మీ పరిచర్యలో క్రీస్తును అనుకరించండి
1 మన పరిచర్యలో మనం అనుసరించడానికి యేసు మాదిరినుంచాడు. ఆయన దేవునిపట్ల, ప్రజలపట్ల తనకున్న ప్రగాఢమైన ప్రేమను చాలా సందర్భాల్లో, చాలా విధాల్లో ప్రదర్శించాడు. ఆయన దీనులకు సత్యాన్ని బోధించి, బాధల్లో ఉన్నవారికి, పీడించబడుతున్నవారికి ప్రేమపూర్వక దయతో సహాయం చేశాడు.—మత్త. 9:35.
2 యేసు మాదిరి, బోధలు: యేసు రాజకీయ వ్యవహారాల్లో భాగంవహించో కేవలం మానవసేవా ప్రయత్నాల్లో భాగంవహించో సమాజాన్ని బాగుచేయడానికి ప్రయత్నించలేదు గానీ తనకివ్వబడిన పనిపై దృష్టి కేంద్రీకరించాడు. సదుద్దేశంతో చేసే ఇతర కార్యాలు తనను పక్కదారి పట్టించేందుకు లేక తన ప్రధాన పనిని మర్చిపోయేలా చేయడానికి అనుమతించలేదు. (లూకా 8:1) మానవాళి సమస్యలకు దేవుని రాజ్యమే శాశ్వత పరిష్కారమనే సువార్తను ప్రకటించడానికే ఆయన ప్రాముఖ్యతనిచ్చాడు. యేసుకు చాలా ప్రాముఖ్యమైన పని ఉన్నా, దానిని చేయడానికి ఆయనకు పరిమిత సమయమే ఉంది. కపెర్నహూములోని ప్రజలు యేసును అక్కడే ఉండమని కోరినప్పుడు ఆయన తన శిష్యులతో ఇలా చెప్పాడు: “ఇతర సమీప గ్రామములలోను నేను ప్రకటించునట్లు వెళ్లుదము రండి; యిందునిమిత్తమే గదా నేను బయలుదేరి వచ్చితిని.”—మార్కు 1:38.
3 యేసు తన శిష్యులకు శిక్షణనిచ్చిన తర్వాత వారిని ఈ నిర్దిష్టమైన సూచనలతో పంపించాడు: “పరలోకరాజ్యము సమీపించి యున్నదని ప్రకటించుడి.” (మత్త. 10:7) తమ జీవితాల్లో రాజ్య సంబంధ విషయాలకు మొదటిస్థానాన్నివ్వాలని ఆయన తన శిష్యులకు బోధించాడు. (మత్త. 6:33) యేసు పరలోకానికి ఆరోహణమవడానికి ముందు తన శిష్యులతో మాట్లాడిన చివరి మాటలు వారు ఏమి చేయాలో వారికి స్పష్టం చేశాయి. ఆయనిలా చెప్పాడు: “కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి.”—మత్త. 28:19.
4 రాజ్యం యొక్క ప్రాముఖ్యత: యేసు ప్రధానంగా దేవుని రాజ్యం గురించే ప్రకటించాడు, తన మాదిరిని అనుసరించమని తన శిష్యులను ఉద్బోధించాడు. మానవాళి సమస్యలను పరిష్కరించడానికి మానవులు చేసే ప్రయత్నాలు విజయవంతం కాలేవు. (యిర్మీ. 10:23) దేవుని రాజ్యమే దేవుని నామాన్ని పవిత్రపరిచి, మానవాళికి శాశ్వత ఉపశమనాన్నిస్తుంది. (మత్త. 6:9-10) జరుగుతున్న “హేయకృత్యములనుగూర్చి మూల్గులిడుచు ప్రలాపించుచున్నవారి[కి]” రాజ్యసత్యాలను బోధించడం, వారు ప్రస్తుతం సంతోషకరమైన, విజయవంతమైన జీవితాల్ని గడపడానికేకాక వాస్తవమైన భవిష్యత్ నిరీక్షణను హత్తుకొని ఉండడానికి కూడా సహాయపడుతుంది.—యెహె. 9:4.
5 దేవుని రాజ్య సువార్తను ప్రకటించే పనిలో యేసు ఇంకా భాగం వహిస్తుండడమేకాక, మనకు మద్దతిస్తానని హామీ ఇస్తున్నాడు. (మత్త. 28:20) మనం మన పరిచర్యలో ఎంతమేరకు యేసు మాదిరిని అనుకరిస్తున్నాం? (1 పేతు. 2:21) కలవరభరితమైన ఈ అంత్యదినాల్లో, పరిచర్యలో యేసు ఉంచిన మాదిరిని సన్నిహితంగా అనుసరించడానికి మన శక్తిమేరకు చేయగలిగిందంతా చేద్దాము!