ప్రశ్నాభాగం
◼ ప్రచారకులు ఇంటర్నెట్‌ను ఎక్కువగా ఉపయోగిస్తూ, వేరేదేశంలో ఉంటున్న అపరిచితులకు సాక్ష్యం ఇవ్వవచ్చా, అధ్యయనం చేయవచ్చా?
మన పని మీద ఆంక్షలున్న లేదా కొంతమందే ప్రచారకులున్న దేశాల్లో బైబిలు అధ్యయనాలు సంపాదించడానికి వేరేదేశంలో ఉన్న కొందరు ప్రచారకులు ఇంటర్నెట్‌ను ఉపయోగించారు. కొన్నిసార్లు మంచి ఫలితాలు వచ్చాయి. కానీ ప్రచారకులు ఈ-మెయిల్స్, చాటింగ్ ద్వారా అపరిచితులతో మాట్లాడితే చాలా ప్రమాదాలున్నాయి. (మన రాజ్య పరిచర్య జూలై 2007, 3వ పేజీ చూడండి.) మంచి హృదయం ఉన్నవాళ్లకు రాజ్య సందేశం అందించాలనే ఉద్దేశం ఉన్నా, అలా మాట్లాడుతున్నప్పుడు ఒక సహోదరుడు లేక సహోదరి చెడ్డవాళ్లతో, మతభ్రష్టులతో కూడా పరిచయం పెంచుకునే అవకాశం ఉంది. (1 కొరిం. 1:19-25; కొలొ. 2:8) అంతేకాక రాజ్య పని మీద ఆంక్షలు లేదా నిషేధం ఉన్న దేశాల్లో మనం ఇంటర్నెట్ ద్వారా మాట్లాడుకునే వాటిపై అధికారుల నిఘా ఉండవచ్చు, దానివల్ల ఆ దేశంలో ఉన్న మన సహోదరసహోదరీలు ప్రమాదంలో పడవచ్చు. అందుకే, ప్రచారకులు వేరే దేశంలో ఉన్న వాళ్లకు సువార్త ప్రకటించడానికి ఇంటర్నెట్ ఉపయోగించకూడదు.
ఉదాహరణకు, మీకు తెలియని ఒక వ్యక్తి మీ దేశానికి వచ్చినప్పుడు అతనికి సాక్ష్యం ఇచ్చే అవకాశం మీకు దొరికి, ఆ తర్వాత అతను తన సొంత దేశానికి తిరిగి వెళ్లాక మీ స్థానిక బ్రాంచి చెప్తే తప్ప అతని ఆసక్తిని పెంచడానికి ప్రయత్నించకూడదు. బదులుగా, jw.org వెబ్‌సైట్ ఉపయోగించి ఎక్కువ సమాచారం ఎలా పొందవచ్చో లేదా వాళ్ల దేశంలోని బ్రాంచి కార్యాలయాన్ని ఎలా సంప్రదించవచ్చో వాళ్లకు చూపించండి. వాళ్ల ఇంటికి దగ్గరగా ఉన్న రాజ్యమందిరానికి వెళ్లమని ప్రోత్సహించండి. అయితే, కొన్ని దేశాల్లో రాజ్యమందిరాలు ఉండకపోవచ్చు. ఆ దేశంలోని సాక్షులను వాళ్లు కలవాలని కోరుకుంటుంటే, మీరు ప్లీజ్‌ఫాలో అప్ (S-43) ఫారమ్ నింపి మీ సంఘ కార్యదర్శికి ఇవ్వవచ్చు. అతను వాటిని jw.org వెబ్‌సైట్ ఉపయోగించి పంపిస్తాడు. ఆ దేశంలోని బ్రాంచి కార్యాలయానికి అక్కడి పరిస్థితులు బాగా తెలుసు కాబట్టి, వాళ్లకు కావాల్సిన ఆధ్యాత్మిక సహాయాన్ని ఆ బ్రాంచీనే సరైన విధంగా ఇవ్వగలదు.—మన రాజ్య పరిచర్య నవంబరు 2011, 2వ పేజీ చూడండి.
ప్రస్తుతం మనం పునర్దర్శనం చేస్తున్నవాళ్లు వేరే దేశానికి వెళ్తే లేదా పరిచయంలేని వేరే దేశస్థులను ఇంటర్నెట్ ద్వారా కలుసుకుని అధ్యయనం చేస్తుంటే పై నిర్దేశాన్ని పాటించాలి. అయితే, ఆ ప్రాంతంలోని ప్రచారకులు వాళ్లను కలిసేంతవరకు వాళ్లకు సహాయం చేయవచ్చు. అయితే వాళ్లు, మన పనిపై ఆంక్షలు లేదా నిషేధం ఉన్న ప్రాంతంలో ఉంటే ఉత్తరాలు, టెలిఫోన్, ఇంటర్నెట్ ద్వారా, బైబిలు అంశాలు మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.—మత్త. 10:16.