పరిపాలక సభ ఉత్తరం
యేసు మాదిరిని అనుకరిస్తూ మనం దేవునికి, “నీ నామము పరిశుద్ధపరచబడు గాక” అని హృదయపూర్వకంగా ప్రార్థిస్తాం. ఆ ప్రార్థనకు అనుగుణంగా జీవించాలనే మన ప్రగాఢమైన కోరిక యెహోవాసాక్షులముగా మన జీవన విధానంలో స్పష్టమౌతుంది. అయితే, దేవుని పేరు తెలుసుకోవడం మాత్రమే సరిపోదు. ఆ నామాన్ని మహిమపరిచేందుకు ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నిజానికి, యెహోవాసాక్షులముగా గుర్తించబడడమే మనలో ఎవరమైనా పొందగల అత్యంత గొప్ప ఆధిక్యత.—మత్త. 6:9; యెష. 43:10.
కీర్తన 110:3లోని మాటలకు అనుగుణంగా యెహోవా ప్రజలు, యెహోవా ఆదేశించిన పనిని ఇష్టపూర్వకంగా చేస్తున్నారు. అన్ని వయసుల ప్రజలు, అన్నిరకాల నేపథ్యాల నుండి వచ్చినవారు ప్రకటనాపనిలో తమ శక్తి సామర్థ్యాలను ఎందుకు వినియోగిస్తున్నారు? ప్రాథమికంగా దేవునిపై వారికున్న ప్రేమ, ఆయనపట్ల వారికున్న వ్యక్తిగత భక్తి వల్లనే అలా చేస్తున్నారు. ‘మన పూర్ణహృదయముతోను, పూర్ణాత్మతోను, పూర్ణశక్తితోను’ యెహోవాను ప్రేమించాలని ద్వితీయోపదేశకాండము 6:5, 6 మనకు ఆజ్ఞాపిస్తోంది. మన పరిస్థితులు అనుమతించిన మేరకు పరిచర్యలో సంపూర్ణంగా భాగం వహించడం ద్వారా దేవుని రాజ్యానికి సంబంధించిన అంశాలకు మన సమయాన్ని, శక్తిని, వనరులను ఉపయోగించేందుకు ఈ హృదయపూర్వక ప్రేమ మనల్ని పురికొల్పుతుంది.
యెహోవాకు మానవజాతిపట్ల ఉన్న ప్రేమ కారణంగానే భూవ్యాప్తంగా తన రాజ్యసువార్త ప్రకటించబడాలని ఆయన నిర్దేశించాడు. ఆయన ఎవరూ నశించాలని కోరుకోవడంలేదు కానీ అందరూ తమ తప్పుడు మార్గాల నుండి మరలి పశ్చాత్తాపపడి జీవం పొందేలా సృష్టికర్తవైపు తిరగాలని కోరుతున్నాడు. (2 పేతు. 3:9) “దుర్మార్గుడు మరణము నొందుటవలన నాకు సంతోషము లేదు; దుర్మార్గుడు తన దుర్మార్గతనుండి మరలి బ్రదుకుటవలన నాకు సంతోషము కలుగును” అని యెహోవా చెబుతున్నాడు. (యెహె. 33:11) మనం పరిచర్యలో భాగం వహిస్తున్నప్పుడు, మన తోటి మానవులపట్ల యెహోవా ప్రేమకు రుజువుగా ఉంటాము. ఈ వాస్తవం, మనం ఆ ప్రాముఖ్యమైన పనిలో భాగం వహించినప్పుడు మన ఆనందానికి, సంతృప్తికి దోహదపడుతుందనడంలో సందేహం లేదు.
