ఒక కుటుంబంగా యెహోవాను ఆరాధించడం
1 బైబిలు కాలాల్లో, కుటుంబ సభ్యులు ఎన్నో పనులను కలిసి చేసేవారు. వారు ఇంటి పనులను కలిసి చేసేవారు, అంతకంటే ముఖ్యంగా వారు కుటుంబంగా కలిసి యెహోవాను ఆరాధించేవారు. (లేవీ. 10:12-14; ద్వితీ. 31:12) నేడు, చాలా ప్రాంతాల్లో కుటుంబ సభ్యులు కొన్ని పనులనే కలిసి చేస్తారు. క్రైస్తవులు కలిసి పనులు చేయడం ఎంత ప్రాముఖ్యమో, ప్రత్యేకంగా ఆరాధనకు సంబంధించిన పనులను కలిసి చేయడం ఎంత ప్రాముఖ్యమో గుర్తిస్తారు. కుటుంబాలు సమైక్యంగా తనను ఆరాధించడాన్ని చూసేందుకు, కుటుంబ వ్యవస్థాపకుడు ఎంత సంతోషిస్తాడో కదా!
2 కుటుంబంగా ప్రకటించండి: సువార్త ప్రకటనా పనిని కలిసిచేయడం కుటుంబ బాంధవ్యాలను బలపరుస్తుంది. కాబట్టి, ఒక పెద్ద సంఘంలోని ఇతరులతో కలిసి ప్రకటనాపనిలో పాల్గొనడంతోపాటు తన భార్యాపిల్లలతో కూడా కలిసి క్రమంగా ప్రకటిస్తాడు. (1 తిమో. 3:4, 5) ప్రయాణ పైవిచారణకర్తలకు తీరికలేనంత పనివున్నా, వారు కూడా తమ భార్యలతో పరిచర్యలో కలిసి పనిచేసే ఏర్పాటు చేసుకుంటారు.
3 తమ పిల్లలతో కలిసి ప్రకటించే తల్లిదండ్రులు వారు చక్కని సువార్తికులుగా ప్రగతి సాధించేందుకు సహాయపడగలరు. పిల్లలు పరిచర్యలో తమ తల్లిదండ్రులు పొందే సంతోషాన్ని, సంతృప్తిని మాత్రమేకాక, యెహోవాపట్ల, తమ పొరుగువారిపట్ల వారికున్న ప్రేమను కూడా గమనిస్తారు. (ద్వితీ. 6:5-7) పిల్లలు పెద్దవారవుతున్నా తల్లిదండ్రులు వారితో కలిసి పనిచేయడం ప్రాముఖ్యం. 15 నుండి 21 సంవత్సరాల మధ్య వయస్సుగల ముగ్గురు పిల్లలున్న ఒక జంట ఇప్పటికీ పరిచర్యలో తమ పిల్లలతోపాటు కలిసి క్రమంగా పాల్గొంటున్నారు. తండ్రి ఇలా చెప్పాడు: “మేము ప్రతీసారి వారికి పరిచర్యలో ఏదో ఒక విషయాన్ని నేర్పిస్తాం. కలిసి ప్రకటించడం ఆనందించదగినదిగా, ప్రోత్సాహకరమైనదిగా ఉండేలా చూస్తాం.”
4 కుటుంబంగా సిద్ధపడండి: పరిచర్యకు కలిసి సిద్ధపడడం ప్రయోజనకరంగా ఉన్నట్లు కుటుంబాలు కనుగొన్నాయి. కుటుంబంగా పరిచర్యకు సిద్ధపడడంలో భాగంగా వంతులవారీగా ప్రచురణ ప్రతిపాదనలను ప్రదర్శించడాన్ని లేదా గృహస్థులుగా ఉండడాన్ని పిల్లలు తరచూ ఇష్టపడతారు. ఇలా చేయడానికి కొందరు, కుటుంబ అధ్యయనం చివర్లో కొన్ని నిమిషాలు కేటాయిస్తారు.
5 ప్రాముఖ్యమైన, సంతృప్తిదాయకమైన పనుల్లో మనకు ప్రియమైన వారితో కలిసి పాల్గొన్నప్పుడు మన సంతోషం రెట్టింపవుతుంది. ఇంటింటి పరిచర్యలో, పునర్దర్శనాలను చేయడంలో బైబిలు అధ్యయనాలను నిర్వహించడంలో కలిసి పనిచేయడం కుటుంబ సభ్యులకు ఎంత సంతోషాన్నిస్తుందో కదా! మీరు మీ కుటుంబంతో కలిసి యెహోవాను ఆరాధిస్తుండగా, మీరు ఆనందంగా ఇలా చెప్పవచ్చు: “నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము.”—యెహో. 24:15.