ప్రకటించేటప్పుడు ధైర్యాన్ని, వివేచనను కనపర్చడం
భద్రపరచుకోండి
1 ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సిద్ధంగా ఉన్నాం: సర్వోన్నత పరిపాలకుడిగా యెహోవా దేవుడు, సంఘానికి శిరస్సుగా, ఇప్పుడు పరిపాలిస్తున్న రాజుగా క్రీస్తుయేసు మన క్రైస్తవ కార్యకలాపాల్లో మనతోపాటు ఉన్నారు. మనం బైబిలు మూలంగా, యేసు ఉపయోగించుకుంటున్న ‘నమ్మకమైన దాసుడు’ ఇస్తున్న చక్కని సలహా మూలంగా సంసిద్ధులమయ్యాం.—2 తిమో. 3:16, 17; మత్త. 24:45-47; 28:20.
2 ‘ఈ లోక పరిస్థితి అంతకంతకూ మారిపోతూ ఉంది,’ మన పరిచర్యలో, ప్రత్యేకంగా ఇంటింటి పరిచర్యలో ఇప్పుడు మనం మరిన్ని సవాళ్ళను ఎదుర్కొంటున్నాం. (1 కొరిం. 7:31, NW) మొదటి శతాబ్దంలో కూడా, మారుతున్న పరిస్థితుల కారణంగా తొలి శిష్యులు తమ పరిచర్యను కొనసాగిస్తున్న విధానంలో మార్పు చేసుకోవాల్సి వచ్చింది. (లూకా 22:35, 36) మన పరిచర్యను నెరవేర్చడంలో మనం వివేచన చూపించడం అవసరమే అయినప్పటికీ, మనం ఏ విషయంలోనూ భయపడకూడదు గానీ మనకు అవసరమైన బలాన్ని అనుగ్రహించమని యెహోవాను నమ్మకంతో వేడుకోవాలి.—ఫిలి. 1:27, 28.
3 వ్యతిరేకత ఎదురైనప్పుడు పరిచర్యలో ఎలా కొనసాగాలనే విషయంపై 2003వ సంవత్సరంలో ఉత్తరాల ద్వారా, సేవా కూటాల్లోని ఆయా భాగాల ద్వారా సహాయకరమైన సమాచారం అందించబడింది. ఇప్పుడు మనం ఆ నిర్దేశాలను పునఃపరిశీలించి, తగిన మార్పులు చేసుకోవలసిన అవసరం ఉంది. సమయం గడుస్తుండగా చాలా సంఘాలు ఆ నిర్దేశాలను అనుసరించడం కొనసాగించలేదని తెలుస్తోంది, అయితే పరిచర్యలో మనకు వ్యతిరేకత అంతకంతకు ఎక్కువవుతోంది కాబట్టి ఇప్పుడు మనమా నిర్దేశాలను పాటించాలి. దేశంలో అన్నిచోట్లా ఒకే రకమైన వ్యతిరేకత ఎదురవడం లేదు, అది ఒకే స్థాయిలో లేదు. కాబట్టి, మనమందరం స్థానిక అవసరాలకు అనుగుణంగా ఆ నిర్దేశాలను అన్వయించుకోవాలి. అయితే, సమస్యలు తలెత్తిన తర్వాత వాటికి స్పందించడం మాత్రమే కాదుగానీ, సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని మనం కోరుకుంటామని గుర్తుంచుకోండి. కాబట్టి, ప్రస్తుతం మనం సమస్యల్ని ఎదుర్కోకపోయినప్పటికీ, ఈ ఆర్టికల్‌లో ఇవ్వబడిన సలహాలను అన్వయించుకోవాలి.
4 ఈ ఆర్టికల్‌లో ఇవ్వబడిన లేఖనాధారిత, ఆచరణీయ సలహాలకు అదనంగా, బ్రాంచి కార్యాలయం సాధారణ న్యాయసంబంధిత సమాచారాన్ని త్వరలోనే పంపిస్తుంది, అది అందరూ తమ చట్టపరమైన హక్కులను తెలుసుకోవడానికి సహాయం చేస్తుంది, అంతేగాక, ఒకవేళ మీరు ప్రకటనాపని చేస్తున్నందుకు అరెస్టు చేయబడితే ఏమి చేయాలనే విషయంలో విస్తృత నిర్దేశాన్నిస్తుంది. ఆ సమాచారం మీకు వ్యక్తిగతంగా సహాయకరంగా ఉంటుంది, మీకు తోడ్పడేందుకు ఏమిచేయాలో తెలుసుకోవడానికి పెద్దలసభకు కూడా సహాయం చేస్తుంది.
