బహిరంగ ప్రదేశాల్లో సమర్థవంతంగా సాక్ష్యమివ్వడం
1. మొదటి శతాబ్ద క్రైస్తవులను అనుసరిస్తూ, నేటి క్రైస్తవులు బహిరంగ ప్రదేశాల్లో ఎలా సాక్ష్యమిస్తున్నారు, దాని ఫలితాలేమిటి?
1 యేసు తొలి శిష్యుల్లాగే, నేడు క్రైస్తవులు కూడా ప్రజలెక్కడ కనిపిస్తే అక్కడ సువార్త ప్రకటించడానికి ప్రయత్నిస్తారు. (అపొ. 16:13; 17:17; 20:20, 21) అలా బహిరంగ ప్రదేశాల్లో సాక్ష్యమిచ్చేందుకు ప్రయత్నిస్తున్న ఫలితంగా, వారు ఇంటింటి పరిచర్యలో కలవడానికి ఎప్పటికీ వీలుకాని ఆసక్తిగల ప్రజలను కనుగొంటున్నారు.
2. బహిరంగ ప్రదేశాల్లో సాక్ష్యమిస్తున్నప్పుడు వివేచన ఎందుకు అవసరం, మనం క్రమత్వానికి ఎలా దోహదపడవచ్చు?
2 బహిరంగ ప్రదేశాల్లో సాక్ష్యమిస్తున్నప్పుడు వివేచన అవసరం. సాధారణంగా ఇతరుల దృష్టిలోపడకుండా ఉండేలా పనిచేయడం మంచిది. ఉదాహరణకు, చాలామంది ప్రచారకులు ఒకే ప్రాంతంలో సాక్ష్యమిస్తున్నా లేక ఒకే వ్యాపారస్థలాన్ని సందర్శిస్తున్నా కొందరు మనల్ని చూసి విసుగు చెందవచ్చు. అది మన పనికి ఉన్న గౌరవాన్ని తగ్గించి మన సమర్థతను పరిమితం చేయవచ్చు. అలా జరగకుండా ఉండాలంటే ఏమి చేయవచ్చు? బహిరంగ సాక్ష్యానికి అనేక ప్రాంతాలు ఉన్న కొన్ని సంఘాలు ఆ ప్రాంతాలను ప్రత్యేక క్షేత్రాలుగా వ్యవస్థీకరించడం సహాయకరంగా ఉంటుందని గ్రహించాయి. (1 కొరిం. 14:39) అంతేకాకుండా సంఘ సేవా కమిటీ వేరే సంఘానికి సహాయం చేయడానికి నిర్దిష్ట ఏర్పాట్లు చేసినప్పుడు తప్ప, మనం మన సంఘానికి నియమించిన క్షేత్రంలోనే పనిచేయడంవల్ల క్రమత్వానికి మనం దోహదపడవచ్చు.—నవంబరు 1998 మన రాజ్య పరిచర్య, 6వ పేజీ, 18-19 పేరాలు చూడండి.
3. బహిరంగ ప్రదేశాల్లో సాక్ష్యమిస్తున్నప్పుడు కొందరు ఎలాంటి పద్ధతి సమర్థవంతంగా ఉన్నట్లు కనుగొన్నారు?
3 ప్రజలను సమీపించడం: యేసు బావి దగ్గర ఒక స్త్రీతో మాట్లాడినప్పుడు ఆయన క్లుప్తమైన వ్యాఖ్యానంతో ప్రారంభించి ఆమెకు ఆసక్తి ఉన్నట్లు స్పష్టమవుతున్న కొద్దీ క్రమంగా సంభాషణను కొనసాగించాడు. (యోహా. 4:7-26) ఈ పద్ధతి కొన్ని పరిస్థితుల్లో నేడు కూడా ఫలవంతంగా ఉంటుంది. బహిరంగ సాక్ష్యంలో ఎక్కువ సమర్థంగా ఉండడానికి రాజ్య సందేశం చెప్పే ముందు ప్రజలను పలకరించి వారిపట్ల వ్యక్తిగత ఆసక్తి చూపించడానికి కొన్ని నిమిషాలు వెచ్చించడం సహాయకరంగా ఉంటుందని కొంతమంది ప్రచారకులు గమనించారు. వాళ్ళు స్థానికంగా ఆసక్తి రేకెత్తించే అంశం మీద వ్యాఖ్యానిస్తారు, సాధారణంగా అది సంభాషణకు దారితీస్తుంది. ఇతరులు తమ చింతలను వ్యక్తం చేస్తున్నప్పుడు వారు జాగ్రత్తగా వింటారు. ఆ తర్వాత కొద్ది సమయంలోనే వారు దేవుని వాక్యం నుండి ఓదార్పుకరమైన సందేశాన్ని వారితో పంచుకుంటారు.—రోమా. 15:4.
4. మనం ఆసక్తిని ఎలా వృద్ధి చేయవచ్చు?
4 ఆసక్తిని వృద్ధి చేయడం: మంచి చర్చ జరిగిన ప్రతీసారి మనం ఆసక్తిని వృద్ధి చేసేలా ఏర్పాట్లు చేయడానికి ప్రయత్నించాలి. మనం ఆసక్తిని ఎలా వృద్ధి చేయవచ్చు? చర్చ ముగుస్తుండగా మీరు మీ నోటు బుక్‌ను బయటికి తీసి ఇలా అనవచ్చు: “మన సంభాషణను నేను ఆనందించాను. వేరే సమయంలో మన సంభాషణను కొనసాగించే అవకాశం ఏదైనా ఉందా?” లేక మీరిలా చెప్పవచ్చు: “మీరు ఓ శీర్షికను చదవాలని నా కోరిక, అది మీకు ఆసక్తికరంగా ఉంటుందని నేననుకుంటున్నాను. నేను ఆ శీర్షికను మీ ఇంటికి గానీ ఆఫీసుకు గానీ తీసుకురావచ్చా?” కొందరు ప్రచారకులు కేవలం ఇలా అడుగుతారు: “నేను మీ ఫోన్ నంబరు తెలుసుకోవచ్చా?” అది సాధారణంగా అనుకూలమైన ప్రతిస్పందన రప్పిస్తుంది.
5. మనం బహిరంగ స్థలాల్లో సాక్ష్యమిస్తున్నప్పుడు మన లక్ష్యం ఏమైవుండాలి?
5 బహిరంగ ప్రదేశాల్లో మొదటిసారిగా కలుసుకున్న చాలామంది బైబిలు అధ్యయనాలను అంగీకరించారు. అలాంటి అధ్యయనాలు ఆ వ్యక్తి ఇంట్లో, ఉద్యోగ స్థలంలో, అనువైన బహిరంగ స్థలంలో, లేక ఫోన్ ద్వారా నిర్వహించవచ్చు. మనం బహిరంగ స్థలాల్లో సమర్థవంతంగా సాక్ష్యమిస్తున్నప్పుడు బైబిలు అధ్యయనాలు ప్రారంభించాలనేది మన లక్ష్యంగా చేసుకుందాం.