బ్రాంచి ఉత్తరం
ప్రియమైన రాజ్య ప్రచారకులకు:
మనం గత కొన్ని సేవా సంవత్సరాలుగా సంఘాలు, సర్క్యూట్లు విలీనం చేయబడడాన్నీ, బలపడడాన్నీ చూశాం. గత సేవా సంవత్సరంలోనే 14 సంఘాలు మూసివేయబడి దగ్గరున్న సంఘాలతో విలీనం చేయబడ్డాయి, దాంతో గత రెండు సేవా సంవత్సరాల్లో మొత్తం 36 సంఘాలు వేరే సంఘాలతో విలీనం చేయబడ్డాయి. చాలామంది సహోదరులు సేవాధిక్యతలు పొందడానికి అర్హులవుతుండడంతో, మనకిప్పుడు ప్రతీ సంఘానికి సగటున ముగ్గురు పెద్దలు, నలుగురు పరిచర్య సేవకులు ఉన్నారు.
సంఘాలు పెద్దవయ్యాయి కాబట్టి, మంచి రాజ్య మందిరాలు అవసరం, సంతోషకరంగా గత సెప్టెంబరు నుండి బ్రాంచి కార్యాలయ సిబ్బంది 10 స్థలాల్లో జరిగిన ప్రతిష్ఠాపన కార్యక్రమాల్లో భాగం వహించారు, ఆ స్థలాల్లో రెండింటిలో జంట రాజ్య మందిర సముదాయాలు కూడా ఉన్నాయి. ఇదంతా భవిష్యత్తు అభివృద్ధికి బలమైన పునాది వేసింది.
బెతెల్ గృహం, కార్యాలయం, ముద్రణాలయం అన్నీ ఇప్పుడు చక్కగా స్థిరపడ్డాయి, అవి ఉత్సాహంగా ఎదురుచూసే అనేక విధాల భవిష్యత్తు విస్తరణకు తగినవిధంగా పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ సంవత్సరం మొదటి భాగంలో క్రొత్త యంత్రాలు నెలకొల్పబడ్డాయి, క్రొత్తగా నెలకొల్పబడిన రెండు రాపిడా ముద్రణా యంత్రాలు గంటకు 12,000 పత్రికలను ముద్రిస్తున్నాయి, అవి అంతకుముందటి యంత్రాలు ముద్రించే పత్రికల కన్నా దాదాపు రెట్టింపు. క్రొత్త పేపర్ కట్టర్స్, ఫోల్డర్స్, ట్రిమ్మర్స్, స్టిచ్చింగ్ లైన్స్ వంటి యంత్రాలను కూడా స్థాపించడంతో ముద్రణా యంత్రాల యూనిట్‌లో అన్నిటినీ సమకూర్చుకున్నట్లయింది, అంటే రాబోయే అనేక సంవత్సరాల వరకు మన సాహిత్య అవసరాలను సులభంగా తీర్చుకోవచ్చు.
క్రొత్త యంత్రాలను స్థాపించడానికి అంతర్జాతీయ జట్టులోని ఆరుగురు సహోదరులు, వారి భార్యల సహాయమే కాక మన క్షేత్రం నుండి నిపుణులైన ఐదుగురు టెక్నీషియన్‌ల సహాయం కూడా అవసరమయింది. ఆ స్వచ్ఛంద సేవకులందరి అనుభవాన్ని, సిద్ధ మనస్సును బెతెల్ సిబ్బంది ఎంతో ప్రశంసించడమే కాక, వారికి అశ్రునయనాలతో వీడ్కోలు చెప్పవలసివచ్చింది.
సునామీవల్ల ప్రభావితులైన మన సహోదరులకు సహాయం చేయడానికి ఏర్పాటు చేయబడిన సహాయ కార్యక్రమానికి అంతర్జాతీయ సహాయం కూడా లభించింది. దేశమంతటి నుండి, విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల నుండి నిధులు అందాయి, కాబట్టి ఒక వారంలోగా మేము సునామీవల్ల ప్రభావితులైన సహోదరులను సందర్శించి, ఆచరణాత్మకమైన సహాయక సామగ్రిని అందించగలిగాం, ప్రత్యేకంగా అధికంగా ప్రభావితం చెందిన అండమాన్ నికోబార్ ద్వీపాలలో ఉన్న సహోదరులకు సహాయం చేయగలిగాం. అర్హులైన ప్రాంతీయ పైవిచారణకర్తలు, నిర్మాణపు సిబ్బంది ఆ ప్రాంతాన్ని తిరిగి సందర్శించడం, విపత్తులో అన్నిటినీ కోల్పోయినవారికి సహాయం అందుతూ ఉండేలా చేసింది. సునామీ తాకిడికి గురైన ప్రాంతాల్లోని సహోదర సహోదరీలు తమ నష్టాలను పూరించడంలో సహాయం చేసిన వారందరికీ తమ హృదయపూర్వక కృతజ్ఞతను తెలియజేయమని మమ్మల్ని అడిగారు. మనం ప్రేమపూర్వక క్రైస్తవ సహోదరత్వంలో భాగంగా ఉండడం ఎంతో గొప్ప ఆధిక్యతో కదా!—1 పేతు. 2:17.
రాజ్య సంబంధ విషయాలను అభివృద్ధి చేయడంలో భాగంగా ఉత్సాహంతో చేసిన ఆ పనులన్నీ మెచ్చుకోదగినవి! మీరు సేవకు అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని కూడా మేము ఎంతో మెచ్చుకుంటున్నాం. (సామె. 3:9, 10) “తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని” మనం ఐక్యతతో చేసే ప్రయత్నాలను యెహోవా ఆశీర్వదించును గాక!—ఎఫె. 1:11.
మీ సహోదరులు,
ఇండియా బ్రాంచి కార్యాలయం