5 వ్యతిరేకతను ఎదుర్కోవడానికి, మన వ్యక్తిగత యథార్థతను కాపాడుకోవడానికి మనం సిద్ధంగావుండాలని మనమందరం గ్రహిస్తాం. (2 తిమో. 3:12) ఈ విషయంలో బ్రాంచి కార్యాలయం మనకు పూర్తిగా మద్దతునిస్తుందనే నమ్మకంతో ఉండవచ్చు. వ్యతిరేకుల గుంపుచేత అడ్డగించబడడం, ‘మహాసభకు అప్పగించబడడం’ అంటే పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్ళబడడం వంటి, మన సహోదరుల్లో చాలామంది ఎదుర్కొన్న పరిస్థితినే మీరు కూడా ఎప్పుడైనా ఎదుర్కొంటే మత్తయి 10:17-20 లో నివేదించబడిన సలహాను మనసులో ఉంచుకోండి. పెద్దలు తమకు ముందే ఇవ్వబడిన నిర్దేశాలను పాటించాలి, వెంటనే బ్రాంచి కార్యాలయాన్ని ఫోనుద్వారా సంప్రదించాలి. యెహోవా తన సంస్థద్వారా మనకు సహాయం చేస్తాడని మనం నమ్మకంతో ఉండవచ్చు.—యెష. 54:17; ఫిలి. 1:7, 27-30.
6 మన పరిచర్యలో వ్యతిరేకతను ఎదుర్కోవడానికి గల కారణాలు: ప్రకటన 12వ అధ్యాయం, 12, 17 వచనాలు ప్రాథమిక కారణాన్ని వివరిస్తున్నాయి. అపవాదియైన సాతాను తన కోపాన్ని వెళ్ళగ్రక్కుతున్నాడు. ఈ ‘అంత్యదినాల్లో’ అతడు వివిధ సమయాల్లో వివిధ ప్రాంతాల్లో వ్యతిరేకతను రేకెత్తించాడు. (2 తిమో. 3:3) ప్రాణాలను రక్షించే ప్రకటనా పనికి ఇతరులు స్పందించకుండా ఆటంకపర్చాలని, ఆ పనిని మనం చేయకుండా మనల్ని నిరుత్సాహపర్చాలని లేదా భయపెట్టాలని అతడు కోరుకుంటున్నాడు. ఈ విషయంలో గతంలో అతడు విఫలమయ్యాడు, మళ్లీ అలాగే క్షేత్రంలోని మన భాగంలో అతడు చేస్తున్న ప్రయత్నాల్లో విఫలమౌతాడు. మన సహోదరులు, ఎన్నో దేశాల్లో, ఎన్నో సమయాల్లో వ్యతిరేకతను ఎలా ఎదుర్కొన్నారో, యెహోవా శక్తితో ఎలా సహించారో, ఆయన సాక్షులుగా ఎలా కొనసాగారో, సువార్తను మానకుండా ఎలా ప్రకటించారో తెలుసుకోవడానికి వార్షిక పుస్తకములు (ఆంగ్లం) లేక ప్రచారకులు (ఆంగ్లం) పుస్తకాల్ని మనం చదవాలి.—అపొ. 5:42.
