కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w21 జూన్‌ పేజీలు 26-30
  • నా నిర్ణయాలన్నిటిలో యెహోవాకు మొదటిస్థానం ఇచ్చాను

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నా నిర్ణయాలన్నిటిలో యెహోవాకు మొదటిస్థానం ఇచ్చాను
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • లెబనాన్‌లో మన ప్రకటనా పని
  • మా కుటుంబం వేరే దేశానికి వెళ్లాలని నిర్ణయించుకుంది
  • మా కుటుంబంలో విషాదం
  • ప్రాముఖ్యమైన నిర్ణయాలు
  • నేను తీసుకున్న ఇంకొక పెద్ద నిర్ణయం
  • మా కుటుంబంలో కొత్త సభ్యుడు
  • మరో ప్రాంతానికి వెళ్లడం
  • నేను మళ్లీ అవే నిర్ణయాలు తీసుకుంటాను
  • బలమైన క్రైస్తవ వారసత్వానికి కృతజ్ఞురాలిని
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • మధ్యప్రాచ్యంలో ప్రకాశిస్తున్న ఆధ్యాత్మిక వెలుగు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • ‘ఒక యూదుని చెంగు పట్టుకొని’ డెబ్బై ఏళ్లు గడిపాను
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
w21 జూన్‌ పేజీలు 26-30

జీవిత కథ

నా నిర్ణయాలన్నిటిలో యెహోవాకు మొదటిస్థానం ఇచ్చాను

డీయా యాజ్‌బెక్‌ చెప్పినది

డీయా యాజ్‌బెక్‌ యౌవనంలో ఉన్నప్పుడు.

1984 లో ఒక రోజు ఉదయం నేను మా ఇంటి నుండి ఆఫీసుకు బయలుదేరాను. మా ఇల్లు వెనిజ్యులాలోని కారాకాస్‌లో ధనవంతులు నివసించే ప్రాంతంలో ఉండేది. నేను ఆఫీసుకు వెళ్తూ ఆ మధ్యే వచ్చిన కావలికోట పత్రికలోని ఒక ఆర్టికల్‌ గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. పొరుగువాళ్లు మనల్ని ఎలా గుర్తిస్తారనే దాని గురించి ఆ ఆర్టికల్‌ చర్చించింది. చుట్టుపక్కల ఇళ్లను చూస్తూ నేను ఇలా ఆలోచించడం మొదలుపెట్టాను: ‘నా పొరుగువాళ్లు నన్ను కేవలం ఒక బ్యాంకు ఉద్యోగిగా చూస్తున్నారా? లేదా నా కుటుంబాన్ని పోషించుకోవడానికి బ్యాంకులో పనిచేస్తున్న ఒక దేవుని సేవకునిగా చూస్తున్నారా?’ నా పొరుగువాళ్లు నన్ను కేవలం బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న వ్యక్తిలా చూస్తున్నారని అర్థమైంది, అది నాకు నచ్చలేదు. కాబట్టి ఈ విషయంలో నేను ఏదోకటి చేయాలని నిర్ణయించుకున్నాను.

1940, మే 19న లెబనాన్‌లోని అంయూన్‌ పట్టణంలో నేను పుట్టాను. కొన్ని సంవత్సరాల తర్వాత మా కుటుంబమంతా ట్రిపొలీ అనే పట్టణానికి తరలి వెళ్లాం. యెహోవాను తెలుసుకొని, ఆయన్ని ప్రేమించే ఆప్యాయత, సంతోషం ఉన్న కుటుంబంలో నేను పెరిగాను. మేము మొత్తం ఐదుగురం; ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిల్లో నేను ఆఖరివాణ్ణి. నా తల్లిదండ్రులు డబ్బు సంపాదించడానికి ప్రాముఖ్యతను ఇవ్వలేదు. బైబిల్ని అధ్యయనం చేయడానికి, కూటాలకు హాజరవ్వడానికి, దేవుని గురించి తెలుసుకొనేలా ఇతరులకు సహాయం చేయడానికే వాళ్లు తమ జీవితంలో అన్నిటికన్నా ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చారు.

