయన అలా మాట్లాడడం కూడా సరైనదే! ఎందుకంటే ఆయన చెప్పింది జరగకుండా ఎవ్వరూ ఆపలేరు. అయితే, యెహోవా తన మాటమీద నిలబడతాడని చెప్పే ఇంకో గ్యారంటీ గురించి ఇప్పుడు చూద్దాం.

“నేనే ఆల్ఫాను, ఓమెగను”

13. “నేనే ఆల్ఫాను, ఓమెగను” అని యెహోవా ఎందుకు అన్నాడు?

13 ముందు పేరాల్లో చెప్పినట్టుగా, యోహాను చూసిన దర్శనాల్లో యెహోవానే స్వయంగా మూడుసార్లు మాట్లాడాడు. (ప్రక. 1:8; 21:5, 6; 22:13) అలా మాట్లాడిన ప్రతీసారి “నేనే ఆల్ఫాను, ఓమెగను” అని యెహోవా అన్నాడు. గ్రీకు అక్షరాల్లో ఆల్ఫా అనేది మొదటి అక్షరం, ఓమెగ అనేది చివరి అక్షరం. “నేనే ఆల్ఫాను, ఓమెగను” అని యెహోవా చెప్తున్నప్పుడు ఆయన దేన్నైనా మొదలుపెడితే, దానికి ఒక విజయవంతమైన ముగింపును కూడా ఇస్తాడని అది సూచిస్తుంది.

చిత్రాలు: యెహోవా సంకల్పం నెరవేర్పు. 1. “ఆల్ఫా.” ఏదెను తోటలో ఆదాముహవ్వలు. 2. తిరుగుబాటు వల్ల వచ్చిన నష్టాల్ని చూపించే చిత్రాలు: చెడ్డ దూతగా మారిన సాతాను, వృద్ధాప్యంలో ఉన్న ఆదాముహవ్వలు, బాబెలు గోపురం, స్మశానం, సైనికులు, ఒక యుద్ధ ట్యాంకు, యుద్ధ విమానాలు, ఫ్యాక్టరీల నుండి వచ్చే కాలుష్యం, నిరసనలు తెలిపే ప్రజలు. ఇంకోవైపు, యెహోవా సంకల్పం ముందుకెళ్తున్నట్టు చూపించే చిత్రాలు: విమోచన క్రయధన ఏర్పాటును చూపించడానికి హింసాకొయ్య మీద యేసు, లోబడే మనస్తత్వం ఉన్న పాత కాలంలోని అలాగే ఇప్పటి కాలంలోని ఆదాముహవ్వల పిల్లలు. 3. “ఓమెగ.” పరదైసులో ప్రజలు కలిసిమెలిసి పని చేసుకుంటున్నారు, సంతోషంగా ఉన్నారు.

యెహోవా దేన్నైనా మొదలుపెడితే దాన్ని ఖచ్చితంగా పూర్తి చేస్తాడు (14, 17 పేరాలు చూడండి)

14. (ఎ) యెహోవా “ఆల్ఫా” అని ఎప్పుడు చెప్పాడో, “ఓమెగ” అని ఎప్పుడు చెప్తాడో ఒక ఉదాహరణతో చెప్పండి. (బి) ఆదికాండం 2:1-3 లో మనకు ఏ భరోసా ఉంది?