7 కొన్నిసార్లు, స్థానికుల్లో మతసంబంధ సున్నితత్వం ఉండడం వ్యతిరేకతకు దారితీయవచ్చు. (అపొ. 19:23-29) చట్టవిరుద్ధంగా మతమార్పిడి చేస్తున్నామని వ్యతిరేకులు మనపై నిందమోపిన సందర్భాల్లో తరచూ అలా జరుగుతుంది. లేదా మతస్థుల నమ్మకాలపై మన లేఖన తర్కాన్ని ఉపయోగించి మత గుంపుల మధ్య భేదాభిప్రాయాలను సృష్టిస్తున్నామని, లేక వారి దేవుళ్ళ గురించి అగౌరవంగా మాట్లాడుతున్నామని వ్యతిరేకులు మనమీద నిందమోపవచ్చు. అలాంటి ఆరోపణలు నిజం కాదు, ఎందుకంటే మనం మన పొరుగువారికి కేవలం సువార్త ప్రకటిస్తాం, దానికి అనుగుణంగా వారు ప్రవర్తిస్తారా లేదా అనేది వారి వ్యక్తిగత నిర్ణయానికి వదిలేస్తాం. మనం ఇతరులను నొప్పించకుండా, కృపాసహితమైన మాటలు మాట్లాడేందుకు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాం.—అపొ. 17:22-28; రోమా. 14:12; కొలొ. 4:6.
8 మన సేవలో కొనసాగడానికి అనుసరించవలసిన సూత్రాలు: ధైర్యంగా ఉండండి. యెహోవాసాక్షులు మనుష్యులను ప్రీతిపర్చేవారు కాదు, మనుష్యులకు భయపడేవారూ కాదు. (సామె. 29:25; ఎఫె. 6:6; w93-TU 7/1 23వ పేజీ) అపొస్తలుల్లాగే మనం కూడా, ప్రకటించమని దేవుడు మనకిచ్చిన బాధ్యతను నిర్వర్తించకుండా వ్యతిరేకులు మనల్ని అడ్డుకునేందుకు అనుమతించము.—అపొ. 5:29.
9 అప్రమత్తంగా ఉండండి. యేసు, నమ్మకస్థులైన దేవుని ఇతర సేవకులు తమ పరిస్థితులనుబట్టి హింసకు వివిధ రీతులుగా స్పందించినా, అనవసరంగా వారు తమ ప్రాణాలను ప్రమాదంలో పడేసుకోలేదని స్పష్టమౌతోంది. తాము ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నామని వారు గ్రహించినప్పుడు, వారు ధైర్యంగా, అప్రమత్తంగా ఉన్నారు. (మత్త. 10:16, 23) ప్రకటనా పనిని విస్తరింపజేసి, యెహోవాపట్ల తమ యథార్థతను కాపాడుకుంటూ ఉండడమే వారి ముఖ్యోద్దేశం. వివిధ పరిస్థితుల్లో వారు స్పందించిన తీరు నేడు పరీక్షలను, హింసను ఎదుర్కొంటున్న క్రైస్తవులు ఏంచేయాలో చెబుతుంది.—w03-TU 10/1 14వ పేజీ, 4వ పేరా చూడండి.
10 పగతీర్చుకోవద్దు. యేసు, అపొస్తలులు వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పుడు స్పందించిన తీరునుబట్టి మనం నేర్చుకొనే మరో ప్రాముఖ్యమైన సూత్రమేమిటంటే, మనం మన వ్యతిరేకులపై ఎన్నడూ పగతీర్చుకోకూడదు. యేసు గానీ ఆయన అనుచరులు గానీ హింసిస్తున్నవారికి వ్యతిరేకంగా ఏదైనా ఉద్యమాన్ని లేవదీసినట్లో లేక వారిపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేసినట్లో తెలియజేసే సమాచారమేదీ బైబిల్లో లేదు. రోమీయులు 12:17-21 లో వ్రాయబడివున్నట్లుగా అపొస్తలుడైన పౌలు ఇచ్చిన సలహాను మనం ఖచ్చితంగా పాటించాలి.—సామె. 20:22.