మా సంఘంలో చాలామంది అభిషిక్త క్రైస్తవులు ఉండేవాళ్లు. వాళ్లలో ఒకరైన మీషెల్‌ ఆబూడ్‌ సంఘ పుస్తక అధ్యయనాన్ని చేసేవాడు. ఆయన న్యూయార్క్‌లో సత్యం నేర్చుకున్న తర్వాత 1921 లో లెబనాన్‌లో పరిచర్య చేయడం మొదలుపెట్టాడు. గిలియడ్‌ పాఠశాలకు వెళ్లొచ్చిన ఆన్‌, గ్వెన్‌ బీవర్‌ అనే ఇద్దరు సహోదరీలను ఆయన ఎంత గౌరవించాడో, వాళ్లకెంత సహాయం చేశాడో నాకు ఇప్పటికీ గుర్తుంది. వాళ్లు మాకు మంచి స్నేహితులయ్యారు. చాలా సంవత్సరాల తర్వాత అమెరికాలో నేను ఆన్‌ని కలిసినప్పుడు ఎంతో సంతోషించాను. ఆ తర్వాత కొంతకాలానికి గ్వెన్‌ని కూడా కలిశాను. ఆమె విల్‌ఫ్రెడ్‌ గూచ్‌ అనే సహోదరుణ్ణి పెళ్లి చేసుకొని ఇంగ్లాండ్‌లోని లండన్‌ బెతెల్‌లో సేవచేస్తుంది.

లెబనాన్‌లో మన ప్రకటనా పని

నేను లెబనాన్‌లో యువకుడిగా ఉన్నప్పుడు, అక్కడ ఎక్కువమంది సాక్షులు లేరు. కానీ మేము ఉత్సాహంగా ఇతరులకు బైబిలు గురించి నేర్పించాం. కొంతమంది మతనాయకులు మమ్మల్ని వ్యతిరేకించినా ఆ పని చేశాం. కొన్ని సంఘటనలు నాకు ఇంకా గుర్తున్నాయి.

ఒక రోజు నేను, మా అక్క సానా ఒక అపార్ట్‌మెంట్‌లో ప్రకటిస్తున్నాం. మేము ఇంటి వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు, ఒక ప్రీస్టు మేమున్న అంతస్తుకు వచ్చాడు. మేమిక్కడ ఉన్నామని ఎవరో ఆయనకు సమాచారం ఇచ్చి ఉంటారు. మా అక్కని అతను తిట్టడం మొదలుపెట్టాడు, కోపంతో ఆమెను మెట్లమీద నుండి తోసేశాడు. దానివల్ల ఆమెకు గాయాలయ్యాయి; ఎవరో పోలీసులకు ఫోన్‌ చేయడం వల్ల వాళ్లొచ్చి దయతో సానాకు కావాల్సిన సహాయం అందేలా చూశారు. పోలీసులు అతన్ని స్టేషన్‌కు తీసుకెళ్లినప్పుడు, అతని దగ్గర గన్‌ ఉండడాన్ని చూశారు. పోలీసు ముఖ్య అధికారి అతన్ని ఇలా అడిగాడు: “అసలు నువ్వెవరు? నువ్వు ప్రజలకి దేవుని గురించి బోధిస్తావా? లేదా అల్లర్లు చేయమని రెచ్చగొడతావా?”

