సంఘ పుస్తక అధ్యయన ఏర్పాటు మనకెలా సహాయం చేస్తుంది?
1. వారంలో జరిగే మన ఐదు కూటాలు మనకెలా సహాయం చేస్తాయి?
1 వారంలో జరిగే మన ఐదుకూటాల్లో ప్రతీదాని నిర్వహణా పద్ధతి, ఉద్దేశం వేర్వేరుగా ఉంటాయి. అయినా, ‘ప్రేమచూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పుకునేలా’ మనకు సహాయం చేయడానికి అవన్నీ ప్రాముఖ్యమైనవే. (హెబ్రీ. 10:24, 25) సంఘ పుస్తక అధ్యయన ఏర్పాటులోని కొన్ని విశేషమైన, ప్రయోజకరమైన అంశాలేమిటి?
2. పుస్తక అధ్యయంలోని చిన్న గుంపుతో కూడుకోవడంవల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయి?
2 ఆధ్యాత్మిక అభివృద్ధికి సహాయపడుతుంది: ఇతర సంఘ కూటాలకు హాజరయ్యేవారి సంఖ్యకన్నా పుస్తక అధ్యయనానికి హాజరయ్యేవారి సంఖ్య సాధారణంగా చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఆధ్యాత్మిక తోడ్పాటునిచ్చే స్నేహ సంబంధాలను సులువుగా వృద్ధిచేసుకోవచ్చు. (సామె. 18:24) బహుశా మీతోపాటు కలిసి పరిచర్యలో పనిచేయమని అడగడం ద్వారా మీ పుస్తక అధ్యయన గుంపులో ప్రతీ ఒక్కరినీ తెలుసుకునే ప్రయత్నం చేశారా? పుస్తక అధ్యయన పైవిచారణకర్త గుంపులోని ప్రతీ ఒక్కరి విభిన్న పరిస్థితులను తెలుసుకోవడానికి, వారిని వ్యక్తిగతంగా ప్రోత్సహించడానికి కూడా పుస్తక అధ్యయన ఏర్పాటు దోహదపడుతుంది.—సామె. 27:23.
3. బైబిలు విద్యార్థులు వ్యాఖ్యానించేందుకు అలాగే హాజరయ్యేందుకు పుస్తక అధ్యయన ఏర్పాటు ఎలా దోహదపడుతుంది?
3 మీతోపాటు మీ బైబిలు విద్యార్థులను పుస్తక అధ్యయనానికి రమ్మని ఆహ్వానించారా? మన పెద్ద కూటాలకు హాజరవడానికి సంకోచించే ఆసక్తిగలవారు, ముఖ్యంగా ఇంట్లో జరిగే చిన్న కూటానికి హాజరయ్యేందుకు అంతగా భయపడకపోవచ్చు. అక్కడ స్నేహపూరితమైన వాతావరణం ఉంటుంది కాబట్టి చిన్నవారు, క్రొత్తగా సహవసిస్తున్నవారు సులువుగా వ్యాఖ్యానించగలుగుతారు. గుంపు చిన్నగా ఉంటుంది కాబట్టి, వ్యాఖ్యానించేందుకు, యెహోవాను స్తుతించేందుకు మనకు ఎక్కువ అవకాశాలు దొరుకుతాయి.—కీర్త. 111:1.
4. పుస్తక అధ్యయన ఏర్పాటు ఏ యే విధాలుగా అనుకూలంగా ఉంటుంది?
4 పుస్తక అధ్యయనాలు సాధారణంగా క్షేత్రం మొత్తంలో అనువుగా ఉండే స్థలాల్లో నిర్వహించబడతాయి. అందరినీ తమకు సమీపంగావున్న ప్రాంతానికి నియమించడం సాధ్యం కాకపోయినా, మనకు నియమించబడిన పుస్తక అధ్యయనానికి హాజరయ్యేందుకు మన సంఘ కూటాలకన్నా తక్కువ దూరమే ప్రయాణించాల్సి ఉంటుంది. పుస్తక అధ్యయన స్థలం క్షేత్ర సేవకోసం కూడుకోవడానికి అనుకూలమైన స్థలంగా కూడా ఉపయోగించవచ్చు.
5. పరిచర్యలో పుస్తక అధ్యయన పైవిచారణకర్త సహాయాన్ని మనమెలా పొందవచ్చు?
5 పరిచర్యకు సహాయం: పుస్తక అధ్యయ పైవిచారణకర్త, ప్రతీ ఒక్కరూ పరిచర్యలో క్రమంగా, అర్థవంతంగా, సంతోషంగా పాల్గొనేందుకు సహాయపడడంలో ఆసక్తిని కనబరుస్తాడు. కాబట్టి, పరిచర్యలోని వివిధ అంశాలకు వ్యక్తిగత మద్దతునిస్తూ గుంపులో ఉన్న ప్రతీ ఒక్కరితో కలిసి పనిచేయడానికి ఆయన కృషిచేస్తాడు. పునర్దర్శనం చేయడం వంటి పరిచర్యలోని ఒకానొక అంశం కష్టంగా ఉన్నట్లు అనిపిస్తే దాని గురించి మీ పుస్తక అధ్యయన పైవిచారణకర్తతో మాట్లాడండి. గుంపులో అనుభవమున్న ప్రచారకులతో మీరు పనిచేసేలా ఆయన ఏర్పాటు చేయవచ్చు. పుస్తక అధ్యయన పైవిచారణకర్త పుస్తక అధ్యయనాన్ని నిర్వహిస్తున్నప్పుడు ఉపయోగించే మంచి బోధనా పద్ధతులను జాగ్రత్తగా గమనించడం ద్వారా బైబిలు అధ్యయనాల్లో మీ బోధనా సామర్థ్యం మెరుగుపడుతుంది.—1 కొరిం. 4:17.
6. పుస్తక అధ్యయన ఏర్పాటు నుండి పూర్తి ప్రయోజనం పొందేందుకు మనమెందుకు ప్రయత్నించాలి?
6 సంఘ పుస్తక అధ్యయనం ఎంత గొప్ప ఆశీర్వాదమో కదా! యెహోవా ఏర్పాటు చేసిన ప్రేమపూర్వకమైన ఈ ఏర్పాటు, మనం జీవించే కష్టకాలాల్లో మనం ఆధ్యాత్మికంగా తొట్రుపడకుండా ఉండేందుకు సహాయం చేస్తుంది.—కీర్త. 26:12.