14 యెహోవా ఆదాముహవ్వల్ని చేసిన తర్వాత మనుషుల విషయంలో, భూమి విషయంలో తన సంకల్పాన్ని తెలియజేశాడు. దాని గురించి బైబిలు ఇలా చెప్తుంది: “దేవుడు వాళ్లను దీవిస్తూ ఇలా అన్నాడు: ‘మీరు పిల్లల్ని కని, ఎక్కువమంది అయ్యి, భూమిని నింపండి, దాన్ని లోబర్చుకోండి.’” (ఆది. 1:28) ఆయన ఆ మాటల్ని చెప్పడం ద్వారా ఒక విధంగా “ఆల్ఫా” అని చెప్పినట్టే. ఆయన తన సంకల్పాన్ని కూడా స్పష్టంగా చెప్పాడు: విధేయులైన, పరిపూర్ణులైన ఆదాముహవ్వల పిల్లలు ఈ భూమిని నింపి, దాన్ని పరదైసుగా మార్చే సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు, యెహోవా ఒక విధంగా “ఓమెగ” అని అంటాడు. “ఆకాశాన్ని, భూమిని, వాటిలోని సమస్తాన్ని చేయడం పూర్తయిన” తర్వాత యెహోవా ఒక గ్యారంటీ ఇచ్చాడు. దాన్ని మనం ఆదికాండం 2:1-3 లో చూడొచ్చు. (చదవండి.) యెహోవా ఏడో రోజును “పవిత్రమైనదిగా ప్రకటించాడు.” దాని అర్థమేంటి? మనుషుల విషయంలో, భూమి విషయంలో యెహోవా ఏదైతే అనుకున్నాడో అది ఖచ్చితంగా ఏడో రోజు చివర్లో జరుగుతుందని ఆ మాటలు గ్యారంటీ ఇస్తున్నాయి.

15. యెహోవా సంకల్పానికి అడ్డుకట్ట వేశాడని సాతాను ఎందుకు అనుకుని ఉండవచ్చు?

15 ఆదాముహవ్వలు దేవునికి ఎదురుతిరిగి పాపం చేశారు. అలా వాళ్ల పిల్లలకు పాపాన్ని, మరణాన్ని వారసత్వంగా ఇచ్చారు. (రోమా. 5:12) దాంతో ఈ భూమంతా, తనకు లోబడే పరిపూర్ణమైన ప్రజలతో నింపాలనే యెహోవా సంకల్పానికి సాతాను అడ్డుకట్ట వేసినట్టుగా అనిపించవచ్చు. అంతేకాదు, యెహోవా “ఓమెగ” అని అనకుండా సాతాను ఆపేసినట్టు కూడా అనిపించవచ్చు. యెహోవా తన మాటమీద నిలబడలేడని సాతాను అనుకొని ఉండవచ్చు. ఇప్పుడు యెహోవా ముందున్న ఒక దారి ఏంటంటే, ఆదాముహవ్వల్ని నాశనం చేసి, వాళ్ల స్థానంలో ఇంకో పరిపూర్ణ జంటను తయారు చేసి, తన సంకల్పాన్ని నెరవేర్చుకోవడమే అని సాతాను అనుకొని ఉంటాడు. కానీ యెహోవా అలా చేసుంటే, ఆయన అబద్ధికుడని సాతాను నిందించేవాడు. ఎందుకు? ఎందుకంటే ఆదికాండం 1:28 లో యెహోవా ఆదాముహవ్వల పిల్లలతోనే ఈ భూమిని నింపుతానని వాళ్లకు చెప్పాడు.

16. యెహోవా ఓడిపోయాడని సాతాను ఎందుకు నిందించి ఉండేవాడు?

16 యెహోవా ముందున్న ఇంకో దారి ఏంటని సాతాను అనుకొని ఉంటాడు? ఆదాముహవ్వలు పిల్లల్ని కనేలా యెహోవా అనుమతిస్తాడు కానీ, వాళ్లు ఎప్పటికీ పరిపూర్ణతకు చేరుకోలేరు అని సాతాను అనుకొని ఉండవచ్చు. (ప్రసం. 7:20; రోమా. 3:23) ఒకవేళ అదే జరిగితే, యెహోవా ఓడిపోయాడని సాతాను ఖచ్చితంగా నిందించేవాడు. ఎందుకు? ఎందుకంటే ఆదాముహవ్వల పిల్లలు పరిపూర్ణులుగా మారి, ఈ భూమ్మీద కళకళలాడుతూ జీవించాలనే యెహోవా సంకల్పం నెరవేరదు!