నాకు బాగా గుర్తున్న ఇంకొక సంఘటన ఏంటంటే, మా సంఘమంతా ఒక బస్సు అద్దెకు తీసుకొని మా నగరానికి దూరంగా ఉన్న ఒక మారుమూల ప్రాంతంలో పరిచర్య చేయడానికి వెళ్లాం. మేము అక్కడ ప్రశాంతంగా ప్రకటించిన కొద్దిసేపటికి స్థానికంగా ఉన్న ఒక ప్రీస్టు అక్కడికి వచ్చాడు, మామీద దాడి చేయడానికి చాలామందిని పోగుచేశాడు, వాళ్లు మమ్మల్ని వేధించారు, మాపై రాళ్లు కూడా విసిరారు. దానివల్ల మా నాన్న తలకి గాయమైంది, ఆయన ముఖం అంతా రక్తం కారడం నాకింకా గుర్తుంది. అమ్మతో కలిసి నాన్న బస్సు దగ్గరికి వచ్చాడు, మిగతావాళ్లమంతా ఆందోళనతో వాళ్ల వెనకాలే బస్సు దగ్గరికి వెళ్లాం. అప్పుడు మా అమ్మ, నాన్న ముఖం తుడుస్తూ అన్న మాటల్ని నేను ఎప్పటికీ మర్చిపోను. ఆమె ఇలా అంది: “యెహోవా వీళ్లను క్షమించు, వీళ్లు ఏం చేస్తున్నారో వీళ్లకు తెలీదు.”

మరో సంఘటన మేము మా సొంత ఊర్లో ఉన్న బంధువుల్ని చూడడానికి వెళ్లినప్పుడు జరిగింది. అక్కడ మా తాతయ్య ఇంటికి బాగా పేరున్న ఒక బిషప్‌ వచ్చాడు. అతనికి మా తల్లిదండ్రులు యెహోవాసాక్షులని తెలుసు, నాకు 6 ఏళ్లే అయినా నన్ను పిలిచి, “నువ్వు ఎందుకు బాప్తిస్మం తీసుకోలేదు?” అని అడిగాడు. అందుకు, నేను ఇంకా చిన్నపిల్లవాణ్ణే అని, బాప్తిస్మం తీసుకోవాలంటే బైబిలు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని, బలమైన విశ్వాసాన్ని పెంచుకోవాలని చెప్పాను. నేను ఇచ్చిన జవాబు నచ్చక, తనతో అగౌరవంగా మాట్లాడానని అతను మా తాతయ్యతో చెప్పాడు.

ఏదేమైనా, అలాంటి చేదు అనుభవాలు తక్కువే ఎదురయ్యాయి. సాధారణంగా లెబనాన్‌ ప్రజలు స్నేహపూర్వకంగా ఉంటారు, ఆతిథ్య స్ఫూర్తి చూపిస్తారు. దానివల్ల చాలామందితో బైబిలు గురించి మాట్లాడగలిగాం, ఎక్కువ బైబిలు అధ్యయనాలు చేయగలిగాం.

మా కుటుంబం వేరే దేశానికి వెళ్లాలని నిర్ణయించుకుంది

ఒక యువ సహోదరుడు వెనిజ్యులా నుండి లెబనాన్‌కు వచ్చాడు. అప్పటికింకా నా స్కూలు చదువు పూర్తికాలేదు. ఆయన మా సంఘ కూటాలకు హాజరవుతున్న సమయంలో, మా అక్క వాఫాతో ఆయనకు పరిచయం ఏర్పడింది. కొంతకాలానికి వాళ్లు పెళ్లి చేసుకొని, వెనిజ్యులాకి వెళ్లిపోయారు. వాఫా తాను రాసిన ఉత్తరాల్లో నాన్నను కుటుంబంతో సహా వెనిజ్యులాకి వచ్చేయమని పదేపదే అడిగేది. మేము ఆమెకు బాగా గుర్తొచ్చేవాళ్లం, అందుకే అలా రాసేది. చివరికి ఆమె కోరుకున్నట్టే మేము వెనిజ్యులాకి వెళ్లాలని నిర్ణయించుకున్నాం!

