మన క్రైస్తవ జీవితం
విమోచన క్రయధనం వల్ల చనిపోయినవాళ్లు మళ్లీ బ్రతుకుతారు
జ్ఞాపకార్థ సమయంలో విమోచన క్రయధనం వల్ల భవిష్యత్తులో వచ్చే దీవెనల గురించి ఆలోచించడానికి వీలౌతుంది. ఆ దీవెనల్లో ఒకటి చనిపోయినవాళ్లు మళ్లీ బ్రతకడం. మనుషులు చనిపోవాలని యెహోవా ఎప్పుడూ అనుకోలేదు. అందుకే మనకు బాగా ఇష్టమైనవాళ్లు చనిపోతే, మన హృదయం దాన్ని తట్టుకోలేదు. (1 కొరిం 15:26) లాజరు చనిపోయినప్పుడు శిష్యులు ఏడవడం చూసి యేసు కూడా ఏడ్చాడు. (యోహా 11:33-35) యేసు తన తండ్రిని ప్రతిబింబించాడు కాబట్టి మనం ఆప్తులను పోగొట్టుకున్నప్పుడు యెహోవా కూడా బాధ పడతాడని దీన్నిబట్టి అర్థమౌతుంది. (యోహా 14:7) తనకు సేవచేసిన వాళ్లను ఎప్పుడు బ్రతికిద్దామా అని యెహోవా ఎంతో ఎదురుచూస్తున్నాడు. మన కోరిక కూడా అదే.—యోబు 14:14, 15.
చనిపోయినవాళ్లను యెహోవా ఎలా బ్రతికిస్తాడు? దాని గురించి ఆయన ఎక్కువ విషయాలు చెప్పలేదు. యెహోవా దేవుడు అన్నీ ఒక క్రమ పద్ధతిలో చేస్తాడు కాబట్టి ఈ పని కూడా అలాగే చేస్తాడని మనం నమ్మవచ్చు. (1 కొరిం 14:33, 40) చనిపోయినవాళ్లను పాతిపెట్టే పనులు కాకుండా తిరిగి బ్రతికిన వాళ్లకు స్వాగతం చెప్పే కార్యక్రమాలు జరగవచ్చు. మీరెప్పుడైనా ఈ విషయాల గురించి ధ్యానించారా? ముఖ్యంగా బాధలో ఉన్నప్పుడు? (2 కొరిం 4:17, 18) విమోచన క్రయధనం ఇచ్చినందుకు, చనిపోయినవాళ్లను మళ్లీ బ్రతికిస్తున్నందుకు మీరు యెహోవాకు కృతజ్ఞతలు చెప్తున్నారా?—కొలొ 3:15.
మీ స్నేహితుల్లో, బంధువుల్లో ఎవర్ని మళ్లీ కలుసుకోవాలని మీరు ఎదురుచూస్తున్నారు?
బైబిల్లో ఉన్నవాళ్లలో ఎవర్ని మీరు కలిసి మాట్లాడాలని అనుకుంటున్నారు?