17. తిరుగుబాటు చేసిన సాతానుకు, మొదటి మానవులకు యెహోవా ఎలా జవాబిచ్చాడు? చివరిగా ఏం జరుగుతుంది? (చిత్రం కూడా చూడండి.)

17 సాతాను, అలాగే మొదటి మానవులు చేసిన తిరుగుబాటుకు యెహోవా ఊహించని పరిష్కారాన్ని ఇచ్చాడు. అది చూసి సాతానుకు మతిపోయి ఉంటుంది! (కీర్త. 92:5) ఆదాముహవ్వలు పిల్లల్ని కనడానికి అనుమతించడం ద్వారా ఆయన అబద్ధికుడు కాదని, ఎప్పుడూ నిజమే చెప్తాడని యెహోవా నిరూపించుకున్నాడు. అంతేకాదు, ఆయన చెప్పింది చేస్తాడని కూడా నిరూపించుకున్నాడు. లోబడే మనస్తత్వం ఉన్న ఆదాముహవ్వల పిల్లల్ని కాపాడడానికి ఒక “సంతానం” పంపించడం ద్వారా ఆయన ఆ సంకల్పాన్ని నెరవేరేలా చేశాడు. (ఆది. 3:15; 22:18) యెహోవా చేసిన ఈ విమోచన క్రయధన ఏర్పాటు చూసి సాతాను అవాక్కయి ఉంటాడు! ఎందుకు? ఎందుకంటే అది యెహోవా నిస్వార్థమైన ప్రేమకు నిలువెత్తు నిదర్శనం. (మత్త. 20:28; యోహా. 3:16) కానీ ఈ లక్షణం స్వార్థపరుడైన సాతానులో ఇసుమంత కూడా లేదు. విమోచన క్రయధన ఏర్పాటు వల్ల ఏం జరుగుతుంది? వెయ్యేళ్ల పరిపాలన చివర్లో, లోబడే మనస్తత్వం ఉన్న ఆదాముహవ్వల పిల్లలు పరిపూర్ణులై, పరదైసు భూమిని సొంతం చేసుకుంటారు. అలా, యెహోవా మొట్టమొదటి సంకల్పం నెరవేరుతుంది. అప్పుడు ఆయన “ఓమెగ” అని అంటాడు.

పరదైసు గురించి యెహోవా ఇచ్చిన మాట మీద మన నమ్మకాన్ని ఎలా పెంచుకోవచ్చు?

18. దేవుడిచ్చిన మాటను మనం ఖచ్చితంగా నమ్మడానికిగల మూడు కారణాలు ఏంటి? (“యెహోవా ఇచ్చిన మాటను నమ్మడానికి మూడు కారణాలు” అనే బాక్సు కూడా చూడండి.)

18 ఈ ఆర్టికల్‌లో, భూమి పరదైసు అవుతుందని ఖచ్చితంగా నమ్మడానికిగల కారణాల్ని చూశాం. ఇతరులకు కూడా ఆ నమ్మకం కలిగించడానికి మనం ఏ విషయాల గురించి చెప్పవచ్చు? మొదటిది, స్వయంగా యెహోవాయే దాన్ని మాటిస్తున్నాడు. ప్రకటన గ్రంథంలో ఇలా ఉంది: “సింహాసనం మీద కూర్చొని ఉన్న దేవుడు ఇలా అన్నాడు: ‘ఇదిగో! నేను అన్నిటినీ కొత్తవిగా చేస్తున్నాను.’” అలా ఇచ్చిన మాటను నిలబెట్టుకునే తెలివి, శక్తి, కోరిక ఆయనకు ఉన్నాయి. రెండోది, తాను ఇచ్చిన మాట నెరవేరుతుందని యెహోవా ఎంత నమ్మకంతో ఉన్నాడంటే, అవి ఇప్పటికే జరిగిపోయినట్టుగా ఆయన మాట్లాడాడు. ఆయన ఇలా చెప్పాడు: “ఈ మాటలు నమ్మదగినవి, సత్యమైనవి . . . అవి నెరవేరాయి!” మూడోది, యెహోవా ఏదైనా చేయడం మొదలుపెడితే, దాన్ని విజయవంతంగా ముగిస్తాడు. అందుకే ఆయన ఇలా అన్నాడు: “నేనే ఆల్ఫాను, ఓమెగను.” అలా సాతాను అబద్ధికుడని, తన సంకల్పాన్ని అడ్డుకోవడం అతని వల్ల కాదని యెహోవా నిరూపిస్తాడు.