1953 లో మేము వెనిజ్యులాకి వచ్చి కారాకాస్‌లోని రాష్ట్రపతి భవనం దగ్గర్లో స్థిరపడ్డాం. నేనప్పటికి చిన్నపిల్లోడ్నే కాబట్టి అప్పుడప్పుడు రాష్ట్రపతి తన విలాసవంతమైన కారులో మా ఇంటి ముందు నుండి వెళ్తున్నప్పుడు ఆతురతతో చూసేవాణ్ణి. అయితే మా తల్లిదండ్రులకు కొత్త దేశానికి, భాషకు, సంస్కృతికి, ఆహారానికి, వాతావరణానికి అలవాటుపడడం కష్టమైంది. అక్కడ వాళ్లు కొత్త జీవితానికి అప్పుడప్పుడే అలవాటుపడుతుండగా, మేము ఊహించని విషయం ఒకటి జరిగింది.

ఎడమ నుండి కుడికి: మా నాన్న. మా అమ్మ. 1953 లో నా కుటుంబంతో పాటు వెనిజ్యులాకి వెళ్లినప్పుడు, నేను

మా కుటుంబంలో విషాదం

మా నాన్న ఆరోగ్యం పాడవ్వడం మొదలైంది. అది మాకు ఎంతో ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే ఆయన చాలా ఆరోగ్యంగా, బలంగా ఉండేవాడు. ఆయన అనారోగ్యంగా ఉన్నట్టు మాకెప్పుడూ గుర్తులేదు. తర్వాత, ఆయనకు క్యాన్సర్‌ అని తేలడంతో దానికి సంబంధించిన ఆపరేషన్‌ చేయించుకున్నారు. విచారకరంగా, అది జరిగిన వారానికి ఆయన చనిపోయారు.

మా పరిస్థితుల్ని బట్టి మేమెంత బాధపడ్డామో మాటల్లో చెప్పలేను. నాకప్పుడు 13 ఏళ్లే, మా నాన్న చనిపోతాడని మేము ఎప్పుడూ అనుకోలేదు. దానివల్ల మా ప్రపంచం ఒక్కసారిగా తల్లకిందులైంది. కొంతకాలం వరకు మా అమ్మ, తన భర్త చనిపోయాడనే నిజాన్ని అంగీకరించలేకపోయింది. ఏదేమైనా జీవితం ముందుకెళ్లాలి కాబట్టి, యెహోవా సహాయంతో ఆ పరిస్థితిని తట్టుకున్నాం. నాకు 16 ఏళ్లు ఉన్నప్పుడు కారాకాస్‌లో నా హైస్కూల్‌ విద్య పూర్తి చేసుకున్నాను. నా కుటుంబానికి మద్దతివ్వాలని బలంగా కోరుకున్నాను.

నేను ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించడానికి ఎంతో సహాయం చేసిన మా అక్క సానా, ఆమె భర్త రూబెన్‌

ఆ సమయంలోనే గిలియడ్‌ పాఠశాలను పూర్తిచేసుకొని వెనిజ్యులాకి తిరిగివచ్చిన రూబెన్‌ ఆరౌహో అనే సహోదరుణ్ణి మా అక్క సానా పెళ్లి చేసుకుంది. వాళ్లు న్యూయార్క్‌కు వెళ్లాలనుకున్నారు. నేను యూనివర్సిటీలో చదవాలని మా కుటుంబం నిర్ణయించింది. దానికోసం నేను న్యూయార్క్‌ వెళ్లాను. అక్కడ మా అక్కాబావల దగ్గర ఉన్నాను. ఆ సమయంలో నేను ఆధ్యాత్మికంగా బాగా ప్రగతి సాధించడానికి వాళ్లిద్దరు సహాయం చేశారు. అంతేకాదు మా బ్రూక్లిన్‌ స్పానిష్‌ సంఘంలో చాలామంది పరిణతిగల సహోదరులు ఉండేవాళ్లు. వాళ్లలో బ్రూక్లిన్‌ బెతెల్‌లో సేవ చేస్తున్న మిల్టన్‌ హెన్షల్‌ అలాగే ఫ్రెడ్రిక్‌ ఫ్రాంజ్‌ కూడా ఉన్నారు. వాళ్ల గురించి తెలుసుకునే అవకాశం దొరికినందుకు నాకు చాలా సంతోషంగా అనిపించింది.

