పరిచర్యలో వ్యతిరేకతను ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండండి
1. క్రైస్తవ పరిచారకులకు ఏమి జరుగుతుందని చెప్పవచ్చు? దానితో ఏ ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి?
1 ప్రజలు తన అనుచరులను హింసిస్తారని యేసు ముందే చెప్పాడు. (యోహా. 15:20) మనం అంత్యదినాల ముగింపుకు చేరుకుంటున్నాం. అంతేకాదు, సాతాను కోపం అంతకంతకు ఎక్కువవుతోంది కాబట్టి రానురాను హింస పెరుగుతుందని చెప్పవచ్చు. (ప్రక. 12:12) పరిచర్య చేస్తున్నప్పుడు మనల్ని మనం ఎలా కాపాడుకోవచ్చు? అవసరమైతే పోలీసుల సహాయం తీసుకోవడంలో తప్పులేదా? దాడి చేసినవాళ్ల మీద చట్టపరమైన చర్య తీసుకోవాలా?
2. శారీరక హాని జరగకుండా తమను తాము కాపాడుకోవడానికి క్రైస్తవులు తగిన చర్యలు ఎందుకు తీసుకోవాలి?
2 ప్రాణం ఎంతో విలువైనది: యెహోవా ప్రాణాన్ని ఎంతో విలువైనదిగా ఎంచుతాడు. అందుకే ఆయన ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు ప్రాణాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తోడ్పడే ఆజ్ఞలను కూడా అందులో చేర్చాడు. (నిర్గ. 21:22-29) దేవుని సేవకులు ఇప్పుడిక మోషే ధర్మశాస్త్రానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేకపోయినా, జీవమనే బహుమానాన్ని వాళ్లు ఇప్పటికీ విలువైనదిగా ఎంచుతారు. కాబట్టి, శారీరక హాని జరిగే అవకాశం ఉన్నప్పుడు క్రైస్తవులు తమను తాము కాపాడుకోవడానికి చర్యలు తీసుకోవడం న్యాయమే.
3. పరిచర్య చేస్తున్న ప్రాంతంలో ప్రమాదకరమైన పరిస్థితి ఏదైనా తలెత్తితే మనం ఏమి చేయాలి?
3 మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? వ్యతిరేకులు కోపంతో యేసుకు ప్రమాదం తలపెట్టాలనుకున్న సందర్భాల్లో ఆయన అక్కడినుండి పారిపోయాడు. (లూకా 4:28-30; యోహా. 8:59) అలాగే, మనం పరిచర్య చేస్తున్న ప్రాంతంలో ప్రమాదకరమైన పరిస్థితి ఏదైనా తలెత్తితే, సాధారణంగా అక్కడి నుండి వెళ్లిపోవడమే తెలివైన పని. వ్యతిరేకత తగ్గే వరకు వేరే ప్రాంతాల్లో ప్రకటించడం మంచిది.—మత్త. 10:23.
4. వ్యతిరేకులు మనల్ని బలవంతంగా నిర్బంధించడానికి ప్రయత్నిస్తే మనం ఏమి చేయవచ్చు?
4 వ్యతిరేకులు మనల్ని బలవంతంగా నిర్బంధించడానికో వాళ్ల ఇంట్లో బంధించడానికో ప్రయత్నిస్తే ఏమి చేయవచ్చు? అప్పుడున్న పరిస్థితులను బట్టి ఏమి చేయాలో నిర్ణయించుకోవాలి. అయితే, అలాంటి చట్టవ్యతిరేకమైన పనులను క్రైస్తవులు అలాగే భరించాల్సిన అవసరం లేదు. వ్యతిరేకిస్తున్న వ్యక్తిని అడ్డుకోవడం ద్వారా మనకు శారీరక హాని జరగకుండా తప్పించుకోవచ్చు, బహుశా ఆ వ్యక్తిని దూరంగా నెట్టేసి అక్కడి నుండి పారిపోవచ్చు. క్రైస్తవులు తమకు శారీరకంగా హాని జరిగే అవకాశం ఉందనుకుంటే, లేదా చివరికి తమ ప్రాణానికే ముప్పు వచ్చేలా ఉంటే, దెబ్బలు తగలకుండా చేతులతో అడ్డుకోవచ్చు, అతణ్ణి ఆపడానికి ప్రయత్నించవచ్చు. ఆ వ్యక్తి షాక్ అయ్యేలా చేయడానికి లేదా అతణ్ణి కాసేపు అశక్తునిగా చేయడానికి ఒక గుద్దు గుద్దొచ్చు కూడా.—జూన్ 2008 తేజరిల్లు! (ఆంగ్లం) పత్రికలోని 10, 11 పేజీల్లో ఉన్న “బైబిలు ఉద్దేశము: ఎలాంటి పరిస్థితుల్లో మనల్ని మనం రక్షించుకోవాలి?” అనే ఆర్టికల్ చూడండి.
5. అధికారులు చేసిన ఎలాంటి చట్టబద్ధమైన ఏర్పాట్లను ఉపయోగించుకుని మనం పరిచర్య చేయవచ్చు?