యెహోవా ఇచ్చిన మాటను నమ్మడానికి మూడు కారణాలు

యెహోవాను సూచించడానికి వెలుగుతో నిండిన సింహాసనం.
  • “సింహాసనం మీద కూర్చొని ఉన్న దేవుడు ఇలా అన్నాడు: ‘ఇదిగో! నేను అన్నిటినీ కొత్తవిగా చేస్తున్నాను.’”—ప్రక. 21:5.

తోలు కాగితం మీద రాస్తున్న అపొస్తలుడైన యోహాను.
  • “ఆయన ఇంకా ఇలా అన్నాడు: ‘ఈ మాటలు నమ్మదగినవి, సత్యమైనవి కాబట్టి రాయి. . . . అవి నెరవేరాయి!’”—ప్రక. 21:5, 6

ఆల్ఫా, ఓమెగ అనే గ్రీకు అక్షరాలు.
  • “నేనే ఆల్ఫాను, ఓమెగను.”—ప్రక. 21:6.

19. దేవుడు మాటిచ్చిన పరదైసు గురించి నమ్మడం ఎవరికైనా కష్టంగా ఉంటే మీరేం చేయవచ్చు?

19 మీరు ప్రీచింగ్‌లో పరదైసు గురించి ఇతరులకు చెప్పిన ప్రతీసారి, దానిమీద మీకున్న నమ్మకం పెరుగుతుందని గుర్తుంచుకోండి. కాబట్టి ఈసారి ఎప్పుడైనా మీరు ప్రకటన 21:4 లో ఉన్న మాటలు చూపించినప్పుడు, “వినడానికైతే బాగుంది గానీ, నమ్మడానికి మాత్రం చాలా కష్టంగా ఉంది” అని ఎవరైనా అంటే ఏం చేయవచ్చు? వాళ్లకు 5, 6 వచనాలు చదివి వివరించండి. యెహోవా స్వయంగా సంతకం పెట్టి, హామీ ఇచ్చినట్టు ఉన్న ఆ మాటల్ని వాళ్లకు చూపించండి. అది యెహోవాయే స్వయంగా ఇచ్చిన గ్యారంటీ!—యెష. 65:16.

మీరెలా జవాబిస్తారు?

  • పరదైసు గురించి యెహోవాయే స్వయంగా మాటివ్వడం ఎందుకంత ప్రత్యేకమైనది?

  • మాట మీద నిలబడతానని దేవుడు ఎలా భరోసా ఇస్తున్నాడు?

  • దేవుడిచ్చిన మాట మీద మన నమ్మకాన్ని ఎలా పెంచుకోవచ్చు?

పాట 145 పరదైసు—దేవుని వాగ్దానం

a పరదైసు గురించి యెహోవా ఇచ్చిన మాటను ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడనే గ్యారంటీ ఏంటో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. ఆ మాట నెరవేరుతుందని మనం ఇతరులకు చెప్పే ప్రతీసారి, మన నమ్మకాన్ని మరింత బలపర్చుకుంటాం.

b ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది పుస్తకంలోని 303-304 పేజీల్లో, 8-9 పేరాలు చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి