బైబిలు అధ్యయనంలో పూర్తిగా భాగం వహించడానికి కుటుంబ సభ్యులు ఏమి చేయవచ్చు?
1 సత్యం నేర్చుకోవడం వల్ల మన కుటుంబ జీవితానికి ఒక అర్థం ఏర్పడుతుంది. కానీ, చక్కగా యెహోవా సేవ చేయాలన్నా, కుటుంబం ఆధ్యాత్మికంగా పటిష్ఠంగా ఉండాలన్నా మనం సమయం తీసుకొని కృషిచేయాలి. అందుకు, కుటుంబ సభ్యులందరూ ఒకరికొకరు సహకరించుకోవాలి. మంచి అధ్యయన అలవాట్లను పెంపొందించుకోవడానికి కుటుంబాలు ఏమి చేయవచ్చో ఈ ఆర్టికల్ చెబుతుంది.
2 ప్రతీరోజు బైబిలు చదవండి: సామెతలు 24:5 ఇలా చెబుతోంది: “తెలివిగలవాడు శక్తిమంతుడుగా నుండును.” క్రమంగా దేవుని వాక్యం చదవడం వల్ల వచ్చే జ్ఞానం, సాతాను చేసే దాడులను తిప్పికొట్టి దేవునితో మన సంబంధాన్ని కాపాడుకోవడానికి కావాల్సిన బలాన్నిస్తుంది. (కీర్త. 1:1, 2) మీ కుటుంబంలో, ప్రతీరోజు బైబిలు చదివే అలవాటుందా? ప్రతీవారం ఏ బైబిలు భాగం చదవాలో మన రాజ్య పరిచర్యలో వస్తుంది. ప్రతీరోజు పది నిమిషాలు వెచ్చిస్తే చాలు, దాన్ని పూర్తిచేయవచ్చు. ఇంట్లో అందరికీ అనువైన సమయంలో, అంటే టిఫిన్ చేసే ముందు గానీ, రాత్రి భోంచేశాక గానీ లేదా పడుకునే ముందు గానీ బైబిలు చదివి, దినవచనం చర్చించండి. అది మీ దినచర్యలో భాగమైపోవాలి.
3 ప్రతీవారం కుటుంబ అధ్యయనం చేయండి: వారమంతా మీరు చేసే పనుల్లో కుటుంబ అధ్యయనానికి ప్రత్యేక స్థానం ఉండాలి. ప్రతీ ఒక్కరు ఉత్సాహంగా పాల్గొంటూ దానికి సహకరించాలి. కుటుంబ అధ్యయనం ఎప్పుడు చేయాలి? ఎంతసేపు చేయాలి? దానిలో ఏమి పరిశీలించాలి? వంటి విషయాల గురించి ఆలోచిస్తున్నప్పుడు కుటుంబ శిరస్సు ఇంట్లోవాళ్ల అవసరాలను మనసులో ఉంచుకోవాలి. వారపు పట్టికలో కుటుంబ అధ్యయనానికే ప్రాధాన్యం ఇవ్వండి. చిన్నచిన్న విషయాల వల్ల ఆటంకం కలగకుండా చూసుకోండి.—ఫిలి. 1:9-11.
4 ఒక కుటుంబంలో, తండ్రికి తన వ్యాపారానికి సంబంధించిన ఫోన్ కాల్స్ ఎక్కువ వచ్చేవి. కాబట్టి, కుటుంబ అధ్యయనమప్పుడు ఆయన దాన్ని డిస్కనెక్ట్ చేసేవాడు. తన కోసం ఎవరైనా ఇంటికొస్తే, వాళ్లను కూడా తమతో కూర్చోమంటాడు లేదా కుటుంబ అధ్యయనం పూర్తయ్యేవరకు వేచివుండమంటాడు. కుటుంబ అధ్యయనానికి ఏదీ ఆటంకం కలిగించకుండా చూసుకోవాలని ఆయన నిశ్చయించుకున్నాడు. అది వాళ్ల పిల్లల మనసుల్లో చెరగని ముద్ర వేసింది, ఆయన వ్యాపారం కూడా బాగానే సాగింది.
5 ఆధ్యాత్మిక విషయాల్లో ఇంట్లో అందరూ సహకరించుకుంటే ఎంత బావుంటుందో కదా! కుటుంబ బైబిలు అధ్యయనంలో పూర్తిగా పాల్గొనడానికి నిజాయితీగా కృషిచేస్తే, యెహోవా మనల్ని మెండుగా దీవిస్తాడు.—కీర్త. 1:3.