బైబిలు అధ్యయనాన్ని నిర్వహించాలనే లక్ష్యాన్ని పెట్టుకోండి
1 “మీ కన్నులెత్తి పొలములను చూడుడి; అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చియున్నవి.” (యోహా. 4:35) యేసుక్రీస్తు అన్న ఆ మాటలు నేటి క్రైస్తవ పరిచారకులున్న పరిస్థితులకు ఖచ్చితంగా వర్తిస్తాయి.
2 యెహోవా మార్గాలను తెలుసుకోవాలని కోరుకునే యథార్థహృదయులు క్షేత్రంలో ఇంకా ఉన్నారు. ప్రతీ సంవత్సరం ఎంతోమంది బాప్తిస్మం తీసుకుని శిష్యులవడాన్నిబట్టి అది నిజమని స్పష్టమౌతోంది. మీకు నిజంగా బైబిలు అధ్యయనం నిర్వహించాలనుంటే మీరు ఏమి చేయవచ్చు?
3 లక్ష్యాన్ని పెట్టుకోండి: మొదట, మీరు ఒక బైబిలు అధ్యయనాన్ని ప్రారంభించి క్రమంగా కొనసాగించాలనే లక్ష్యాన్ని పెట్టుకోండి. పరిచర్య చేస్తున్నప్పుడు ఈ లక్ష్యాన్ని మనసులో ఉంచుకోండి. మన క్రైస్తవ నియామకంలో ప్రకటించడంతోపాటు బోధించడం కూడా ఒక భాగమే కాబట్టి మనమందరం బైబిలు అధ్యయనం చేసే మరిన్ని అవకాశాల కోసం చూడాలి.—మత్త. 24:14; 28:19, 20.
4 గుర్తుంచుకోవాల్సిన ఇతర విషయాలు: రాజ్య ప్రచారకులు హృదయపూర్వకంగా ప్రార్థించాలి. ఆధ్యాత్మిక సహాయం కోసం ప్రార్థించిన ప్రజలను మనం కొన్నిసార్లు కలుస్తుంటాం. అలాంటి వారిని కనుగొని, వారికి బోధించేందుకు యెహోవా మనల్ని ఉపయోగించుకోవడం మనకెంత ఆశీర్వాదకరమో కదా!—హగ్గ. 2:7; అపొ. 10:1, 2.
5 ఒక సహోదరి ఒక బైబిలు అధ్యయనం కావాలని ప్రార్థించిన తర్వాత మీరు బైబిలు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇష్టపడతారా? అనే కరపత్రాలను అందరికీ కనపడేలా తన ఆఫీసులో పెట్టింది. ఒక స్త్రీ వాటిలోనుండి ఒక కరపత్రాన్ని తీసుకుని, దాన్ని పూర్తిగా చదివి, దాని వెనకున్న కూపన్ని నింపడం ప్రారంభించింది. అప్పుడు సహోదరి ఆమెతో మాట్లాడి బైబిలు అధ్యయనం ప్రారంభించింది.
6 బైబిలు అధ్యయనాన్ని నిర్వహించాలనే మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి, బైబిలు అధ్యయనాలను ప్రారంభించడంలో, వాటిని నిర్వహించడంలో సమర్థులైన తోటి ప్రచారకులు మీకు సహాయం చేయవచ్చు. బైబిలు అధ్యయనం కోసం మీరు చేసే ప్రయత్నాల గురించి దేవునికి విన్నవించుకొని, ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీకు దొరికే సహాయాన్నతంటినుండి ప్రయోజనం పొందండి. బహుశా త్వరలోనే ఒక బైబిలు అధ్యయనాన్ని పొందే సంతోషం మీ సొంతమౌతుంది.