1957 లో నేను బాప్తిస్మం తీసుకున్నప్పుడు

యూనివర్సిటీలో మొదటి సంవత్సరం పూర్తౌతుండగా, నేను నా జీవితంతో ఏం చేస్తున్నానని ఆలోచించడం మొదలుపెట్టాను. యెహోవా సేవ చేయడానికి క్రైస్తవులు పెట్టుకునే లక్ష్యాల గురించి వివరించిన కావలికోట ఆర్టికల్స్‌ చదివి, బాగా ఆలోచించాను. మా సంఘంలో పయినీర్లుగా, బెతెల్‌ సభ్యులుగా సేవచేస్తున్న సహోదరులు ఎంత సంతోషంగా ఉన్నారో నేను చూశాను. నాకు కూడా వాళ్లలాగే ఉండాలని అనిపించింది. అయితే నేనింకా బాప్తిస్మం తీసుకోలేదు. యెహోవాకు సమర్పించుకోవాల్సిన ప్రాముఖ్యతను వెంటనే గుర్తించాను. ఆ తర్వాత నేను సమర్పించుకుని 1957, మార్చి 30న బాప్తిస్మం తీసుకున్నాను.

ప్రాముఖ్యమైన నిర్ణయాలు

నేను బాప్తిస్మం తీసుకున్నాక పూర్తికాల సేవలో అడుగుపెట్టడం గురించి ఆలోచించాను. నేను పయినీరు అవ్వాలని ఎంతో కోరుకున్నాను. కానీ అది నాకు కష్టమనిపించింది. ఒకవైపు యూనివర్సిటీలో చదువుతూ, మరోవైపు పయినీరు సేవ చేయగలనా అని అనుకున్నాను. ఆ యూనివర్సిటీ విద్యను ఆపేసి వెనిజ్యులాకు వచ్చి పయినీరు అవ్వాలనే నా నిర్ణయం గురించి నేనూ నా కుటుంబం చాలా ఉత్తరాలు రాసుకొని చర్చించుకున్నాం.

నేను 1957, జూన్‌లో కారాకాస్‌కు తిరిగి వచ్చాను. అయితే నా కుటుంబ పరిస్థితి అంత బాలేదని గమనించాను. ఇంకొకరి సంపాదన కూడా మా కుటుంబానికి అవసరమైంది. దానికి నేనెలా సహాయం చేయగలనని అనుకున్నాను. ఒక బ్యాంకులో నాకు ఉద్యోగం దొరికింది. కానీ పయినీరు సేవ కూడా చేయాలని ఎంతో కోరుకున్నాను. నిజానికి అది చేయడం కోసమే తిరిగొచ్చాను కాబట్టి నేను రెండూ చేయాలని నిర్ణయించుకున్నాను. నేను చాలా సంవత్సరాల వరకు బ్యాంకులో ఉద్యోగం చేస్తూ పయినీరు సేవ కూడా చేశాను. ఆ సమయంలో అంతకుముందు కన్నా బిజీగా, సంతోషంగా ఉండేవాడిని!

నాకెంతో సంతోషాన్నిచ్చిన ఇంకొక విషయం ఏమిటంటే, యెహోవాను ఎంతో ప్రేమించే సిల్వియా అనే అందమైన సహోదరిని పెళ్లి చేసుకోవడం. ఆమె తన తల్లిదండ్రులతో వెనిజ్యులాకి వచ్చింది. కొంతకాలానికి, మా అబ్బాయి మీషెల్‌ (మైక్‌), అలాగే మా అమ్మాయి సమీరా పుట్టారు. మా అమ్మ మాతోపాటే ఉండడానికి వచ్చింది. కాబట్టి ఆమె బాగోగులు కూడా నేను చూసుకోవడం మొదలుపెట్టాను. కుటుంబ బాధ్యతల వల్ల పయినీరు సేవ ఆపేయాల్సి వచ్చినా పయినీరు స్ఫూర్తిని చూపించాను. అందుకే వీలైనప్పుడల్లా నేను, సిల్వియా సెలవుల్లో సహాయ పయినీరు సేవ చేసేవాళ్లం.

