ఫోన్లో సాక్ష్యమివ్వడం ప్రయోజనకరంగా ఉంటుంది
1 ఫోన్లో సాక్ష్యమిచ్చే పద్ధతి ప్రకటనా పనిలో ప్రాముఖ్యమైనదని ఎందుకు చెప్పవచ్చు? ఎందుకంటే అది రక్షణ కోసం దేవుని జ్ఞానాన్ని సంపాదించుకునేలా ఇతరులకు సహాయం చేయడానికున్న మరో పద్ధతి. (2 పేతు. 3:9) మనం దేవుని రాజ్యసువార్త ప్రకటించడానికి ముఖ్యంగా ప్రజలను ఇంటింటి పరిచర్యలోనే కలుసుకున్నా, ఇళ్ల దగ్గర దొరకని వారితో మాట్లాడడానికి వేరే పద్ధతులను ఉపయోగించడానికి కూడా ఇష్టపడతాం.—మత్త. 24:14; లూకా 10:1-7; ప్రక. 14:6.
2 సంఘం ఎలాంటి ఏర్పాట్లు చేస్తుంది? ఇంటింటి పరిచర్య కోసం చేసినట్లే, ఫోన్లో సాక్ష్యమివ్వడానికి కూడా ప్రచారకులకు క్షేత్రాన్ని కేటాయిస్తారు. ఒంటరిగానైనా లేదా ఇద్దరు ముగ్గరున్న చిన్న గుంపుగానైనా ఫోన్లో సాక్ష్యమివ్వవచ్చు. ఫోన్లో సాక్ష్యమిస్తున్నప్పుడు అనవసరమైన శబ్దాలు లేకుండా ప్రశాంతంగా ఉండే స్థలాన్ని చూసుకోవాలి. సాధారణంగా ఇంటింటి పరిచర్యకు వెళ్తున్నప్పుడు తీసుకువెళ్లేవాటన్నిటిని ఒక టేబులు మీద పెట్టుకుని మొదలుపెడితే ప్రయోజనకరంగా ఉంటుందని చాలామంది చెబుతున్నారు.
3 ఫోన్లో ఎలా సాక్ష్యమివ్వాలి? ఫోన్లో సాక్ష్యమిస్తున్నప్పుడు మనమే మాట్లాడుతూపోకుండా అవతలి వారిని కూడా మాట్లాడనివ్వాలి. ఫోన్లో సాక్ష్యమివ్వడం కొత్తగా మొదలుపెడుతున్నవారు ఏదైనా అందింపును చదివి వినిపించవచ్చు, అయితే మాట్లాడుతున్నట్లు చదవాలి. బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించవలెను అనే చిన్నపుస్తకంలో, మన రాజ్య పరిచర్యలో అలాగే మీరు సత్యం తెలుసుకోవాలనుకుంటున్నారా? అనే కరపత్రంలో ఉన్న ఉపోద్ఘాతాలు సహాయం చేయగలవు. ఏం చెప్పాలో మీరే సొంతగా సిద్ధం చేసుకుంటున్నప్పుడు దేని గురించి మాట్లాడాలో, ఏ ప్రశ్న వేస్తే బావుంటుందో ముందే నిర్ణయించుకోండి. దానికి జవాబు తెలియజేసే కొన్ని లేఖనాలను చూసిపెట్టుకోండి. అవతలి వారు చెప్పేది జాగ్రత్తగా విని దాన్నిబట్టి ఆ పైన మాట్లాడాలో లేదో నిర్ణయించుకోండి. ఇలా ప్రకటిస్తున్నప్పుడు కూడా సాధారణంగా ఇంటింటి పరిచర్యలో అందించే ప్రచురణల గురించే చెప్పవచ్చు. ఈ విషయాలను మనసులో ఉంచుకోండి: ప్రశాంతంగా ఉండాలి, నెమ్మదిగా మాట్లాడాలి. మర్యాదపూర్వకంగా, ఓపికగా, స్నేహపూర్వకంగా మాట్లాడాలి, ఎందుకంటే అవతలి వారు మీ స్వరంలో వాటిని గుర్తుపట్టగలుగుతారు. అవతలి వారు మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా వింటూ, మీరు వింటున్నట్టు వారికి తెలిసేలా చేసి, వారు తమ అభిప్రాయాన్ని చెప్పినందుకు కృతజ్ఞతలు తెలుపండి. విరాళాల గురించి ప్రస్తావించకూడదు, ఎందుకంటే మనమేదో ఫోన్ చేసి డబ్బులు దండుకునేవారమని అనుకునే ప్రమాదముంది. అవతలి వారికి ఆసక్తి లేదని మీకనిపిస్తే సంభాషణను మర్యాదపూర్వకంగా ముగించండి.
4 మన క్షేత్రంలో కొంతమంది ఇల్లు కదళ్లేని పరిస్థితిలో ఉండవచ్చు. కొందరు తమ పని సమయాల వల్ల మనం ఇంటింటి పరిచర్యకు వెళ్లినప్పుడు మనకు దొరకకపోవచ్చు. మరి కొంతమంది, బయటివారిని లోపలికి వెళ్లనివ్వని కాలనీలలో లేదా అపార్టుమెంట్లలో ఉంటుండవచ్చు. కాబట్టి పరిచర్యను ఇంకా సంపూర్తిగా, సమగ్రంగా చేయడానికి ఎంతో ప్రయోజనకరంగా ఉండే టెలిఫోన్ సాక్ష్యం గురించి ఆలోచించండి.
[అధ్యయన ప్రశ్నలు]
1. ఫోన్లో సాక్ష్యమివ్వడం ప్రకటనా పనిలో ప్రాముఖ్యమైనదని ఎందుకు చెప్పవచ్చు?
2. ఫోన్లో సాక్ష్యమివ్వడం కోసం సంఘం ఎలాంటి ఏర్పాట్లు చేస్తుంది?
3. ఫోన్లో సాక్ష్యమిచ్చేటప్పుడు ఏ విషయాలను మనసులో ఉంచుకోవాలి?
4. ఫోన్లో సాక్ష్యమివ్వడం వల్ల, మనకు కేటాయించిన క్షేత్రంలో ఉన్న ఎలాంటి వారిని కూడా కలుసుకోవచ్చు?