‘అసమయంలో’ కూడా పరిచర్య చేయడానికి మనకు శిక్షణ లభించింది
1 ‘అసమయంలో’ అంటే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు కూడా సరైన మనోవైఖరిగల వారిని వెదికేలా శిక్షణనిచ్చి మనల్ని సిద్ధం చేసిన మన రాజ్య పరిచర్య గత సంచికల్లోని ఆదేశాలు సమయానుకూలమైనవి అని అర్థం చేసుకున్నాం. (2 తిమో. 4:2) మరి ఆ ఆదేశాల్లో వేటినైనా మీరు పాటించారా? బైబిలు సువార్తను వినాలా, వద్దా అని ఇంటివారు నిర్ణయించుకునే హక్కును గౌరవించాలని నేర్చుకున్నాం. ఇది జ్ఞానయుక్తం, ఎందుకంటే మనం వివిధరకాల మత నమ్మకాల ప్రజల దగ్గరకు పిలవకుండానే వెళ్తున్నాం. మనం విషయం చెప్పడానికి ముందే ఇంటివారు వినడానికి సుముఖంగా ఉన్నారో లేదో గ్రహించడానికి ప్రయత్నిస్తాం. అలా చేస్తే మనమాయన ఇష్టాయిష్టాలను గౌరవిస్తున్నామని చూపిస్తాం.
2 మనం జాగ్రత్తగా, వివేచనతో, నేర్పుగా వ్యవహరించినప్పుడు ఇబ్బందుల్లో చిక్కుకోం. నేర్పుగా వ్యవహరించడమంటే, ఏం మాట్లాడకూడదో మనం గ్రహించాలని అర్థం. (యోహా. 16:12) ఇతరులను బలవంతపెట్టో, ఆశపెట్టో మతమార్పిడి చేయడం లేదని మనకు తెలుసు. క్రీస్తు శిష్యులు శాంతిని, ఓదార్పును ఇచ్చే సందేశాన్ని ప్రకటిస్తారు. అంతమాత్రాన క్షేత్రంలోని అందరూ ఆ సందేశం వినరు లేదా మన సదుద్దేశాన్ని అర్థం చేసుకోరు. కాబట్టి, క్రైస్తవులు తమను ‘హింసించేవారి’ నుండి లేదా రెచ్చగొట్టేవారి నుండి దూరంగా పారిపోవాలి. (మత్త. 10:23; అపొ. 14:5-7) ఇటీవల నెలల్లో వ్యతిరేకత ఎదురైన క్షేత్రాల్లో సహోదరులు అలాగే చేసి, ఆసక్తి చూపించిన వారికి మాత్రమే సహాయం చేయడం మీద దృష్టి నిలిపారు. అలా వారు సత్ఫలితాలు చూశారు. అయితే ఒకప్పుడు మనల్ని వ్యతిరేకించినవారు ఆ తర్వాత వివిధ కారణాలను బట్టి మన సందేశం వినవచ్చని గుర్తుంచుకోవాలి.
3 సంఘ క్షేత్రంలో మతపరంగా సమస్యలు తలెత్తగల కొన్ని ప్రాంతాల్లో ఎలా సేవచేయాలో వివరించే ముద్రిత సూచనల్ని పెద్దలు ఆయా సమయాల్లో గుర్తుచేయడం ఎంతో సహాయకరంగా ఉన్నట్లు సహోదరులు గ్రహించారు. (2 పేతు. 3:1, 2) మన రాజ్య పరిచర్య జనవరి నుండి మే మరియు ఆగస్టు 2008 సంచికల్లోని కొన్ని అంశాలను కూటాల్లో సముచితం అనిపించినప్పుడు, అలాగే గ్రూపును సేవకు పంపించడానికి ముందు ప్రస్తావించవచ్చు. ఇలా ప్రస్తావించడం, ప్రజలు తప్పుగా అర్థం చేసుకోగల పాత పద్ధతులను, పదాలను విడిచిపెట్టి, ప్రస్తుత ఏర్పాట్లకు అనుగుణంగా సేవచేయడానికి అందరికీ సహాయం చేస్తుంది. ఈ ఆదేశాలను తదేకంగా గుర్తు చేస్తే, ప్రజలు ఉండే బహిరంగ స్థలాల్లో సమకూడే క్షేత్ర సేవా గ్రూపులు గట్టిగట్టిగా మాట్లాడకుండా లేదా అందరి దృష్టి తమమీద పడేలా ప్రవర్తించకుండా మరింత జాగ్రత్తగా ఉంటారు.
4 అన్నిటికన్నా మిన్నగా, ప్రమాదం ముంచుకు రాకముందే మనమందరం ప్రతీరోజు దేవుని వాక్యాన్ని చదువుతూ, ప్రార్థిస్తూ, హృదయాన్ని స్థిరపర్చుకోవాలి. ధైర్యంగా చర్య తీసుకునేలా మనల్ని ప్రేరేపించగల బలమైన విశ్వాసం మనలో ఉండాలి. (ఎజ్రా 7:10; కీర్త. 78:8; యాకో. 2:17; w09 9/15, 12-15 పేజీలు చూడండి.) మనకు యెహోవాపై నమ్మకం ఉంటే, అల్లరిమూక మనల్ని చుట్టిముట్టినప్పుడు ప్రశాంతంగా ఉండగలుగుతాం, పోలీసు అధికారులకు మన కార్యకలాపాల గురించి గౌరవపూర్వకంగా వివరించగలుగుతాం.
5 మీరొకవేళ భయం వల్ల క్రమంగా పరిచర్యకు వెళ్ళకపోతుంటే, నిరుత్సాహపడకండి. యేసు మరణించిన తర్వాత అపొస్తలులందరూ కొంతకాలం ప్రకటించడం మానేశారనీ, కానీ త్వరలోనే మళ్లీ ప్రకటించడం ఆరంభించారనీ గుర్తుంచుకోండి. (మత్త. 26:56; అపొ. 5:28) ప్రజలు మన సందేశాన్ని వ్యతిరేకించినప్పుడు ముఖ్యంగా మనం అపొస్తలుల కార్యములు 18:9, 10 లో యేసు ఇచ్చిన హామీని గుర్తుంచుకోవాలి. సువార్త ప్రకటిస్తూ ఉండే ధైర్యాన్ని ఇమ్మని యెహోవాకు ప్రార్థించండి. (అపొ. 4:29) ప్రజలు ఇష్టపడే రీతుల్లో ప్రకటించే మార్గాలు వెదకండి. యెహోవా హృదయాలను పరిశీలిస్తాడనీ, సహృదయులను ఆకర్షిస్తాడనీ ఎన్నడూ మర్చిపోకండి.—1 సమూ. 16:7; యోహా. 6:44.