నేను తీసుకున్న ఇంకొక పెద్ద నిర్ణయం

నేను ఈ ఆర్టికల్‌ మొదట్లో చెప్పిన సందర్భం, నా పిల్లలు ఇంకా స్కూల్లో చదువుకుంటున్నప్పుడు జరిగింది. ఆ సమయంలో మా జీవితం చాలా సౌకర్యవంతంగా ఉండేది. అలాగే బ్యాంకుల్లో పనిచేసే తోటి ఉద్యోగస్తులు నన్ను గౌరవించేవాళ్లు. అయినా నేను యెహోవా సేవకునిగానే గుర్తించబడాలని కోరుకున్నాను. ఇతరులు నన్ను అలా గుర్తించాలంటే ఏం చేయాలా అని ఆ రోజు ఆలోచిస్తూనే ఉన్నాను. కాబట్టి నేను, నా భార్య కూర్చొని మా ఆర్థిక వనరుల గురించి మాట్లాడుకున్నాం. ఒకవేళ బ్యాంకులో ఉద్యోగం మానేస్తే నాకు పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయి. మాకు ఏ అప్పులు లేవు కాబట్టి జీవితాన్ని సరళం చేసుకుంటే, చాలాకాలం బ్రతకడానికి కావాల్సిన డబ్బులు మా దగ్గర ఉంటాయి.

ఆ నిర్ణయం తీసుకోవడం అంత తేలిక కాదు కానీ నా భార్య, మా అమ్మ నాకు పూర్తి మద్దతిచ్చారు. అలా నాకు పయినీరు సేవచేసే అవకాశం మళ్లీ దొరికింది. నేను చాలా సంతోషించాను! ఇక పయినీరు సేవ మొదలుపెడతాననగా మేము ఊహించని వార్త ఒకటి విన్నాం.

మా కుటుంబంలో కొత్త సభ్యుడు

అప్పుడే పుట్టిన వాళ్ల బాబు గాబ్రీయెల్‌తో డీయా, సిల్వియా.

కుటుంబంలో కొత్త సభ్యుడు మా అబ్బాయి గాబ్రీయెల్‌

సిల్వియా గర్భవతి అని డాక్టర్‌ చెప్పారు, మేమిద్దరం ఆశ్చర్యపోయాం! చాలా సంతోషించాం కూడా. అయినా పయినీరు అవ్వాలనే నా నిర్ణయం గురించి కూడా ఆలోచించాను. నేను తిరిగి పయినీరు సేవ మొదలుపెట్టగలనా? మా కుటుంబంలోకి ఒక కొత్త సభ్యుణ్ణి ఆహ్వానించడానికి మేము మానసికంగా, భావోద్వేగపరంగా సిద్ధపడ్డాం. మరి నేను జాగ్రత్తగా వేసుకున్న ప్రణాళికల సంగతేంటి?

మా లక్ష్యాల గురించి చర్చించుకున్న తర్వాత, నేను పయినీరు సేవ మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నాను. 1985 ఏప్రిల్‌లో మాకు గాబ్రీయెల్‌ పుట్టాడు. నేను బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసి, 1985 జూన్‌లో మళ్లీ పయినీరు సేవ మొదలుపెట్టాను. ఆ తర్వాత బ్రాంచి కమిటీ సభ్యునిగా నియమించబడ్డాను. అయితే బ్రాంచి కార్యాలయం కారాకాస్‌లో లేదు కాబట్టి, నేను వారానికి రెండుమూడు రోజులు దాదాపు 80 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది.

