విభిన్న భాషల్లో కరపత్రాల సెట్టు
1 భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో ఉపయోగించబడే దాదాపు 1600 భాషలు మాట్లాడే ప్రజలకు సువార్త ప్రకటించడమనే సవాలుతో కూడిన నియామకం మనకుంది. (మత్త. 24:14; ప్రక. 7:9) అనేకమంది ప్రచారకులు స్థానిక భాషలను మాట్లాడే ప్రజలకు మాత్రమే కాక, తమ క్షేత్ర పరిధిలో నివసించే అనేక ఇతర ‘వంశాలవారికి, భాషలవారికి’ కూడా సమర్థవంతంగా సాక్ష్యమిస్తూ తమ నియామకాన్ని చక్కగా నిర్వర్తిస్తున్నారు. బహుశా మీకు కూడా చాలా భాషలు తెలిసివుండవచ్చు లేదా గృహస్థునికీ మీకూ తెలిసిన హిందీ లేదా ఇంగ్లీషు వంటి భాషల్లో మాట్లాడగలుగుతుండవచ్చు. మీకన్ని భాషలు రాకపోయినా, అవసరమైనప్పుడు అన్ని దేశాల ప్రజలకు సువార్త అనే చిన్న పుస్తకాన్ని మీరు చక్కగా ఉపయోగించివుండవచ్చు.
2 భారతదేశంలోని 26 భాషల్లో బైబిలు సాహిత్యాలను అందజేయడం ద్వారా దృశ్య సంస్థ ఇస్తున్న మద్దతు విషయంలో అందరూ ఎంతో కృతజ్ఞతతో ఉన్నారు. అయితే, ఆసక్తిగలవారు చదివే భాషల్లో సాహిత్యాలు మీ బ్యాగులో లేదా మీ సంఘంలోని స్టాకులో లేకపోతే మీరు నిరుత్సాహపడవచ్చు. ఆసక్తి కనబర్చిన ప్రతిఒక్కరికీ వారు చక్కగా చదివే భాషలో బైబిలు ఆధారిత ప్రచురణను ఇవ్వడం మీకు సంతృప్తినివ్వదా?
3 అలా చేసేందుకు వీలుగా, సంఘాలు వాచ్‌టవర్ పబ్లికేషన్స్ లిస్ట్‌లో ఇవ్వబడిన భాషలన్నింటిలోనేకాక చైనా, పర్షియా, ఫ్రెంచ్వంటి మరికొన్ని సర్వసాధారణ విదేశీ భాషల్లో కూడా చిన్నమొత్తంలో కరపత్రాలను ఇప్పుడు ఆర్డర్ చేయవచ్చు. అప్పుడు ప్రతీ ప్రచారకుడు పరిచర్యలో తనకు ఎదురయ్యే అవకాశమున్న ఇతర భాషలవారికి, ముద్రిత సందేశాన్ని అందించేందుకు వీలుగా 10, 15 లేదా 20 విభిన్న భాషల కరపత్రాలను ఒక సెట్టుగా పెట్టుకోవడం సాధ్యమౌతుంది. క్షేత్రంలో ఏ యే అదనపు భాషలు అవసరమౌతాయో, ఆ భాషలు మాట్లాడే సమాజాలవారికి ఏ అంశంపై కరపత్రం ఇస్తే బాగుంటుందో ఎంపికచేసి, ఆ ‘సెట్టులో’ ఏ యే కరపత్రాలు ఉండాలో నిర్ణయించడానికి సంఘ సేవా కమిటీ వాచ్‌టవర్ పబ్లికేషన్స్ లిస్ట్‌ను చూడవచ్చు.
4 ప్రచారకులు అప్పుడప్పుడు తమ సెట్టులోనుండి కరపత్రాలను ఇస్తారు కాబట్టి తాము అందించిన భాషా కరపత్రం స్థానంలో మరో కరపత్రాన్ని సంఘం చిన్నమొత్తంలో ఉంచిన స్టాకులోనుండి తీసుకోవచ్చు. ఆ విధంగా చేయడంవల్ల, పరిచర్యకు వెళ్లినప్పుడు వారి దగ్గర ఎల్లప్పుడూ సెట్టులోని అన్ని భాషల్లో కరపత్రాలుంటాయి. అంతేకాక, మనపని ఎంత నిష్పక్షపాతమైనదో చూపించడానికి, అన్ని జాతులవారికి భాషలవారికి ప్రకటించమనే ఆజ్ఞను మనమెంత గంభీరంగా తీసుకుంటున్నామో చూపించడానికి అలా ఒక సెట్టుగా అమర్చినవాటిని మనం దృశ్య సాధనంగా ఉపయోగించవచ్చు.
5 కొన్ని భాషల కరపత్రాలను ఎప్పుడో ఒకసారి మాత్రమే ఉపయోగిస్తాం కాబట్టి, అవి అన్ని సమయాల్లో శుభ్రంగా, మనం పంచుకునే సందేశాన్ని ‘అలంకరించేవిగా’ ఉండేలా వాటిని మన సేవా ఉపకరణాలతోపాటు జాగ్రత్తగా పెట్టుకోవాలి. (తీతు 2:9, 10) పాడైపోయిన లేదా చిరిగిపోయిన కరపత్రాలను తీసేసి వేరేవి పెట్టుకోవాలి.
6 ఇండియా బ్రాంచి ప్రతీ సంవత్సరం 26 భాషల్లో దాదాపు 46,00,000 కరపత్రాలను ముద్రిస్తోంది. వివిధ భాషలు మాట్లాడే అనేకమంది మనతోపాటు యెహోవాను ఆరాధించేలా, వారికి సహాయం చేసేందుకు మనం వీటిని పూర్తిగా ఉపయోగిద్దాం.—యెషయా 2:2, 3.