నవంబరు 10 నుండి డిసెంబరు 7 వరకు కరపత్రాన్ని అందించే ప్రత్యేక ప్రచార కార్యక్రమం!
1 నవంబరు 10 సోమవారం మొదలుకొని నాలుగువారాల పాటు మీరు సత్యం తెలుసుకోవాలనుకుంటున్నారా? అనే క్రొత్త కరపత్రాన్ని అందించే ప్రత్యేక కార్యక్రమంలో మనం పాల్గొంటాము. ఈ ప్రపంచవ్యాప్త ప్రత్యేక ప్రచార కార్యక్రమం, సత్యానికి ఏకైక మూలంపట్ల అనేకమంది ఆసక్తి చూపించేలా చేస్తుందని ఆశించబడుతుంది.—యోహా. 17:17.
2 “దేవునికి మనపై నిజంగా శ్రద్ధ ఉందా?” “యుద్ధాలు, బాధలు ఎప్పటికైనా లేకుండా పోతాయా?” “చనిపోయాక మనకేమవుతుంది?” “చనిపోయినవారు తిరిగి బ్రతుకుతారా?” “మనమెలా ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు?” “మనమెలా సంతోషంగా ఉండవచ్చు?” ప్రాముఖ్యమైన ఈ ఆరు ప్రశ్నలకు ఈ కరపత్రం బైబిల్లో నుండి సంక్షిప్తమైన సమాధానాలు ఇస్తుంది. ఈ ప్రశ్నలకు క్రైస్తవమత సామ్రాజ్య చర్చీలు సంతృప్తికరమైన సమాధానాలు ఎప్పుడూ ఇవ్వలేదు. అలాంటి విషయాల గురించి క్రైస్తవులు కాని అనేకమంది కూడా ఆలోచిస్తారు, వాటికి స్పష్టమైన సమాధానాలు బైబిలులో దొరుకుతాయని వారికి తెలియకపోవచ్చు. కాబట్టి మనమిచ్చే ఈ సమాచారం, చాలామందికి ఆసక్తికరంగా ఉంటుందని మనమనుకోవచ్చు.
3 మీ క్షేత్రంలో అందరికీ అందివ్వండి: మీరు ఇంటింటి పరిచర్య చేసే ప్రాంతంలో సాధ్యమైనంత ఎక్కువమందికి ఈ కరపత్రాన్ని అందించడానికి ప్రయత్నించండి. మీరు సేవ చేయాల్సిన క్షేత్రం ఎక్కువగావుంటే మొదటిసారి వెళ్ళినప్పుడే తాళం వేసివున్న ఇళ్ళలో ఒక కరపత్రం విడిచిరమ్మని పెద్దలు ప్రోత్సహించవచ్చు. పొరుగువారికి, బంధువులకు, పనిస్థలంలోనూ పాఠశాలలోనూ మీకు తెలిసినవారికి, మీరు తరచూ మాట్లాడేవారికి ఒక కరపత్రం ఇవ్వడం మర్చిపోకండి. నవంబరులో లేదా డిసెంబరులో మీరు సహాయ పయినీరు సేవచేసేలా ప్రణాళికలు వేసుకోవచ్చు. మీ పిల్లలుగానీ, మీ బైబిలు విద్యార్థులుగానీ మంచి ఆధ్యాత్మిక ప్రగతి సాధించి, బాప్తిస్మం తీసుకోని ప్రచారకులుగా మనతోపాటు ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందుకు అర్హులయ్యారా? అలాగైతే ఆ విషయాన్ని పెద్దలకు తెలియజేయండి.
4 ఆసక్తిని గ్రహించండి: గృహస్థులతో స్నేహపూర్వక చర్చను ప్రారంభించండి. వారి ఆసక్తిని వెంటనే గ్రహించండి. ఒకవేళ ఆ వ్యక్తికి ఆధ్యాత్మిక విషయాలపట్ల ఆసక్తిలేదని మీకనిపిస్తే, అతనికి వీడ్కోలు చెప్పి వచ్చెయ్యండి. ఆసక్తి ఉన్నట్లు మీరు గ్రహిస్తేనే సంభాషణ కొనసాగించండి.
5 ఏమి చెప్పాలి? మన సందేశం అనేకమందికి చేరాలంటే మీరు విషయాన్ని క్లుప్తంగా చెప్పడం మంచిది. కవరుమీదున్న ఆరు ప్రశ్నల్లో నుండి గృహస్థులకు సముచితంగా ఉండే ఒక ప్రశ్నను ఎంపిక చేసుకోండి. ఆయనను ఆ ప్రశ్న అడిగి, కరపత్రంలోవున్న జవాబువైపుకి ఆయన అవధానాన్ని మళ్ళించండి. అలాచేస్తే ప్రచారకులందరూ క్షేత్రంలోని అవసరాలకు తగినవిధంగా విషయాన్ని వివరించగలుగుతారు. ఒకవేళ ఎవరికైనా ఆసక్తి ఉన్నట్లు కనిపిస్తే వివరాలు వ్రాసిపెట్టుకొని, పునర్దర్శనం చేయండి. వారాంతాల్లో కరపత్రంతోపాటు తాజా సంచికలను అందించండి. డిసెంబరు 7తో ప్రచార కార్యక్రమం ముగిసిన తర్వాత మహాగొప్ప మనిషి పుస్తకాన్ని మనం అందిస్తాం. కరపత్రాలు మిగిలిపోతే అందుబాటులోవున్న మిగతా కరపత్రాలను అందిస్తున్నట్లే అందించాలి.
6 బైబిలు అధ్యయనాన్ని ప్రారంభించండి: ఈ కరపత్రం బైబిలు అధ్యయనాలు ప్రారంభించేందుకు మనకు సహాయం చేయడానికే ప్రత్యేకంగా రూపొందించబడింది. ఆసక్తి చూపించినవారి దగ్గరకు తిరిగివెళ్ళినప్పుడు, బైబిలులోని ఏ సత్యం వారికి ఓదార్పును లేదా ఉపశమనాన్ని ఇచ్చిందో చెప్పమని వారిని అడగవచ్చు. బైబిలు అధ్యయన ఏర్పాటు గురించి ప్రస్తావించబడిన వెనక పేజీ చూపించి వారికి బైబిలు బోధిస్తోంది పుస్తక ప్రతిని ఇవ్వవచ్చు. వీలైతే, వారు ఎంపిక చేసుకున్న విషయానికి సంబంధించిన సమాచారం ఎక్కువుగావున్న అధ్యాయంలోని ఒకటి లేదా రెండు పేరాలను క్లుప్తంగా చర్చించండి.
7 యెహోవా తనను “ఆత్మతోను సత్యముతోను” ఆరాధించేవారి కోసం చూస్తున్నాడు. (యోహా. 4:23) సత్యం గురించి ఇతరులు తెలుసుకునేందుకు సహాయం చేయడానికి మనమందరం ఈ ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో భాగంవహిద్దాం!