ప్రగతిదాయక బైబిలు అధ్యయనాలను నిర్వహించడం—సిద్ధపడడానికి విద్యార్థులకు శిక్షణనివ్వడం
1 సాధారణంగా పాఠాన్ని ముందే చదివి, జవాబులను అండర్లైన్చేసుకుని, వాటిని తమ సొంత మాటల్లో ఎలా వ్యక్తం చేయాలో ఆలోచించే విద్యార్థులు త్వరగా ఆధ్యాత్మిక అభివృద్ధి సాధిస్తారు. కాబట్టి ఒకసారి క్రమంగా అధ్యయనం చేయడం మొదలుపెట్టిన తర్వాత, పాఠాన్ని ఎలా సిద్ధపడాలో చూపించడానికి మీ విద్యార్థితో కలిసి ఒక పాఠాన్ని సిద్ధపడండి. చాలామంది విద్యార్థుల విషయంలో మొత్తం అధ్యాయం లేదా ఒక పాఠం వారితో కలిసి సిద్ధపడితే సహాయకరంగా ఉంటుంది.
2 అండర్లైన్ చేసుకోవడం, మార్జిన్లలో వివరణలు రాసుకోవడం: ఇవ్వబడిన ప్రశ్నలకు సూటియైన జవాబులు ఎలా కనుక్కోవాలో వివరించండి. అధ్యయనం చేస్తున్న ప్రచురణలో ముఖ్యమైన పదాలు లేక పదబంధాలు అండర్లైన్చేసి ఉన్న మీ పుస్తకాన్ని విద్యార్థికి చూపించండి. మీరు సమాచారాన్ని పరిశీలిస్తుండగా, మీలాగే మీ విద్యార్థి కూడా జవాబును గుర్తుతెచ్చుకోవడానికి సహాయం చేసేవాటిని మాత్రమే అండర్లైన్చేసుకోవాలనుకోవచ్చు. (లూకా 6:40) అలా చేసిన తర్వాత సొంత మాటల్లో జవాబివ్వమనండి. అలాచేస్తే, సమాచారాన్ని విద్యార్థి ఎంత స్పష్టంగా అర్థం చేసుకుంటున్నది మీకు తెలుస్తుంది.
3 అధ్యయనం కోసం సిద్ధపడేటప్పుడు, బ్రాకెట్లలో ఉన్న లేఖనాలను విద్యార్థి జాగ్రత్తగా పరిశీలించడం ప్రాముఖ్యం. (అపొ. 17:11) పేరాలో ఇవ్వబడిన ప్రతీ లేఖనం ఆ పేరాలోని విషయానికి ఆధారమని తెలుసుకోవడానికి విద్యార్థికి సహాయం చేయండి. అధ్యయనం చేస్తున్న ప్రచురణ మార్జిన్లో క్లుప్తమైన వివరణలను ఎలా రాసుకోవాలో చూపించండి. విద్యార్థి నేర్చుకుంటున్న వాటికి ఆధారం బైబిలనే విషయాన్ని స్పష్టం చేయండి. అధ్యయనంలో వ్యాఖ్యానాలు చేస్తున్నప్పుడు పేరాలో ఇవ్వబడిన లేఖనాలను ఎక్కువగా ఉపయోగించమని విద్యార్థిని ప్రోత్సహించండి.
4 సమీక్ష, పునఃసమీక్ష: అధ్యయనం చేస్తున్న సమాచారాన్ని విద్యార్థి బాగా సిద్ధపడే ముందు, అసలు ఆ సమాచారంలో ఏ అంశం గురించి ప్రస్తావించబడిందో తెలుసుకోవడం సహాయకరంగా ఉంటుంది. చర్చించబడిన సమాచారాన్ని తెలుసుకోవడానికి శీర్షికను, ఉపశీర్షికలను, చిత్రాలను ఒకసారి పరిశీలించడం మంచిదని చెప్పండి. సిద్ధపడడం ముగించే ముందు, ఒకవేళ పునఃసమీక్షా బాక్సు ఉంటే దాన్ని ఉపయోగించి, పాఠంలోని ముఖ్యాంశాలను మళ్లీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ప్రయోజనకరంగా ఉంటుందని వివరించండి. అలాచేస్తే, విద్యార్థి సమాచారాన్ని గుర్తుంచుకోవడం వీలవుతుంది.
5 అధ్యయనం కోసం చక్కగా సిద్ధపడడానికి విద్యార్థులకు శిక్షణనిస్తే, సంఘ కూటాల్లో ప్రయోజనకరమైన వ్యాఖ్యానాలు చేయగలుగుతారు. అంతేకాదు, మీరు మీ విద్యార్థులతో వ్యక్తిగత బైబిలు అధ్యయనం పూర్తిచేసిన చాలాకాలం తర్వాత కూడా ప్రయోజనం చేకూర్చే చక్కని అధ్యయన అలవాట్లను అలవర్చుకోగలుగుతారు.