మరో ప్రాంతానికి వెళ్లడం

బ్రాంచి కార్యాలయం లా-విక్టోరియా పట్టణంలో ఉండేది. కాబట్టి, బెతెల్‌కు దగ్గరగా ఉండడానికి మా కుటుంబమంతా లా-విక్టోరియాకు మారాలని నిర్ణయించుకున్నాం. మా అందరికీ అదొక పెద్ద మార్పు. నా కుటుంబం ఇచ్చిన మద్దతును బట్టి నేను వాళ్లనెంతో మెచ్చుకుంటాను, గౌరవిస్తాను. మా అమ్మ బాగోగులు చూసుకోవడానికి మా అక్క బాహా ముందుకొచ్చింది. మైక్‌ పెళ్లి చేసుకున్నాడు. కానీ సమీరా, గాబ్రీయెల్‌ మాతోనే ఉండేవాళ్లు. లా-విక్టోరియాకు మారడం వల్ల వాళ్లు కారాకాస్‌లో ఉన్న తమ స్నేహితులకు దూరమయ్యారు. సిల్వియా కూడా హడావిడిగా ఉండే రాజధాని పట్టణాన్ని వదిలి, ఒక చిన్న పట్టణంలో సర్దుకుపోవాల్సి వచ్చింది. అలాగే మేమందరం చిన్న ఇంట్లో ఉండడానికి అలవాటుపడాల్సి వచ్చింది. అవును, లా-విక్టోరియాకు మారినప్పుడు మేము ఎన్నో సర్దుబాట్లు చేసుకున్నాం.

పరిస్థితులు మళ్లీ మారాయి. గాబ్రీయెల్‌కు పెళ్లి అయ్యింది, సమీరా విడిగా ఇల్లు తీసుకొని ఉంటుంది. తర్వాత 2007 లో సిల్వియాను, నన్ను బెతెల్‌కు ఆహ్వానించారు. మేము ఇప్పటికీ అక్కడే సేవ చేస్తున్నాం. మా పెద్ద అబ్బాయి మైక్‌ ఒక సంఘ పెద్దగా అలాగే తన భార్య మానికతో పాటు పయినీరుగా సేవ చేస్తున్నాడు. మా చిన్న అబ్బాయి గాబ్రీయెల్‌ కూడా సంఘపెద్దే. ఆయన, తన భార్య ఆంబ్రతో కలిసి ఇటలీలో సేవ చేస్తున్నాడు. సమీరా పయినీరు సేవతోపాటు, రిమోట్‌ వాలంటీర్‌గా బెతెల్‌ సేవ చేస్తుంది.

ఎడమ నుండి కుడికి: వెనిజ్యులా బ్రాంచిలో నా భార్య సిల్వియాతో. మా పెద్దబ్బాయి మైక్‌, ఆయన భార్య మానిక. మా అమ్మాయి సమీరా. మా చిన్నబ్బాయి గాబ్రీయెల్‌, ఆయన భార్య ఆంబ్ర

నేను మళ్లీ అవే నిర్ణయాలు తీసుకుంటాను

నా జీవితంలో పెద్దపెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఆ నిర్ణయాలు తీసుకున్నందుకు నాకు అస్సలు బాధ లేదు. అవకాశం వస్తే నేను మళ్లీ ఆ నిర్ణయాలే తీసుకుంటాను. యెహోవా సేవలో నేను పొందిన ఎన్నో నియామకాల్ని, సేవావకాశాల్ని బట్టి చాలా కృతజ్ఞుణ్ణి. ఈ సంవత్సరాలన్నిటిలో, యెహోవాతో బలమైన స్నేహాన్ని కాపాడుకోవడం ఎంత ప్రాముఖ్యమో నేను చూశాను. మనం తీసుకునే నిర్ణయాలు చిన్నవైనా, పెద్దవైనా “మానవ అవగాహనకు మించిన” శాంతిని ఆయన మనకు ఇస్తాడు. (ఫిలి. 4:6, 7) సిల్వియా, నేను బెతెల్‌ సేవను ఆనందిస్తున్నాం. అలాగే మా జీవితాల్లో యెహోవాకు మొదటిస్థానం ఇస్తూ నిర్ణయాలు తీసుకున్నాం కాబట్టి, ఆయన వాటిని ఆశీర్వదించాడని మాకు అనిపిస్తుంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి