మన ప్రాథమిక బైబిలు అధ్యయన సహాయకం—బైబిలు బోధిస్తోంది పుస్తకం
1 “దైవిక విధేయత” అనే జిల్లా సమావేశంలో, బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకావిష్కరణను చూసి మనమెంత పులకరించిపోయామో కదా! శనివారపు కార్యక్రమం ముగిసిన తరువాత హాజరైన ప్రతినిధులు తమ స్వంత కాపీని పొందడానికి ఎంతో ఆనందించారు. ఈ క్రొత్త అధ్యయన ఉపకరణం ఎలా ఉపయోగించబడుతుంది? ఇది మన ప్రాథమిక బైబిలు అధ్యయన సహాయకంగా ఉండేలా రూపొందించబడింది. ఈ కొత్త పుస్తకం మార్చి నెలనుంచే సాహిత్య ప్రతిపాదనగా అందించబడినా, ప్రచారకులు బైబిలు అధ్యయనాలు ఆరంభించి వాటిని నిర్వహించడానికి దీనిని ఉపయోగించడం వెంటనే మొదలుపెట్టాలని ప్రోత్సహించబడుతున్నారు.
2 ప్రస్తుతం నిర్వహించే బైబిలు అధ్యయనాలు: ప్రచారకులు ప్రస్తుతం జ్ఞానము పుస్తకం లేదా దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్ నుండి బైబిలు అధ్యయనాలు నిర్వహిస్తున్నట్లయితే, ఈ కొత్త పుస్తకాన్ని ఎప్పుడు, ఎలా ప్రారంభించాలో నిర్ణయించేందుకు వారు వివేచన ఉపయోగించాలి. మీరు ఇటీవలే అధ్యయనాన్ని ఆరంభించినట్లయితే, ఈ కొత్త పుస్తకం నుండే ప్రారంభించవచ్చు. అదే జ్ఞానము పుస్తకంలోని అధిక భాగాన్ని ఇప్పటికే పూర్తి చేసివుంటే, మీరు అధ్యయనం చేస్తున్న విషయాన్నే వివరిస్తున్న అధ్యాయాన్ని బైబిలు బోధిస్తోంది పుస్తకంలోనుండి ఎన్నుకొని అధ్యయనాన్ని కొనసాగించండి. ఒకవేళ జ్ఞానము స్తకంలోని చివరి భాగాన్ని అధ్యయనం చేస్తూవుంటే, ఆ ప్రచురణను పూర్తి చేయాలని మీరు నిర్ణయించుకోవచ్చు.
3 బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని అధ్యయనం చేయడం ద్వారా ప్రయోజనం పొందేవారు చాలామంది ఉన్నారని మనందరికీ నిస్సందేహంగా తెలుసు. ఈ ప్రగతిదాయక అధ్యయన సహాయకాన్ని ఉపయోగించి బైబిలు అధ్యయనం చేసేలా వారిలో ప్రతీ ఒక్కరినీ ఎందుకు ఆహ్వానించకూడదు? ఉదాహరణకు, జ్ఞానము పుస్తకం లేదా దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్ని పూర్తి చేసినా సమర్పణ, బాప్తిస్మం వరకు పురోభివృద్ధి సాధించనివారు, ఈ కొత్త పుస్తకాన్ని ఉపయోగించి మళ్ళీ తమ అధ్యయనాన్ని కొనసాగించేందుకు ఇష్టపడవచ్చు. దేవుని గురించిన ప్రామాణిక జ్ఞానాన్ని తమ పిల్లలకు అందించడానికి తల్లిదండ్రులు ఈ ప్రచురణను ఉపయోగించడానికి నిర్ణయించుకోవచ్చు.—కొలొ. 1:9, 10.
4 రెండవ పుస్తకాన్ని అధ్యయనం చేయడం: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది పుస్తకాన్ని పూర్తి చేసిన తర్వాత కూడా, మరొక పుస్తకం నుండి అధ్యయనాన్ని కొనసాగించే ఏర్పాటేమైనా ఉందా? ఉంది. నిదానంగానైనా, విద్యార్థి ఖచ్చితంగా పురోభివృద్ధి సాధిస్తూ తను నేర్చుకునే విషయాలపట్ల కృతజ్ఞతా భావాన్ని చూపిస్తున్నట్లయితే, ఆ బైబిలు అధ్యయనాన్ని అద్వితీయ సత్య దేవుణ్ణి ఆరాధించండి పుస్తకం నుండి కొనసాగించవచ్చు. శిష్యులను చేయమనే ఆజ్ఞను మనం నెరవేరుస్తుండగా బైబిలు బోధిస్తోంది పుస్తకం ఒక శక్తిమంతమైన ఉపకరణంగా పని చేస్తుందనే నమ్మకం మనకుంది.—మత్త. 28:19, 20.