11 సాధ్యమైతే సమస్యలు తలెత్తకుండా చూసుకోండి. కొన్నిసార్లు పారిపోవడమే తెలివైన, ధైర్యవంతమైన పని అని బైబిలు స్పష్టంగా చెబుతోంది. ఈ విషయాన్నే నొక్కిచెబుతూ, తన శిష్యులను పరిచర్యకు పంపించే ముందు యేసు వారికిలా చెప్పాడు: “వారు ఈ పట్టణములో మిమ్మును హింసించునప్పుడు మరియొక పట్టణమునకు పారిపోవుడి.” (మత్త. 10:23) అవును, యేసు శిష్యులు తమను హింసించేవారి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించాలి. మతం మార్చుకొనేలా ఇతరులను బలవంతపెట్టడానికి ప్రయత్నిస్తూ ధర్మయుద్ధం లాంటిదేదీ వారు చేయకూడదు. వారు శాంతియుతమైన సందేశాన్నే అందజేశారు. (మత్త. 10:11-14; అపొ. 10:34-37) కాబట్టి ఆ క్రైస్తవులు కోపోద్రేక పరిస్థితికి తావిచ్చే బదులు రెచ్చగొట్టేవారి నుండి దూరంగా పారిపోయారు. ఆ విధంగా, వారు మంచి మనస్సాక్షిని, యెహోవాతో తమకున్న అమూల్యమైన సంబంధాన్ని కాపాడుకున్నారు.—2 కొరిం. 4:1, 2; w02-TU 4/15 32వ పేజీ చూడండి.
12 ఎంపిక చేసుకోండి. క్షేత్రంలోని ప్రజలందరూ సానుకూలంగా స్పందించరని యేసు తన శిష్యులకు తెలియజేశాడు. ఆయనిలా అన్నాడు: “మీరు ఏ పట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించునప్పుడు, అందులో ఎవడు యోగ్యుడో విచారణచే[యండి].” రాజ్య సందేశాన్ని అందరూ అంగీకరించేటట్లయితే, ‘విచారణచేయండి’ అనే మాటను ఉపయోగించాల్సిన అవసరమే లేదు. సందేశంపట్ల ఆసక్తి కనబర్చని వారి విషయంలో వారెలా ప్రతిస్పందించాలి? “ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండిన యెడల మీరు ఆ యింటినైనను ఆ పట్టణమైనను విడిచిపోవునప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి” అంటే సమాధానంతో అక్కడనుండి వెళ్ళిపోయి, పర్యవసానాలను యెహోవా తీర్పుకు విడిచిపెట్టాలి.—మత్త. 10:11, 14.—w88 7/15 11వ పేజీ 9వ పేరా చూడండి.
13 వివేచనతో మెలగండి. క్షేత్ర పరిచర్యలో ఉన్నప్పుడు సాధ్యమైనంత మేరకు సమస్యాత్మక పరిస్థితులకు దూరంగా ఉండండి. బైబిలు ఇలా చెబుతోంది, “వివేకియైనవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును.” (సామె. 14:15) అదింకా ఇలా సలహానిస్తోంది: “వివాదము అధికము కాకమునుపే దాని విడిచిపెట్టుము.” (సామె. 17:14) మీ నడతలను బాగుగా కనిపెట్టుకోవడమంటే, ప్రమాదకరంగా అనిపించే ప్రదేశాలకు దూరంగా ఉండడమని అర్థం. ఒంటరిగా సేవచేయడం జ్ఞానయుక్తంకాని ప్రాంతంలో క్షేత్ర పరిచర్య చేస్తున్నప్పుడు, మీతోపాటు పనిచేయడానికి వేరొక ప్రచారకుణ్ణి ఏర్పాటు చేసుకోవాలని సలహా ఇవ్వబడుతోంది. అపార్ట్మెంట్ బిల్డింగ్‌లలో సాక్ష్యమిచ్చేటప్పుడు, సారథ్యం వహించే సహోదరులు అందుబాటులో ఉన్నప్పుడు, వారితో కలిసి ఎక్కువమంది ప్రచారకులు ఒకే ఫ్లోర్లో పనిచేయడం ప్రయోజనకరంగా ఉండవచ్చు. ఇళ్ళల్లోకి గానీ అపార్ట్మెంట్లలోకి గానీ రమ్మని ఆహ్వానిస్తే లోపలికి వెళ్ళేముందు వివేచనను ఉపయోగించండి.
