జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి పుస్తకాన్ని అధ్యయనం చేయడం
1 ఏప్రిల్ 18తో మొదలయ్యే వారంలో, మనం మన సంఘ బైబిలు అధ్యయనాల్లో జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి పుస్తకాన్ని అధ్యయనం చేయడం మొదలుపెడతాం. యేసుక్రీస్తు జీవితాన్ని, ఆయన పరిచర్యను మళ్లీ పరిశీలించడం ఎంత సంతోషాన్నిస్తుందో కదా! ఈ పుస్తకం, మనం ఇంతవరకు అధ్యయనం చేసిన ఇతర పుస్తకాల్లా రూపొందించబడలేదు కాబట్టి కొన్ని నిర్దేశాలు సహాయకరంగా ఉంటాయి.
2 ఈ పుస్తకంలో పేజీ నంబర్లు లేవు కాబట్టి ఏ వారంలో ఏ అధ్యాయం చర్చించాలో మన రాజ్య పరిచర్యలో ఇవ్వబడుతుంది. కొన్ని అధ్యాయాలు పెద్దగా ఉన్నాయి అందుకే వాటిని కొన్ని వారాలపాటు చర్చిస్తాం. అర్హత గల ఒక సహోదరుడు అధ్యాయం మొత్తాన్ని (లేదా ఒక ఉపశీర్షిక మొత్తాన్ని) చదివిన తర్వాత, అధ్యయన నిర్వాహకుడు అధ్యాయానికి లేదా చదివిన భాగానికి సంబంధించి చివర్లో ఉన్న ప్రశ్నలు అడుగుతాడు. అధ్యాయంలో జవాబులు ఎప్పుడూ వరుసగానే ఉండవు. అధ్యాయంలో ఉన్న సమాచారం ఆధారంగా క్లుప్తంగా, సూటిగా జవాబులు ఇవ్వాలి.
3 తర్వాత, ఉన్న సమయాన్ని బట్టి, అధ్యాయం చివర్లో ఇచ్చిన లేఖనాలను చదవవచ్చు. ఎక్కువ వచనాలు చదవాల్సి ఉంటే ఒక్కొక్కరి చేత కొన్ని వచనాలు చదివిస్తే చాలామంది ప్రచారకులకు చదివే అవకాశం దొరుకుతుంది. ఆ తర్వాత, చదివిన భాగంపై వ్యాఖ్యానాలు చేయవచ్చు. అధ్యయన నిర్వాహకుడు సరైన ప్రశ్నలు ముందుగానే తయారు చేసుకుంటే, పుస్తకంలో ముఖ్యంగా చెప్పిన అంశాలకు, చదివిన లేఖనాలకు ఎలాంటి సంబంధం ఉందో తెలియజేసే అర్థవంతమైన వ్యాఖ్యానాల్ని ప్రేక్షకుల నుండి రాబట్టగలుగుతాడు. ప్రశ్నలన్నీ, వ్యాఖ్యానాలన్నీ హాజరైన వాళ్లందరు యేసుక్రీస్తు గురించి, ఆయన జీవితం గురించి, ఆయన బోధల గురించి తెలుసుకునే విధంగా ఉండాలి.
4 మహాగొప్ప మనిషి పుస్తకంలో, యేసుక్రీస్తు జీవితంలోని ఘట్టాలన్నీ అవి జరిగిన క్రమంలోనే ఉన్నాయి. వాటిని ఊహించుకుని, అవి ఎక్కడ జరిగాయో మనసులో ఉంచుకుంటే వాటిని బాగా గుర్తుంచుకోగలుగుతాం. కాబట్టి, రంగురంగుల చిత్రాలను తప్పకుండా పరిశీలించండి, ఉపోద్ఘాతం తర్వాత పుస్తకం ప్రారంభంలో ఉన్న పటాన్ని తరచుగా ఉపయోగించండి.
5 పుస్తకంలో ఉన్న ఉపోద్ఘాతాన్ని మొదటి వారంలో పరిశీలిస్తాం. ఉపశీర్షికలో ఉన్న పేరాలన్నీ చదివిన తర్వాత, అధ్యయన నిర్వాహకుడు దానికి సంబంధించి తాను తయారు చేసుకున్న ప్రశ్నలను అడుగుతాడు. మొదట దీన్ని పరిశీలిస్తే ఆ తర్వాత జరగబోయే అధ్యయనాలను అర్థం చేసుకోవడం సుళువవుతుంది. హాజరయ్యే వాళ్లందరూ ఎంత బాగా సిద్ధపడితే అందులో ఉన్న విషయాలను అంత బాగా అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా అధ్యయన నిర్వాహకుడు ప్రతీవారం బాగా సిద్ధపడాలి. అప్పుడే మన ప్రభువు, రక్షకుడు, జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి అయిన యేసుక్రీస్తు గురించి సంఘం బాగా తెలుసుకోవడానికి ఆయన సహాయం చేయగలుగుతాడు.