యెహోవా ప్రేరేపిత వాక్యమైన పరిశుద్ధ లేఖనాలను మనం దృష్టించే విధానం ద్వారా కూడా ఆయనపట్ల మనకున్న ప్రగాఢమైన ప్రేమ వెల్లడవుతుంది. బైబిలు లేకపోతే మనకు దేవుని గురించి తెలిసేది కాదు, యాకోబు 4:8 మనల్ని ఆహ్వానిస్తున్నట్లుగా ఆయనకు సన్నిహితమై ఉండేవాళ్ళం కాదు. అంతేకాక మనమిక్కడ ఎందుకున్నాం, భవిష్యత్తులో ఏమి జరగబోతోంది అనేవి కూడా తెలిసేవి కాదు. మనందరి పూర్వికుడైన ఆదామే మన సమస్యలకు మూలకారణమని కూడా మనకు తెలిసేది కాదు. (రోమా. 5:12) మన కోసం విమోచనా క్రయధనంగా తన అద్వితీయ కుమారుణ్ణి పంపించడం ద్వారా దేవుడు కనబరచిన గొప్ప ప్రేమ గురించి కూడా మనకు తెలిసేది కాదు. యెహోవా, తన జ్ఞానం, తెలివి, గ్రహింపులో కొంత పరిమాణాన్ని ఇంకా చాలా విధాల్లో మనకిస్తున్నాడు. ఆయన మనకిచ్చిన, తన ఆత్మ ప్రేరేపిత వాక్యమనే బహుమతిని మనమెంత విలువైనదిగా పరిగణిస్తామో కదా! ఈ అద్భుతమైన బహుమతిపట్ల మనకున్న కృతజ్ఞత, మనం ఆయన వాక్కులను చదవడానికి, అధ్యయనం చేయడానికి, ధ్యానించడానికి ‘సమయాన్ని సద్వినియోగం’ చేసుకొనేలా మనల్ని పురికొల్పుతుంది. (ఎఫె. 5:15, 16; కీర్త. 1:1-3) ప్రతీరోజు దేవుని వాక్యాన్ని చదవడానికి పట్టే సమయాన్ని బట్టి మనమెన్నడూ చింతించకూడదు. బదులుగా దేవునిపట్ల మనకున్న ప్రేమ ఆయన వాక్యాన్ని చదివేలా చేయాలి, అది ఆయన గురించి మరింత జ్ఞానాన్ని సంపాదించుకునేందుకు, ఆయనపట్ల మనకున్న ప్రేమను ప్రగాఢం చేసుకునేందుకు దోహదపడుతుంది.
ఆదాము యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు, అతని భవిష్యత్ సంతానమంతటికీ, మనలో ప్రతి ఒక్కరికీ దుఃఖకరమైన, నిరీక్షణలేని పరిస్థితులను తీసుకువచ్చాడని మనం బైబిలునుండి తెలుసుకున్నాం. అయినప్పటికీ దేవుడు ఈ భూమిపట్ల తనకున్న సంకల్పం ఖచ్చితంగా నెరవేరేలా చర్యలు తీసుకుని, మానవజాతి తప్పించుకోవడానికి మార్గం ఏర్పరచగలడు, ఆయన అలా చేశాడు కూడా.—ఆది. 3:15.
మన దేవుని అద్భుతమైన నామాన్ని పరిశుద్ధపరచాలని మనలో ప్రతీ ఒక్కరం బలంగా కోరుకుంటామనడంలో సందేహం లేదు. యెహోవా ఎంత మహోన్నతమైన దేవుడనే విషయం గురించి జ్ఞానాన్ని సంపాదించుకోవడంలో మనం కొనసాగుతుండగా, ఆయన గొప్ప నామాన్ని, ఆయన సంకల్పాన్ని తెలియజేయడంలో ఆయనతో, ఆయన సంస్థతో సహకరించడానికి మనం పురికొల్పబడతాము. మనకు ఇప్పుడు ఆయన అనుగ్రహం, ఆశీర్వాదం, నూతనలోకంలో నిరంతర భవిష్యత్తు లభిస్తాయని హామీ ఇవ్వబడుతోంది.
పరిపాలక సభలోని సభ్యులమైన మేము, ప్రియమైన సహోదరసహోదరీలైన మీ పట్ల మాకున్న ప్రేమను మరోసారి తెలియజేస్తున్నాము. “మహాశ్రమల[కు]” ముందు మిగిలివున్న సమయాన్ని వీలైనంత ఎక్కువమందికి సువార్త ప్రకటించడానికి ఉపయోగించేందుకు మీరు చేస్తున్న శ్రద్ధాపూర్వక కృషికి మా ప్రగాఢ మెప్పుదలను తెలియజేయాలనుకుంటున్నాం. (ప్రక. 7:14) అలా సువార్త ప్రకటించడం ద్వారా, నిత్యజీవానికి నడిపించే దేవుని గురించిన, క్రీస్తు గురించిన జ్ఞానాన్ని పొందేలా మీకు లభించిన అవకాశాన్నే మీరు వారికిస్తారు.—యోహా. 17:3.
మీ సహోదరులు,
యెహోవాసాక్షుల పరిపాలక సభ