14 ఇప్పుడు పెద్దల సభ అమలులో పెట్టే విషయాలు: సేవా కమిటీ ఆధ్వర్యంలో పెద్దలు, సంఘానికి నియమించబడిన క్షేత్రమంతటినీ సమీక్షించాలి, మతసంబంధ తీవ్రవాదులు నివసించే ప్రాంతాల్ని గుర్తించాలి. చాలావరకు, అలాంటి వ్యక్తులు దగ్గర దగ్గరగానే నివసిస్తారు. తీవ్రవాదులు నివసించేవని తెలిసిన విడి ఇళ్ళను కూడా మ్యాప్‌లో గుర్తుపెట్టాలి. అలాంటి ప్రాంతాలకు, ఇళ్ళకు వెళ్ళకూడదు. సంఘం ప్రకటించగలిగే ఇతర క్షేత్రాలున్నాయి, బహుశా అవి మరింత ఫలవంతంగా ఉండవచ్చు.
15 క్షేత్రసేవా కూటాలకోసం సమస్యాత్మకంగావున్న ప్రాంతాల్లోని సహోదరుల ఇళ్ళను ఉపయోగించకుండా జాగ్రత్త వహిస్తూ ఆ కూటాల కోసం సంఘ మరియు గుంపు ఏర్పాట్లను సమీక్షించండి. పెద్ద క్షేత్రసేవా గుంపులు క్షేత్రంలో సమావేశమవకుండా చూసుకోవడం కూడా మంచిది. పరిచర్యలో ఉన్నప్పుడు ఒకరితో ఒకరు గట్టిగా మాట్లాడకుండా, క్షేత్రంలో పనిచేసిన తర్వాత తిరిగి గుంపుగా కలుసుకోకుండా లేదా మరితర విధాలుగా ఇతరుల దృష్టిని ఆకర్షించకుండా ఉండడానికి వివేచనను ఉపయోగించాలి.
16 ఈ సమాచారానికి అనుగుణంగా, మన రాజ్య పరిచర్య నవంబరు 1998 సంచిక 5వ పేజీ ఇలా చెబుతోంది: “మంచి సంస్థీకరణతో, మనం పెద్దవైన, బాగా కనిపించేంతటి గుంపులను పరిచర్య ప్రాంతంలో సమావేశపరచం. పెద్ద ప్రచారకుల గుంపు అనేక కార్లూ, మోటార్ సైకిళ్ళూ, స్కూటర్లూ లేదా వ్యాన్లతో తమ ఇంటి ముందుకు వచ్చినప్పుడు కొందరు గృహస్థులు భయపడవచ్చు. మనం నివాస ప్రాంతాలను ‘ఆక్రమించుకోబోతున్నామన్న’ తలంపును కలిగించాలని మనమనుకోం. పరిచర్య ప్రాంతంలో పనిచేసేందుకు గల ఏర్పాట్లను ప్రాంతీయ పరిచర్య కొరకైన కూటాల్లో చేసుకోవడం మంచిది. ఒక కుటుంబంలాగా, ప్రచారకులు చిన్న గుంపులతో వెళ్తే, గృహస్థులు భయపడరు, ఆ ప్రాంతంలో సేవ చేస్తుండగా, పునఃసంస్థీకరణ అంత పెద్ద అవసరమూ కాదు.”
17 వేర్వేరు భాషా గుంపులు లేక సంఘాలు కలిసి ఒకే క్షేత్రంలో పనిచేస్తుంటే, ఆ క్షేత్రంలో పనిచేయడానికి సంబంధించి సమస్తమూ ‘క్రమముగా మర్యాదగా’ జరిగేటట్లు కూడా పెద్దలు చూస్తారు. (1 కొరిం. 14:39, 40) ఈ సందర్భాల్లో కూడా క్షేత్రసేవా గుంపులు ఇతరుల దృష్టిని ఎక్కువగా ఆకర్షించకుండా చూసుకోవాలి.
18 మనం జాగ్రత్తగా ఉండాలని కోరుకునే విషయాలు: సంఘం క్షేత్ర కార్యకలాపాల విషయంలో కొన్ని మార్పులు చేసుకోవాల్సిన అవసరముంది కాబట్టి అందరం, చేయబడే ఏర్పాట్లకు లోబడి పనిచేయాలి.
