బైబిలు అధ్యయనాల్లో లేఖనాలను చక్కగా ఉపయోగించండి
1. బైబిలు అధ్యయనాలు నిర్వహిస్తున్నప్పుడు లేఖనాలను మనం ఎందుకు నొక్కి చెప్పాలి?
1 ప్రజలను ‘శిష్యుల్ని చేయాలన్న’ ఉద్దేశంతోనే మనం బైబిలు అధ్యయనాలు నిర్వహిస్తాం. వాళ్లు శిష్యులవ్వాలంటే, దేవుని వాక్యంలోని బోధలను అర్థం చేసుకుని, వాటిని అంగీకరించి, వాటిని తమ జీవితాలలో పాటించేలా వాళ్లకు మనం సహాయం చేయాలి. (మత్త. 28:19, 20; 1 థెస్స. 2:13) కాబట్టి, బైబిలు అధ్యయనం నిర్వహిస్తున్నప్పుడు లేఖనాలను చూపించడం చాలా ప్రాముఖ్యం. మొదట్లో, నిర్దిష్టమైన లేఖనాలు తమ స్వంత బైబిల్లో ఎక్కడ ఉన్నాయనేది ఎలా తెలుసుకోవాలో విద్యార్థులకు చూపించడం సహాయకరంగా ఉండవచ్చు.
2. ఏ లేఖనాలను చదివి చర్చించాలనేది మనమెలా నిర్ణయించుకోవచ్చు?
2 ఏ లేఖనాలను చదవాలో ఎంపిక చేసుకోండి: మీరు సిద్ధపడుతున్నప్పుడు, పేరాలో పరిశీలించబడుతున్న విషయానికి అందులో ఇవ్వబడిన ప్రతీ లేఖనం ఎలా వర్తిస్తుందో చూసి, అధ్యయనం నిర్వహించేటప్పుడు వాటిలో ఏ లేఖనాలను చదివి, చర్చించాలో నిర్ణయించుకోండి. సాధారణంగా, మన నమ్మకాలకు లేఖనాధారాన్ని చూపించే వాటిని చదవడం మంచిది. నేపథ్య సమాచారాన్ని అందజేసే లేఖనాలను చదవాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ప్రతీ విద్యార్థి అవసరాల్ని, పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకోండి.
3. ప్రశ్నలు వేయడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి, మనమెలా ప్రశ్నలు వేయవచ్చు?
3 ప్రశ్నలు వేయండి: బైబిలు లేఖనాలను మీరు వాళ్లకు వివరించే బదులు, వాళ్లనే మీకు వివరించమనండి. ప్రశ్నలను నైపుణ్యవంతంగా ఉపయోగించడం ద్వారా మీరలా చేయవచ్చు. ఏదైనా ఒక లేఖన అన్వయింపు స్పష్టంగా ఉంటే, పేరాలో ఉన్నదాన్ని ఆ లేఖనం ఎలా సమర్థిస్తుందో చెప్పమని అడగవచ్చు. మిగతా సందర్భాల్లో, విద్యార్థి సరైన ముగింపుకు రావడానికి ఒక నిర్దిష్టమైన ప్రశ్న లేదా వరుసగా కొన్ని ప్రశ్నలు వేయాల్సిరావచ్చు.
4. మనం చదివే లేఖనాలను ఎంతవరకు వివరించాలి?
4 సులువుగా అర్థమయ్యేలా చెప్పండి: సాధారణంగా, నైపుణ్యవంతుడైన వేటగాడికి గురిని కొట్టేందుకు ఒకే ఒక్క బాణం చాలు. అలాగే, నైపుణ్యవంతుడైన బోధకుడికి ఏదైనా ఒక విషయం చెప్పడానికి ఎన్నో పదాలు అవసరం లేదు. అధ్యయనం నిర్వహిస్తున్నప్పుడు ప్రతీ లేఖనానికి సంబంధించిన అన్ని విషయాలను వివరించడానికి ప్రయత్నించకండి. అధ్యయనంలో పరిశీలించబడుతున్న విషయం అర్థమవడానికి అవసరమైనదాన్ని మాత్రమే చెప్పండి. కొన్నిసార్లు, ఒక లేఖనాన్ని అర్థం చేసుకుని, దాన్ని సరిగ్గా వివరించడానికి క్రైస్తవ ప్రచురణల్లో పరిశోధన చేయాల్సిన అవసరం ఉండవచ్చు.—2 తిమో. 2:15.
5, 6. దేవుని వాక్యాన్ని తమ జీవితాల్లో అన్వయించుకోవడానికి విద్యార్థులకు మనమెలా సహాయం చేయవచ్చు, అయితే మనమేమి చేయకూడదు?
5 ఎలా అన్వయిస్తుందో చెప్పండి: అవసరమైనప్పుడు, విద్యార్థి తనకు బైబిలు లేఖనాలు వ్యక్తిగతంగా ఎలా అన్వయిస్తాయో తెలుసుకునేలా సహాయం చేయండి. ఉదాహరణకు, హెబ్రీయులు 10:24, 25 పరిశీలిస్తున్నప్పుడు, ఒక కూటం గురించి చర్చించి, దానికి రమ్మని ఆహ్వానించవచ్చు. కానీ రమ్మని బలవంతం చేయకండి. యెహోవాకు సంతోషం కలిగించే చర్యలు తీసుకునేలా దేవుని వాక్యం అతన్ని ప్రేరేపించనివ్వండి.—హెబ్రీ. 4:12.
6 శిష్యులను చేయమని మనకివ్వబడిన ఆజ్ఞను పాటిస్తున్నప్పుడు, లేఖనాలను చక్కగా ఉపయోగిస్తూ, ‘విశ్వాసం ద్వారా విధేయతను’ ప్రోత్సహిద్దాం.—రోమా. 16:25, 26.