5 మనం పోలీసుల సహాయం తీసుకోవాలా? అపొస్తలుడైన పౌలు పరిచర్య చేస్తున్నప్పుడు, రోమా చట్టం ప్రకారం తనకు అందుబాటులో ఉన్నవాటిని ఉపయోగించుకున్నాడు. ఉదాహరణకు, వ్యతిరేకులు ఆయన మీద అబద్ధ ఆరోపణలు చేసినప్పుడు, తన విన్నపాన్ని కైసరుకు చెప్పుకోవడానికి తనకున్న చట్టబద్ధమైన అవకాశాన్ని వినియోగించుకున్నాడు. (అపొ. 25:11) అంతకుముందు మరో సందర్భంలో, పౌలు కొరడా దెబ్బల్ని తప్పించుకోవడానికి రోమా పౌరునిగా తనకున్న హక్కులను ఉపయోగించుకున్నాడు. (అపొ. 22:25, 29) కాబట్టి క్రైస్తవులు తమను తాము కాపాడుకోవడానికి అధికారుల సహాయాన్ని, అంటే ‘మనకు మేలు కలుగుటకు దేవుని పరిచారకులుగా’ ఉన్నవాళ్ల సహాయాన్ని తీసుకోవడం న్యాయమే.—రోమా. 13:3, 4.
6. తప్పించుకుని పారిపోలేని ప్రమాదకరమైన పరిస్థితి ఏదైనా ఎదురైతే మనమేమి చేయాలి?
6 పై విషయాలను బట్టి, పరిచర్య చేస్తున్నప్పుడు మనం తప్పించుకుని పారిపోలేని ప్రమాదకరమైన పరిస్థితి ఏదైనా ఎదురైతే, వెంటనే పోలీసులను సంప్రదించాలి. కొంతమంది తెలివిగా, సమస్య రాబోతుందని పసిగట్టిన వెంటనే సహాయం అర్థించడానికి వీలుగా దగ్గర్లో ఉన్న పోలీస్స్టేషన్ ఫోన్ నంబరును తమ సెల్ఫోన్లలో పెట్టుకున్నారు. క్షేత్రసేవా కూటాలు నిర్వహించే సహోదరులు తమతోపాటు పరిచర్య చేస్తున్నవాళ్లు ప్రమాదంలో పడకుండా వాళ్లను కాస్త గమనిస్తుండాలి.—1 పేతు. 5:2, 3.
7. పరిచర్య చేస్తున్నప్పుడు గృహస్థులు మనమీద దాడి చేస్తే, మనం చట్టపరమైన చర్య తీసుకోవడం ఎందుకు మంచిది?
7 చట్టపరమైన చర్య తీసుకోవాలా? పరిచర్య చేస్తున్నప్పుడు గృహస్థులు మనమీద దాడి చేస్తే, వాళ్ల మీద చట్టపరమైన చర్య తీసుకోవాలా? మరిన్ని సమస్యలు వస్తాయనో అవిశ్వాసులైన బంధువుల ముందు లేదా ఇరుగుపొరుగువాళ్ల ముందు పరువు పోతుందనో భయపడి కొంతమంది అలా చేయడానికి ఇష్టపడకపోవచ్చు. అయితే, మనం చట్టపరమైన చర్య తీసుకోకపోతే, యెహోవాసాక్షుల మీద దాడి చేసినా శిక్షపడకుండా తప్పించుకోవచ్చని వ్యతిరేకులు అనుకునే ప్రమాదముంది. అంతేకాదు, వాళ్లు భయం లేకుండా దౌర్జన్యంగా మన మీద దాడి చేస్తూనే ఉండే అవకాశం కూడా ఉంది. (ప్రసం. 8:11) మనం చట్టపరమైన చర్య తీసుకుంటే, ‘సువార్త పక్షాన వాదించడంలో, దానిని [“చట్టబద్ధంగా,” NW] స్థిరపరచడంలో’ భాగం వహించగలుగుతాం. భవిష్యత్తులో మన సహోదరసహోదరీలు ఆ ప్రాంతంలో పరిచర్య చేస్తున్నప్పుడు వాళ్ల మీద దాడి జరిగే అవకాశాలు తగ్గుతాయి.—ఫిలి. 1:7.
8. హింస ఎదురయ్యే ప్రమాదమున్నా, మనమెందుకు భయపడకుండా ప్రకటించవచ్చు?
8 వ్యతిరేకులు అనుకున్నది సాధించరు: క్రైస్తవులు హింస అనుభవించక తప్పదు, అయినా భయపడాల్సిన అవసరం లేదు. విశ్వమంతటిలో గొప్ప వ్యక్తి మనకు తోడుగా ఉన్నాడు. (యెష. 41:9; హెబ్రీ. 13:6) వ్యతిరేకులు, సువార్త ప్రకటించే పని జరగకుండా ఆపడానికి యెహోవా అనుమతించడు. (యెష. 54:17) అంతేకాదు, వ్యతిరేకత ఉన్నా మనం నమ్మకంగా పరిచర్య చేయడం ‘దేవునికి ఇష్టమైనది’ అని, వ్యతిరేకులు తన సేవకులకు ఎలాంటి హాని చేసినా, ఆ హాని వల్ల వాళ్లకు కలిగిన బాధను ఒకరోజు ఆయన తీసివేస్తాడని మర్చిపోవద్దు. (1 పేతు. 2:19, 20) యెహోవా సంస్థ మనకు మద్దతిస్తోంది. మనం పరిచర్యలో ఉన్నప్పుడు ఎవరైనా దాడిచేసినా లేదా పరిచర్య చేయడం చట్టవ్యతిరేకమని అధికారులన్నా వెంటనే మనం పెద్దలకు తెలియజేయాలి, అప్పుడు వాళ్లు బ్రాంచిని సంప్రదిస్తారు. ఈ కష్టమైన అంత్యదినాల్లో పట్టుదలతో సువార్తను ప్రకటిస్తున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా, ఎంతో వివేచనతో వ్యవహరించాలి.—అపొ. 5:41, 42.