19 మనం ఏదైనా పుస్తకం, పత్రిక, కరపత్రం లేదా వేరే ప్రచురణ అందించడానికి ముందు అసలు మనతో మాట్లాడడానికి, వినడానికి గృహస్థుడు ఇష్టపడుతున్నాడా అని మొదట తీర్మానించుకోవడం జ్ఞానయుక్తం. మనం ప్రాథమికంగా బైబిల్లోని సువార్త సందేశాన్ని చెప్పడానికే వారి దగ్గరకు వెళ్తున్నాం. గృహస్థుడు శాంతమనస్కుడని తీర్మానించుకున్నాకే మనం వారికి చదవడానికి ఏమైనా ఇవ్వాలని నిర్ణయించుకోవచ్చు.
20 పరిచర్యలో పాల్గొంటున్నప్పుడు మన చుట్టుప్రక్కల ఏమి జరుగుతోందో జాగ్రత్తగా గమనిస్తుండాలి. గృహస్థుడు వ్యతిరేకించే వ్యక్తిలా అనిపిస్తే జ్ఞానయుక్తంగా మన సంభాషణను ఆపేసి, అక్కడినుండి వచ్చేయ్యాలి, బహుశా ఆ ప్రాంతాన్ని కూడా విడిచిపెట్టి వచ్చేయ్యాల్సి ఉంటుంది. ఇద్దరిద్దరు కలిసి పనిచేస్తున్నప్పుడు ఒకరు మాట్లాడుతుంటే మరొకరు దగ్గర్లో ఏమి జరుగుతోందో గ్రహించలేనంతగా లీనమైవుండే బదులు చుట్టుప్రక్కల ఏమి జరుగుతోందో గమనించాలి. మనం చేస్తున్న పనిని మొదట ఎవరో ఒకరు గమనించి ఆ తర్వాత ఇతరులను పిలిచి గుంపును పోగుచేయడంతో వ్యతిరేక పరిస్థితులు తలెత్తుతాయి.
21 అపార్థానికి తావిచ్చే పదజాలాన్ని వాడడం మానేయాలి. ఉదాహరణకు, బైబిల్లోని కొన్ని మంచి విషయాలను ‘పంచుకునేందుకే’ వచ్చామనీ వారికేదో ‘ఇవ్వడానికి’ రాలేదనీ చెప్పవచ్చు, లేకపోతే మతమార్పిడి చేయడానికి ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని ఆరోపించే అవకాశముంటుంది. వారి ఆరాధనా విధానం గురించి మన అభిప్రాయాన్ని లేక వారు విగ్రహారాధన చేయడం గురించి మనమెలా భావిస్తున్నామని మనల్ని అడిగితే, అలాంటి విషయాల్లో తీర్పు చెప్పడానికో మతం విషయంలో వారి ఎంపికను ఆమోదించడానికో లేక తిరస్కరించడానికో వారిదగ్గరకు రాలేదని చెప్పవచ్చు. అలాంటి విషయాలు వారే నిర్ణయించుకోవాలి. మనం బైబిల్లోని మంచి సమాచారాన్ని కేవలం పంచుకోవాలనుకుంటున్నాం. దాన్ని వింటారా, వినరా అనేది నిర్ణయించుకోవాల్సింది వారే.
22 మనం వేసుకునే బట్టలనుబట్టి, ప్రకటనాపనికి మనం వాడే బ్యాగులనుబట్టి మనం, మనం చేసే సేవ ఇతరుల దృష్టినాకర్షించాలని మనం కోరుకోం. శుభ్రంగా, మర్యాదకరంగా ఉండే దుస్తులు వేసుకోవాలి, అయితే వేరే దేశాల్లోని సహోదరులు చేస్తున్నదాన్ని చూసి బహుశా అదే అనుకరిస్తూ క్షేత్రపరిచర్యకు ఫలాని “విధమైన” దుస్తులు మాత్రమే సరైనవని భావిస్తూ అలాంటి దుస్తులనే ధరించాల్సిన అవసరం లేదు. మనమీద, మనం చేసే పనిమీద ఇతరుల దృష్టి పడేలా పెద్ద బ్యాగును తీసుకెళ్ళకుండా, మన దగ్గరే బైబిలును, కొన్ని ప్రచురణలను ఉంచుకోవడం లేదా అనుమానం రాకుండా ఉండేలాంటి చిన్న ఫోల్డర్లో వాటిని తీసుకెళ్ళడం మంచిది.
