డిసెంబరులో రాజ్యవార్త నం. 38ని అందించబోతున్నాం!
1. చనిపోయినవాళ్ల గురించి ప్రజలకు ఎలాంటి ప్రశ్నలు ఉన్నాయి? డిసెంబరులో ఆ ప్రశ్నలకు సమాధానం ఎలా లభిస్తుంది?
1 ప్రజల నమ్మకాలు ఎలావున్నా మరణం అందరికీ శత్రువే. (1 కొరిం. 15:26) చనిపోయినవాళ్లు ఎక్కడున్నారు? వాళ్లను మళ్లీ కలుస్తామా? అని చాలామంది ఆలోచిస్తుంటారు. అందుకే, “చనిపోయినవాళ్లు మళ్లీ బతుకుతారా?” అనే ఆసక్తికరమైన శీర్షికగల రాజ్యవార్త నం. 38ని ప్రపంచవ్యాప్తంగావున్న సంఘాలన్నీ ఒక నెలపాటు జరిగే ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో పంచిపెడతాయి. అది డిసెంబరు 1న మొదలౌతుంది. ప్రత్యేక ప్రచార కార్యక్రమం తర్వాత, రాజ్యవార్త నం. 38ని పరిచర్యలో కరపత్రంలా ఉపయోగిస్తాం.
2. రాజ్యవార్త నం. 38 ఎలా ఉంటుంది?
2 అదెలా ఉంటుంది: రాజ్యవార్త నం. 38ని దాని పేరు, అలాగే “మీరేమంటారు? అవును. కాదు. చెప్పలేం.” అనే మాటలు కనిపించేలా నిలువుగా మడవాలి. అప్పుడు ఇంటివాళ్లు దాన్ని తెరవగానే, కరపత్రం మీదున్న ప్రశ్నకు పరిశుద్ధ లేఖనాలు ఎలా జవాబిస్తున్నాయో, ఆ వాగ్దానం నుండి వాళ్లెలా ప్రయోజనం పొందవచ్చో కనిపిస్తుంది. పరిశుద్ధ లేఖనాలు చెప్పేదాన్ని ఎందుకు నమ్మవచ్చో కూడా అందులో ఉంటుంది. ఆ కరపత్రం వెనుక భాగంలో, ఇంటివాళ్లను ఆలోచింపజేసే ఒక ఆసక్తికరమైన ప్రశ్న, ఇంకా ఎక్కువ తెలుసుకోమనే ఆహ్వానం ఉంటాయి.
3. రాజ్యవార్త నం. 38ని ఎలా పంచిపెడతాం?
3 ఎలా పంచిపెట్టాలి? ఈ ప్రచార కార్యక్రమం కూడా జ్ఞాపకార్థ ఆచరణప్పుడు, జిల్లా సమావేశమప్పుడు చేసే ప్రచార కార్యక్రమంలాగే ఉంటుంది. ఏప్రిల్ 1, 2013 తేదీతో సంఘ పెద్దలకు ఒక ఉత్తరం వచ్చింది. పెద్దలు దానిలోని సూచనల ప్రకారం స్థానిక క్షేత్రాన్ని పూర్తిచేయడానికి నిర్దేశాలు ఇస్తారు. చిన్న క్షేత్రంగల సంఘాలు, దగ్గర్లోని పెద్ద క్షేత్రంగల సంఘాలకు సహాయం చేయవచ్చు. కరపత్రాలను తీసుకుంటున్నప్పుడు ఆ వారానికి కావాల్సినన్ని మాత్రమే తీసుకోండి. ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు, ఇంటింటి పరిచర్య క్షేత్రాలన్నీ పూర్తిచేసిన తర్వాత కరపత్రాలను బహిరంగ పరిచర్యలో కూడా పంచిపెట్టవచ్చు. ఒకవేళ నెల పూర్తవకముందే కరపత్రాలన్నీ అయిపోతే, ఆ నెలలో ఇవ్వాల్సిన ప్రచురణలను అందించాలి. ఆ నెల మొదటి శనివారం, బైబిలు అధ్యయనాలు ప్రారంభించడం మీద కాకుండా ప్రచార కార్యక్రమం మీదే దృష్టిపెడతాం. వారాంతాల్లో, వీలైనప్పుడల్లా పత్రికలను కూడా అందించాలి. ప్రచార కార్యక్రమంలో పూర్తిగా పాల్గొనడానికి మీరు ఏర్పాట్లు చేసుకుంటున్నారా?