బైబిలును నైపుణ్యవంతంగా ఉపయోగించండి
1. బైబిలు దేనికి ఎంతో ఉపయోగకరమైనది?
1 దేవుని ప్రేరేపిత వాక్యాన్ని నైపుణ్యవంతంగా, యుక్తిగా ఉపయోగిస్తే సత్యాన్ని స్పష్టంగా ప్రకటించి బోధించగలుగుతాం, అలాగే అబద్ధ బోధలను, మనుష్యులు కల్పించిన ఆచారాలను బహిర్గతం చేయగలుగుతాం.—2 తిమో. 2:15; 1 పేతు. 3:15.
2. ఏ లేఖనాలు ఎక్కడున్నాయో సులువుగా తెలుసుకోవడానికి ఏమి చేయాలి?
2 బైబిలును బాగా తెలుసుకోండి: ఏ ఉపకరణాన్నైనా ఎంత బాగా ఉపయోగిస్తే దాని గురించి అంత బాగా తెలుస్తుంది. బైబిలును మొదటి నుండి చివరి వరకూ చదివితే మీరు అందులోవున్న ముఖ్యాంశం గురించి ఒక అవగాహనకు రాగలుగుతారు. దీనివల్ల లేఖనాలను గుర్తుంచుకోగలుగుతారు, ఏ లేఖనాలు ఎక్కడున్నాయో సులువుగా తెలుసుకోగలుగుతారు. లేఖనాల గురించి బాగా తెలుసుకున్నప్పుడు పరిచర్యలో లేదా అనియత సాక్ష్యమిస్తున్నప్పుడు దృఢ నమ్మకంతో ఎంతో ఉత్సాహంగా మాట్లాడగలుగుతారు.—1 థెస్స. 1:4, 5.
3, 4. (ఎ) బైబిలును బాగా తెలుసుకునే కొన్ని పద్ధతులేవి? (బి) లేఖనాలను బాగా తెలుసుకోవడానికి మీరు ఇంకా వేరే ఏ పద్ధతులైనా ఉపయోగించారా?
3 సంఘ కూటాల్లో ప్రసంగీకుడు లేఖనాలను చదువుతున్నప్పుడు మీరు కూడా మీ బైబిలును తెరిచి చూడండి. వ్యక్తిగత బైబిలు అధ్యయనం చేస్తున్నప్పుడు, సంఘ కూటాలకు సిద్ధపడుతున్నప్పుడు బైబిలు తెరిచి లేఖనాలను చూడండి, వాటినెలా అన్వయించుకోవచ్చో ధ్యానించండి. లేఖనాలను నేరుగా బైబిలు తెరిచి చదివితే, పరిచర్య చేస్తున్నప్పుడు ఏ లేఖనాలు ఎక్కడున్నాయో సులువుగా కనుక్కోవచ్చు.—యోహా. 14:26.
4 కొన్ని కుటుంబాలు బైబిలు లేఖనాలను కంఠస్థం చేయడానికి ఒక సమయాన్ని కేటాయించుకుంటాయి. దీనికోసం ఒకవైపు ఉల్లేఖించబడిన లేఖనం, మరోవైపు ఎత్తిరాయబడిన లేఖనం ఉన్న చిన్న అట్టముక్కలను ఉపయోగిస్తారు. వీటిని ఒకరి తర్వాత ఒకరు మార్చుకుంటూ లేఖనాలను చూడకుండా చెప్పగలరో లేదో, అలాగే ఫలానా లేఖనం బైబిల్లో ఎక్కడుందనేది చెప్పగలరో లేదో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. క్షేత్ర సేవా అందింపులను అభ్యాసం చేయడం, ఎవరైనా ఏదైనా ప్రశ్న అడిగినా లేక అభ్యంతరం చెప్పినా బైబిలు ఉపయోగిస్తూ ఇవ్వబోయే సమాధానాన్ని అభ్యాసం చేయడం కూడా మన నైపుణ్యానికి పదును పెడుతుంది.
5. బైబిలు ఉపయోగించే విషయంలో మనకున్న నైపుణ్యాన్ని ఎందుకు మెరుగుపర్చుకోవాలి?
5 బైబిలుకు ఏ పుస్తకం సాటిరాదు. దీనిలో ఉన్న మాటలే ప్రజలకు “రక్షణార్థమైన జ్ఞానము” ఇవ్వగలవు. (2 తిమో. 3:14, 15) మన ప్రాంతంలో ఉన్న చాలామంది ప్రజలకు బైబిల్లో ఉన్న అమూల్యమై విషయాలు తెలీవు. కాబట్టి మనం వారికి బైబిలు నిజంగా ఏమి చెప్తుందో చూపించడానికి మనకున్న నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవాలి.—సామె. 2:1-5.