23 వినగలిగినంత దూరంలో ఉన్నవారి అవధానాన్ని ఆకర్షించేలా గృహస్థునితో గట్టిగా మాట్లాడడాన్ని నివారిస్తే మంచిది. గట్టిగా మాట్లాడడం వల్ల ఇతరులు పోగవడమేకాక, కొందరు మనంచేసే పనినిబట్టి అభ్యంతరపడే అవకాశముందని అనుభవం ద్వారా స్పష్టమయ్యింది.
24 ఇంట్లోకి ఆహ్వానించబడినప్పుడు అప్రమత్తంగా ఉండండి, ఎందుకంటే వ్యతిరేకులు కొన్నిసార్లు ప్రచారకులను అదే ప్రాంతంలో ఉండేలాచేసి, ఫోను ద్వారా ఇతరులను పోగుచేయడానికి ఈ పద్ధతిని ఉపయోగించారు. మీరు గృహస్థునితో మాట్లాడుతుండగా గృహస్థుడు తాను ఫోన్ చేయడంగానీ లేదా ఫోన్ చేయమని తన కుటుంబ సభ్యుల్లో వేరేవాళ్ళకు చెప్పడంగానీ చేసినట్లయితే, మీరు అక్కడ నుండి వెళ్ళడానికి దానిని ఒక గుర్తుగా భావించండి.
25 మన లక్ష్యమేమిటో గుర్తుంచుకోండి: మన సందేశాన్ని వినాలనుకొనే యోగ్యులైన వ్యక్తులను వెదకడమే మన లక్ష్యం, మనల్ని ఆటంకపర్చాలనుకునే వారి లేదా సువార్త ప్రకటనా పనిని ఆపుచేయాలనుకునే వారి దృష్టినాకర్షించాలనుకోం.
26 యెహోవా కాపుదలపై నమ్మకముంచండి: మీ పరిచర్యను నెరవేర్చే విషయంలో మీరు ఈ సవరింపులను చేసుకునేటప్పుడు యెహోవా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందన్న నమ్మకంతో ఉండండి. (యెష. 54:17; ఫిలి. 4:13) తన శిష్యులను పంపుతూ యేసు వారికి సూచించినట్లే, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మనం మార్పుచేసుకోవడం జ్ఞానయుక్తం, లేఖనాధారితం కూడా. (మత్త. 10:5-23) నియతంగా లేక అనియతంగా పరిచర్యలో పాల్గొంటున్నప్పుడు చక్కని వివేచనను ఉపయోగించండి, చుట్టుప్రక్కల పరిస్థితుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. జీవంకోసం యెహోవా దేవుడిచ్చే ప్రేమపూర్వక ఆహ్వానానికి ఎవరి హృదయాలు ప్రతిస్పందిస్తాయో అలాంటి వారిని కలుసుకునేలా దేవదూతలు మనకు సహాయపడతారన్న నమ్మకంతో ఉండండి.—ప్రక. 14:6.
27 రాబోయే నెలల్లోని మన రాజ్య పరిచర్యలో, మీ పరిచర్యను ధైర్యంతోనూ, వివేచనతోనూ నెరవేర్చడానికి సహాయం చేసేలా మరిన్ని ఆర్టికల్స్ వస్తాయి. ఇవ్వబడిన సలహాలను అనుసరించడానికి, అమలులోకి వచ్చిన ఎలాంటి సంస్థాగత ఏర్పాట్లనైనా పాటించడానికి మనమందరం తీర్మానించుకుందాం.
[3వ పేజీలోని బాక్సు]
ఈ ఇన్సర్ట్ను ఎలా ఉపయోగించాలి?
దీనిని జాగ్రత్తగా చదివి, దీనిలోని విషయాల గురించి ఆలోచించండి. ఇవ్వబడిన సలహాలను అన్వయించుకోండి. ఈ ఆర్టికల్‌లో ఇవ్వబడిన సలహాలను, నిర్దేశాలను అమలులోపెట్టడం మనం ఎప్పుడు ప్రారంభించాలి? వెంటనే ప్రారంభించాలి!